2వ అధ్యాయము: సాంఖ్య యోగము

సాంఖ్య యోగము

ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్ధంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరిస్తాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువుగా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు త్యజించి, ఎలాగైతే కొత్త బట్టలు ధరిస్తాడో, ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక బాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ బాధ్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక బాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది స్వర్గలోకాల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, మరియు అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.
    అర్జునుడిని ప్రాపంచిక స్థాయిలో ఉత్తేజిత పరిచిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని 'బుద్ధి యోగము' అంటాడు. బుద్ధిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితికి చేరుకుంటాడు.
    దివ్య జ్ఞానంలో స్థితులై ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితులై ఉన్న వారు మోహము, భయం, మరియు క్రోధములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖ-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన - కామము, క్రోధము, మరియు లోభములు - ఎలా ఎదుగుతాయో, మరియు వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

సంజయుడు పలికెను: జాలి నిండినవాడై, శోకతప్త హృదయంతో, కంటినిండా నీరు నిండిపోయున్న అర్జునుడిని చూసిన, శ్రీ కృష్ణుడు, ఈ విధంగా పలికెను.

శ్రీ భగవానుడు ఇట్లనెను: ప్రియమైన అర్జునా, ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ చిత్త భ్రాంతి ఎట్లా దాపురించింది? ఇది గౌరవనీయ వ్యక్తికి తగదు. ఇది ఉత్తమ లోకాలకు దారి తీసేది కాకపోగా, అపకీర్తి పాలుజేస్తుంది.

ఓ పార్థా, ఈ యొక్క పౌరుషహీనత్వానికి లోనుకావటం నీకు తగదు. ఓ శత్రువులను జయించేవాడా, ఈ నీచమైన హృదయ దౌర్బల్యం విడిచిపెట్టి, యుద్ధానికి లెమ్ము.

అర్జునుడు ఇట్లనెను: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా.

నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తంతో కళంకితమై ఉంటాయి.

ఈ యుద్ధం యొక్క ఎలాంటి ఫలితం మనకు మేలైనదో కూడా మనకు తెలియదు - వాళ్ళను జయించడమా లేదా వారిచే జయింపబడటమా. వారిని సంహరించిన తరువాత కూడా, మనకు జీవించాలని అనిపించదు. అయినా, వారు ధృతరాష్ట్రుని పక్షంలో చేరి, మన ఎదురుగా యుద్ధభూమిలో నిలిచి ఉన్నారు.

నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియటంలేదు మరియు ఆందోళన, పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము.

నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.

సంజయుడు ఇట్లనెను: ఈ విధంగా పలికిన గుడాకేశుడు, శత్రువులను శిక్షించేవాడు, హృషీకేశునితో, ‘గోవిందా, నేను యుద్ధం చేయను’ అంటూ మౌనముగా ఉండిపోయాడు.

ఓ ధృతరాష్ట్రా! ఆ తరువాత, ఇరుసేనల మధ్యలో, శోకసంతుప్తుడైన అర్జునుడితో శ్రీ కృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను.

భగవంతుడు ఇలా అన్నాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. ప్రాణములు పోయిన వారి గురించి గానీ బ్రతికున్న వారి గురించి గానీ, పండితులైనవారు శోకింపరు.

నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా మనము ఉండకుండా ఉండము.

ఏ విధంగానైతే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా బాల్యము, యౌవనం, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధముగా మరణ సమయంలో, జీవాత్మ మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున భ్రమకు లోనవ్వరు.

ఓ కుంతీపుత్రా, ఇంద్రియ-విషయములతో సంయోగము వలన ఇంద్రియములకు క్షణభంగురమైన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లు అనిపిస్తుంది. ఇవి అనిత్యములు మరియు ఇవి వేసవి, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా, కలత చెందకుండా వీటిని ఓర్చుకోవటం నేర్చుకోవాలి.

ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండింటిలోనూ చలించకుండా నిశ్చలముగా ఉన్న వ్యక్తి మోక్షమునకు అర్హుడవుతాడు.

అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు, మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండింటి స్వభావాన్ని యథార్థముగా అధ్యయనం చేసిన తత్త్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు.

