న హి ప్రపశ్యామి మమాపనుద్యాద్
యచ్ఛోకముచ్ఛోషణమింద్రియాణామ్ ।
అవాప్య భూమావసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ ।। 8 ।।
న — కాదు; హి — నిజముగా; ప్రపశ్యామి — నేను చూచుట; మమ — నా యొక్క; అపనుద్యాత్ — పోగొట్టే; యత్ — ఏదైతే; శోకం — శోకమును; ఉచ్ఛోషణమ్ — శుష్కింప చేయునట్టి; ఇంద్రియాణామ్ — ఇంద్రియముల యొక్క; అవాప్య — పొందిన తరువాత; భూమౌ — ఈ భూమిపై; అసపత్నమ్ — ఎదురులేని; ఋద్దం — సుసంపన్నమైన; రాజ్యం — రాజ్యము; సురాణామ్ — దేవతల యొక్క; అపి — అయినా; చ — కూడా; ఆధిపత్యమ్ — ఆధిపత్యము.
Translation
BG 2.8: నా ఇంద్రియములను శుష్కింప చేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయమేదీ తోచటం లేదు. నేను ఈ భూమిపై సుసంపన్నమైన, ఎదురులేని రాజ్యాన్ని గెలిచినా, లేదా దేవతల వంటి ఆధిపత్యము పొందినా, ఈ శోకమును తొలగించుకోలేను.
Commentary
ఎప్పుడైనా మనము దుఃఖంలో మునిగిపోయినప్పుడు, మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది, మరియు ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో, అప్పుడు మానసికంగా కుంగిపోవటం మొదలౌతుంది. అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధికన్నా పెద్దవిగా పరిణమించటంతో, తనను శోక సముద్రం నుండి కాపాడుకోవటానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు. శ్రీ కృష్ణుడిని గురువుగా స్వీకరించిన తరువాత తన దయనీయ స్థితిని వెల్లడిచేయుచూ తన మనస్సులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు, అర్జునుడు.
అర్జునుడి పరిస్థితి అతనొక్కడిదే కాదు. జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే. మనకు సంతోషం కావాలి, కానీ దుఃఖం కలుగుతుంటుంది; మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానపు మేఘాల్ని తొలగించుకోలేము; పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ పదేపదే ఆశాభంగము కలుగుతుంటుంది; మన కాలేజి డిగ్రీలు, నేర్చుకున్న విద్య, మరియు లౌకిక పాండిత్యములు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు. జీవితమనే చిక్కుముడిని విప్పటానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం. మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు లభించినప్పుడు, మనకు వారి నుండి నేర్చుకునే అణకువ, వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరువబడుతుంది. ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు.