Bhagavad Gita: Chapter 15, Verse 20

ఇతి గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ ।
ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత ।। 20 ।।

ఇతి — ఇవి; గుహ్య-తమం — అత్యంత రహస్యమైన; శాస్త్రం — వైదిక శాస్త్రము; ఇదం — ఇది; ఉక్తం — చెప్పబడినది; మయా — నా చేత; అనఘ — అర్జునా, పాప రహితుడా; ఏతత్ — ఇది; బుద్ధ్వా — అర్థంచేసుకుని; బుద్ధిమాన్ — జ్ఞాని; స్యాత్ — అగును; కృత-కృత్యః — సాధించవలసినది పూర్తి చేసినవాడు; చ — మరియు; భారత — అర్జునా, భరత వంశజుడా.

Translation

BG 15.20: ఓ పాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.

Commentary

ఈ అధ్యాయము యొక్క చిట్టచివరి శ్లోకము 'ఇతి' అన్న పదంతో మొదలౌతున్నది; అంటే 'ఇవి' అని అర్థం. శ్రీ కృష్ణుడు ఇలా సూచిస్తున్నాడు: ‘ఈ ఇరవై శ్లోకాలలో నేను వేద శాస్త్రాల సారాన్ని తెలియచేసాను. ఈ జగత్తు యొక్క స్వభావాన్ని, భౌతికపదార్థము మరియు ఆత్మ మధ్య భేదాన్ని, మరియు చివరగా పరమ సత్యము యొక్క సర్వోన్నత జ్ఞానమును ఆ దివ్య మంగళ పురుషోత్తమునిగా తెలియచేసాను. ఎవరైతే ఈ జ్ఞానమును స్వీకరించి అంగీకరిస్తారో వారు యదార్థముగా జ్ఞానోదయం పొందుతారు అని ఇప్పుడు, నేను నీకు హామీ ఇస్తున్నాను. ఇటువంటి జీవాత్మ, సమస్త కార్యముల, కర్తవ్యముల లక్ష్యము అయిన భగవత్ ప్రాప్తిని సాధిస్తుంది.