శరీరమంతయు వ్యాపించి ఉన్న అది నాశనం చేయబడలేనిదని తెలుసుకొనుము. ఎవ్వరూ కూడా అనశ్వరమైన ఆత్మను నాశనంచేయలేరు.

ఈ భౌతిక శరీరము మాత్రమే నశించునది; అందున్న జీవాత్మ నాశరహితమైనది, కొలవశక్యముకానిది, మరియు నిత్యశాశ్వతమైనది. కావున, ఓ భరత వంశీయుడా, యుద్ధం చేయుము.

ఆత్మ ఇతరులను చంపును అని భావించేవాడు, ఆత్మ ఇతరులచే చంపబడును అని భావించేవాడు - ఇద్దరూ అజ్ఞానులే. నిజానికి ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరిచేతనూ చంపబడదు.

ఆత్మకి పుట్టుక లేదు, ఎన్నటికీ మరణం కూడా ఉండదు. ఒకప్పుడు ఉండి, ఇకముందు ఎప్పుడైనా అంతమైపోదు. ఆత్మ జన్మ లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, మరియు వయోరహితమైనది. శరీరం నశించిపోయినప్పుడు అది నశించదు.

ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం చేయబడలేదు, నిత్యమైనది, పుట్టుక లేనిది, ఎన్నటికీ మార్పుచెందనిది అని తెలిసిన వ్యక్తి, ఎవరినైనా ఎట్లా చంపును? ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవ్వగలడు?

ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా, మరణ సమయములో, జీవాత్మ పాత శరీరమును వీడి కొత్త శరీరమును స్వీకరించును.

ఈ ఆత్మను, ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు. నీరు తడపలేదు, గాలి ఎండిపోవునట్లు చేయలేదు.

ఆత్మ, విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది; దానిని తడుపుటకును మరియు ఎండించుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పులేనిది, పరివర్తనలేనిది, మరియు సనాతనమైనది.

ఆత్మ అనేది అవ్యక్తమైనది (కనిపించనిది), ఊహాతీతమైనది, మరియు మార్పులేనిది. ఇది తెలుసుకొని నీవు శరీరం కోసము శోకించవలదు.

కానీ ఒకవేళ నీవు, ఆత్మ పదే పదే జనన మరణములకు లోనగుతుంది అని అనుకున్నా సరే, ఓ మహా బాహువులు కలవాడా, ఇలా శోకించుట తగదు.

పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణించినవానికి మరల పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం నీవు శోకించ వద్దు.

ఓ భరత వంశీయుడా, సృష్టింపబడిన ప్రాణులన్నీ పుట్టుక ముందు అవ్యక్తములు, జీవిత కాలంలో వ్యక్తములు, మరల మరణించిన పిదప అవ్యక్తములు. కావున శోకించుట ఎందులకు?

కొందరు ఈ ఆత్మని ఆశ్చర్యమైనదిగా చూస్తారు, కొందరు ఆశ్చర్యమైనదిగా వర్ణిస్తారు, మరియు కొందరు ఆత్మ ఆశ్చర్యమైనదని వింటారు, మరికొందరు, విన్న తరువాత కూడా దీని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేరు.

ఓ అర్జునా, దేహమునందు ఉండెడి ఆత్మ చావులేనిది; కాబట్టి ఏ ప్రాణి గురించి కూడా నీవు శోకించుట తగదు.

అంతేకాక, నీ యొక్క క్షత్రియ స్వ-ధర్మమును అనుసరించి నీవు చలింపరాదు. నిజానికి, ఒక క్షత్రియుడికి ధర్మ పరిరక్షణకు యుద్ధం చేయటమనే దానికన్నా మించిన కర్తవ్యం లేదు.

ఓ పార్థ, ధర్మాన్ని పరిరక్షించే ఇలాంటి అవకాశాలు, కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు అదృష్టవంతులు. ఇవి వారికి స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటివి.

కానీ, ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు.

జనులు నిన్ను పిరికివాడు, పారిపోయిన సైనికుడు అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి అనేది మరణము కన్నా ఘోరమైనది.

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారు, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు, అలా వారికి నీ మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటావు.

