8వ అధ్యాయము: అక్షర బ్రహ్మ యోగము

అక్షర బ్రహ్మ యోగము

ఉపనిషత్తులలో విస్తారంగా చెప్పబడిన చాలా పదాలని మరియు విషయాలని ఈ అధ్యాయం క్లుప్తంగా వివరిస్తుంది. ఇది మరణం తరువాత ఆత్మ యొక్క గమ్యాన్ని నిర్ణయించే కారకాలను కూడా వివరిస్తుంది. మనం మరణ సమయంలో భగవంతుడిని స్మరించగలిగితే, ఆయనను ఖచ్చితంగా పొందగలము. కాబట్టి, రోజువారి పనులు చేస్తూనే, ఆయనను అన్ని సమయాల్లో స్మరిస్తూనే ఉండాలి. ఆ స్వామి యొక్క గుణములు, లక్షణములు, మరియు మహిమలు గుర్తు చేసుకుంటూ ఆయనను స్మరించవచ్చు. దృఢ సంకల్పముతో యోగ ధ్యానములో మనస్సుని నామ సంకీర్తన ద్వారా ఆయనపైనే కేంద్రీకరించాలి. మన మనస్సుని సంపూర్ణంగా అనన్య భక్తితో ఆయన పైనే నిమగ్నం చేసినప్పుడు మనము ఈ భౌతిక జగత్తుకి అతీతంగా ఆధ్యాత్మిక స్థాయిలోనికి వెళతాము.
    ఆ తర్వాత, ఈ అధ్యాయం, భౌతిక జగత్తు లోని రకరకాల లోకాల గురించి ప్రస్తావిస్తుంది. సృష్టి క్రమంలో, ఈ లోకాలు మరియు వాటిలో అసంఖ్యాకమైన జీవ రాశులు ఎలా వచ్చాయో, మరలా ప్రళయ కాలంలో ఎలా తిరిగి లయం అవుతాయో, ఈ అధ్యాయం చెపుతుంది. కానీ, ఈ యొక్క వ్యక్త, అవ్యక్త సృష్టికి అతీతంగా, భగవంతుని దివ్య ధామము ఉంటుంది. ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరించినవారు, అంతిమంగా దివ్య ధామాన్ని చేరుకుంటారు, మరియు ఈ మృత్యు లోకానికి తిరిగిరారు; చీకటి మార్గాన్ని అనుసరించేవారు, ఈ జన్మ, వ్యాధి, వృద్దాప్యం, మరియు మృత్యువు యొక్క అంతం లేని చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు.

అర్జునుడు పలికెను: ఓ పరమేశ్వరా, బ్రహ్మన్ (పరమ సత్యము) అనగా ఏమిటి? అధ్యాత్మము (ఆత్మ) అనగా ఏమిటి?, మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదైవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణా, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము?

శ్రీ భగవానుడు పలికెను: సర్వోన్నతమైన, నాశములేని తత్త్వమునే బ్రహ్మన్ అందురు; వ్యక్తి యొక్క ఆత్మ తత్త్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్త్వమునకు మరియు వాటి అభివృద్దికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు.

దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, నిరంతరం మారుతునే ఉండే ఈ భౌతిక సృష్టినే అదిభూత అంటారు; సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వ రూపమునే అధిదైవము అంటారు; సర్వ భూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము, అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు, అని పిలువబడుతాను.

మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు.

మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తుచేసుకుంటాడో, ఓ కుంతీ పుత్రుడా, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును.

కాబట్టి, సర్వ కాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు; ఈ విషయంలో సందేహం లేదు.

అభ్యాసముతో, ఓ పార్థా, నిరంతరంగా మనస్సుని, ఎటూ పోనీయక, పరమేశ్వరుడైన నన్ను స్మరించుట యందే నిమగ్నం చేస్తే, నీవు తప్పకుండా నన్ను పొందగలవు.

భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైన వాడు, అన్నింటికీ ఆధారమైన వాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు; ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకీ అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో, యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో, ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి, నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో, వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు.

వేద పండితులు ఆయనను నాశము (క్షయము) చెందని వాడు అని చెప్తారు; ఆయనలో ప్రవేశించటానికి, మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ, ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తముగా విశదపరుస్తాను.

శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి, మనస్సుని హృదయ స్థానము యందే నిలిపి, ప్రాణములను మూర్ధ్న్యా (తల) స్థానములోకి లాగి, వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను.

పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వ్యక్తి పరమ గతిని పొందును.

ఓ పార్థా, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు, నేను సులభముగానే దొరుకుతాను ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి.

నన్ను పొందిన పిదప, మహాత్ములకు, ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు, ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు.

బ్రహ్మలోక పర్యంతమూ, ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో, నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు, ఓ అర్జునా. కానీ నా ధామమునకు చేరిన పిదప, ఓ కుంతీ పుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు.

వెయ్యి చతుర్యుగము (మహాయుగము) ల కాలము, బ్రహ్మ దేవునికి ఒక రోజు (కల్పము) అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యదార్థాన్ని అర్థం చేసుకున్నట్టు.

బ్రహ్మ యొక్క పగలు ప్రారంభంకాగానే, సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే, అన్ని జీవాత్మలూ తమ అవ్యక్త రూపంలోకి లీనమై పోతాయి.

బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవ రాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది, మరియు బ్రహ్మరాత్రి ప్రారంభమవగానే అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మపగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి.

ఈ యొక్క వ్యక్తమయిన మరియు అవ్యక్తమయిన సృష్టి కంటెను అలౌకికమైన మరియొక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్ని నశించిపోయినా, ఆ లోకము మాత్రము నిత్యము, నశించదు.

ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము, మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక (మర్త్య) లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము.

సర్వోత్కృష్ట పరమ పురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వ వ్యాప్తుడు మరియు సర్వ ప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నా, ఆయన కేవలం భక్తి చేత మాత్రమే తెలుసుకోబడుతాడు.

ఈ లోకం నుండి వెళ్లి పోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను, ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకొని, ఉత్తరాయణ ఆరు మాసాల కాలంలో, శుక్ల పక్షంలో, పగటి పూట ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వారు పరమ పదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మ కాండలని ఆచరించేవారు, దక్షిణాయన ఆరు మాసాల్లో, కృష్ణ పక్షంలో, ధూమ్ర కాలంలో, రాత్రిపూట, ఈ లోకాన్ని విడిచి వెళ్ళినవారు - స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత, తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ రెండు, ప్రకాశవంతమైన మరియు చీకటి, మార్గాలూ ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది.

ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు, ఓ పార్థా, ఎన్నటికీ మోహమునకు గురి కారు. కాబట్టి, సర్వదా (అన్ని సమయాల్లో) యోగములో స్థితుడవై (భగవంతునితో ఏకమై) ఉండుము.

ఈ రహస్యం తెలిసిన యోగులు - వైదిక కర్మ కాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దానధర్మాలు చేయుట - వీటన్నిటి పుణ్య ఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు.