6వ అధ్యాయము: ధ్యాన యోగము

ధ్యాన యోగము

ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు, ఐదవ అధ్యాయంలో నుండీ ఉన్న వస్తున్న 'కర్మ యోగ' (ప్రాపంచిక విధులు నిర్వర్తిస్తూనే ఆధ్యాత్మిక అభ్యాసం చేయటం) మరియు 'కర్మ సన్యాస' (సన్యాస ఆశ్రమంలో ఆధ్యాత్మికత అభ్యాసం చేయటం) మార్గాలను పోల్చి, విశ్లేషణను కొనసాగిస్తూనే, మొదటి మార్గాన్నే సిఫారసు చేస్తున్నాడు. మనం కర్మలను భక్తితో చేసినప్పుడు, అది మన మనస్సుని పవిత్రం చేసి మన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని స్థిరపరుస్తుంది. అప్పుడు మనస్సు ప్రశాంతత పొందిన తరువాత, ధ్యానమే, మన ఉన్నతికి ప్రధాన ఉపకరణము అవుతుంది. ధ్యానము ద్వారా యోగులు తమ మనస్సుని జయించటానికి శ్రమిస్తారు, ఎందుకంటే అశిక్షితమైన నిగ్రహింపబడని మనస్సు మన ప్రధాన శత్రువు, కానీ, సుశిక్షితమైన నియంత్రణలో ఉన్న మనస్సు మన మంచి మిత్రుడు. తీవ్రమైన కఠిన నిష్ఠలు పాటించటం ద్వారా ఒక వ్యక్తి ఆధ్యాత్మిక పథంలో పురోగతి సాధించలేడని శ్రీ కృష్ణుడు అర్జునుడిని హెచ్చరిస్తున్నాడు; కాబట్టి తినటంలో, పనిలో, వినోదంలో, మరియు నిద్రలో మిత సంయమనం పాటించాలని ఉపదేశించాడు. తదుపరి, మనస్సుని భగవంతునితో ఏకం (సంయోగం) చేయటానికి 'సాధన' ని వివరిస్తాడు. ఎలాగైతే గాలి వీచని చోట దీపం నిశ్చలంగా ఉంటుందో, అదే విధంగా సాధకుడు మనస్సుని ధ్యానం యందు నిలకడతో ఉంచాలి. నియంత్రణ చేయటానికి మనస్సు నిజానికి చాలా క్లిష్టమైనది, కానీ, అభ్యాసము, వైరాగ్యములతో దీనిని నియంత్రించవచ్చు. కాబట్టి, మనస్సు ఎక్కడికి పోయినా, దానిని తిరిగి తెచ్చి, భగవంతుని వైపే విడువకుండ కేంద్రీకరించాలి. ఎప్పుడైతే మనస్సు పరిశుద్ధమవుతుందో, అది అలౌకిక స్థితిలో నిలుస్తుంది. ఈ యొక్క 'సమాధి' అన్న పరమానంద స్థితి లో వ్యక్తి అనంతమైన దివ్యానందాన్ని అనుభవిస్తాడు.
అర్జునుడు తదుపరి శ్రీ కృష్ణుడిని, ఆధ్యాత్మిక మార్గంలో ప్రారంభమై కూడా చంచలమైన మనస్సు వల్ల లక్ష్యాన్ని చేరుకోలేని సాధకుడి గతి ఏమిటి అని ప్రశ్నిస్తాడు. భగవత్ ప్రాప్తి కోసం ప్రయాస పడే వ్యక్తి ఎప్పుడూ చెడిపోడు అని శ్రీ కృష్ణుడు హామీ ఇస్తాడు. భగవంతుడు ఎల్లప్పుడూ మన అన్ని పూర్వ జన్మల ఆధ్యాత్మిక పురోగతి లెక్క చూసుకుని, దానిని మళ్ళీ తదుపరి జన్మలలో పునరుత్తేజింప చేస్తాడు; దీనితో మనం ఎక్కడ విడిచిపెట్టామో అక్కడ నుండి తిరిగి ప్రయాణం మొదలు పెట్టవచ్చు. ఎన్నో జన్మల నుండి పోగైన సాధన ఫలంగా యోగులు ఈ జన్మలోనే భగవంతుడిని చేరుకుంటారు. తపస్వులు (మునులు), జ్ఞానులు (చదువుకున్నవారు, వేద శాస్త్ర పండితులు), మరియు కర్మీల కంటే యోగులే (భగవంతునితో ఏక మవ్వటానికి పరిశ్రమించే వారు) శ్రేష్ఠమైన వారు అని ప్రకటిస్తూ ఈ అధ్యాయం ముగుస్తుంది. ఇంకా, యోగులందరిలో కెల్లా, భగవంతుని పట్ల ప్రేమ యుక్త భక్తిలో నిమగ్నమయ్యే వారే అత్యున్నతమైన వారు.