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి క్రూరమైన మాటలతో అవమానిస్తారు, దీనితో నీ గొప్పతనం చులకనైపోతుంది. అయ్యో, ఇంతకంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

యుద్ధం చేస్తే నీవు, యుద్ధ రంగంలో వీరమరణం పొంది స్వర్గానికి పోయెదవు, లేదా విజయుడవై ఈ భూమండలముపై రాజ్యమును అనుభవించెదవు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము, ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి సిద్ధముకమ్ము.

సుఖ-దుఃఖాలని, లాభ-నష్టాలని మరియు జయాపజయములను సమానంగా తీసుకుంటూ, కర్తవ్య నిర్వహణగా యుద్ధం చేయుము. నీ బాధ్యతలని ఈ విధంగా నిర్వర్తించటం వలన నీకు ఎన్నటికీ పాపం అంటదు.

ఇప్పటివరకు, నేను నీకు సాంఖ్య యోగం, అంటే, ఆత్మ తత్త్వం గురించి విశ్లేషణాత్మక జ్ఞానమును, వివరించాను. ఇప్పుడు వినుము, ఓ పార్థ, నేను బుద్ధి యోగాన్ని విశదీకరిస్తాను. ఇలాంటి అవగాహనతో పని చేసినప్పుడు, నీవు కర్మ బంధములనుండి విముక్తి పొందెదవు.

ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును.

ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.

పరిమితమైన అవగాహన కలవారు, స్వర్గలోక ప్రాప్తి కోసం, డాంభికమైన కర్మకాండలను ప్రతిపాదించే వేదాల్లో చెప్పబడిన సమ్మోహపరచే మాటలకు ఆకర్షితులౌతారు మరియు అందులో ఇంకా ఏమీ ఉన్నత స్థాయి ఉపదేశం లేదనుకుంటారు. తమకు ఇంద్రియ సుఖాలని ప్రాప్తింపచేసే వేదాల్లోని ఆయా భాగాలని ప్రశంసిస్తారు మరియు ఉన్నత జన్మ, ఐశ్వర్యం, ఇంద్రియ భోగాలు, మరియు స్వర్గలోక ప్రాప్తి కోసం ఆడంబరమైన కర్మకాండలు చేస్తుంటారు.

ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తితో ఉండి మరియు వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోనయ్యి, వారు, భగవత్-ప్రాప్తి పథంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు.

ఓ అర్జునా, వేదములు భౌతిక ప్రకృతి యొక్క త్రి-గుణాత్మకమైన విషయ సంబంధమై వివరించును. నీవు ఈ త్రిగుణములకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మిక చైతన్య స్థితిలో ఉండుము. ద్వంద్వముల నుండి విడివడి, నిత్యమూ పరమ-సత్యంలో స్థితమై ఉండి, మరియు భౌతిక లాభాలు, భద్రతల గురించి పట్టించుకోకుండా, ఆత్మ భావన యందే స్థితుడవై ఉండుము.

ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనుతో తీరుతాయి. అదే ప్రకారంగా, పరమ సత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే.

శాస్త్రవిహిత కర్తవ్య కర్మను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు. నీవే కర్మ ఫలములకు హేతువు అని ఎప్పుడూ అనుకోకు మరియు చేయవలసిన కర్మలు మానుటలో ఆసక్తి ఉండరాదు.

జయాపజయముల పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జునా, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును.

దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.

వివేకముతో ఈ ఫలాసక్తిరహిత కర్మ శాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మ లోనే పుణ్య పాపములను రెంటినీ త్యజించును. కాబట్టి, నైపుణ్యంతో (సరియైన దృక్పథంతో) పని చేయటం అనే, యోగ అభ్యాసము చేయుము.

జ్ఞానులు, సమత్వ బుద్ధి కలిగి ఉండి, జననమరణ చక్రంలో బంధించే కర్మ ఫలములపై మమకార-ఆసక్తులను త్యజించి ఉంటారు. ఇలాంటి దృక్పథంతో పని చేయటం వలన సమస్త దుఃఖములకు అతీతమైన స్థితిని పొందెదరు.

మోహమనే ఊబి నుండి నీ బుద్ధి బయటపడినప్పుడే నీవు ఇప్పటి వరకు విన్న దాని గురించి, ఇక వినబోయేదాని గురించి వైరాగ్యం కలుగుతుంది. (ఇహపర లోక భోగముల విషయంలో).

కామ్య కర్మ కాండలను చెప్పే వేద విభాగాల వైపు ఆకర్షితం కాకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని యందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగ స్థితిని పొందెదవు.

అర్జునుడు పలికెను : ఓ కేశవా, భగవత్ ధ్యాస యందే స్థిరముగా ఉన్న (స్థితప్రజ్ఞుని) వాని లక్షణములు ఏమిటి? జ్ఞానోదయం అయిన వ్యక్తి ఎలా మాట్లాడును? ఎలా కూర్చొనును? ఎలా నడుచును?

భగవానుడు పలికెను: ఓ పార్థ, మనస్సుని వేధించే అన్నీ స్వార్థ ప్రయోజనాలను, ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మ జ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు, ఆ వ్యక్తిని స్థిత ప్రజ్ఞుడు అంటారు.

దుఃఖముల నడుమ కలతచెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారము, భయము, మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత-ప్రజ్ఞుడైన ముని అని అంటారు.

ఎవరైతే అన్నీ పరిస్థితులలో మమకారం/ఆసక్తి లేకుండా ఉంటాడో, సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు క్రుంగిపోకుండా ఉంటాడో, అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని.

తాబేలు దాని అంగములను తన పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.

సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగ వస్తు/విషయముల నుండి నియంత్రించినా కానీ, ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది. కానీ, భగవత్ ప్రాప్తి నొందిన వారికి ఆ రుచి కూడా అంతమగును.

ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి, అల్లకల్లోలమైనవి అంటే, ఓ కుంతీ పుత్రుడా, వివేకము కలిగి, స్వీయ-నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు.

ఎవరైతే తమ ఇంద్రియములను వశమునందు ఉంచుకొని, మనస్సుని నాయందే ఎల్లప్పుడూ లగ్నం చేయుదురో, వారు సంపూర్ణ జ్ఞానంలో స్థితులై ఉన్నట్టు.

ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలుగ చేస్తుంది, మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది.

కోపం అనేది విచక్షణా రాహిత్యానికి దారి తీస్తుంది, అది స్మృతి (జ్ఞాపకశక్తి) భ్రమని కలుగ చేస్తుంది. స్మృతిభ్రమ కలిగినప్పుడు బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనుష్యుడు పతనమౌతాడు.

ఇంద్రియ వస్తు-విషయములను వాడేటప్పుడు కూడా మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు భగవంతుని కృపకు పాత్రుడగును.

భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలిగిపోయే పరమ శాంతి లభిస్తుంది, మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రము గానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.

కానీ, మనస్సు-ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి, స్థిరమైన బుద్ధి కానీ, నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు; మరియు మనశ్శాంతి లోపించినవాడు సంతోషంగా ఎలా ఉండగలడు?

ఎలాగైతే బలమైన వీచేగాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన గాని మనస్సు కేంద్రీకృతమయినచో అది బుద్ధిని హరించి వేస్తుంది.

కాబట్టి, ఓ అర్జునా, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియవిషయముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉండును.

అన్నీ ప్రాణులూ దేన్నయితే పగలు అనుకుంటాయో అది పండితునికి అజ్ఞానపు రాత్రి, మరియు అన్నీ ప్రాణులకూ ఏది రాత్రియో అది అంతర్ముఖులైన జ్ఞానులకు పగలు.

ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా, ఎలాగైతే సముద్రం నిశ్చలంగా/ప్రశాంతంగా ఉంటుందో, అదేవిధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా, చలించని యోగి శాంతిని పొందుతాడు; కోరికలను సంతృప్తిపర్చుకోవటానికే కృషి చేసే వ్యక్తి ఇది పొందడు.

ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి మరియు అత్యాశ లేకుండా, నేను/నాది అన్న భావన లేకుండా, మరియు అహంకార రహితముగా ఉంటాడో, అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది.

ఓ పార్థ, జ్ఞానోదయం కలిగిన జీవాత్మ స్థితి ఎలా ఉంటుందంటే, ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్లీ అది మాయలో పడదు. మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి, జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది, ఆ భగవంతుని దివ్య ధామానికి చేరుకుంటాడు.