Bhagavad Gita: Chapter 18, Verse 23

నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ।। 23 ।।

నియతం — శాస్త్ర బద్దముగా; సంగ-రహితం — మమకారాసక్తి లేకుండా; ఆరాగ-ద్వేషతః — రాగ ద్వేషములు లేకుండా; కృతం — చేయబడి; అఫల-ప్రేప్సునా — ఫలాపేక్ష లేకుండా; కర్మ — కర్మ; యత్ — ఏదైతే; తత్ — అది; సాత్త్వికం — సాత్వికము; ఉచ్యతే — అని చెప్పబడును.

Translation

BG 18.23: ఏదైతే కర్మ - శాస్త్రబద్దముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.

Commentary

మూడు రకములైన జ్ఞానములను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు మూడు విధములైన కర్మలను వివరిస్తున్నాడు. చరిత్ర గమనంలో ఎంతోమంది సామాజిక శాస్త్రవేత్తలు మరియు తత్త్వవేత్తలు ఏది మంచి కర్మ(పని) అనే విషయంపై తమతమ అభిప్రాయాలను వివరించి ఉన్నారు. వారిలో కొంతమంది ప్రముఖులు మరియు వారి సిద్ధాంతాలు ఇక్కడ పేర్కొనబడినవి.

1. గ్రీకు ఎపిక్యూరియన్లు (క్రీస్తు పూర్వం ౩వ శతాబ్దం), "తినండి, త్రాగండి మరియు హాయిగా ఉండండి" అనే పద్దతి సక్రమమని నమ్మినారు.

2. దీనికంటే ఇంకా కొంచం మెరుగ్గా ఉన్నటువంటిది, Hobbs of England (1588 – 1679) మరియు Helvetius of France (1715 – 1771) యొక్క సిద్ధాంతం. వారు అన్నదేమిటంటే, అందరూ స్వార్ధ పరులై, ఎవరూ ఇతరుల గురించి ఆలోచించకపోతే, ప్రపంచంలో అది ఒక అస్తవ్యస్త స్థితికి దారి తీస్తుంది. కాబట్టి వ్యక్తిగత ఇంద్రియ సంతృప్తి తో పాటు మనం ఇతరుల గురించి కూడా ఆలోచించాలి. ఉదాహరణకి, ఒకవేళ భర్త అనారోగ్యంతో ఉంటే, భార్య అతనిని చూసుకోవాలి; ఒకవేళ భార్య అనారోగ్యం తో ఉంటే, భర్త ఆమెను చూసుకోవాలి. ఒకవేళ గనక ఇతరులకు సహాయం చేయటం, స్వీయప్రయోజనానికి విరుద్ధంగా ఉంటే, సొంత ప్రయోజనానికే మనం మొగ్గు చూపాలి అని వారు అభిప్రాయపడ్డారు.

3. జోసెఫ్ బట్లర్ (1692 – 1752) యొక్క సిద్ధాంతం దీనికంటే ఇంకా ముందుకు వెళ్ళింది. ఆయన ఏమన్నాడంటే, మన స్వీయ-ప్రయోజనం తరువాతనే ఇతరులకు సేవ చేయటం, అనే ఆలోచన తప్పు అని. ఇతరులకు సేవ చేయటం సహజమైన మానవ సద్గుణము. ఒక తల్లి-సింహము కూడా తాను ఆకలితో ఉన్నా తన పిల్లలకు పాలు ఇస్తుంది. కాబట్టి, ఇతరుల సేవకే ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, బట్లర్ యొక్క సేవా దృక్పథం కేవలం భౌతికమైన దుఃఖ నివృత్తికి మాత్రమే పరిమితమయినది; ఉదాహరణకి, ఒక వ్యక్తి ఆకలితో ఉంటే, అతనికి అన్నం పెట్టాలి. కానీ ఇది సమస్యను నిజంగా నిర్మూలించదు ఎందుకంటే ఆరు గంటల తరువాత ఆ వ్యక్తికి మళ్ళీ ఆకలి వేస్తుంది.

4. బట్లర్ తరువాత జెరెమీ బెంథాం (1748 – 1832) మరియు జాన్ స్టుఆర్ట్ మిల్ (1806 – 1873) వచ్చారు. వారి యొక్క ఉపయోగితావాదంలో, అధికసంఖ్యలో జనులకు ఏది హితమైనదో అదే సరియైన పని అని చెప్పారు. ఏది సరియైన పనో నిర్ణయించటానికి అత్యధికులు దేనిని మంచి అంటారో దానిని ఎంచుకోమన్నది. కానీ ఒకవేళ అధికసంఖ్యాక జనులు అనుకున్నది తప్పయినా లేదా వారు తప్పుడుబాటలో ఉన్నా ఈ సిద్ధాతం వీగిపోతుంది, ఎందుకంటే వెయ్యిమంది అజ్ఞానులు ఉన్నా, ఒక్క వివేకముకలవాని యొక్క, అలోచనా సామర్ధ్యమును వారు సరితూగరు.

ఇంకా మరికొందరు తత్త్వవేత్తలు అంతరాత్మ చెప్పిన విధముగా అనుసరించమని చెప్తారు. అదే మనకు ఏది సరియయిన ప్రవర్తనో చెప్పటానికి ఉత్తమమైన మార్గదర్శి అని సూచించారు. కానీ, సమస్య ఏమిటంటే ప్రతిఒక్కని అంతరాత్మ వేర్వేరు విధములుగా మారదర్శకం చేస్తుంది. ఒకే కుటుంబములో, ఇద్దరు పిల్లలకి విభిన్న విలువలు, అంతరాత్మ ఉంటాయి. అంతేకాక, ఒకే వ్యక్తి యొక్క అంతరాత్మ కూడా కాలంతో పాటు మారుతుంది. ఒక హంతకుడుని, తను జనులను చంపటం పట్ల పశ్చాత్తాపం పడుతున్నాడా అని అడిగితే, అయన ఇలా అనవచ్చు, "మొదట్లో చెడుపని చేస్తున్నట్టు అనిపించేది, కానీ క్రమక్రమముగా, అదేదో దోమలను చంపటం లాగ మామూలు పని అయిపొయింది. నాకేమీ పశ్చాత్తాపం లేదు." అని.

యుక్తమైన పని ఏది అన్న విషయంలో, మహాభారతం ఇలా చెప్తున్నది:

ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్
శృతిః  స్మృతిః  సదాచారః స్వస్య చ ప్రియమాత్మనః (5.15.17)

"ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకు ఇష్టం ఉండదో, నీవు కూడా వారి పట్ల అలా ప్రవర్తించకు. కానీ, నీ ప్రవర్తన ఎల్లప్పుడూ శాస్త్ర సమ్మతంగా ఉండేలా చూసుకో." ఇతరులు నీపట్ల ఎలా ఉండాలి అని నీవు ఆశిస్తావో నీవు వారిపట్ల అలా ఉండుము. బైబిల్ కూడా ఇలా పేర్కొంటున్నది, "“Do to others as you would have them do to you.” (Luke 6.31) "ఇతరులు నీకు ఏమి చేయాలని కోరుకుంటావో నీవు వారికి అదే చేయుము". అదే మాదిరిగా, శాస్త్రములు చెప్పిన విధముగా తన కర్తవ్యమును చేయటమే సత్త్వ గుణములో ఉన్న కర్మ (పని) అని ఇక్కడ శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. అంతేకాక, అటువంటి పని రాగద్వేష రహితముగా ఉండాలి, మరియు ఫలాపేక్ష లేకుండా కూడా ఉండాలి అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు.