Bhagavad Gita: Chapter 2, Verse 15

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ ।
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ।। 15 ।।

యం — ఎవరైతే; హి — వాస్తవముగా; న వ్యథయంతి — వ్యాకుల పడరో; ఏతే — వీటి చే; పురుషం — వ్యక్తులు; పురుష-ఋషభ — శ్రేష్ఠమైన పురుషుడా, అర్జునా; సమ — సమానముగా (సమత్వబుద్ధితో); దుఃఖ — బాధ; సుఖం — సంతోషము; ధీరం — స్థిరముగా; సః — ఆ వ్యక్తి; అమృతత్వాయ — మోక్షమునకు; కల్పతే — అర్హుడు అవుతాడు.

Translation

BG 2.15: ఓ అర్జునా, పురుష శ్రేష్ఠుడా, సుఖదుఃఖముల చే ప్రభావితం కాకుండా, రెండిటిలో చలించకుండా నిశ్చలముగా ఉన్నవాడు మోక్షమునకు అర్హుడవుతాడు.

Commentary

ఇంతకు క్రితం శ్లోకం లో, శ్రీ కృష్ణుడు సుఖదుఃఖ అనుభూతులు అనిత్యములు అని వివరించాడు. ఇప్పుడు అర్జునుడిని జ్ఞాన వివక్ష ద్వారా ఈ ద్వందములకు అతీతంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు. ఈ వివక్షని పెంపొందించుకోవటానికి, మనం మొదట రెండు ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు అర్థం చేసుకోవాలి: 1) మనం ఎందుకు ఆనందం కోసం ఆకాంక్షిస్తాము? 2) ఎందుకు భౌతిక ఆనందం మనకు తృప్తినివ్వదు?

మొదటి ప్రశ్నకు సమాధానం చాలా సులభం. భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం మరియు మనం జీవాత్మలం అతని అణు-అంశలము. అంటే ప్రాథమికంగా మనము అనంతమైన ఆనంద సాగరానికి చెందిన చిన్న భాగాలము అని అర్థం. స్వామి వివేకానంద, ప్రజలని సంభోదిస్తూ, “నిత్యమైన ఆనంద స్వరూపం యొక్క బిడ్డల్లారా”, (O ye children of immortal bliss) అని అనేవాడు. ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో, ప్రతి భాగము సహజంగా దాని పూర్ణభాగం వైపు గుంజ బడుతుంది. అదేవిధముగా, ఆనంద సముద్రం యొక్క అణు-అంశలము అవటం వలన, మనం జీవాత్మలము కూడా ఆ ఆనందము వైపు ఆకర్షితులమైతాము. కాబట్టి ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. ఆనందం దేనిలో ఉంది, ఏ రూపంలో ఉంది అన్న విషయంలో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ అన్నీ ప్రాణులు దాన్ని తప్ప వేరేది ఏదీ కోరరు. ఇదంతా మొదటి ప్రశ్నకి సమాధానం.

ఇక ఇప్పుడు రెండవ ప్రశ్నకు సమాధానాన్ని అర్ధం చేసుకుందాం. ఆత్మ అనేది పరమాత్మ యొక్క అణు-అంశ కాబట్టి అది భగవంతుని లాగానే దివ్యమైనది. కావున ఆత్మ కోరుకునే ఆనందం కూడా దివ్యమైన ఆనందమే. అటువంటి ఆనందం ఈ క్రింది మూడు లక్షణాలను తప్పకుండా కలిగి ఉండాలి.

— అది పరిమాణం లో అనంతమై ఉండాలి.
— అది శాశ్వతమై ఉండాలి.
— అది ఎప్పుడూ కొత్తగా/తాజాగా అనిపించాలి.

భగవంతుని ఆనందము అలా ఉంటుంది, దానిని సత్-చిత్-ఆనందము, అంటే నిత్యమైన-చైతన్యవంతమైన-ఆనంద సింధువు అని అంటారు. కానీ, ఇంద్రియములకు వాటి విషయ సంయోగము ద్వారా మనము అనుభవించే ఆనందము దీనికి విరుద్ధముగా ఉంటుంది: అది తాత్కాలికమైనది, పరిమితమైనది, జడమైనది. ఇందుకే, శరీరం ద్వారా అనుభవించే భౌతిక మైన ఆనందము మనలో ఉన్న దివ్యమైన జీవాత్మ ను సంతృప్తి పరచలేదు.

ఈ వివక్షతో, మనము భౌతిక ఆనంద అనుభూతిని నియంత్రించుకునే సాధన చేయాలి. అదేవిధంగా, మనము భౌతిక బాధలను, దుఃఖాన్ని సహించాలి. (ఈ రెండవ అంశం 2.48వ, 5.20వ వంటి తదుపరి శ్లోకాలలో విశదంగా చెప్పబడింది). అప్పుడే మనం ఈ ద్వందములకు అతీతంగా ఎదుగుతాము మరియు ఇక ప్రాపంచిక భౌతిక శక్తి మనలను కట్టివేయలేదు.

Watch Swamiji Explain This Verse