ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ ।
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ।। 13 ।।
ఓం — ఈశ్వరుని నిరాకార తత్వాన్ని సూచించే పవిత్ర శబ్దం; ఇతి — ఈ విధంగా; ఏక-అక్షరం — ఒకే అక్షరంతో ఉన్న; బ్రహ్మ — పరమ సత్యము; వ్యాహరన్ — జపిస్తూ; మాం — నన్ను (శ్రీ కృష్ణుడు); అనుస్మరన్ — స్మరిస్తూ; యః — ఎవరైతే; ప్రయాతి — వెళ్లిపోతారో; త్యజన్ — విడిచిపెడుతూ; దేహం — శరీరము; సః — అతడు; యాతి — పొందును; పరమాం — అత్యున్నతమైన; గతిం — లక్ష్యము.
Translation
BG 8.13: పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వాడు పరమ గతిని పొందును.
Commentary
ప్రణవము అని కూడా పిలవబడే ఈ పవిత్రమైన ఓం-కారము, శబ్ద రూపములో ఉన్న బ్రహ్మాన్ (పరమేశ్వరుని యొక్క నిర్గుణ నిరాకార తత్వము) ను సూచిస్తుంది. కాబట్టి, భగవంతుని లాగానే నాశములేనిదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ, శ్రీ కృష్ణుడు, అష్టాంగ-యోగ సాధనా పద్దతిలో ధ్యానము చేసే విధానాన్ని చెపుతున్నాడు; మనస్సుని కేంద్రీకరించటానికి, నియమనిష్ఠలను, బ్రహ్మచర్యమును పాటిస్తూ ‘ఓం’ కారముని జపిస్తుండాలని అంటున్నాడు. వేద శాస్త్రాలు "ఓం" కారమును "అనాహత నాదము" అని కూడా చెప్తాయి. ఈ శబ్దము సమస్త సృష్టి యందు వ్యాపించి ఉంటుంది, దీనితో అనుసంధానం అయ్యే యోగులకు ఇది వినపడుతుంది.
బైబిల్ ఇలా పేర్కొంటుంది : “In the beginning was the Word, and the Word was with God, and the Word was God.” (John 1:1). వేద శాస్త్రాలు కూడా భగవంతుడు మొట్టమొదట శబ్దమునునే సృష్టించాడు అని, శబ్దము నుండి ఆకాశము ను సృష్టించి, ఆ తరువాత మిగతా సృష్టి చేయటానికి ముందుకెళ్ళాడు అని పేర్కొంటున్నాయి. ఈ మూల శబ్దమే "ఓం". ఈ కారణంగా, వైదిక తత్వంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీనిని 'మహా వాక్యము', అంటే వేదముల సర్వోన్నత శబ్దము అని కూడా అంటారు. దీనినే బీజ మంత్రము అని కూడా అంటారు, ఎందుకంటే అది తరచుగా హ్రీం, క్లీం వంటి వాటి లాగా వేద మంత్రాల ప్రారంభంలో జత చేయబడుతుంది. ఈ ఓంకార నాదములో మూడు అక్షరములు ఉంటాయి: అ.... ఉ....మ. ఓం కారము యొక్క సరియైన జప పద్దతిలో, మొదట "అ" కారమును నాభి స్థానము నుండి, గొంతు-నోరు తెరిచి జపిస్తారు. ఇది, గొంతు మధ్యనుండి వచ్చే "ఉ" కారములో విలీనమవుతుంది. ఈ ప్రక్రియ "మ" కారమును పెదవులు మూసి అనటంతో పూర్తవుతుంది. ఈ మూడు భాగాలు అ.... ఉ....మ.. లకు ఎన్నో అర్థాలు మరియు వ్యాఖ్యానాలు ఉన్నాయి. భక్తులకు "ఓం" అనేది భగవంతుని నిరాకార తత్వానికి ఉన్న పేరు.
ఈ ప్రణవ నాదము, అష్టాంగ యోగములో ఉన్న ధ్యాన విషయము. భక్తి యోగములో, భక్తులు, భగవంతుని యొక్క నామములు అయిన రామ, కృష్ణ, శివ మొదలైన పేర్ల మీద ధ్యానం చెయటానికి మొగ్గు చూపుతారు; ఎందుకంటే ఈ భాగవన్నామములలో భగవంతుని పరమానందము యొక్క మరింత తియ్యదనము ఉంటుంది. ఈ తేడా, బిడ్డ గర్భంలో ఉండటానికి మరియు ఒళ్లో ఉండటానికి ఉన్న లాంటిది. ఒళ్లో ఉన్న బిడ్డ, గర్భంలో ఉన్న బిడ్డ కంటే , ఎంతో ఎక్కువ తియ్యని అనుభూతిని ఇస్తుంది.
మన ధ్యానము యొక్క అంతిమ పరీక్ష మరణ సమయమే. మృత్యువు యొక్క తీవ్ర బాధ లో కూడా, అంతఃకరణమును భగవంతుని యందే నిలుపగలిగిన వారు ఈ పరీక్షలో విజయం సాధించినట్టు. అటువంటి వ్యక్తులు, శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత, అత్యున్నత లక్ష్యాన్ని పొందుతారు. ఇది చాలా క్లిష్టమైనది మరియు దీనికి ఒక జీవిత కాలపు అభ్యాసము అవసరం. ఇక తదుపరి శ్లోకం లో శ్రీ కృష్ణుడు ఇటువంటి ప్రావీణ్యము సాధించటానికి ఉన్న సునాయాస మార్గాన్ని ఇస్తున్నాడు.