Introduction

ప్రార్ధన

ప్రథమం సద్గురుమ్ వందే శ్రీ కృష్ణ తదనంతరం
గురుః పాపాత్మనాం త్రాతా శ్రీ కృష్ణస్త్వమలాత్మనాం
ముకుందానంద ప్రపన్నోహం గురు పాదారవిందయోః
తస్య ప్రేరణయా తస్య దివ్యాదేశం వదామ్యహం

"నేను మొదట నా గురుదేవులు జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ గారికి, మరియు ఆ తరువాత శ్రీ కృష్ణ భగవానునకు మర్యాద పూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. శ్రీ కృష్ణుడు పవిత్ర హృదయులనే అక్కున చేర్చుకుంటాడు, కానీ నా గురుదేవులు ఎంత దయగల వారు అంటే, వారు ఆధ్యాత్మిక అభాగ్యులకు కూడా ఆశ్రయం ఇస్తారు. ఈ అల్పమైన, అతిసామాన్యమైన, ముకుందానంద అనే పేరుతో లోకంలో పిలవబడే ఈ జీవాత్మ, తన ఆధ్యాత్మిక గురువుల పాదారవిందముల వద్ద శరణాగతి చేస్తున్నది. తన గురువు గారి అనుమతి, ప్రేరణ, మరియు కృపతో, అతను వినయంతో ఆధ్యాత్మిక విషయముల పై అర్థ వివరణ చేయబోవుచున్నాడు."


వందే వృందావనానందాం రాధికాం పరమేశ్వరీం
గోపికాం పరమాం శూద్దాం హ్లాదినీం శక్తి రూపిణీం

"సర్వోత్కృష్ట దేవత మరియు భగవంతుని పరమానందమును అందించే శక్తి స్వరూపమైన రాధారాణికి నా మర్యాదపూర్వక వందనములు అర్పిస్తున్నాను. ఆమె గోపికలలో అత్యంత పవిత్రురాలు మరియు ఆమె మూర్తీభవించిన బృందావన ఆనందము."


కదా ద్రక్ష్యామి నందస్య బాలకం నీపమాలకం
పాలకం సర్వ సత్త్వానాం లసత్తిలక భాలకం

"నందకుమారునిగా ఈ భూలోకంలో అవతరించిన ఆ యొక్క శ్రీ కృష్ణ భగవానుని దివ్యమంగళ స్వరూపముని నా కన్నులు ఎప్పుడు చూడగలవో? ఆయన తన కంఠము చుట్టూ పూలమాల అలంకరించబడి ఉంటాడు మరియు లలాటముపై తిలకమును ధరించి ఉంటాడు; ఆయనే ధర్మాత్ముల రక్షకుడు."


అజాత పక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాః క్షుధార్తాః
ప్రియం ప్రియేవ వ్యుషితం విషణ్ణా మనోరవిందాక్ష దిదృక్షతే త్వామ్

"ఓ భగవంతుడా! ఒక పిట్టపిల్ల తన తల్లి కోసం పరితపించినట్టుగా, ఆకలితో ఉన్న పసిపాప తల్లి చనుబాల కోసం వేచిఉన్నట్టుగా, ప్రేమికుడు ప్రేయసిని కోరుకున్నట్లుగా, నా మనస్సు సతతమూ నీ దివ్య దర్శనమునే వాంఛించనీ."


జ్ఞాన సముపార్జనకు ఆరోహణ మరియు అవరోహణ క్రమ పద్దతులు


జ్ఞాన సముపార్జనకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది ఆరోహణ క్రమము, దీనిలో మనం, పరమ సత్యమును అన్వేషించి, కనుగొని, అర్థంచేసుకొనుటకు మన ఇంద్రియమనోబుద్ధులను ఉపయోగిస్తాము. రెండవది అవరోహణ మార్గము, దీనిలో మనం ఒక సరియైన మూలం నుండి జ్ఞానాన్ని అందుకుంటాము. ఆరోహణ క్రమంలో జ్ఞానాన్ని సముపార్జించుకోవటం అంతర్లీనంగా లోపాలతో కూడి ఉంటుంది. మన ఇంద్రియమనోబుద్ధులు భౌతిక ప్రాకృతిక శక్తిచే తయారు చేయబడ్డాయి కావున అవి పరిమితమైనవి మరియు దోషములతోకూడి ఉన్నవి. అందుచేత, మనం వాటి ద్వారా పొందిన జ్ఞానము యొక్క ఖచ్చితత్వం మరియు విశ్వసనీయత పై సంపూర్ణ విశ్వాసం ఎప్పటికీ ఉంచలేము.


భౌతిక శాస్త్రము యొక్క జ్ఞాన సముపార్జన ఆరోహణ పద్దతిలో ఉండటం వలన, గత కాలపు అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు తిరుగులేని శాస్త్ర సిద్దాంతాలు కూడా కొత్తవాటి చే త్రోసివేయబడి తిరగవ్రాయ బడుతాయి. ఉదాహరణకి, పదార్ధము అనేది అవిభాజ్య పరమాణువులచే చేయబడి ఉంది అని చెప్పిన గ్రీకు సిద్దాంతము, పరమాణువులలో ఎలక్ట్రానులు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు చాలా ఖాళీ ప్రదేశము ఉంటుందని చూపించిన రూథర్ఫోర్డ్ చే కొట్టివేయనడినది. రూథర్ఫోర్డ్ యొక్క సిద్ధాంతము క్వాంటమ్ సిద్ధాంతము చే త్రోసివేయబడినది, అది, ఎలక్ట్రానులు, ప్రోటాన్లు, అసలు ఘన పదార్ధాలు కావనీ, dual particle wave nature తో ఉన్న vibrating patterns of energy అని పేర్కొన్నది. దీనితో మనకేమి సందేహం కలుగుతుంది అంటే, మనం ఇప్పుడు నిజమని నమ్మేవి కూడా, కొద్ది శతాబ్దాల భవిష్యత్తులో, అవి పూర్తిగా తప్పే అని నిరూపింపబడతాయేమో అని.


మరోపక్క, రెండవ జ్ఞాన సముపార్జన పద్దతి, అవరోహణ పద్దతి, సంపూర్ణముగా ఇటువంటి దోష రహితమయినది. మనం ఎప్పుడైతే పరిపూర్ణదోషరహిత మూలం నుండి జ్ఞానాన్ని అందుకుంటామో, అప్పుడు అది తప్పులు లేనిది అని నమ్మవచ్చు. ఉదాహరణకు, మన తండ్రి ఎవరు అని తెలుసుకొవాలంటే మనం ఏమీ ప్రయోగాలు చేయనవసరం లేదు. కేవలం మన అమ్మని అడిగితే సరిపోతుంది, ఎందుకంటే ఈ విషయం మీద ఆమెనే ప్రమాణము. అదే విధంగా, ఆధ్యాత్మిక విషయాలలో కూడా అవరోహణ పద్దతి మనకు తక్షణమే విస్తారమైన జ్ఞాన భాండాగారాన్ని అందచేస్తుంది, అదే విషయాన్ని మనం స్వంతంగా తెలుసుకోవాలంటే ఎన్నో యుగాల సమయం పడుతుంది. ఇందులో ఉండే ఒకేఒక నియమం ఏమిటంటే ఆ జ్ఞానాన్ని తీసుకునే మూలము ఖచ్చితంగా దోషరహితమయినది మరియు విశ్వసనీయమైనది అయి ఉండాలి. వేదములు ఇటువంటి ఒక జ్ఞాన మూలాధారములు.


వేదములు అంటే ఏవో పుస్తకాల పేర్లు కావు. అవి భగవంతుని యొక్క సనాతనమైన జ్ఞానము, ఈ జగత్ సృష్టి చేసినప్పుడు ఆయన వాటిని ప్రకటిస్తాడు. ఈ సృష్టి చక్ర క్రమంలో, ప్రారంభంలో ఆయన వాటిని ప్రధమంగా జన్మించిన బ్రహ్మగారి హృదయంలో తెలియపరిచాడు. ఈ వేదములు వేల సంవత్సరముల కొద్దీ , గురు శిష్య పరంపరలో కేవలం కంఠము ద్వారా ముందు తరాలకు అందించబడ్డాయి, అందుకే వీటికి ఉన్న మరోపేరు "శృతి" (వినటం ద్వారా అందుకోబడిన జ్ఞానం). వీటినే అపౌరుషేయములు (ఏ మానవుడు తయారు చేసినవి కావు) అని కూడా అంటారు. ఈ కారణం చేత భారత దేశ తత్త్వశాస్త్రములో, ఏ ఆధ్యాత్మిక సూత్రాన్ని నిరూపించాలన్నా, వేదములే అంతిమ ప్రామాణికములు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఏ ఆధ్యాత్మిక సిద్ధాంత ప్రమాణత్వం ఋజువు చేయాలన్నా వేదములే ఆధారం. వేదముల అర్ధాన్ని మరింత అర్థవివరణ చేయటానికి, మరిన్ని ఎన్నో గ్రంధాలు రచించబడ్డాయి. ఈ శాస్త్ర గ్రంధాలు వేద ప్రమాణ పరిధిని అతిక్రమించవు, పైగా అవి వేదాల్లో ఉన్న జ్ఞానాన్నే మరింత విస్తరించి వివరణ చేయటానికి ప్రయత్నిస్తాయి. వీటన్నిటినీ కలిపి "వైదిక వాఙ్మయము" అని అంటారు.
వైదిక గ్రంధాలు అపారమైనవి, కానీ వాటిలో మూడింటిని "ప్రస్థాన త్రయము" అంటారు (వైదిక విషయాలని అర్థంచేసుకోవటానికి ఉన్న మూడు ప్రారంభ స్థానాలు). ఇవే ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు మరియు భగవద్గీత.


ఉపనిషత్తులు అంటే, వేదములలో తత్త్వ జ్ఞానము ఉన్న భాగాలు, అవి వేద విషయ సారములు. అవి చదివిన తరువాత, జర్మన్ తత్వవేత్త Arthur Schopenhauer (1788-1860) ఇలా అన్నాడు, "ఉపనిషత్తులకి సరితూగగల ఔన్నత్యం గల తత్త్వజ్ఞానం వేరొకటి ఏదీ లేదు. నా జీవితానికి అది ఎంతో ఉపశమనాన్ని ఇస్తూఉన్నది, మరియు నా మరణానికి కూడా ఎంతో స్వాంతన ఇస్తుంది. ("There is no philosophy in the world as elevating as that of the Upaniṣhads. It has been the solace of my life and it shall be the solace of my death.") Paul Deussen (1845-1919), అనే మరొక జర్మన్ తత్త్వవేత్త, ఈ విధంగా తన భావాలను వ్యక్త పరిచాడు: "సనాతనమైన తత్త్వజ్ఞాన సత్యమును వ్యక్తపరచటానికి, బంధవిముక్తి జ్ఞానవిషయాన్ని కలిగున్న ఉపనిషత్తులను మించిన స్థానం లేదు" ("Eternal philosophical truth has seldom found a more striking and decisive expression than in the emancipating knowledge of the philosophy of the Upaniṣhads.") కానీ, ఉపనిషత్తులు సామాన్య జనులకు అర్థంచేసుకోవటానికి కష్టతరమైనవి.


బ్రహ్మ సూత్రములు ఉపనిషత్తుల సారాంశము. వేదముల తత్త్వ జ్ఞానానికి ముగింపుగా, అది వేద వ్యాసునిచే రచించబడినది. అందుకే దానిని "వేదాంతము" అని కూడా అంటారు, అంటే "వేద విషయముల యొక్క అంతిమ సారాంశము". ఉపనిషత్తుల లాగానే, బ్రహ్మ సూత్రములు కూడా అర్థం చేసుకోవటానికి చాలా క్లిష్టమైనవి, అంతేకాక అవి సంక్షిప్తముగా ఉండటం చేత బహుళార్థములు వచ్చేట్టుగా ఉంటూ, మరియు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతాయి.


భగవద్గీత ఈ రెండు గ్రంధాల కన్నా మరింత అందుబాటులో ఉన్నటువంటిది. అది వైదిక తత్త్వజ్ఞానం పై సమగ్రమైన మరియు సులువుగా అర్థమయ్యే సారాంశాన్ని ఇస్తుంది. భగవద్ అంటే, "భగవంతుని యొక్క" అని అర్థం మరియు గీత అంటే "పాట" అని అర్థం. కాబట్టి, భగవద్గీత అంటే శబ్దార్థప్రకారముగా "భగవంతుని పాట" అని అర్థం. ఇది పరమేశ్వరుడైన శ్రీ కృష్ణుడికీ మరియు ఆయన భక్తుడైన అర్జునుడికి మధ్య, మహాభారత సంగ్రామ తరుణంలో జరిగిన సంభాషణ.


చరిత్ర క్రమంలో, ఆర్థికశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, తత్త్వశాస్త్రము, మొదలైన వాటిల్లో, కొన్ని వందల సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి మరియు తరువాత కాలంలో అవన్నీ తప్పని, అసంపూర్ణమైనవని తిరస్కరించబడ్డాయి. ఇవన్నీ ఆరోహణ క్రమంలో జ్ఞానాన్ని తెలుసుకోవటం ద్వారా వచ్చినవే, అందుకే లోపాలు, దోషాలతో కూడుకున్నవి. ఒకవేళ భగవద్గీత కూడా నశ్వరమైన మరియు పరిమిత బుద్ధి చే సృష్టించబడి ఉండి ఉంటే, యాభై శతాబ్దాల కాల గమనంలో అది కాలదోషంపట్టి, అసంబద్ధమైనదిగా అయిపోయి ఉండేది. కానీ, నిత్య శాశ్వతమైన గీతా-జ్ఞానము ఇప్పటి ఆధునిక కాల తత్త్వవేత్తలైన మహాత్మా గాంధీ, Robert Oppenheimer, Carl Jung, Herman Hesse, మరియు Aldous Huxley, (ఇంకా ఎందరో),లకు కూడా స్ఫూర్తినిచ్చింది, ఈ ప్రకారంగా, భగవద్గీత యొక్క మూలము దివ్యమైనదని మనకు తెలుస్తున్నది.


మహాభారత అంతర్గతంగా ఉన్నది


భగవద్గీత మొట్టమొదట, వేద వ్యాసునిచే, వేరుగా ప్రత్యేకమైన వేరే గ్రంధముగా రచించబడినది. ఆ తరువాత ఆయన మహాభారతం రచించినప్పుడు, ఆయన భగవద్గీతని దానిలోనే పొందుపరిచాడు. మహాభారతం ఒక లక్ష శ్లోకాలని కలిగి ఉంది, అందుకే అది ప్రపంచంలో కెల్లా అత్యంత విస్తారమైన కావ్యము. అది Iliad and Odyssey కలిపిన దానికన్నా ఏడు రెట్లు పెద్దది మరియు బైబిల్ కన్నా మూడు రెట్లు పెద్దది. రామాయణంతో పాటూ – దీనికి "ఇతిహాసము" అన్న స్థాయి ఇవ్వబడినది, అంటే భారత దేశ చారిత్రాత్మక లిఖితము అని అర్థం. దీనిలో ఉన్న కథలు, నీతి ఉపదేశాలు భారతీయ సంస్కృతిని వేల సంవత్సరాల కొద్దీ ప్రభావితం చేశాయి. మహాభారతము పద్దెనిమిది పర్వాలుగా విభజించబడినది. ఆరవదైన భీష్మ పర్వంలో భగవద్ గీత పొందుపరిచబడినది. ఈ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకూ ఉన్న పద్దెనిమిది అధ్యాయాలలో ఇది ఉంది.


వేదాల్లో ఉన్న చాలామటుకు ముఖ్యమైన జ్ఞానాన్ని భగవద్గీత కలిగి ఉన్నది కావున, దానినే గీతోపనిషత్తు లేదా గీతా ఉపనిషత్తు అంటారు. అది ఈ క్రింద తెలుపబడిన రెండు ముఖ్యమైన ప్రయోజనాలను మనకు అందిస్తుంది.

ఇది బ్రహ్మ విద్యను తెలియచేస్తుంది

మానవ జాతి తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవటంలో సాహసోపేతంగా ముందుకు వెళుతున్న క్రమంలో, మనం కొత్తవి తెలుసుకుని, నేర్చుకున్న కొద్దీ, ఇంకా తెలుసుకోవలసినది ఎంతో ఉన్నది అని గ్రహిస్తున్నాము. కొత్త కొత్త శాస్త్రాలు ప్రతి సంవత్సరం పుడుతూనే ఉంటాయి, దీనితో మనం సమస్త సృష్టి యొక్క పరమ సత్యమును తెలుసుకునే ప్రయాస ఎప్పటికీ పూర్తి కాని వ్యవహారము అని తెలుసుకుంటాము. మరి ఈ సమస్త సృష్టిని, కనిపించే సర్వ పదార్థాన్ని సులువుగా వివరించగలిగే ఓకే జ్ఞాన మూలము ఏదైనా ఉన్నదా అని మనం అబ్బురపడవచ్చు. వేదాల ప్రకారం, అటువంటి జ్ఞాన విషయం తప్పకుండా ఉంది, అదే పరమ సత్యమును తెలుసుకునే శాస్త్రము. పరమ సత్యము ఒక్కటే, దానినే ఈశ్వరుడు, భగవంతుడు, గాడ్, లార్డ్, అల్లాహ్, ఖుదా, యహ్వెహ్, ఆహుర్ మజ్దా, అలఖ్ నిరంజన్, శూన్య, ఐకొంకర్ మొదలైన భిన్నమైన పేర్లతో పిలుస్తారు. మిగతా అన్ని సత్యములు దాని నుండే ఉద్భవించాయి మరియు బృహత్ ప్రణాళికలో అవి వాటి వాటి స్థానాలలో ఉంటాయి. ఈ ప్రకారంగా, వేదములు ఇలా పేర్కొన్నాయి : "ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి", "ఎవరికైతే పరమ సత్యము యొక్క జ్ఞానము తెలుస్తుందో వారికి అన్నింటి జ్ఞానము తెలిసినట్టే." పరమ సత్యమును తెలుసుకునే శాస్త్రమునే "బ్రహ్మ విద్యా" అంటారు. భగవద్గీత యొక్క అన్నింటికన్నా ప్రధానమైన ప్రయోజనం, బ్రహ్మ విద్యను, అంటే భగవత్-ప్రాప్తి శాస్త్రమును మనకు బోధించటమే.


ఇప్పుడున్న ప్రస్తుత సమస్యలను పరిష్కరించటానికి సహకరించే జ్ఞానము ఒక రకమైన జ్ఞానోదయము, అదే సమయంలో, అజ్ఞానపు మూలాల్ని నాశనం చేసి సమస్త బాధలను ఒక్క వేటుతో పరిష్కరించేది ఇంకొక రకమైన జ్ఞానోదయము. ఆత్మని అనంతమైన జన్మల నుండీ కట్టివేసిన అజ్ఞానపు చీకటిని నిర్మూలిస్తూ, భగవద్గీత, ఈ రెండక రకమైన జ్ఞానోదయమే లక్ష్యంగా పనిచేస్తుంది. తన ఎదుటే ఉన్న సమస్యతో ఎటూపాలుపోక, అర్జునుడు, తన శోక ఉపశాంతి కోసం శ్రీ కృష్ణుడిని అర్థించాడు. శ్రీ కృష్ణుడు కేవలం అతని తక్షణ సమస్యకు మాత్రమే పరిష్కారం చూపటమే కాకుండా, జీవిత పరమావధి పై సమగ్రమైన ఉపదేశాన్ని ఇచ్చాడు.

ఇది యోగాభ్యాసమును బోధిస్తుంది

ఏదేని శాస్త్రం మనకు ఉపయోగపడాలంటే, అది రెండింటిని మనకు చెప్పాలి - థియరీ (పుస్తక జ్ఞానము) మరియు ప్రాక్టీసు ( ఆచరణా విధానము). అత్యంత శ్రేష్ఠమైన పుస్తక జ్ఞానం కూడా, అదొక్కటే జీవిత సమస్యలను పరిష్కరించటానికి సరిపోదు. మరియు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే, అది కేవలం ఒక మానసిక వినోదానికి మాత్రమే పనికి వస్తుంది. భగవద్గీత కేవలం ఉన్నతమైన తత్త్వజ్ఞానం అందించి మాత్రమే ఊరుకోదు; ఆధ్యాత్మిక సూత్రాలను దైనందిన జీవితంలో ఉపయోగంలో పెట్టటానికి స్పష్టమైన విధానాలను కూడా విశదీకరిస్తుంది. ఆధ్యాత్మిక విషయ శాస్త్రాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టే విధానాలనే "యోగము" అని అంటారు. అందుకే భగవద్గీతను "యోగ శాస్త్రము" అని కూడా అంటారు, అంటే యోగ-అభ్యాసమును ఉపదేశించే గ్రంధము అని అర్థము.


అంతగా అనుభవం లేని ఆధ్యాత్మిక సాధకులు తరచుగా ఆధ్యాత్మికతను మరియు లౌకిక జీవనాన్ని వేర్వేరుగా చూస్తారు; కొందరు మోక్షమంటే ఏదో పరలోకంలో పొందేది అనుకుంటారు. కానీ భగవద్గీత అటువంటి తారతమ్యమును చూపదు, మానవ జీవితంలో ప్రతి వ్యవహారమును ఈ లోకంలోనే పవిత్రం చేయటానికి ప్రయత్నిస్తుంది. ఈ విధంగా, దాని యొక్క అన్ని పద్దెనిమిది అధ్యాయాలు కూడా వేర్వేరు రకాల "యోగము" లుగా పేర్కొనబడ్డాయి, ఎందుకంటే అవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, దైనందిన జీవితంలో ఆచరించి అభ్యాసం చేయటానికి పద్దతులను వివరిస్తాయి. ఈ అధ్యాయాలు కర్మ యోగము, జ్ఞాన యోగము, మరియు భక్తి యోగము వంటి వివిధ రకాల యోగ పద్దతులను కూడా వివరిస్తాయి.

భగవద్గీత సమయ పరిస్థితి

పరమ సత్యము ఒక్కటే మరియు అది సనాతమైనది, అయినా, వేర్వేరు ప్రదేశాలలో అది భిన్నమైన రీతులుగా తనను తాను వ్యక్తపరుచుకుంటుంది, ఆయా సందర్భాలు దానికి తమదైన శైలిని ఆపాదిస్తాయి. అందుకే భగవద్గీత యొక్క ఉపదేశాన్ని కేవలం ఏదో సామాన్యమైన తత్వజ్ఞానంగా లేదా నీతిశాస్త్ర సిద్ధాంతంగా పరిగణించరాదు. దాని పూర్వ రంగంలా ఉపయోగపడే, ఒక విపత్కర పరిస్థితిలో, మానవ నిజ జీవితంలో ఆచరణలో పెట్టబడిన నైతికత అది. దీని యొక్క ఉపదేశాలు అత్యంత గంభీరమైనవి కనుక, భగవద్గీత కు అంతే క్లిష్టమైన, అసాధ్యమైన విపత్కర పరిస్థితి దాని పూర్వ రంగముగా అవసరం అయినది. అందుకే, దాని యొక్క సందేశం యొక్క విలువను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధభూమి యందు కృష్ణ భగవానుడు అర్జునుడికి తన దివ్య సందేశాన్ని చెప్పటానికి దారి తీసిన చారిత్రిక పూర్వాపరాలను తెలుసుకోవటం ఎంతో అవసరం.


భగవద్గీత చెప్పబడిన సందర్భము మహాభారత యుద్ద ప్రారంభ సమయం, ఆ మహా యుద్ధం, దాయాదులైన కౌరవులు, పాండవుల మధ్య అప్పుడే ప్రారంభమవ్వబోతోంది. పాండవులు - యుధిష్టురుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, మరియు సహదేవుడు - ఈ ఐదుగురు, ధర్మాత్ములైన సోదరులు. వారి తండ్రి, పాండు రాజు, ఆ సోదరుల చిన్నతనంలోనే, దురదృష్టవశాత్తు చనిపోయాడు. పాండు రాజు సిహాసనం/రాజ్యాధికారం, ఆయన సోదరుడు ధృతరాష్ట్రుడిచే లాక్కోబడినది. ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడు. ధృతరాష్ట్రునికి కౌరవులు అనబడే వంద మంది కొడుకులు కలిగారు, వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. ఎన్నో సంవత్సరాలుగా, దుర్యోధనుని నాయకత్వంలోని కౌరవులు, తమ దాయాదులైన పాండవులను క్షోభ పెట్టారు, మరియు న్యాయపరంగా తమది కాని హస్తినాపుర సామ్రాజ్యం పై ఆధిపత్యం సాగించారు.


కౌరవులు అంటే మూర్తీభవించిన క్రూరత్వం, అన్యాయం, దుర్మార్గము, హింస మరియు అధర్మం. మరోపక్క, పాండవులు పుణ్యాత్ములు మరియు సాధువులు - నైతికత, త్యాగము, భక్తి మరియు కరుణ మెండుగా కలవారు. ప్రముఖంగా, వారు శ్రీ కృష్ణ భగవానుని యొక్క గొప్ప భక్తులు. కౌరవులు చేసిన దాష్టీకానికి, పాండవుల కష్టాలు ఎంత భరింపశక్యము కానివిగా అయ్యాయంటే, ఈ రెండు పక్షాల మధ్య యుద్ధం ఇక దగ్గరపడింది. యుద్ధం అనివార్యం అని తెలుసుకుని, రెండు పక్షాలూ, ఆ సమయంలో భారత దేశంలో అక్కడక్కడా ఉన్న ఎన్నో రాజ్యాల మద్దతు కూడగట్టాయి. ఈ రెండు దాయాదుల వర్గాలు ఎంత శక్తివంతమైనవంటే, ఈ యుద్ధం భారత ఖండాన్నంతా ప్రభావితం చేస్తుంది. అందుకే, ఈ పుడమిపై ఉన్న అందరు రాజులు ఏదో ఒక పక్షం తీసుకోవలసి వచ్చింది.


చురుకైన సైన్య సమీకరణ ప్రయత్నాల్లో భాగంగా, అర్జునుడు మరియు దుర్యోధనుడు, శ్రీ కృష్ణ భగవానుని సహాయం అర్థించటం కోసం ద్వారక చేరుకున్నారు. ఆయన సర్వజ్ఞుడు అవ్వటంచే, శ్రీ కృష్ణుడికి, వారు ఇరువురూ తన సహాయాన్ని కోరి వస్తున్నట్టు ముందే తెలుసు. జరగపోయే సంగ్రామం గురించి చెప్పే ఒక నీతిబోధక పరిస్థితిని కలిగించాడు. తన మందిరంలో నిద్రిస్తున్నట్టుగా కృష్ణుడు పడుకున్నాడు. అర్జునుడు ఆయన మందిరంలోనికి ప్రవేశించి, వినయ స్వభావంతో, ఆయన లేవటానికి వేచిచూస్తూ, శ్రీ కృష్ణుడి పాదాల దగ్గర కూర్చున్నాడు. ఈ లోపు, దుర్యోధనుడు కూడా అక్కడికి చేరుకున్నాడు, మరియు తన సహజమైన అహంకార స్వభావంచే శ్రీ కృష్ణుడి తల వెనుకనున్న కుర్చీలో కూర్చున్నాడు. శ్రీ కృష్ణుడు లేవగానే, సహజంగానే ఆయన దృష్టి మొదట అర్జునుడిపై పడింది, ఆ తరువాత దుర్యోధనుడు కూడా అక్కడే ఉన్నాడని ఆయనకు తెలుపబడింది. ఇరు పక్షాలు కూడా సంగ్రామంలో ఆయన సహాయాన్ని అర్థించాయి. అర్జునుడు మరియు దుర్యోధనుడు ఇరువురూ కూడా కృష్ణుడి బంధువులే కాబట్టి, తను పక్షపాతము చూపిస్తున్నాడనే అపవాదు ఆయన వద్దనుకున్నాడు. కాబట్టి, ఒక పక్షానికి తన ద్వారకా సామ్రాజ్య మహా సైన్యాన్ని, మరో పక్షానికి తానే స్వయంగా ఉంటానని కానీ ఆయుధం పట్టకుండా ఉంటానని ప్రతిపాదన చేసాడు. శ్రీ కృష్ణుడు లేచిన వెంటనే మొదట అర్జునుడిని చూసాడు కాబట్టి ఏది కావాలో ఎంచుకునే మొదటి అవకాశం అర్జునుడికే ఇచ్చాడు. ఆయుధాలు పట్టకపోయినా తనకు శ్రీ కృష్ణుడే కావాలని అర్జునుడు కోరుకున్నాడు. భగవంతుడే తనతోపాటుగా ఉంటే, తనకు ఎప్పటికీ అపజయం కలుగదు అని అతని విశ్వాసం. అర్జునుడి ఎంపిక దుర్యోధనుడికి సంతోషాన్ని కలుగ చేసింది, ఎందుకంటే ఆయన కేవలం సైనిక శక్తి ఆధారంగా ఉన్న భౌతిక బలాన్నే నమ్ముకున్నాడు. పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఈ విధంగా యుద్ధంలో అర్జునుడి రథసారథి అయ్యాడు.


ఇక యుద్ధం ప్రారంభ మవ్వబోతున్నదనగా, కురుక్షేత్ర యుద్ధ భూమి యందు ఇరుపక్కలా అపారమైన సైన్యాలు గుమికూడాయి. ఇదే ఆసన్నమైన మహాభారత సంగ్రామం. పరిస్థితి అత్యంత గంభీరంగా ఉంది. ఇరు పక్షాలకూ వినాశకారి అయిన పోరాటంలో, ఒక శకం ముగుస్తోంది. ఇక కొద్ది సేపట్లో యుద్ధం ప్రారంభమయ్యే దశలో, అర్జునుడు తన రథాన్ని ఉభయ సేనల మధ్యకు తీసుకెళ్లమని కృష్ణుడిని ప్రార్ధించాడు. యుద్ధం కోసం నిలిచి ఉన్న యోధులను చూసిన పిదప, అర్జునుడు మనోస్థైర్యాన్ని కోల్పోయాడు. నైరాశ్యపు ఉద్వేగంలో గాండీవాన్ని పడవేసాడు మరియు యుద్ధం చేయటానికి నిరాకరించాడు.


అర్జునుడు నైతిక సందిగ్ధతకు బలైపోయాడు. ఒక పక్క, తనకు ఆరాధ్యులు, గౌరవనీయులు అయిన తాతగారు భీష్ముడు, తన గురువు ద్రోణాచార్యుడు మొదలైన వారితో పోరాటం చేయాలి. మరోపక్క, తన క్షత్రియ ధర్మ పరంగా తాను ధర్మ యుద్ధం చేయాలి. అయినా, విజయం వలన సాధించే ప్రతిఫలాలు ఏవీ ఈ నీచమైన పనిని సరితూగలేవు. ఇదొక ఏ పరిష్కారం దొరకని అయోమయ స్థితిగా అనిపించింది. అయోమయానికి గురై, నిస్సత్తువ ఆవహించి, జీవితంతో నిరాశ చెంది, మరియు పరిస్థితులచే దుఃఖభరితుడైనవాడై, అర్జునుడు పరమేశ్వరునికి శరణాగతి చేసి, సరియైన దిశానిర్దేశం చేయమని వేడుకున్నాడు. అర్జునుడి ఈ యొక్క నైతిక అయోమయ స్థితిలో, శ్రీ కృష్ణుడు జ్ఞానబోధ కు ఉపక్రమించాడు.

సంఘటనల యొక్క చారిత్రాత్మిక ఖచ్చితత్వం


మహాభారతంలో విశదీకరించబడిన సంఘటనల యొక్క చారిత్రాత్మిక ఖచ్చితత్త్వం పై సందేహాలు వెలిబుచ్చబడ్డాయి. ఏసుక్రీస్తు యొక్క చారిత్రాత్మకతపై మరియు బైబిల్లో చెప్పబడిన ఆయన యొక్క జీవిత ఘటనలపై కూడా ఇదే విధమైన వివాదాలు ఐరోపాలో కూడా ఉవ్వెత్తున లేచాయి. ఇటువంటి వాదోపవాదాలు చరిత్రకారులకు ముఖ్యమేమో కానీ ఆధ్యాత్మిక కోణపరంగా అవి ముఖ్యం కాదు. ఏదేమైనా, ఏసుక్రీస్తు యొక్క ఉపదేశాలు అనుసరించి ప్రయోజనం పొందుతూ, మరియు ఆయన చెప్పిన విధంగా పవిత్రమైన జీవనం గడిపినంత కాలం, నిజానికి ఏసుక్రీస్తు నజారేత్ లో పుట్టాడా లేక బెత్లేహెం లో పుట్టాడా అనే విషయం, ఏమైనా అంత అవసరమా? అదే ప్రకారంగా, భగవద్గీత యొక్క ఉపదేశ సారం ఆశిస్తున్నప్పుడు, మనకు దాని సంబంధిత చారిత్రిక విశేషాలలో పని లేదు. మనకు కేవలం అది చూపించే ఆధ్యాత్మిక సూత్రాలు మరియు జ్ఞానోదయ పథంలో వాటి యొక్క ప్రయోజనం తో మాత్రమే పని. ఒక రాతి విగ్రహం పట్లనైనా సరే మనం దైవీ భావన కలిగి ఉంటే, మనం పవిత్రులమవుతాము. మన యొక్క దైవీ భావనలే మనలను పవిత్రం చేస్తాయి. ఇక భగవంతుని లీలలపై దైవీ భావనలతో చింతన చేయటం యొక్క పవిత్రమొనర్చే ప్రభావం పై సందేహమెక్కడ?


నేను భగవద్గీత పై వ్యాఖ్యానం రాద్దామని అనుకుంటున్నానని భక్తులకు చెప్పినప్పుడు, పాశ్చ్యత్య దేశాల్లోని కొందరు, మహాభరతం యొక్క దృష్టాంత కథారూపక వివరణ (allegorical interpretation) చేయాలని, ఆప్రకారంగానే గీతని విశదీకరించాలని సూచించారు. వారు పాశ్చాత్య దేశాల్లో ప్రజాదరణ పొందిన, మొత్తం పరిస్థితిని దృష్టాంత కథారూపకలా లేదా రూపకలాంకరణతో (allegory) చూపించిన చాలా వ్యాఖ్యానాలని దృష్టాంతముగా చూపించారు. ఇటువంటి దృష్టాంత కథారూపక వివరణ (allegorical interpretation) చేయటం చాలా సులువైన పని, కానీ ఇటువంటి పద్దతితో వచ్చిన సమస్య ఏమిటంటే అది మహాభారతము మనకు అందించే మధురమైన భక్తి భావనను నాశనం చేస్తుంది, మరియు దాన్ని పేలవమైన మేధో-విశ్లేషణ స్థాయి (dry intellectual analysis) కి దిగజారుస్తుంది. ఇది ఎలాగుంటుందంటే, చక్కటి పూదోట అక్కడ పెరుగుతున్నదనే జ్ఞానం లేకుండా క్షేత్రాన్ని వ్యవసాయం కోసం ట్రాక్టరు దున్నించమని ఆదేశం ఇచ్చినట్టుగా ఉంటుంది. అదే విధంగా, ఈ గ్రంథాలని/శాస్త్రాలని తెలియచేయటంలో వేద వ్యాసుని ఉద్దేశ్యం, మనకు దివ్య జ్ఞానపు భాండాగారాలని అందించటమే కాక, చదివేవారికి భగవంతుని మనోహరమైన నామములు, రూపములు, గుణములు, లీలలు మరియు ధామములు అందించటమే, ఇవి మనస్సుని ఆ పరమేశ్వరునికి అనుసంధానం చేయటానికి చక్కటి ఆధారంగా ఉంటాయి.


కాబట్టి, ప్రతిదాన్నీ జీవంలేని దృష్టాంత కథారూపక వివరణ (lifeless allegorical interpretations) కి దిగజార్చుదామనే ఉత్సుకతకి వశమయిపోకుండా ఉందాం. భగవద్గీత, తన అసలు రూపంలోనే, మన విశ్లేషణాత్మక బుద్ధికి విస్తారమైన పోషణలాగా, అపారమైన జ్ఞానాన్ని, మనకు అందిస్తుంది, మరలా దాన్ని పేలవమైన మేధావీకరణం చేయటం భాష్యాకారులకు అనవసర ప్రయాస. వేద వ్యాసుడుకి కూడా సాహిత్య ఉపకరణంలా దృష్టాంత కథారూపక వివరణ (allegory) యొక్క ప్రయోజనం తెలుసు, మరియు ఆయన దానిని చక్కగా ఉపయోగించుకున్నాడు కూడా. కాబట్టి, భగవంతుడు మానవ రూపంలో ఆ భూమిపై దిగివచ్చినప్పుడు చెప్పిన సందేశాన్ని, చేసిన లీలలను మనకు వివరించే క్రమంలో, మనల్ని మనస్సుకు-మేధస్సుకూ రెంటికీ చెందిన ప్రయాణంలో తీసుకెళుతూ, వేద వ్యాసుడిని ఎక్కడ అవసరం అయితే అక్కడ తన స్వంత దృష్టాంతాలని/ఉపమానాలని తెలియచేయనిద్దాం.

భగవద్గీత యొక్క భాష


భగవద్గీత మనకు భారత దేశ చారిత్రాత్మిక భాష అయిన, సంస్కృతంలో, వ్రాయబడి, అందించబడినది. సంస్కృతము, ఆధ్యాత్మిక విషయాలని వ్యక్తపరచటానికి ఉన్నతమైన శబ్దసముదాయము కలిగిఉంది కాబట్టి భగవద్గీతకి ఇది చక్కగా యోగ్య మైనది. ప్రపంచంలో అన్ని భాషలలో కెల్లా అత్యంత పరిపూర్ణ వ్యాకరణము కలిగిన భాష కూడా ఇదే; దీని వ్యాకరణము వేల సంవత్సరాల కొద్దీ మారకుండా ఉంది. ఇటీవలే, నాసా (NASA) శాస్త్రవేత్తలు Artificial Intelligence లో ఉపయోగం కోసం కంప్యూటర్ భాషని అభివృద్ధి చేయటంలో భాగంగా, ఈ ప్రయోజన విషయంలో సంస్కృతానికే అత్యంత పరిపూర్ణ వ్యాకరణం ఉన్నదని తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. NASA Ames Research Center, CA, కి చెందిన Rick Briggs, తన పరిశోధనా వ్యాసంలో ఇలా వ్రాసారు, "Knowledge Representation in Sanskrit and Artificial Intelligence (The AI Magazine Spring, 1985 #39)": "There is at least one language, Sanskrit, which for the duration of almost 1,000 years was a living spoken language with a considerable literature of its own. Besides works of literary value, there was a long philosophical and grammatical tradition that has continued to exist with undiminished vigor until the present century. Among the accomplishments of the grammarians can be reckoned a method for paraphrasing Sanskrit in a manner that is identical not only in essence but in form with current work in Artificial Intelligence."


భగవద్గీత యొక్క మాధ్యమంగా ఉన్న ఈ సంస్కృత భాష మనకు గాంభీర్యాన్ని మరియు కుశలతని అందిస్తుంది. అదే సమయంలో, అది మల్చుకోవటానికి అనువుగా ఉండి, అన్ని సాంప్రదాయాలకు తమ తమ దృక్కోణాన్ని ఆ దివ్య సంభాషణలో చూసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.

భగవద్గీత యొక్క ప్రపంచ ప్రాచుర్యం

శంకరాచార్యుల వారి కాలం నుండీ, గొప్ప తత్త్వవేత్తలు తరచుగా భగవద్గీతపై తమ తమ వ్యాఖ్యానాలను రచించారు. సంస్కృతము నుండి దానిని ఎన్నో భారతీయ భాషలలోకి అనువదించటం కూడా జరిగింది, ఉదాహరణకి పదమూడవ శతాబ్దంలో సంత్ జ్ఞానేశ్వర్ మరాఠీ లో రచించిన ""జ్ఞానేశ్వరీ"" అనే గ్రంధం.


బ్రిటిష్ పరిపాలన కాలంలో, గీత, ప్రపంచ ప్రాచుర్యం పొందినది. మొదటి సారి దానిని ఆంగ్లంలోకి చార్లెస్ విల్కిన్స్, అనే ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకుడు అనువదించాడు. అతని అనువాదం, అమెరికాలో న్యూ ఇంగ్లాండ్ కు చెందిన ఆధ్యాత్మిక వేత్తలపై గాఢమైన ముద్ర వేసింది. రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ తన ""బ్రహ్మ"" అనే కవితకి దానినే ఆధారంగా చేసుకున్నాడు. ఎవాంజెలికల్ క్రైస్తవమతానికి అభ్యతరం చెప్పే వారందరికీ భగవద్గీత తప్పనిసరిగా చదవాల్సిన గ్రంధం గా ఎమెర్సన్ గారు చేశారు. ఆయన మిత్రుడు హెన్రీ డేవిడ్ థోరో కూడా భగవద్గీత పట్ల అత్యంత ఆసక్తి కలవాడే, మరియు ఆయన కర్మ యోగ సూత్రాలని తన స్వీయ జీవన శైలిలో మరియు సిద్ధాంతాలలో ఆచరించాడు. అలా అది మొదటి సారి "కౌంటర్ కల్చర్" లో భాగంగా అయింది. ఓ శతాబ్దం తరువాత, టి.ఎస్. ఎలియట్ గారికి భారతీయ తత్త్వజ్ఞానం పై దీర్ఘమైన ఆసక్తి ఉండినది మరియు ఆయన దాన్ని తన కావ్యాలలో పొందుపరిచాడు. భగవద్గీత జర్మన్ కవులను కూడా ఎంతో ఆకర్షించింది, ప్రముఖంగా Schlegel, Humboldt, and Goethe.
ఇక భారత దేశానికొస్తే, దేశ గౌరవాన్ని సంపాదించుకుంటున్న స్వాతంత్రోద్యమ నాయకులు, తమలో కలిగే ప్రేరణకు భగవద్గీతయే మూలమని పేర్కొన్నారు. బాల గంగాధర తిలక్ గారు స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీకి పూర్వం ఉండేవారు, ఆయన ఒక గౌరవ ప్రదమైన కర్మయోగి, మరియు ఆయన భగవద్గీత పై విస్తారమైన మరియు గంభీరమైన వ్యాఖ్యానాన్ని రచించారు. ఆయన తరువాత మహాత్మా గాంధీ గారు, ఏప్పుడైనా తనకు నిరాశ కలిగితే, మార్గనిర్దేశం మరియు ఉపశాంతి కొరకు భగవద్గీతని ఆశ్రయిస్తాను, అని ప్రకటించారు. గాంధీ గారి ఆలోచనా సరళి, ఇరవైయవ శతాబ్దంలో, పాశ్చాత్య దేశాల్లోని మహోన్నతులైన మార్టిన్ లూథర్ కింగ్ మరియు నెల్సన్ మండేలాలను ప్రభావితం చేసింది. ఈ యొక్క తూర్పు పశ్చిమ దేశాల మధ్యలో జరిగిన ఆలోచనా -వినిమయం, భగవద్గీత యొక్క ప్రాచుర్యాన్ని మరింత పెంచింది. 1960వ దశకంలో మరో సారి అమెరికాలో "కౌంటర్ కల్చర్" (counter culture) వెల్లువ ప్రబలింది. పాశ్చాత్య దేశాల్ని సందర్శించిన స్వామి వివేకానంద మరియు స్వామీ యోగానంద లాగానే, చాలా మంది భారత దేశ గురువులు అమెరికాకి రావటం మొదలుపెట్టారు, ఉదాహరణకి, స్వామి విష్ణుదేవానంద, స్వామి సచ్చిదానంద మరియు స్వామి ప్రభుపాద. వారందరూ భగవద్గీతనే తమ తమ ఉపదేశాలకు, ప్రామాణికమైన మూలముగా ఉదహరించారు. అందుకే, భగవద్గీత చాలా వేగంగా, అత్యంత ప్రజాదరణ కలిగిన, బాగా ప్రాచుర్యం పొందిన జ్ఞాన గ్రంధంగా, దానికి ఈ రోజున్న స్థాయికి చేరుకోగలిగింది.

దీని యొక్క ఉపదేశాలు మతవిశ్వాసాలకు మరియు సాంప్రదాయాలకు అతీతమైనవి

ఒక రకమైన ఉపదేశం ఏంటంటే అది ఏదేని ఒక సిద్ధాంతమును, విశ్వాసాన్ని లేదా సాంప్రదాయాన్ని ప్రచారం చేస్తుంది. మరొక రకమైన ఉపదేశం అన్ని మతవిశ్వాసాలు మరియు సాంప్రదాయాలకు అతీతమైన ఆదర్శాలను మరియు జీవన మూలసూత్రాలను ప్రచారంచేస్తుంది. భగవద్గీతను ఎదో ఒక మత వ్యవస్థ యొక్క ఫలంగా పరిగణించే పండితులు దాని ఉపదేశం యొక్క విశ్వవ్యాపకతకి అన్యాయం చేసినట్టే. అది అందించే అభిప్రాయాలు ఏవో తత్త్వ బుద్ధికి తోచిన ఊహలు కావు, పైగా అవి, మన జీవన అస్థిత్వం మరియు జీవయాత్రలో నిరూపణీయమైన ఆధ్యాత్మిక యదార్ధాల యొక్క నిత్యసత్యాలు. అందుకే, మొట్టమొదటి ఆంగ్ల భగవద్గీత ప్రచురితం అయినప్పుడు, అప్పటికాలపు భారత గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్, తన ముందుమాట లో ఇలా వ్రాసాడు, "These (writings of the inhabitants of India) will survive when the British dominion of India shall have long ceased to exist, and when the sources which it yielded of wealth and power are lost to remembrance."


అందుకే భగవద్గీత ను అధ్యయనం చేయటంలో మన పద్దతి - ఆ ఉపదేశాన్ని సైద్ధాంతికమైన లేదా పాండిత్యపరమైన నిశితపరీక్ష కోసం కాకుండా, లేదా దాని తత్త్వజ్ఞానాన్ని మిగతా వేరే సిద్ధాంతాల పట్ల పోటీకోసం కాకుండా - ఉండాలి. తన పుటలనుండి ఎన్నో ఆధ్యాత్మిక ఉపదేశాలు పెల్లుబికినా, భగవద్గీత అనేది ఏదో అలౌకిక ఆధ్యాత్మిక ప్రబంధము కాదు. పైగా అది, అత్యుత్తమ నిజ జీవిత ప్రయోజనం కోసం అత్యున్నత సత్యాన్ని అన్వేషిస్తుంది; ఇది కేవలం ఏదో మేధాసంబంధ లేదా ఆధ్యాత్మిక తృప్తి కోసం కాదు, అది నిజానికి, మన ప్రస్తుత నశ్వరమైన దోషపూరిత జీవితం నుండి మనలని కాపాడి, శాశ్వతమైన పరిపూర్ణత దిశగా తీసుకువెళుతుంది. అందుకే మానవులకు అత్యున్నత సంక్షేమం మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందటానికి దోహదపడే నిత్య నూతన ఉపదేశం అందుకునేందుకు సహాయపడటానికి, దానిని మనం ఆశ్రయించాలి.

భగవద్గీత పై వ్యాఖ్యానాలు

దివ్య జ్ఞాన గ్రంధాలు సహజంగానే తమపై ఎన్నో వ్యాఖ్యానాలు/భాష్యాలు వ్రాయబడటానికి అనుకూలంగా ఉంటాయి. ఈ వ్యాఖ్యానాలు వాటిలో నిక్షిప్తమై ఉండే నిత్యశాశ్వత సూత్రాలను అర్థవివరణ చేయటానికి దోహదపడుతాయి. ఇది ఎలాగంటే, దేశాలకు తమతమ న్యాయ శాస్త్ర గ్రంధాలు ఉంటాయి, అంటే రాజ్యాంగము వంటివి. వీటితో పాటుగా, న్యాయకోవిదులు వ్యాఖ్యానాలు ప్రచురించారు, ఇవి ఆయా న్యాయ శాస్త్రాలను అధ్యయనం చేయటంలో సహకరిస్తాయి. అదే విధంగా, వేదశాస్త్రాలపై భాష్యాలు కూడా ఆయా శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న జ్ఞాన రత్నాలను వెలికితీయటానికి సహకరిస్తాయి. దాని యొక్క అత్యంత ప్రజాదరణ వలన, భగవద్గీత పై వందల భాష్యాలు రచించబడ్డాయి. ప్రముఖమైన భాష్యకారులు ఎవరంటే, జగద్గురు శంకరాచార్య, జగద్గురు రామానుజాచార్య, జగద్గురు మధ్వాచార్య, జగద్గురు నింబార్కాచార్య మరియు మహాప్రభు వల్లభాచార్య - వీరందరూ ప్రముఖ వైదిక సాంప్రదాయాలను స్థాపించినవారే. శైవ సాంప్రదాయంలో, ప్రఖ్యాత తత్త్వవేత్త అభినవగుప్త, కొద్దిపాటి తేడాలతో ఉన్న "గీతార్థ సమగ్రహ" అని పిలవబడే గీతాభాష్యాన్ని రచించాడు.


