యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ।। 19 ।।
యస్య — ఎవరైతే; సర్వే — సమస్త; సమారంభాః — క్రియాకలాపములు; కామ — భౌతిక సుఖముల వాంఛ; సంకల్ప — సంకల్పము; వర్జితాః — రహితములై (త్యజించినవారై); జ్ఞాన — ఆధ్యాత్మిక జ్ఞానమనే; అగ్ని — అగ్నిలో; దగ్ధ — కాలి భస్మమై; కర్మాణం — కర్మలు; తం — వానిని; ఆహుః — అందురు; పండితం — పండితుడని; బుధాః — జ్ఞానులు.
Translation
BG 4.19: ఎవరి యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేసారో అట్టివారు, జ్ఞానోదయమైన మునులచే, పండితులు అనబడుతారు.
Commentary
జీవాత్మ అనేది, ఆనంద సముద్రమైన భగవంతుని యొక్క అణు-అంశము కాబట్టి, సహజంగానే తనుకూడా ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ, భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ, తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో, భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి కర్మలు చేస్తుంటుంది. ఈ వ్యవహారములు మనోఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి జీవాత్మను కర్మ బంధములలో పెనవేస్తాయి.
కానీ, జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, తను కోరుకునే ఆనందం ఇంద్రియ వస్తు-విషయముల ద్వారా లభించదని, ప్రేమ పూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందని తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమును భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. ‘నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞ హోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, ఓ కుంతీ పుత్రుడా, వాటన్నిటిని నాకు అర్పితముగా చేయుము.’ (భగవత్ గీత 9.27). ఈ విధంగా జ్ఞానోదయమైన జీవాత్మ భౌతిక సుఖాల కోసం స్వార్థంతో కూడిన పనులు త్యజించి, అన్ని కర్మలను భగవంతుడికే అంకితం చేస్తుంది, ఈ పనులు ఎలాంటి కర్మ బంధనాలను కలుగచేయవు. ఆ కర్మలు ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలిభస్మమై పోయాయని చెప్పబడుతాయి.