భగవంతుడు పలికెను: ఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మలను (చేయవలసిన విధులను), చేసిన వారే నిజమైన సన్యాసులు, యోగులు. అంతేకాని, కేవలం అగ్ని హోత్ర యజ్ఞం వంటివి చేయటం ఆపివేసిన వారు లేదా శారీరిక క్రియలు త్యజించిన వారు కాదు.

సన్యాసము అని అందరూ అనుకునేది, యోగము కంటే వేరైనది కాదు. ఎందుకంటే, ఎవ్వరూ కూడా ప్రాపంచిక కోరికలను త్యజించకుండా యోగి కాలేరు.

యోగంలో పరిపూర్ణత సాధించే యత్నంలో ఉన్న (ప్రారంభ-దశ) జీవాత్మకు ఫలాపేక్ష లేకుండా పని చేయటమే సాధనం అంటారు; యోగంలో ఉన్నత స్థాయి చేరుకున్న మునికి ధ్యానంలో ప్రశాంతతయే సాధనం అంటారు.

ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు-విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితముగా ఉంటాడో ఆ వ్యక్తి యోగ శాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు; ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యజించాడు కావున.

నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని పతనమైపోవద్దు. ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు.

మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వారికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.

మనస్సుని జయించిన యోగులు - శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానాపమానములు - ఈ ద్వందములకు అతీతంగా ఉన్నతమైన స్థానంలో ఉంటారు. ఇటువంటి యోగులు ప్రశాంతతతో, భగవత్ భక్తి యందు స్థిర చిత్తముతో ఉంటారు.

జ్ఞానవిజ్ఞానములతో మరియు విచక్షణతో తృప్తినొందిన యోగులు, ఇంద్రియములను జయించిన వారై, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు. వారు – మట్టి, రాళ్ళు, మరియు బంగారము – వీటన్నిటిని ఒకే దృష్టితో చూస్తారు.

శ్రేయోభిలాషులను, మిత్రులను, శత్రువులను, సాధువులను మరియు పాపులను - యోగులు నిష్పక్షపాత బుద్ధితో చూస్తారు. మిత్రుల, సహచరుల, శత్రువుల పట్ల సమబుద్ధితో ఉంటూ, శత్రువుల, బంధువుల పట్ల తటస్థంగా, మరియు, పుణ్యాత్ములు, పాపాత్ముల పట్ల పక్షపాతం లేకుండా - ఉన్న యోగి మానవులలో సర్వ శ్రేష్ఠుడుగా పరిగణించబడుతాడు.

యోగ స్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి, నియంత్రించబడిన మనస్సు-శరీరంతో, కోరికలను, భోగవస్తువులను త్యజించి, నిత్యమూ భగవత్ ధ్యానంలో నిమగ్నమైఉండాలి.

యోగాభ్యాసము చేయటానికి, పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి; దీనిని కుశ గడ్డి, జింక చర్మము, మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు.

దానిపై స్థిరముగా కూర్చొని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.

ఈ విధంగా, ప్రశాంతతతో, భయరహితంగా, మరియు నిశ్చల మనస్సుతో మరియు బ్రహ్మచర్య వ్రతంలో దృఢ సంకల్పంతో, సావధానుడైన యోగి, నేనే పరమ లక్ష్యంగా, నా పై ధ్యానం చేయాలి.

ఈ విధంగా, నిరంతరం మనస్సుని నాయందే నిలిపిఉంచుతూ, క్రమశిక్షణ మనస్సు కలిగిన యోగి నిర్వాణమును పొందును మరియు నా యందే పరమ శాంతితో స్థితుడై ఉండును.

ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో, వారు యోగములో విజయం సాధించలేరు.

కానీ ఎవరైతే తినటంలో మరియు వినోదాలలో మితంగా ఉంటారో, పనిలో సమతుల్యతతో, నిద్రలో క్రమబద్ధతతో ఉంటారో, వారు యోగాభ్యాసముతో అన్ని దుఃఖములను ఉపశమింపచేయవచ్చు.

వారు సంపూర్ణ క్రమశిక్షణతో, మనస్సుని అన్ని స్వార్థ పూరిత వాంఛల నుండి వెనక్కి మరల్చి, పరమశ్రేష్ఠమైన ఆత్మ శ్రేయస్సుయందే లగ్నం చేస్తారు. ఇటువంటి వారు యోగములో ఉన్నారు అని చెప్పబడతారు, మరియు వారు సమస్త ఇంద్రియ కోరికలకు అతీతంగా ఉంటారు.