దివ్య జ్ఞానము యొక్క అద్భుతం ఏమిటంటే, దానిని ఎంత ఎక్కువ మథనం చేస్తే అంత ఎక్కువ అమృతం స్రవిస్తుంది, అందుకే నిస్సందేహముగా ఈ నిశితమైన వ్యాఖ్యానాలచే ఈ లోకం సుసంపన్నం చేయబడింది అని చెప్పవచ్చు. అదే సమయంలో, ఈ మహోన్నత గురువుల వ్యాఖ్యానాలు తమతమ జీవిత లక్ష్యం/ఆదర్శములకు అనుగుణముగా ఉంటాయి, అని మనం యెఱింగిఉండాలి. ఈ గొప్ప ఆచార్యులు ఆయా దేశ, కాల, పరిస్థితుల అనుసరించి పరమ సత్యాన్ని ప్రచారం చేశారు. వారెప్పుడూ మానవ జాతి సంక్షేమమే లక్ష్యంగా పనిచేసారు. ఈ విధంగా, వారు ఒక ప్రచారక ఉత్సాహంతో పనిచేస్తూ, తమ తమ దృక్పథాల్ని భగవద్గీత యొక్క అన్ని శ్లోకాలలో వర్ణించారు. ఈ చక్కటి వ్యాఖ్యానాలు అన్నింటికీ పూర్తి గౌరవం ఇస్తూనే, మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే శ్రీ కృష్ణుడు అద్వైత వాది కాడు, లేదా విషష్టాద్వైత వాది కాడు, ద్వైత వాది కాడు, లేదా ద్వైతాద్వైత వాది కాడు. ఆయన తత్త్వవేత్తల తర్కవితర్కాలకు అతీతుడు, ఆయన సందేశము కూడా అంతే. ఈ విధంగా, థీఇసం, అస్సెటిసిసం, డ్యూయలిసం, ప్రాగ్మాటిసం, కర్మ, జ్ఞాన, భక్తి, హఠ, సాంఖ్య, మొదలైన సిద్ధాంతాలన్నీ ఆయన బోధనలో అల్లుకుపోయి ఉన్నట్లు మనం చూడవచ్చు. అందుకే మనం భగవద్గీత యొక్క అర్థాన్ని ఏదో ఒక్క తత్త్వ సాంప్రదాయమునకే పరిమితం చేయకుండా జాగ్రత్తపడాలి, మరియు బదులుగా దానిని పరమ సత్యాన్ని అంతటినీ దర్శింపచేసే దాన్నిగా పరిగణించాలి.


జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ గారి ఆలోచనా సరళి ఇదే, ఆయన ఏ ఒక్క సంప్రదాయంలోనే లేదా పరంపర లోనే చిక్కుకుపోకుండా, అందరు ప్రముఖ భారత మునుల, ఋషుల గ్రంథాలనుండి, మరియు పాశ్చాత్య తత్త్వవేత్తల నుండీ కూడా, అనాయాసంగా ఉదహరిస్తుంటారు. నాలుగు వైష్ణవ సాంప్రదాయాలలో దేనికి చెందినవారనే ప్రశ్న ఆయనని అడిగితే, ఆయన సవినయంగా పరమ సత్యము ఒక్కటే, అది ఏ ఒక్క సాంప్రదాయానికి పరిమితమైనది కాదు అని పేర్కొంటారు. అన్ని నిఖార్సైన సంప్రదాయాలు కూడా భగవంతుని నుండి ప్రారంభమైనవే. కాబట్టి, ఉన్నది ఒకటే సంప్రదాయం, అదే భగవంతుని సంప్రదాయము, అందుకే మనము దానిని నాలుగు రకాలుగా ఎందుకు విభజించాలి? మరిక, పరమ సత్యాన్ని ఈ రకంగా విభజించుకుంటూ పొతే, ఆయా వర్గాలు అలా పెరుగుతూనే ఉంటాయి. సాంప్రదాయాలకు సరిగ్గా ఇదే జరిగింది, నాలుగు మూల సాంప్రదాయాలు మరిన్ని శాఖలుగా-ఉపశాఖలుగా విస్తరించాయి, ఇవన్నీ పరమ సత్యాన్ని కేవలం తమ సొత్తుగానే పరిగణించుకున్నాయి. ఈ వైఖరి, ఉన్న ఒకే సనాతన ధర్మాన్ని ఎన్నెన్నో సాంప్రదాయ ఖండాలుగా చేసింది.


ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతూ, ప్రజల మధ్య సమాచార ప్రవాహం పెరిగిన కొద్దీ, ఏదో ఒక్క జాతి, మతం లేదా సంప్రదాయమే పరమ సత్యము యొక్క సంరక్షకులనే భావం క్రమేపీ తగ్గిపోతున్నది. ఉప్పొంగిన విశాల హృదయ భావాలకు అనుగుణంగా మనలను మనం అన్వయించుకుంటూ, భగవద్గీత నుండి జనించే తేజస్సుచే మొత్తం అఖండ, నిష్కళంకమైన సత్యాన్ని ప్రకాశవంతం చేయనిద్దాం. ఇదే, అంతిమంగా, భగవద్గీత ఒక్కదానిదే కాక, సమస్త వేద శాస్త్రాల యొక్క సనాతన మూల ప్రయోజనం.

జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ గారి గురించి

జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు ఒక అవతార పురుషుడు, ఆయన సనాతన వైదిక జ్ఞానాన్ని ఇప్పటి ఆధునిక కాలంలో తిరిగి స్థిరపరిచారు. ఆయన 34 ఏళ్ల యుక్త వయస్సులో, పుణ్యక్షేత్రం అయిన కాశీ లో 500 మంది వేద పండితులతో కూడిన కాశీ విద్వత్ పరిషత్తు ముందు, పది రోజుల పాటు, చక్కటి సంస్కృతంలో, వందల వైదిక గ్రంధాలలోని సూత్రాలను అద్భుతంగా ఉదహరిస్తూ, భగవత్ప్రాప్తి కొరకు ఈ కాలానికి తగిన సరళమైన పద్దతిని తెలియచేయటానికి, ప్రసంగించారు. విశేషశాస్త్ర పరిజ్ఞానము గల పండితులతో కూడిన ఈ ప్రఖ్యాత పరిషత్తు, ఎప్పుడైతే తమ అందరి కూడిన జ్ఞానం మొత్తం కంటే కూడా కృపాలుజీ మహారాజ్ జ్ఞానం ఎక్కువే అని తెలుసుకున్న పిదప, ఆయనకు "జగద్గురు" అన్న బిరుదు ఇచ్చి సత్కరించారు. ఈ విధంగా ఆయన, భారత దేశ చరిత్రలో, జగద్గురు శంకరాచార్య, జగద్గురు నింబర్కాచార్య , జగద్గురు రామానుజాచార్య, మరియు జగద్గురు మధ్వాచార్యల తరువాత, ఒరిజినల్ "జగద్గురు" బిరుదుని అందుకున్న ఐదవ మహాత్మునిగా అయ్యారు.


ఆ పండితులు, సనాతన వైదిక గ్రంధాలపై ఆయన గారి యొక్క అధికారిక నైపుణ్యానికి అచ్చెరువొంది, ఆయనపై ఎన్నో ప్రశంసలను కురిపించారు.

జగద్గురుత్తమ్ - భారత చరిత్రలో ఉత్తమ జగద్గురువు.
వేద మార్గ ప్రతిష్టాపనాచార్య - వేదములు తెలియపరిచిన యదార్ధ మార్గాన్ని స్థిరపరిచిన వారు.
నిఖిల దర్శన సమన్వయాచార్య - సమస్త శాస్త్రముల సారాన్ని సమన్వయం చేసినవారు.
సనాతన వైదిక ధర్మ ప్రతిష్టాపనాచార్య - జగత్తులో సనాతన వైదిక ధర్మాన్ని తిరిగి ప్రతిష్టాపన చేసిన వారు.
సత్సంప్రదాయ పరమాచార్య - యదార్ధమైన ఆధ్యాత్మిక జ్ఞాన సాంప్రదాయ స్థాపకులు.

జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారు, భగవద్గీత శ్లోకాల నిశిత గూడార్ధాలని నాకు తెలియపరిచిన ఆధారంగా ఈ భగవద్ గీత భాష్యం రచించబడినది. ఈ వ్యాఖ్యానం యొక్క లక్ష్యం సొంత వివరణ ఇవ్వటం కాకుండా, శ్రీ కృష్ణ భగవానుడు పలికిన శ్లోకాల యొక్క అర్థాన్ని తెలియచేయటమే. ఈ లక్ష్యం నిమిత్తం, ప్రపంచ నలుమూలలా ఉన్న గ్రంధాలను, మహాత్ముల, పవిత్ర సాధువుల బోధనలను, ఉదహరించటానికి నేను వెనుకాడలేదు.

చదవటం మరింత సులభంగా ఉండేందుకు సహకరించే కొన్ని సూచనలు


కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే ఈ వ్యాఖ్యానం చదవటం సులభమవుతుంది. మొదటగా, భగవద్గీత అనేది ఒక సంభాషణలోని సంభాషణలోని సంభాషణ. భగవద్గీత పొందుపరచబడి ఉన్న మహాభారతంలోని భీష్మ-పర్వం, వైశంపాయన ఋషి జనమేజయ మహారాజుకు చెప్పినది. అందుకే జనమేజయునికి "సంజయ ఉవాచ" - "సంజయుడు పలికెను"; "ధృతరాష్ట్ర ఉవాచ" - "ధృతరాష్ట్రుడు పలికెను", వంటివి చెప్పేది వైశంపాయనుడు అన్నమాట. కానీ, వైశంపాయనుడు మరియు జనమేజయుడు ప్రత్యక్షంగా భగవద్గీతలో వక్తలుగా కనిపించరు.


ధృతరాష్ట్ర మహారాజు మరియు అయన మంత్రి సంజయుడు మధ్య సంభాషణగా భగవద్గీత ప్రారంభమవుతుంది. ధృతరాష్ట్రుడు గుడ్డి వాడు కాబట్టి స్వయంగా రణరంగంలో లేడు. యుద్ధభూమిలో ఏమి జరుగుతున్నది అని అడగటం ద్వారా దృతరాష్ట్రుడు ఈ సంభాషణను మొదలుపెడతాడు; దీని తరువాత ఇక ఆయన ఏమీ గీతలో మళ్లీ మాట్లాడడు. అక్కడ జరిగే విషయాల వివరణ ద్వారా సంజయుడిచే సమాధానం ఇవ్వబడుతాడు. సంజయుడు వేద వ్యాసుని శిష్యుడు, మరియు తన గురువు గారి కృపచే, ఆయనకు దూరదృష్టి సిద్ధి కలిగింది. ఆ విధంగా, సంజయుడు దూరం నుండే యుద్ధభూమి యందు జరిగేవన్నీ చూడగలిగాడు మరియు ధృతరాష్ట్రునికి రణరంగం లో సంఘటలలన్నీ ఉన్నదున్నట్లుగా చెప్పగలిగాడు. ధృతరాష్ట్రునికి తాను చూసే, వినే విషయాలు చెప్పే సందర్భాలలో, సంజయుడు ఈ గ్రంధంలో అప్పుడప్పుడూ వచ్చిపోతుంటాడు. ఈ విధంగా, అతనంటాడు: శ్రీ భగవానువాచ - "పరమేశ్వరుడైన భగవంతుడు పలికెను" మరియు అర్జున ఉవాచ - "అర్జునుడు పలికెను," వంటివి.


అత్యధిక మేర సంభాషణ శ్రీ కృష్ణ భగవానుడు మరియు అర్జునుడికి మధ్య జరిగింది. అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు మరియు శ్రీ కృష్ణుడు సమాధానం చెప్తాడు. శ్రీ కృష్ణుడే ఎక్కువ మాట్లాడుతాడు కాబట్టి ఈ సంభాషణ కాస్త ఏకపక్షంగా ఉంటుంది.


అంతేకాక, ఎన్నో విశేషనామములు, బిరుదులు ఉపయోగించబడినాయి. ఉదాహరణకి, శ్రీ కృష్ణుడు - హృషీకేశ, కేశవ, గోవింద, మధుసూదన, అచ్యుత, మొదలైన పేర్లతో పిలవబడ్డాడు. అదే విధంగా, అర్జునుడు - ధనంజయ, గుడాకేశ, కౌంతేయ, పరంతప, మొదలైన పేర్లతో పిలవబడుతాడు. తరచుగా ఈ పేర్లు సంభాషణకు ఒక ప్రత్యేక అర్థం సూచించటానికి వాడబడుతాయి. అవసరం బట్టి వ్యాఖ్యానం లో ఇటువంటి విశేషార్థాలు వివరించబడినవి.

భగవద్గీతలో ముఖ్యమైన పదాలు


భగవద్గీత యొక్క మొత్తం సారాంశం ఇక్కడ పేర్కొనటం ఈ ఉపోద్ఘాతం యొక్క పరిధిలో లేనిది. ఒక కారణం ఏమిటంటే, అలాచేస్తే మీరే స్వయంగా చదివి దానిని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు. అంతేకాక, శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినది అంతా ఇక్కడ సారాశంగా చెప్పటం సాధ్యం కాదు. అయినా, చదివేవారికి ఆయా విషయాలు సునాయాసంగా అవగతం చేసుకోవటానికి సహాయకారిగా, భగవద్గీత లో మరియు మిగతా వైదిక గ్రంధాల్లో తరచుగా కనిపించే కొన్ని పదాలు ఇక్కడ వివరించబడ్డాయి.


భగవంతుడు  : వైదిక శాస్త్రాల్లో, భగవద్గీతతో సహా, భగవంతుడు అంటే, సర్వోత్కృష్టమైన అస్తిత్వం, ఆయన సర్వ-శక్తిమంతుడు, సర్వజ్ఞుడు, మరియు సర్వాంతర్యామి. సమస్త సృష్టికి ఆయనే సృష్టికర్త, స్థితికర్త, మరియు లయకారకుడు. ఏకకాలంలో పరస్పర విరుద్ధమైన అసంఖ్యాకమైన గుణములు కలవాడు. ఈ విధంగా, ఆయన ఏకకాలంలో , సమీపంగా ఉంటాడు మరియు దూరంగా ఉంటాడు; బ్రహ్మాండ ఆకారంలో ఉంటాడు మరియు సూక్ష్మంగా కూడా ఉంటాడు; నిర్గుణుడు, అయినా లెక్కించలేనన్ని గుణములు కలిగి ఉంటాడు.
సర్వోత్కృష్టమైన అస్తిత్వాన్ని మూడు రకాలుగా జనులు అర్థంచేసుకుంటారు. కొందరు ఆయనను నిరాకార సర్వవ్యాప్త తత్త్వంగా అనుసంధానం చేసుకుంటారు; దీనినే బ్రహ్మాం అంటారు. ఇతరులు ఆయనను, సర్వ భూతముల హృదయంలో స్థితమై ఉన్న పరమాత్మగా కొలవటానికి మొగ్గుచూపుతారు. మరికొందరు ఆయనను సాకార రూపంలో, భగవంతుడిగా ఆరాధిస్తారు. ఈ మూడు కూడా - బ్రహ్మాం, పరమాత్మ మరియు భగవానుడు - ఒకే సర్వోన్నత అస్తిత్వం యొక్క భిన్నమైన రూపాంతరాలు.


అప్పుడప్పుడూ, తన అకారణ కరుణచే, ఈశ్వరుడు ఈ భూలోకంపై దిగివస్తాడు మరియు జీవుల ఉద్దరణ కోసం లీలలను ప్రదర్శిస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. శ్రీ రాముడు మరియు శ్రీ కృష్ణుడు ఇరువురూ ఆ సర్వోత్కృష్టమైన దివ్య పురుషుని అవతారములే. భగవంతుడు సర్వ శక్తిమంతుడు కావటంచే, ఆయన ఒక్క రూపానికే పరిమితం కాడు; ఆయనకు అసంఖ్యాకమైన రూపములు కలవు. కానీ, ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఇవన్నీ ఒకే దివ్య భగవంతుని యొక్క వేర్వేరు స్వరూపములే కానీ , వేర్వేరు దేవుళ్ళు కాదు.


ఆత్మ : ఒక్కో ఆత్మ భగవంతుని యొక్క ఒక అణు-అంశ. అది స్వభావరీత్యా ఆధ్యాత్మికమైనది, దివ్యమైనది, కాబట్టి భౌతిక శరీరము కంటే వేరైనది. ఆత్మ ఉండటం వల్లనే జడ పదార్థంతో తయారైన శరీరానికి చైతన్యం ప్రాప్తిస్తుంది. ఆత్మ వెళ్ళిపోయినప్పుడు శరీరం మళ్ళీ మృతపదార్ధం అయిపోతుంది. శరీరం (దేహము) నశించిపోయేది కానీ ఆత్మ నిత్య శాశ్వతమైనది.
ప్రతి వ్యక్తి పుట్టుకతో పాటు కొత్త ఆత్మ పుడుతుంది అని చెప్పే అబ్రహామిక్ సిద్ధాంతం కంటే ఇది భిన్నమైనది. వైదిక జ్ఞానం ప్రకారం, ఆత్మ అనేది ఆది, అంతము లేనిది; అది పుట్టుక సమయంలో మొదలయ్యింది కాదు లేదా శరీరం మృతి చెందినప్పుడు నశించిపోయేది కాదు. ప్రాపంచిక పరిభాషలో మనం అనుకునే మృత్యువు, కేవలం ఆత్మ శరీరాన్ని మార్చుకోవటమే. భగవద్గీత దీనిని, ఒక వ్యక్తి బట్టలు మార్చుతూ కొత్తవి తొడుక్కోవటంతో పోల్చుతుంది. ఆత్మకి తన తదుపరి జన్మ ఎంచుకోవటంలో స్వేచ్ఛ లేదు, అది భగవంతునిచే కర్మసిద్ధాంత అనుసారం నిర్ణయించబడుతుంది.


అసలు మనలను భౌతిక శక్తి ఎందుకు ఆవరించివేసినట్టు? అది ఎందుకంటే మనం ఈశ్వర విముఖంగా అయ్యాము కాబట్టి. భగవంతుడు ప్రకాశం వంటివాడు, అదే సమయంలో భౌతిక శక్తి చీకటి వంటిది. వెలుగుకి విముఖంగా తిరిగినవాడిని సహజంగానే అంధకారం ఆవరిస్తుంది. అదేవిధంగా, ఈశ్వర విముఖంగా ఉన్న జీవులను మాయా శక్తి కప్పివేస్తుంది.
ఆత్మ అన్న పదానికి సంబంధించిన వైదిక పదాలని అర్థంచేసుకోవడం ఉపయోగకారిగా ఉంటుంది. దేహములో స్థితమై ఉన్న ఆత్మను జీవాత్మ అంటారు, ఎందుకంటే అది శరీరాన్ని "జీవింపచేస్తుంది". భౌతిక జగత్తులో ఆత్మలను ఉదహరించేటప్పుడు "ఆత్మ" మరియు "జీవాత్మ" అన్న పదాలని తరచుగా ఒకే అర్థంలో వాడుతుంటారు. ప్రతిఒక్క జీవాత్మతో పాటుగా, భగవంతుడు కూడా శరీరంలో స్థితుడై ఉంటాడు. ఆయనను "పరమాత్మ" అంటారు. ఆయన, ప్రతి జన్మ నుండి జన్మకు, జీవాత్మ ఏ శరీర రూపంలోకెళ్ళినా, దానితో పాటుగా వెళ్తుంటాడు. జీవుని యొక్క వ్యవహారాలలో పరమాత్మ జోక్యం చేసుకోడు, ఆయన కేవలం ఒక మౌనసాక్షిగా ఉంటాడు. జీవాత్మ తన సనాతన మిత్రుడిని మర్చిపోయి, భౌతిక శక్తిని భోగించంలో ప్రయాస పడుతుంటాడు.
ఈ యొక్క ""ఆత్మ"" అన్న పదం, గీత లో చాలా సార్లు, ఎన్నో సందర్భాలలో అగుపిస్తుంటుంది. కొన్ని చోట్ల, ""ఆత్మ"" అంటే శరీరమనోబుద్ధుల కంటే వేరైన జీవాత్మను సూచిస్తుంది, (ఉదా. 6.20వ శ్లోకం). కొన్ని సార్లు, అది ప్రాణి యొక్క మొత్తం వ్యక్తిత్వాన్ని, అంటే ఆత్మ-శరీరమనోబుద్ధులతో కూడి ఉన్నదాన్ని (ఉదా. 6.20వ శ్లోకం) సూచిస్తుంది. అప్పుడప్పుడూ, ఆత్మ అంటే మనసుని సూచిస్తుంది (ఉదా. 6.5వ శ్లోకం); ఒకటిరెండు చోట్ల, ఆత్మా అనే పదాన్ని బుద్ధిని (ఉదా. 5.7వ శ్లోకం) సూచించటానికి వాడబడుతుంది. ఇంకా మరికొన్ని సందర్భాలలో, అది ""పరమాత్మ" ను సూచించటానికి కూడా వాడబడుతుంది. (ఉదా. 6.29వ శ్లోకం)
భౌతిక ప్రకృతి (మాయ) : ప్రాకృతిక శక్తి అనేది భగవంతునికి వ్యతిరేకమైనది ఏమీ కాదు. పైగా అది నిజానికి భగవంతుని యొక్క అసంఖ్యాకమైన శక్తులలో ఒకటి. ప్రళయ సమయంలో ప్రకృతి భగవంతుని యందే అంతర్లీనంగా ఉండిపోతుంది. ఆయన మళ్ళీ సృష్టి చేయటానికి సంకల్పించినప్పుడు, దాని వంక దృష్టి సారిస్తాడు, దానితో అది తన అంతర్గర్భితమైన స్థితి నుండి తిరిగి విస్తరించటం ప్రారంభమవుతుంది. ఆ తదుపరి విభిన్న రకాలైన స్థూల, సూక్ష్మ మూలకాలను వ్యక్తపరుస్తుంది.


భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ, యొక్క ఒక పని, ఈ జగత్తుని సృష్టించటమైతే, దాని రెండవ పని, ఆత్మలను జనన మరణ సంసారంలో కట్టి వేయటము. మాయ అనేది మనలను మనం దివ్య-ఆత్మలమనే అసలు స్వరూపాన్ని మర్చిపోయేటట్టు చేస్తుంది, మరియు మనము ఈ ప్రాకృతిక శరీరమే అన్న భ్రమ లో ఉంచుతుంది. అందుకే మనం ఈ ప్రపంచంలోని భౌతిక సుఖాల కోసం ప్రాకులాడుతాము. భౌతిక జగత్తులో అసంఖ్యాకమైన జన్మల ప్రయాస తరువాత, ఆత్మకి, తను వెతికే అనంతమైన దివ్య ఆనందము ఈ ప్రపంచంలో దొరకదు అని తెలిసిపోతుంది. ఆ తరువాత అది, పరిపూర్ణ దోషరహిత స్థితికి చేరటానికి యోగ పథంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ భగవంతునితో సంపూర్ణముగా ఐక్యమై పోతుందో అది భౌతిక శక్తి యొక్క పాశముల నుండి విముక్తి పొందుతుంది.


ప్రకృతి గుణములు : భౌతిక ప్రాకృతిక శక్తి మూడు గుణములతో కూడి ఉంటుంది: సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. ఈ గుణములు మన వ్యక్తిత్వంలో వేర్వేరు పాళ్ళలో ఉండి మనలని ప్రభావితం చేస్తాయి. తమో గుణము - సోమరితనం, జడత్వం, అజ్ఞానం, క్రోధము, హింస, మరియు వ్యసనం - వీటిని కలుగ చేస్తుంది. దీనిచే అది ఆత్మని మరింత భౌతిక ప్రాపంచిక దృక్పథంలోకి గుంజివేస్తుంది. రజో గుణము - మనోఇంద్రియముల కోరికలను ప్రేరేపిస్తుంది మరియు వ్యక్తిని తన ప్రాపంచిక ఆశయాలను సాధించటానికి తీవ్రంగా పరిశ్రమించేటట్టు చేస్తుంది. సత్త్వ గుణము వ్యక్తిని జ్ఞానము చే ప్రకాశింపచేస్తుంది మరియు ధార్మిక లక్షణాలను పెంపొందింపచేస్తుంది - దయ, సహనం, మరియు ఓర్పు వంటివి. అది మనస్సుని ప్రశాంతంగా ఉంచి, ఆధ్యాత్మిక సాధన కు అనుకూలంగా చేస్తుంది. ఆధ్యాత్మిక సాధకుడు తన తమో గుణము, రజో గుణములను తగ్గించుకొని సత్త్వ గుణమును పెంపొందించుకొనుటకు పరిశ్రమించాలి, ఆ తదుపరి సత్వ్వ గుణమునకు కూడా అతీతుడైపోవాలి. భగవంతుడు ఆ మూడు గుణములకు అతీతుడు; ఆయనకే మన మనసుని అనుసంధానం చేసి మనం కూడా ఆ అలౌకిక స్థాయి కి ఎదగవచ్చు.


యజ్ఞము: సాధారణంగా, యజ్ఞము అంటే అగ్ని హోమము అనే అర్థం వస్తుంది. భగవద్గీత లో, యజ్ఞము అంటే, భగవద్ అర్పితముగా చేయబడిన వేద విహిత కర్మలు అన్నీ వస్తాయి. ప్రకృతి మూలకములు అన్నీ భగవంతుని సృష్టిలో అంతర్గత భాగములే. వ్యవస్థ లో అన్ని అంగములు కూడా సహజంగానే పూర్ణ అస్థిత్వం నుండి గ్రహిస్తాయి మరియు దానికి తిరిగి ఇస్తాయి. సూర్యుడు భూగోళానికి స్థిరత్వం ఇస్తాడు మరియు జీవరాశి అస్తిత్వానికి కావలసిన వెలుగు/వేడిమిని కూడా అందిస్తాడు. మన పోషణ కోసం భూమి తన మట్టి నుండి ఆహారాన్ని సృష్టిస్తుంది , అంతేకాక, నాగరిక జీవనానికి కావలసిన ఖనిజాలను తన గర్భంలో ఉంచుకున్నది. వాయువు ప్రాణ శక్తిని మన దేహంలో కదిలిస్తుంది మరియు శబ్ద తరంగశక్తికి వాహకంగా పనిచేస్తుంది. మనం మానవులం కూడా భగవంతుని సృష్టి లో అంతర్గత భాగమే. మనం పీల్చే గాలి, నడిచే నేల, తాగే నీరు, పగటిపూట వెలుగు, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క ప్రసాదములే. మన జీవన ఆధారం కోసం వీటన్నిటిని స్వీకరించినప్పుడు, మనకు కూడా ఈ వ్యవస్థ పట్ల మన విధులు ఉంటాయి. మనకు విధింపబడిన కర్తవ్యములను భగవత్ సేవగా చేయటం ద్వారా మనం ప్రకృతి సృష్టి వ్యవస్థలో పాలు పంచుకోవాలి అని భగవద్గీత పేర్కొంటుంది. భగవంతుడు మన నుండి ఆశించే యజ్ఞము ఇదే.


ఒక చేతి ఉదాహరణ తీసుకోండి. అది శరీరంలో ఒక అంతర్గత భాగము. అది తన పోషకాలను అంటే, రక్తము, ఆక్సిజన్, ఇతర పోషకాలను - శరీరం నుండి తీసుకుంటుంది. ప్రతిగా, శరీరం కోసం తన వంతు పనులను చేస్తుంది. ఒకవేళ చెయ్యి ఆ సేవను భారమైనదిగా పరిగణించి, శరీరం నుండి విడిపోవాలని ప్రయత్నిస్తే, అది కొద్ది నిమిషాలు కూడా నిలువలేదు. అది తన శరీరం పట్ల చేసే ఈ యజ్ఞములోనే, చెయ్యి యొక్క స్వప్రయోజనం కూడా తీరుతుంది. అదే విధంగా, మనం జీవాత్మలం కూడా ఆ పరమాత్మ యొక్క అణు-అంశలమే (ఆయన భాగాలమే), మరియు ఈ మహా వ్యవస్థలో మనం చేయవలసిన పాత్ర ఉంది. ఆయన పట్ల మన యజ్ఞం చేస్తే, మన స్వ-ప్రయోజనం కూడా సహజంగానే తీరుతుంది.


యజ్ఞము అంటే భగవత్ దృక్పథంలో, పరమేశ్వరునికి అర్పితముగా చేయబడాలి. కానీ, జనులు తమ తమ జ్ఞానంలో భిన్నములుగా ఉంటారు, అందుకే యజ్ఞాన్ని వేర్వేరు విధాలుగా వేర్వేరు దృక్పథాలతో చేస్తారు. నిమ్న స్థాయి జ్ఞానం కలవారు, భౌతిక ప్రతిఫలాల కోసం, దేవతలకు నివేదన చేస్తారు.


దేవతలు : ప్రాకృతిక జగత్తులోనే కానీ, ఉన్నత స్థాయి స్వర్గాది లోకాల్లో ఉండే జీవులు వీరు. దేవతలు అంటే భగవంతుడు కాదు. వారు కూడా మనలాగే జీవాత్మలే. వారు భగవంతుని పరిపాలన లో కొన్ని నిర్దుష్ట పదవులను నిర్వహిస్తుంటారు మరియు భౌతిక జగత్తులో కొన్ని కార్యక్రమాలను పర్యవేక్షింస్తుంటారు.


ఓ దేశపు కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి. హోమ్ శాఖ మంత్రి, ఆర్ధిక మంత్రి, వ్యాపార/వాణిజ్య మంత్రి, వ్యవసాయ మంత్రి, మొదలైన వారు ఉంటారు. ఇవి పదవులు; ఎంపిక చేయబడిన వారు ఈ పదవులను పరిమితమైన కొద్ది కాలం అలంకరిస్తారు. పదవీకాలం అయిపోయిన తరువాత ప్రభుత్వం మారుతుంది, ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా మారతారు. ఈ పదవులు ఉంటాయి, కానీ ఈ పదవిలో ఉండేవారు మారుతూ ఉంటారు. అదే విధంగా, ఈ జగత్తు నిర్వహణలో, అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఇంద్రుడు మొదలైన వారు ఉంటారు. తమ పూర్వ జన్మల కర్మల ఫలితంగా ఎంపికచేయబడిన జీవాత్మలకు ఈ పదవులు కొద్ది కాలం ఇవ్వబడతాయి. ఈ విధంగా, ఆత్మలు తాత్కాలికంగా దేవతలవుతాయి మరియు, తత్ఫలితంగా వాటిని మనం భగవంతునితో పోల్చలేము.


చాలా మంది జనులు భౌతిక సంపదల కోసం దేవతల ఆరాధన చేస్తుంటారు. కానీ, మనం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే, ఈ దేవతలు మనకు భౌతిక బంధం నుండి మోక్షం ఇవ్వలేరు లేదా భగవత్ ప్రాప్తినీ ఇవ్వలేరు. ఒకవేళ వారు భౌతిక ప్రయోజనాలను ప్రసాదించినా, అవి కూడా వారు భగవంతుని ద్వారా తమకు ఇవ్వబడిన శక్తిసామర్ధ్యముల చేతనే ఇస్తారు. కాబట్టి, భగవద్గీత పదేపదే జనులను దేవతల ఆరాధన పట్ల హెచ్చరిస్తుంది, మరియు నిజమైన జ్ఞానంతో ఉన్న వారు పరమేశ్వరుడినే పూజిస్తారు అని పేర్కొంటున్నది.


భగవంతుని దివ్య ధామము: స్వర్గాది లోకాలు, భూలోకము, నరక లోకాలతో కూడి ఉన్న ఈ భౌతిక జగత్తు అంతా కలిపి, భగవంతుని సృష్టిలో ¼ వంతు మాత్రమే. ఇది ఇంకా ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధించని ఆత్మల కోసం ఉన్నది. ఇక్కడ మనం ఎన్నో రకాలుగా యాతనకు గురి అవుతాము; జన్మ, వ్యాధులు, వృద్ధాప్యం మరియు మృత్యువు వంటి వాటిచే. ఈ సమస్త భౌతిక జగత్తుకీ అతీతంగా ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి, ఇవి భగవంతుని సృష్టిలో ¾ వంతు. ఆ ఆధ్యాత్మిక జగత్తులో, అసంఖ్యాకమైన దివ్య ధామములు ఉన్నాయి, అవే వైదిక గ్రంధాల్లో చెప్పబడిన సాకేత లోకము (శ్రీరామ చంద్రుని ధామము), గోలోకము (శ్రీకృష్ణ భగవానుని దివ్య ధామము), వైకుంఠ లోకము (శ్రీమన్నారాయణుడి ధామము), శివ లోకము (శివుని ధామము), దేవీ లోకము (దుర్గామాత లోకము) మొదలైనవి. భగవత్ ప్రాప్తి పొందిన వారు భగవత్ ధామమునకే వెళతారు మరియు ఈ భౌతిక జగత్తు లోని జనన మరణ చక్రమునకు తిరిగి రారు, అని భగవద్గీత పదేపదే వక్కాణిస్తుంది.


శరణాగతి : భగవంతుడు దివ్యమైన వాడు మరియు మన భౌతిక ప్రాకృతిక బుద్ధిచే అర్థం కానివాడు. అదే విధంగా, ఆయన మన భౌతిక ప్రాకృతిక ఇంద్రియములకు గోచరము కాడు - కళ్ళు అతనిని చూడలేవు, చెవులు అతనిని వినలేవు, వంటివి. కానీ, ఆయన ఏదేని ప్రాణిపై తన కృపను ప్రసాదించాలని సంకల్పిస్తే, తన దివ్య శక్తిని ఆ యొక్క ధన్యుడైన ఆత్మకు ప్రసాదిస్తాడు. తన దివ్య కృపను అందుకున్న పిదప, వ్యక్తి భగవంతుడిని చూడవచ్చు, మరియు పొందవచ్చు. భగవత్ కృప కూడా ఆయన నుండి ఎదో యాదృచ్చికంగా వచ్చే చర్య కాదు. తన దివ్య కృపను తనకు శరణాగతి చేసిన వారి యందే ప్రసరిస్తాడు. ఈ విధంగా, జీవాత్మ పరమేశ్వరునికి శరణాగతి చేసే రహస్యాన్ని నేర్చుకోవాలి అని భగవద్గీత వక్కాణిస్తుంది.


యోగము : "యోగ" అన్న పదం గీత లో సుమారుగా నూటయాభై చోట్ల వేర్వేరు ప్రయోజనాలకు ఉపయోగించబడినది. యజ్ అన్న మూల ధాతువు నుండి ఇది వచ్చింది, అంటే "ఏకమవుట" అని అర్థం. ఆధ్యాత్మిక దృక్కోణం నుండి చూస్తే, జీవాత్మ, భగవంతునితో ఏకమవ్వటాన్ని "యోగం" అంటారు (ఉదా. 5.21వ శ్లోకం). కానీ, ఈ యోగాన్ని సాధించే శాస్త్ర విధానాన్ని కూడా యోగము అంటారు. (ఉదా. 4.1వ శ్లోకం). ఇంకా, ఈ శాస్త్ర విధాన పద్దతి ద్వారా సాధించిన పరిపూర్ణ స్థితిని కూడా యోగమనే అంటారు. (ఉదా. 6.18వ శ్లోకం). భగవంతునితో యోగం వలన వ్యక్తి సహజంగానే భౌతిక ప్రకృతి సంపర్కం చే జనించే క్లేశముల నుండి విడివడుతాడు. అందుకే, ఈ దుఃఖ విముక్తి దశ కూడా "యోగము" అని సూచించబడినది. (ఉదా. 6.23వ శ్లోకం). పరిపూర్ణత అనేది తనతోపాటుగా సమత్వ బుద్ధిని కలుగచేస్తుంది కాబట్టి, ఇటువంటి సమత్వం కూడా యోగము అని చెప్పబడింది (2.48వ శ్లోకము). యోగ స్థితిలో ఉన్నవాడు అన్ని కార్యకలాపాలను సంపూర్ణ దోషరహితంగా, భగవత్ భక్తి దృక్పథంలో చేస్తాడు, అందుకే పనిలో నైపుణ్యం కూడా యోగము అని చెప్పబడుతుంది. (2.50వ శ్లోకం)


అసలు ఈ యోగం ఎందుకు అవసరం అని ఎవరైనా అడగవచ్చు. దీనికి సమాధానం ఏమిటంటే, భౌతిక జగత్తులో ఆనందాన్ని వెతకటం అనేది ఎడారిలో ఎండమావి వెంటపడటం లాంటిది. ప్రాపంచిక కోరికల స్వభావం ఏమిటంటే, వాటిని తీర్చటం అంటే అగ్నిలో ఆజ్యంపోసి ఆర్పటానికి ప్రయత్నించటమే. కొద్దిగా మంట జ్వాల తగ్గినట్టుగా అనిపించినా, అది మరింత ఉదృతంగా ఎగిసి పడుతుంది. అదే విధంగా, మనోఇంద్రియముల కోరికలను తీర్చటం అనేది లోభము/దురాశకు దారి తీస్తుంది. కానీ, కోరికలను నిరోధించటం కూడా మంచిది కాదు, ఎందుకంటే అది క్రోధమునకు దారి తీస్తుంది. అందుకే మనం కోరికలు ఎందుకు జనిస్తాయో అన్న మూల కారణాన్ని అర్థంచేసుకోవాలి మరియు దానిని సరిదిద్దటానికి ప్రయత్నించాలి. ఇదంతా మనం ఎదో వ్యక్తిలోనో లేదా వస్తువు లోనో ఆనందం ఉంది అని చింతన చేయటం నుండి జనిస్తాయి. ఈ నిరంతర చింతన, మనస్సుకి మమకారాసక్తి కలుగచేస్తుంది, మరియు ఈ ఆసక్తి కోరికను జనింపచేస్తుంది. కాబట్టి, ఆత్మ అన్వేషించే ఆ దివ్య పరమానందము భౌతిక ప్రాకృతిక వస్తువులలో లేదు అని మనం దృఢంగా నిశ్చయించుకుంటే, ఈ కోరికలు పుట్టటం ఆగిపోతుంది. కానీ, ఆనందం కోసం ఉన్న కోరిక ఆత్మకు సస్వభావ సహజంగా ఉండేది ఎందుకంటే అది సనాతనమైన దివ్య ఆనంద సముద్రం యొక్క అణు-అంశ. ఆత్మ ఎప్పుడైతే భగవంతుని అనంతమైన ఆనందాన్ని పొందుతుందో అప్పుడే దాని ఈ స్వస్వభావం తృప్తి చెందుతుంది. కాబట్టి, తెలిసినా, తెలియకపోయినా, ప్రతి ఒక్క జీవాత్మ, ఆ యొక్క భగవత్ ప్రాప్తి స్థితి లేదా "యోగ" స్థితికి చేరుకోవటానికి ప్రయాస పడుతున్నది.


