సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః ।
నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే ।। 14 ।।
సతతం — ఎల్లప్పుడూ; కీర్తయంతః — భగవత్ కీర్తి ని పాడుతూ; మాం — నన్ను; యతంతః — శ్రమిస్తూ; చ — మరియు; దృఢవ్రతాః — ధృఢసంకల్పముతో; నమస్యంతః — వినమ్రతతో నమస్కరిస్తూ; చ — మరియు; మాం — నన్ను; భక్త్యా — ప్రేమయుక్త భక్తి; నిత్య-యుక్తా — నిత్యమూ ఏకమై ఉండి; ఉపాసతే — ఆరాధిస్తారు.
Translation
BG 9.14: ఎల్లప్పుడూ నా దివ్య లీలలను గానం చేస్తూ, ధృడ సంకల్పముతో పరిశ్రమిస్తూ, వినయముతో నా ముందు ప్రణమిల్లుతూ, నిరంతరం వారు నన్ను ప్రేమ యుక్త భక్తి తో ఆరాధిస్తుంటారు.
Commentary
మహాత్ములు తన పట్ల భక్తి తో నిమగ్నమైతారని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు వారు భక్తి ఎలా చేస్తారో వివరిస్తున్నాడు. భక్తులు తమ భక్తి సాధన కోసం, దానిని పెంపొందించుకోవటం కోసం, కీర్తనల పట్ల ఎంతో ఆసక్తితో ఉంటారు అని అంటున్నాడు. భగవంతుని కీర్తిని గానం చేయటమే కీర్తన అంటారు, దీనిని ఈ విధంగా నిర్వచిస్తారు : నామ-లీలా-గుణాదీనాం ఉచ్చైర్-భాషా తు కీర్తనం (భక్తి రసామృత సింధు 1.2.145). “భగవంతుని యొక్క నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు మరియు పరివారము యొక్క కీర్తిని పాడటమే కీర్తన అందురు”
కీర్తన అనేది భక్తిని సాధన చేయటానికి ఉన్న అత్యంత ప్రభావమైన పనిముట్టు. అది మూడు రకాల భక్తి విధానాలని కలిగి ఉంటుంది, శ్రవణం (వినటము), కీర్తనం, మరియు స్మరణం. మన లక్ష్యం భగవంతుని పై మనస్సుని లగ్నం చేయటమే, అది కీర్తనం మరియు శ్రవణంతో పాటుగా చేస్తే ఇంకా సులువవుతుంది. ఆరవ అధ్యాయంలో చెప్పినట్టు, మనస్సు అనేది గాలి వలె చంచలమైనది, మరియు సహజంగానే ఒక ఆలోచన తరువాత ఇంకో ఆలోచనకి తిరుగుతూనే ఉంటుంది. శ్రవణము మరియు కీర్తనము జ్ఞానేంద్రియాలను భగవత్ దృక్పథంలో నిమగ్నం చేస్తాయి, మనస్సుని పదేపదే దాని తిరుగుడు నుండి వెనక్కు తీస్కు రావటానికి అవి సహాయం చేస్తాయి.
కీర్తన ప్రక్రియ వలన ఇంకా చాల వేరే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. తరచుగా జనులు జపము (పూసల మాల సహాయంతో భగవత్ నామమును లేదా మంత్రమును జపించుట) లేదా ధ్యానము ద్వారా భక్తిని ఆచరిస్తుంటారు, వారు నిద్రని ఆపుకోలేరు. కానీ, కీర్తన అనేది ఎంతో నిమగ్నమై చేసే పని కాబట్టి అది సహజంగానే నిద్రని తరిమివేస్తుంది. అంతేకాక, కీర్తన అనేది ధ్యాస మరల్చే అన్యమైన శబ్దాలను దరిచేరనివ్వదు. కీర్తన అనేది అందరూ కలసి అభ్యాసం చేసుకోవచ్చు. దానితో పాటుగా, మనస్సుకి కావలసిన మార్పు/కొత్తదనము, కీర్తనలో ఉండే భగవత్ నామాలు, గుణాలు, లీలలు, ధామాలు వంటి వాటి ద్వారా దానికి లభిస్తాయి. మరియు కీర్తనలో పెద్దగా గొంతెత్తి పాడటం వలన ఆ యొక్క భగవత్ నామము యొక్క దివ్య ప్రకంపనలు మొత్తం వాతావరణాన్ని మంగళప్రదంగా, పవిత్రంగా చేస్తాయి.
