యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।
యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో కూడియుండి; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధితో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.
Translation
BG 5.7: పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు.
Commentary
వైదిక వాఙ్మయంలో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు, ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.
ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ-ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.