భగవంతుని తో ఏకమవ్వటానికి ఉన్న వేర్వేరు మార్గాలనే వివిధములైన యోగ పద్ధతులు అంటారు. ఉదాహరణకు, కర్మ యోగము, జ్ఞాన యోగము, అష్టాంగయోగము మరియు భక్తి యోగము. అందుకే, ఆధ్యాత్మిక అభ్యాసకులను సాధారణంగా యోగులు (ఉదా. 4.25వ శ్లోకం) లేదా సాధకులు అంటారు. ఒక్కోసారి, యోగ అన్నపదం అష్టాంగ యోగ పద్దతిని సూచిస్తుంది. (ఉదా. 4.28వ శ్లోకం). ఇటువంటి సందర్భాలలో యోగి అంటే, ప్రత్యేకంగా అష్టాంగ యోగ అభ్యాసకుడినే సూచిస్తుంది.


జ్ఞాన యోగము (జ్ఞాన మార్గ పథము): ఈ యోగ పద్దతిలో, ఆత్మ జ్ఞానమునకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. దీనినే గీత , ఒక్కోసారి సాంఖ్య యోగము అని కూడా పేర్కొంటుంది. బుద్ధి యొక్క విశ్లేషణ ద్వారా జ్ఞాని అనేవాడు ఆత్మ సాక్షాత్కారం కోసం పరిశ్రమిస్తాడు, అది సమస్త దేహ ఉపాధులకూ మరియు మలినములకూ భిన్నమైనది. ఆత్మ జ్ఞానమే అత్యున్నత లక్ష్యంగా పరిగణించబడుతుంది. జ్ఞాన యోగ అభ్యాసము, భగవత్ కృప సహకారం లేకుండానే సొంత ప్రయంత్నం పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి, అది కష్టతరమైనది మరియు ప్రతి అడుగులో పతనమయ్యే అవకాశం ఉంటుంది.


అష్టాంగ యోగము (ఎనిమిదంచెల మార్గము): దీనిలో, యాంత్రిక అభ్యాసము మొదలుకొని, మనో నిగ్రహము వరకూ క్రమబద్ధమైన పరిశుద్ధి ఓనర్చె ప్రక్రియ ఉంటుంది. దీని యందు, ప్రాణ శక్తిని వెన్నుపూస లోని సుషుమ్న నాడి ద్వారా పైకి లేపుతారు. దానిని మూడవ కంటి స్థానమైన కనుబొమల మధ్య నిలుపుతారు. ఆ తరువాత, అత్యంత భక్తితో దాన్ని పరమేశ్వరుని పై కేంద్రీకరిస్తారు. మహర్షి పతంజలి, తన ప్రఖ్యాత "యోగ సూత్రాలు" గ్రంథంలో దీనిని అభ్యాసం చేసే ఒక క్రమబద్ధ విధానాన్ని సూచించాడు. ఆ విధంగా, ఇది అష్టాంగ యోగము లేదా ఎనిమిది అంచెల యోగ విధానంగా ప్రాచుర్యం పొందింది. దీనికి కొద్ది తేడాతో ఉండేదే హఠ యోగము, దీనిలో నియమనిష్ఠలు ప్రధానంగా ఉంటాయి. మనస్సు మరియు ఇంద్రియములపై నియంత్రణని, సంకల్ప శక్తి ద్వారా సాధించటానికి హఠ యోగము ప్రయత్నిస్తుంది.
చాలా ప్రదేశాలలో, వైదిక గ్రంధాలు, భగవత్ ప్రాప్తికి మూడు మార్గాలే ఉన్నాయని పేర్కొంటాయి - కర్మ యోగము, జ్ఞాన యోగము, మరియు భక్తి యోగము. ఈ విధమైన వర్గీకరణలో, అష్టాంగ యోగము, జ్ఞానయోగములో భాగంగా పరిగణించబడుతుంది.


భక్తి యోగము (భక్తి మార్గము): ఈ పథంలో మనస్సు భగవంతుని యొక్క నామములు, రూపములు, గుణములు, లీలలు మొదలైన వాటిపై, నిస్వార్ధ, అనన్య ప్రేమతో అనుసంధానం చేయబడుతుంది. భగవంతుడే తన సనాతనమైన తండ్రిగా, తల్లిగా, సఖుడిగా, స్వామిగా మరియు ఆత్మ-సఖుడిగా పరిగణిస్తూ, వ్యక్తి భగవంతుని పట్ల ప్రేమయుక్త సంబంధాన్ని పెంచుకుంటాడు. ఆయనకు శరణాగతి చేసి, స్వీయ చిత్తమును, భగవత్ చిత్తముతో ఏకీకృతం చేసి, భక్తుడు భగవత్ కృపను ఆకర్షిస్తాడు మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణతని, ఇతర పద్దతులలో కంటే సులువుగా సాధిస్తాడు. భగవద్గీత అన్ని యోగ విధానాలనూ సమర్ధించినా, అది పదేపదే భక్తి మార్గమే అత్యుత్తమ మార్గమని వక్కాణిస్తుంది. తాను భక్తిచే మాత్రమే తెలిసుకోబడుతాను అని శ్రీ కృష్ణుడు పదే పదే చెప్పిన ఉపదేశం, భక్తి అనేది తక్కువస్థాయి యోగ పద్దతి అని కొందరిలో ఉన్న అపోహని తొలగించటానికి, ఈ వ్యాఖ్యానంలో ప్రస్ఫుటంగా చెప్పబడినది.


కర్మ యోగము (కర్మ మార్గము): కర్మ అంటే వ్యక్తి చేసే ప్రాపంచిక విధులు మరియు బాధ్యతలు, అదే సమయంలో యోగం అంటే భగవంతునితో ఏకమవ్వటం. కాబట్టి, ప్రపంచంలో విహిత కర్మలు చేస్తూ కూడా భగవంతునితో మనస్సుని ఐక్యం చేయటమే కర్మ యోగము. అన్ని పనులు భగవత్ ప్రీతి కోసం మాత్రమే అన్న ధృడ సంకల్పాన్ని బుద్ధి యందు పెంపొందించుకోవటం ద్వారా, మనస్సుని కర్మ ఫలాలపై అనాసక్తితో ఉంచటం దీనికి అవసరం. అందుకే గీత, ఒక్కోసారి దీనిని బుద్ధి యోగము అంటుంది. చాలా మంది జనులు గృహస్తులుగా ఉంటూ, ప్రాపంచిక కర్తవ్యాలను నిర్వర్తిస్తూనే, ఆధ్యాత్మికతను అభ్యాసం చేస్తారు కాబట్టి, వారికి, వేరే ఇతర ఎంచుకున్న యోగ విధానం తో పాటుగా కర్మ యోగము అనేది అవసరం అవుతుంది.
ఈ కొన్ని ముఖ్యమైన పదాల క్లుప్తమైన వివరణతో, ఇక ఈ "భగవంతుని గీత" ని చదివి, శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో అందించిన అద్భుతమైన దివ్య జ్ఞానాన్ని స్వయముగా తెలుసుకునే అవకాశాన్ని నేను పాఠకునికే వదిలిపెడుతున్నాను.

కృతజ్ఞతలు

నా గురుదేవులు, జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ గారికి నా గాఢమైన హృదయపూర్వక కృతజ్ఞతలర్పిస్తున్నాను. ఆయన దివ్య ప్రేమ మరియు అలౌకిక జ్ఞాన, సముద్రము. కేవలం ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే, నావంటి అర్హతలేని జీవుడు, ఆయన యొక్క అనంతమైన జ్ఞాన భాండాగారము నుండి ఒక జ్ఞాన బిందువుని అందుకోగలిగింది. మానవ జాతి సేవ కోసం వైదిక జ్ఞానాన్ని ఉపదేశించమని అయన ఇచ్చిన ఆజ్ఞ పాటించే నిమిత్తమే ఈ వినయపూర్వక కృషి.
అత్యంత దయాళువైన మరియు ఔదార్యము కల ఋషి వేద వ్యాసుని పట్ల, సమస్త మానవ జాతికి ఉన్న ఋణాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. అయన, భగవద్గీత పొందుపరచబడి ఉన్న, పవిత్రమైన మహాభారత గ్రంధాన్ని మనకు ప్రసాదించారు.


నా ఎడిటర్ రిచర్డ్ కజుత్ (భారతీయ పేరు రామకృష్ణ) గారి కృషికి కి నేను మనఃస్ఫూర్తిగా నా కృతఙ్ఞతలు అందజేస్తున్నాను. ఆయన ఏంతో శ్రమతో నా మాటలపై ఆలోచించి ఎన్నో ఉపయోగకరమైన సలహాలను అందించారు. దీని నిమిత్తం ఆయన యొక్క నిస్వార్థ సేవ మరియు శ్రమ, సమయ త్యాగానికి నేను చాలా ప్రీతి చెందాను. నా మనఃపూర్వక కృతజ్ఞతలు, ఆర్తి మాలిక్ కూడా అందిస్తున్నాను - ఆమె ఎంతో ఓపికతో దీనిలో తప్పులు సరిదిద్దటం కోసం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసింది మరియు అమూల్యమైన సలహాలు ఇచ్చింది. వీరిద్దరూ కూడా, ఖచ్చితమైన సమయ ఒత్తిడి లోబడి పని చేయటానికి అంగీకరించి తమ మహోన్నత సహకారాన్ని అందించారు మరియు తమతమ పనులను సుమారుగా ఆరు నెలలలోనే పూర్తిచేశారు.
ఈ పుస్తకంలోని బొమ్మలను తయారుచేసినందుకు, సంజయ్ సర్కార్ కి నా కృతజ్ఞతలను అందచేస్తున్నాను.


రాత్రియంబవళ్లూ ఫార్మాటు, టైపు-సెట్టింగు, లేఔట్ మొదలైన వాటిపై పనిచేసినందుకు, ప్రజ్ఞ్యాన్ వైద్యాకి కూడా నా హృదయపూర్వక కృతఙ్ఞతలు. ఈ పుస్తక తయారీ మరియు ముద్రణలో పాలు పంచుకున్న - శ్రేయ భట్ , శైలీ అధికారి, సంతన బాలాజీ, ఇంకా నా టీమ్ లో అందరు సభ్యులకు కూడా - నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు.


ఈ పుస్తకాన్ని ఏ ప్రయోజనం కోసం ప్రచురించామో ఆ ఆశయాన్ని అది నెరవేరుస్తుందని, మరియు పరమ సత్యాన్ని అన్వేషించే వారికి, వారి భగవత్ ప్రాప్తి పథంలో సహాయ పడగలదని ఆశిస్తున్నాను.

భగవత్ సేవలో,

స్వామి ముకుందానంద.