12వ అధ్యాయము: భక్తి యోగము

భక్తి యోగము

ఈ చిన్న అధ్యాయము, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గముల కన్నా, ప్రేమ యుక్త భక్తి మార్గము యొక్క సర్వోన్నత ఉత్కృష్టతని నొక్కివక్కాణిస్తుంది. యోగములో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయము ప్రారంభమవుతుంది —భగవంతుని సాకార రూపము పట్ల భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మంను ఉపాసించే వారా అని. ఈ రెండు మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీ కృష్ణుడు సమాధానమిస్తాడు. కానీ, తన సాకార రూపమును ఆరాధించేవారే అత్యుత్తమ యోగులని ఆయన భావిస్తాడు. నిరాకార, అవ్యక్త భగవత్ తత్త్వముపై ధ్యానం చేయటం చాలా ఇబ్బందులతో కూడి ఉన్నది మరియు అది బద్ద జీవులకు చాలా కష్టతరమైనది అని వివరిస్తాడు. తమ అంతఃకరణ ఆయనతో ఏకమై పోయినవారు, మరియు తమ అన్ని కార్యములను ఆయనకే అర్పించిన సాకార రూప భక్తులు, త్వరితగతిన జనన-మరణ చక్రము నుండి విముక్తి చేయబడతారు. శ్రీ కృష్ణుడు ఈ విధంగా అర్జునుడిని, అతని బుద్ధిని తనకు అర్పించి, మనస్సుని అనన్య ప్రేమ-యుక్త భక్తితో తన యందే లగ్నం చేయమని ప్రార్థిస్తాడు.
    కానీ, తరచుగా, ఇటువంటి ప్రేమ, ప్రయాసపడే జీవాత్మలో కనిపించదు. కాబట్టి, శ్రీకృష్ణుడు ఇతర పద్ధతులను కూడా సూచించాడు, ఒకవేళ అర్జునుడు తక్షణమే భగవంతుని యందు మనస్సుని పూర్తిగా నిమగ్నం చేసే స్థాయిని చేరుకోలేకపోతే, అతను ఆ యొక్క దోషరహిత పరిపూర్ణ స్థాయిని చేరుకోవటానికి పరిశ్రమించాలి. భక్తి అనేది ఏదో ఒక నిగూఢమైన బహుమానం కాదు, దానిని నిరంతర అభ్యాసము ద్వారా పెంపొందించుకోవచ్చు. ఒకవేళ అర్జునుడు ఇది కూడా చేయలేకపోతే, అతను ఓటమిని ఒప్పుకోకూడదు; సరికదా భక్తితో శ్రీకృష్ణుడి ప్రీతికోసం పనిచేయటం నేర్చుకోవాలి. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే, అతను తన కర్మ-ఫలములను త్యజింఛాలి మరియు ఆత్మయందే స్థితమై ఉండాలి. కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే, యాంత్రికమైన అభ్యాసం కన్నా జ్ఞానాన్ని పెంపొందించుకోవటం ఉన్నతమైనది, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కంటే ధ్యానం ఉన్నతమైనది; ధ్యానం కంటే ఉన్నతమైనది కర్మ ఫలములను త్యజించటం, ఇది తక్షణమే ఎంతో శాంతిని కలుగజేస్తుంది. ఈ అధ్యాయం యొక్క మిగతా శ్లోకాలు భగవంతుడికి చాలా ప్రియమైన, ఆయన ప్రేమ-యుక్త భక్తుల యొక్క మహోన్నతమైన గుణములను విశదీకరిస్తాయి.

అర్జునుడు ఇలా అడిగెను: నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మన్ ను ఉపాసించే వారు – వీరిలో, యోగములో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని నీవు పరిగణిస్తావు?

శ్రీ భగవానుడు ఇలా పలికెను: నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతమూ నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను.

నాశరహితుడూ, అనిర్వచనీయమైన వాడు, అవ్యక్తమూ, సర్వవ్యాపి, మనోబుద్ధులకు అతీతుడు, మార్పు లేనివాడు, నిత్యశాశ్వతుడూ, మరియు నిశ్చలమైన వాడునూ - అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్త్వాన్ని - ఇంద్రియములను నిగ్రహించి, సర్వత్రా సమబుద్ధితో ఉంటూ, సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ - ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు.

మనస్సు యందు అవ్యక్తము పట్ల ఆసక్తి ఉన్నవారికి, సిద్ధి పథము చాలా కష్టములతో కూడుకున్నది. అవ్యక్తమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది.

కానీ, తాము చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ, నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ, నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని, ఓ పార్థా, నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యుసంసారసాగరము నుండి విముక్తి చేస్తాను, ఏలనన వారి అంతఃకరణ నా యందే ఏకమైపోయి ఉంటుంది.

నీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు నీ బుద్ధిని నాకు అర్పించుము. ఆ తరువాత, నీవు సర్వదా నాలోనే నివసిస్తావు. దీనిపై ఎలాంటి సంశయము వద్దు.

ఒకవేళ నీవు మనస్సును నా యందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే, ఓ అర్జునా, మనస్సును నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ, నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము.

నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నాకోసమే పనులు చెయ్యటానికి ప్రయత్నం చేయుము. ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు.

ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే, నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మయందే స్థితుడవై ఉండుము.

యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది; జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమయినది. ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మెరుగైనది, ఎందుకంటే ఇటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించును.

ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.

లోకమున ఎవ్వరినీ బాధ(క్షోభ) పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్వేగమునకు గురి కాని వాడు, సుఖాల్లో-బాధల్లో ఒక్కలాగే ఉంటూ, మరియు భయము, ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.

ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతతో ఉండి, బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి, దక్షతతో, ఉదాసీనంగా, కలతలు లేకుండా, మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు.

ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధ పడకుండా ఉంటారో, ఎవరైతే నష్టం జరిగినా బాధ పడరో లేదా లాభం కోసం ప్రాకులాడరో, శుభ-అశుభ పనులను రెంటినీ త్యజిస్తారో, అటువంటి జనులు, భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైనవారు.

ఎవరైతే, మిత్రులపట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో, గౌరవము-అపమానముల ఎడ, చలి-వేడిమి పట్ల, సుఖ-దుఖఃముల పట్ల సమబుద్ధితో ఉంటారో, మరియు చెడు సాంగత్యమును విడిచి ఉంటారో; దూషణ మరియు పొగడ్తని ఒక్కలాగే తీసుకుంటారో, మౌనముగా చింతన చేస్తుంటారో, తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారో, నివాసస్థానము పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారో, ఎవరి బుద్ధి స్థిరముగా నా యందే లగ్నమై ఉన్నదో, మరియు ఎవరైతే నాయందు భక్తితో నిండిపోయి ఉన్నారో, అటువంటి వ్యక్తులు నాకు చాలా ప్రియమైనవారు.

ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామృతమును గౌరవించి, నాపై విశ్వాసముతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో, వారు నాకు అత్యంత ప్రియమైన వారు.