Bhagavad Gita: Chapter 4, Verse 9

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః ।
త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సొఽర్జున ।। 9 ।।

జన్మ — పుట్టుక; కర్మ — కార్యములు; చ — మరియు; మే — నా యొక్క; దివ్యమ్ — దివ్యమైనవి; ఏవం — ఈ విధంగా; యః — ఎవరైతే; వేత్తి — తెలుసుకుంటారో; తత్త్వతః — పరిపూర్ణముగా; త్యక్త్వా — విడిచిపెట్టిన పిదప; దేహం — దేహమును; పునః-జన్మ — మరల పుట్టుక; న-ఇతి — ఉండదు; మాం — నన్నే; ఏతి — చేరును; సః — అతడు; అర్జున — అర్జునా.

Translation

BG 4.9: నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థంచేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తరు, నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు.

Commentary

ఈ శ్లోకాన్ని ఇంతకు క్రితం శ్లోకం యొక్క పరిజ్ఞానంతో అర్థం చెసుకోవాలి. భగవంతుని పై ప్రేమ పూర్వక స్మరణ ద్వారా మన మనస్సు శుద్ది అవుతుంది. ఈ భక్తి నిరాకార బ్రహ్మం పై ఉండవచ్చు లేదా సాకార రూపంపై గాని ఉండవచ్చు. నిరాకార బ్రహ్మం పై ఉండే భక్తి, చాలా మందికి అగోచరమైనది మరియు అస్పష్టమైనదిగా ఉంటుంది. భక్తి పూర్వక ధ్యాన సమయంలో దేని మీద ధ్యాస ఉంచాలి లేదా దేనితో అనుసంధానమవ్వాలి అనేది వారికి తెలియదు. ఒక స్వరూపం తో ఉన్న భగవంతునిపై భక్తి, సులువైనది మరియు ఆచరణీయమైనది. అలాంటి భక్తికి, భగవంతుని వ్యక్తిత్వంపై దైవీ భావాలు అవసరం. శ్రీ కృష్ణుడి పై భక్తిలో నిమగ్నమవ్వాలంటే, ఆయన నామాలు, రూపము, గుణములు, లీలలు, ధామము మరియు పరివారము పై దైవీ ప్రేమను పెంచుకోవాలి. ఉదాహరణకి, భగవంతుడు విగ్రహాలలో ఉన్నాడనే దైవీ భావాల వలన, రాతి విగ్రహాలను ఆరాధించటం తో జనులు తమ అంతఃకరణ శుద్ధి చేసుకుంటారు. ఈ భావాలే భక్తుల మనస్సులను పవిత్రం చేస్తాయి. మూలపురుషుడైన మనువు ఇలా అన్నాడు.

న కాష్టే విద్యతే దేవో న శిలాయాం న మృత్సు చ
భావే హి విద్యతే దేవస్తస్మాత్భావం సమాచరేత్

"భగవంతుడు కట్టెలో లేడు, రాతిలో లేడు. భక్తితో కూడిన హృదయంలో ఉన్నాడు. కాబట్టి, విగ్రహాన్ని ప్రేమ పూర్వక భావంతో ఆరాధించుము"

అదేవిధంగా, శ్రీ కృష్ణ పరమాత్మ పై భక్తి పెంచుకోవాలంటే, ఆయన లీలలు దివ్యమైనవి అన్న భావన కలిగి ఉండాలి. మహాభారతము మరియు భగవద్గీతలపై ఉపమాన-అలంకారముగా వ్యాఖ్యానం చెప్పిన భాష్యకారులు, శ్రీ కృష్ణుడి పట్ల భక్తిపై విశ్వాసాన్ని నాశనం చేసి తీవ్ర అన్యాయం చేసినట్టే. ఈ శ్లోకం లో, శ్రీ కృష్ణుడు, మన భక్తిని పెంపొందించుకోవటానికి, తన లీలల యందు దివ్య భావన కలిగి ఉండటం యొక్క అవసరాన్ని ఉద్ఘాటించాడు.

ఇలాంటి దైవీ భావాలు పెంపొందించుకోవటానికి, భగవంతుని కర్మలకు, మన కర్మలకు ఉన్న తేడాని అర్థం చేసుకోవాలి. భౌతికంగా బద్దులైన జీవాత్మలమైన మనకు ఇంకా దివ్య ఆనందం లభించలేదు, అందుకే మన ఆత్మ యొక్క తపన ఇంకా తీర్చబడలేదు. అందుకే, మన కర్మలన్నీ స్వార్థ ప్రయోజనం కోసమే, ఇంకా, స్వీయ తృప్తి కోసమే. కానీ, భగవంతుని కర్మలలో ఎలాంటి స్వార్థ ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆయన తన వ్యక్తిత్వం ద్వారానే అనంతమైన ఆనందంతో సంపూర్ణ తృప్తి తో ఉంటాడు. ఆయనకి ఏదో పనులు చేసి ఇకింత ఆనందం పొందవలసిన అవసరం లేదు. కాబట్టి, భగవంతుడు ఏ పని చేసినా అది భౌతికంగా బద్దులైన జీవాత్మల సంక్షేమం కోసం చేసేదే. అటువంటి, ఆయన చేసే దివ్య క్రియాకలాపములనే ‘లీలలు’ అంటారు. అదే సమయంలో, మనం చేసే క్రియలను ‘పనులు’ అంటారు.

అదే విధంగా, భగవంతుని జన్మ కూడా దివ్యమైనది, మనలాగా కాకుండా, ఆయన పుట్టుక ఒక తల్లి గర్భం నుండి కలుగలేదు. బ్రహ్మానంద భరితుడైన భగవంతునికి ఒక తల్లి గర్భంలో తలక్రిందులుగా ఉండవలసిన అవసరం లేదు. భాగవతం ఇలా పేర్కొంటుంది.

తమ్ అద్భుతం బాలకం అంబుజేక్షణం
చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం (10.3.9)

“శ్రీ కృష్ణుడు తన జన్మ సమయంలో దేవకీవసుదేవుల ముందు ప్రకటమయినప్పుడు, అతను తన నాలుగు భుజాల విష్ణు రూపంలో ఉన్నాడు.” ఈ నిలువెత్తు స్వరూపం ఖచ్చితంగా దేవకీ గర్భంలో ఉండిఉండదు. అయినా, ఆమెకు తను గర్భంలోనే ఉన్నాననే భావన తెప్పించటానికి, తన యోగమాయా శక్తి చేత, దేవకీ దేవి గర్భాన్ని పెరిగిస్తూఉన్నాడు. చివరికి, తను ఆమెలో ఎప్పుడూ లేనని తెలియచేస్తూ, బయట నుండి వ్యక్తమయ్యాడు.

ఆవిరాసీద్ యథా ప్రాచ్యాం దిశీందుర్ ఇవ పుష్కలః (భాగవతం 10.3.8)

“రాత్రి పూట ఆకాశంలో సంపూర్ణ ప్రకాశంతో చంద్రుడు ప్రకటితమయినట్టుగా, శ్రీ కృష్ణ పరమాత్మ దేవకీవసుదేవుల ముందు ప్రత్యక్షమయ్యాడు.” ఇదే భగవంతుని జన్మ యొక్క దివ్య స్వభావం. మనము ఆయన జన్మ మరియు కర్మలు దివ్యమైనవి అన్న విశ్వాసం పెంచుకుంటే, మనము సునాయాసంగా ఆయన సాకార స్వరూపం పట్ల భక్తి లో నిమగ్నమై, సర్వోత్క్రుష్ట గమ్యమును చేరుకుంటాము.