అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ।। 22 ।।
అనన్యాః — ఎల్లప్పుడూ; చింతయంతః — స్మరిస్తూ; మాం — నన్ను; యే — ఎవరైతే; జనాః — జనులు; పర్యుపాసతే — కేవలం (నన్నే) పూజింతురో; తేషాం — వారి యొక్క; నిత్య -అభియుక్తానాం — సదా నా యందే నిమగ్నమై ఉన్నారో; యోగ — ఆధ్యాత్మిక సంపత్తిని అందిస్తాను; క్షేమమ్ — ఆధ్యాత్మిక సంపత్తిని రక్షిస్తాను; వహామి — మోస్తాను; అహం — నేను.
Translation
BG 9.22: ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నా యందు అనన్య భక్తిలో నిమగ్నమైన వారుంటారు, అలా నా యందే సతతమూ మనస్సు నిలిపిన వారికి, వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను.
Commentary
నిస్సహాయ స్థితిలో ఉండి తన మీదే పూర్తిగా ఆధారపడి ఉన్న అప్పుడే పుట్టిన పసి బిడ్డని, ఏ తల్లి కూడా వదిలిపెట్టేయలేదు. ఆత్మ యొక్క సర్వోన్నత, నిత్య శాశ్వత తల్లి ఆ భగవంతుడే. ఈ శ్లోకంలో భగవంతుడు తనకు అనన్య శరణాగతి చేసిన ఆత్మలకు అమ్మ లాంటి హామీ ఇస్తున్నాడు. ఇక్క ఉపయోగించబడిన పదాలు 'వహామి అహం' అంటే, "నేనే స్వయంగా నా భక్తుల భారాన్ని మోస్తాను" అని, ఇది, ఒక వివాహితుడు తన భార్యా, పిల్లల యొక్క భారాన్ని మోసినట్టుగా అన్నమాట. భగవంతుడు రెండింటిని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు - మొదటిది యోగము - అంటే తన భక్తులకు లేని ఆధ్యాత్మిక సంపదని తనే ప్రసాదిస్తాడు. రెండవది క్షేమము - తన భక్తులకున్న ఆధ్యాత్మిక సంపదలని తను సంరక్షిస్తాడు.
కానీ, దీనికి ఆయన పెట్టిన షరతు ఏమిటంటే, అనన్య శరణాగతి. దీనిని కూడా మళ్లీ తల్లి-బిడ్డల ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక నవజాత శిశువు పూర్తిగా తన తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది; ఆమే శిశువుకు కావలసినవన్నీ చూసుకుంటుంది. బిడ్డ ఏమైనా కావాలంటే కేవలం ఏడుస్తుంది; అమ్మనే బిడ్డను శుభ్రంచేయటం, అన్నంపెట్టడం, స్నానం చేపించటం వంటి పనులన్నీ చేస్తుంది. కానీ, బిడ్డకి ఐదు సంవత్సరముల వయస్సు వచ్చినప్పుడు, కొన్ని పనులు తనంత తానే చేసుకుంటుంది. ఆ మేరకు తల్లి తన పనులు తగ్గించుకుంటుంది. ఇంకా, అదే బిడ్డ యుక్త వయస్సు వచ్చి, అన్ని భాద్యతలూ తనే తీస్కున్నప్పుడు, అమ్మ తన భాద్యతను ఇంకా తగ్గించుకుంటుంది. ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి, "మన కొడుకు ఏడి?" అని అడిగితే, అమ్మ , "స్కూలు నుండి ఇంకా ఇంటికి రాలేదు. స్నేహితులతో కలిసి సినిమాకి పోయాడేమో" అంటుంది. ఆమె యొక్క వైఖరి ఇప్పుడు వాడి పట్ల ఉదాసీనంగా ఉంటుంది. కానీ, ఇదే పిల్లవాడు ఐదు సంవత్సరముల వయస్సులో ఉన్నప్పుడు, స్కూలు నుండి రావటం పది నిముషాలు ఆలస్యం అయితే, అమ్మ-నాన్న చింతించటం మొదలుపెడతారు, "ఏమయిందో? వాడు చిన్నవాడు. వాడికేమీ ప్రమాదం జరగలేదు కదా. ఒకసారి స్కూల్ కి ఫోన్ చేసి కనుక్కుందాం." అని అనుకుంటారు.
ఈ ప్రకారంగా పిల్లవాడు మరింత భాద్యతలు తీసుకున్నకొద్దీ, ఆ తల్లి తన భాధ్యతని త్యజిస్తూ ఉంటుంది. భగవంతుని చట్టము కూడా ఇలాగే ఉంటుంది. మన సొంత స్వేచ్చా చిత్తము తో ప్రవర్తిస్తూ, మన కర్మలను చేసేది మనమే అని అనుకున్నప్పుడు, మన సొంత శక్తి సామర్ధ్యాల మీద ఆధారపడి ఉన్నప్పుడు, భగవంతుడు తన కృపని ప్రసాదించడు. కేవలం మన కర్మలను నోటు చేసుకుంటూ ఫలములను ఇస్తుంటాడు. మనం పాక్షికంగా ఆయనకు శరణాగతి చేసి, పాక్షికంగా భౌతిక ఆధారాలపై ఆధారపడినప్పుడు, భగవంతుడు కూడా తన కృప ను పాక్షికంగా ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటామో, 'మామేకం శరణం వ్రజ' , భగవంతుడు తన పూర్తి అనుగ్రహముని ప్రసాదించి, మనకు ఉన్నవాటిని సంరక్షిస్తూ, మనకు లేని వాటిని సమకూరుస్తూ, మన పూర్తి భాద్యతను తను స్వీకరిస్తాడు.