ఇవన్నీ కారణాల వలన, కీర్తన అనేది భారతీయ యోగులలో అత్యంత ప్రజాదరణ పొందిన భక్తి మార్గముగా ఉంది. ప్రఖ్యాతిగల భక్తి మహాత్ములు అందరూ – సూరదాసు, తులసీదాసు, మీరాబాయి, గురు నానక్, కబీర్, తుకారం, ఏకనాథ్, నార్సి మెహత, జయదేవుడు, త్యాగరాజు మరియు ఇతరులు – గొప్ప కవులు. వారు ఎనెన్నో భక్తి గీతాలను రచించారు మరియు వాటి ద్వారా, కీర్తనం, శ్రవణం మరియు స్మరణం లో నిమగ్నమైనారు.
వైదిక శాస్త్రాలు, ఈ కలి యుగంలో, భక్తికి, కీర్తన ప్రక్రియని అత్యంత శక్తివంతమైన మరియు అత్యంత సులువైన మార్గముగా ప్రత్యేకంగా ప్రశంసించాయి.
కృతే యద్ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మఖైః
ద్వాపరే పరిచర్యాయాం కలౌ తద్ధరికీర్తనాత్ (భాగవతం 12.3.52)
"సత్య యుగంలో భక్తికి అత్యుత్తమ మార్గము, భగవత్ ధ్యానము ఉండేది. త్రేతా యుగములో, యజ్ఞ యాగాదులను భగవత్ ప్రీతి కోసం ఆచరించటం ఉండేది. ద్వాపర యుగంలో, విగ్రహారాధన అనేది సిఫారసు చేయబడ్డ పద్దతి. ఈ ప్రస్తుత కలి యుగంలో, అది కేవలం కీర్తన మాత్రమే"
అవికారీ వా వికారీ వా సర్వ దోషైక భాజనః
పరమేశ పదం యాతి రామ నామానుకీర్తనాత్ (అధ్యాత్మ రామాయణం)
"నీవు సకామ భావముతో ఉన్నా లేదా నిష్కామ భావన తో ఉన్నా, నీవు దోషరహితుడవైనా లేదా లోపభూయిష్టుడవైనా, నీవు గనక శ్రీ రామచంద్ర ప్రభువు యొక్క నామసంకీర్తన చేస్తే, నీవు పరమ పదమును చేరుకోగలవు"
సర్వ ధర్మ బహిర్భూతాః సర్వ పాపరతస్థథా
ముచ్యతే నాత్ర సందేహో విశ్నోర్ణమానుకీర్తనాత్ (వైశంపాయన సంహిత)
"పరమ పాపిష్టులైనా మరియు ధార్మికత ఏమాత్రమూ లేనివారైనా, వారు విష్ణుమూర్తి యొక్క నామ గానము చేయటం వలన రక్షింపబడుతారు, ఇందులో సందేహం లేదు."
కలియుగ కేవల హరి గున గాహా, గావత నర పావహిం భవ థాహా (రామాయణం)
"ఈ కలి యుగంలో మోక్షానికి ఒక ఉపాయం ఉంది. భగవంతుని కీర్తి ని గానం చేస్తూ మనము భవ సాగరాన్ని దాటివేయవచ్చు. "
కానీ, కీర్తన ప్రక్రియలో, మనం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, శ్రవణం మరియు కీర్తనము సహాయకులే, ప్రధానమైనది భగవత్ స్మరణ. ఒకవేళ మనం అది విడిచి పెడితే, కీర్తన అనేది మనలను పరిశుద్ధి చేయదు. కాబట్టి, తన భక్తులు తమ మనస్సులని ఆయన స్మరణ లో నిమగ్నం చేసి, కీర్తన చేస్తుంటారని, శ్రీ కృష్ణుడు ఇక్కడ అంటున్నాడు. వారు అంతఃకరణ శుద్ధికై ధృడ సంకల్పముతో దీనిని ఆచరిస్తుంటారు.