గాలి వీచని ప్రదేశంలో దీపము ఎలాగైతే నిశ్చలంగా ఉండునో, యోగికి వశమునందున్న మనస్సు ఈశ్వర ధ్యానములో స్థిరముగా ఉండును.

ఎప్పుడైతే, మనస్సు, ప్రాపంచిక కార్యకలాపాల నుండి నిగ్రహింపబడి, యోగాభ్యాసము ద్వారా నిశ్చలంగా ఉండునో, అప్పుడు ఆ యోగి పరిశుద్ధమైన మనస్సు ద్వారా ఆత్మను దర్శించగలడు మరియు ఆంతర ఆనందంలో రమించును.

సమాధి అనబడే ఆ పరమానంద యోగ స్థితిలో, వ్యక్తి అత్యున్నత అపరిమిత దివ్య ఆనంద అనుభూతి పొందుతాడు. ఈ విధమైన స్థితిలో ఉన్న వ్యక్తి, నిత్య పరమసత్యము నుండి ఎన్నటికీ విచలితుడు కానే కాడు.

ఆ స్థితిని పొందిన తరువాత, వ్యక్తి, మరింక ఏదీ అంతకంటే గొప్పది కాదు అని భావిస్తాడు. ఈ విధంగా స్థితమై ఉండి, వ్యక్తి ఎంతటి గొప్ప విపత్తులోనైనా ఏమాత్రం చలింపడు.

దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం/అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను.

ప్రాపంచిక తలంపుల నుండి జనించిన అన్ని కోరికలను త్యజించి, ఇంద్రియములను అన్ని వైపులనుండీ మనస్సుతో నిగ్రహించవలెను. క్రమక్రమముగా మరియు నిశ్చయముగా, బుద్ధియందు దృఢవిశ్వాసంతో మనస్సు భగవంతుని యందే స్థితమగును, మరియు మరే ఇతరమైన వాటి గురించి ఇక ఆలోచించదు.

ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.

మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ-ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు – అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది.

స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.

నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సమత్వ దృష్టితో సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.

ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు.

నా యందే ఏకత్వంలో స్థితుడై ఉండి, మరియు నన్నే సర్వ భూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములు చేస్తునే ఉన్నా, నా యందే నివసించును.

సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ, మరియు ఇతరుల సుఖాలకు, దుఃఖాలకు, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను.

అర్జునుడు పలికెను: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది.

ఓ కృష్ణా, ఈ మనస్సు చాలా చంచలమైనది, అల్లకల్లోలమైనది, బలమైనది, మరియు మూర్ఖపు పట్టుగలది. దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది.

శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.

మనస్సు అదుపులో లేనివానికి యోగము కష్టతరమైనది. కానీ, మనస్సుని నిగ్రహించటం నేర్చుకున్నవారు, మరియు సరియైన పద్దతిలో పరిశ్రమ చేసేవారు, యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయము.

అర్జునుడు పలికెను : ఈ మార్గంలో శ్రద్ధతో ప్రయాణం ప్రారంభించి కూడా, చంచలమైన మనస్సు కారణంచే, తగినంతగా పరిశ్రమించక, యోగ లక్ష్యాన్ని ఈ జన్మలో సాధించలేక పోయిన యోగి యొక్క గతి ఏమిటి?

యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ మహా బాహువులు గల కృష్ణా, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా?

ఓ కృష్ణా, నా ఈ సందేహమును పూర్తిగా నివృత్తి చేయుము, మరిక నీ కన్నా ఇది చేయగలవారు ఎవరున్నారు?

శ్రీ భగవానుడు ఇలా పలికెను: ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియ మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.

యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము.

ఇటువంటి జన్మ పొందిన తరువాత, ఓ కురు వంశస్తుడా, వారు తమ పూర్వ జన్మల విజ్ఞానాన్ని తిరిగి మేల్కొలిపి, యోగములో పరిపూర్ణత కొరకు మరింత పరిశ్రమిస్తారు.

వారు తమ ఇష్టానికి వ్యతిరేకంగానైనా, పూర్వ జన్మల సాధనా బలంచే ఖచ్చితంగా భగవంతుని వైపు ఆకర్శించబడుతారు. ఇటువంటి సాధకులు సహజంగానే, వేదములలో చెప్పబడిన కర్మ కాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతారు.

అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.

ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.

అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.