Bhagavad Gita: Chapter 15, Verse 15

సర్వస్య చాహం హృది సన్నివిష్టో
మత్తః స్మృతిర్ జ్ఞానమపోహనం చ ।
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో
వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ ।। 15 ।।

సర్వస్య — సమస్త ప్రాణులలో; చ — మరియు; అహం — నేను; హృది — హృదయములో; సన్నివిష్టః — స్థితమై ఉండి; మత్తః — నానుండి; స్మృతిర్ — స్మృతి; జ్ఞానమ్ — జ్ఞానము; అపోహనం — విస్మృతి (మతిమరుపు); చ — మరియు; వేదైః — వేదముల చే; చ — మరియు; సర్వైః — అన్ని; అహం — నేను; ఏవ — మాత్రమే; వేద్యః — తెలుసుకొనబడవలసిన వాడను; వేదాంత-కృత్ — వేదాంతములను రచించినవాడను; వేద-విత్ — వేదార్ధములను తెలిసినవాడను; ఏవ — ఒక్కడినే (మాత్రమే); చ — మరియు; అహం — నేను.

Translation

BG 15.15: నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే.

Commentary

భగవంతుడు మనలో జ్ఞానము మరియు స్మృతి (జ్ఞాపకశక్తి) అనే మహాద్భుతమైన ఉపకరణములను సృష్టించాడు. మెదడు దాని యొక్క హార్డువేర్, మరియు మనోబుద్ధులు దాని సాఫ్ట్-వేర్ వంటివి. మనం తరచుగా దీనికి చాలా మామూలుగా తీస్కుంటాము. శస్త్రచికిత్సా వైద్యులు ఒక్కోసారి మెదడు మార్పిడి ప్రక్రియ చేస్తారు మరియు వారు చేసిన దానికి చాలా గర్వపడతారు, కానీ, వారు అసలు ఈ అద్భుతమైన మెదడు యొక్క వ్యవస్థ ఎలా సృష్టిచేయబడినదో అని తలంచరు. చాలా విషయాలలో, శాస్త్రీయ పరిజ్ఞానం ఎంత ముందుకు వెళ్ళినా, కంప్యూటర్లు లేదా యంత్రాలు, మనుష్యుల మెదడుతో సరితూగలేకున్నాయి. ఉదాహరణకి, మనుష్యుల ముఖములను గుర్తుపట్టగలిగే సాంకేతిక పరిజ్ఞానం కోసం సాఫ్ట్-వేర్ ఇంజినీర్లు ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. అదే సమయంలో, మనుష్యులు మాత్రం జనుల ముఖములు మారినా వారిని సునాయాసముగా గుర్తుపట్టగలుగుతున్నారు. అందుకే, మనం ‘మిత్రమా, చాలా రోజుల తరువాత నిన్ను కలుసుకోవటం చాలా సంతోషముగా ఉన్నది. ఇంతకు పూర్వం కలిసినప్పటికీ, ఇప్పటికి చాలా మారిపోయావు!’ అనే మాటలు తరచుగా వింటుంటాము. దీని వలన మనకు, మనుష్యుల మెదడు, జనుల ముఖములను, అవి సంవత్సరాల తరబడి మారినా సరే గుర్తుపట్టగలుగుతున్నది, అదే సమయంలో కంప్యూటర్లు మాత్రం మారని ముఖములను కూడా పూర్తిగా గుర్తుపట్టలేకున్నాయి, అని అవగతం అవుతున్నది. ఇప్పటికీ, శాస్త్రవేత్తలు, చేతివ్రాతతో రాసిన అక్షరాలను తప్పులు లేకుండా గుర్తుపట్టే స్కానర్ యంత్రముల కోసం శ్రమిస్తున్నారు, అదే సమయంలో మనుష్యులు మాత్రం ఇతరులు వ్రాసిన కాస్త గజిబిజిగా ఉన్న చేతివ్రాతను కూడా గుర్తుపట్టగలరు. జ్ఞాపక శక్తి మరియు జ్ఞానము అనే పరమాద్భుతమైన సామర్థ్యములు తన నుండే వచ్చాయి అని శ్రీ కృష్ణుడు ఇక్కడ పేర్కొంటున్నాడు.

అంతేకాక, విస్మృతి (మర్చిపోయే శక్తి), కూడా తనదే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఎలాగైతే అవసరం లేని పత్రాలు చింపివేయబడుతాయో, ప్రాణులు, అవసరం లేని జ్ఞాపకాలను స్మృతినుండి తీసివేస్తాయి, అదేకనక లేకపోతే, సమాచారంతో అది నిండిపోతుంది. శ్రీమద్ భాగవతంలో ఉద్ధవుడు శ్రీ కృష్ణునితో ఇలా అన్నాడు:

త్వత్తో జ్ఞానం హి జీవానాం ప్రమోషస్ తే ఽత్ర శక్తితః (11.22.28)

‘నీ నుండే జీవప్రాణుల యొక్క జ్ఞానము ఉద్భవించినది, మరియు నీ శక్తి వలననే ఆ జ్ఞానము తీసివేయబడుతుంది.’

మనలో అంతర్గతంగా ఉన్న ఈ యొక్క విజ్ఞాన వ్యవస్థయే కాక, వేదములు అనేవి, బాహ్యంగా ఉన్న జ్ఞాన సంపద, మరియు శ్రీ కృష్ణుడు తన విభూతులను ఆ పరిధిలో కూడా తెలియచేస్తున్నాడు. సృష్టి ప్రారంభంలో వేదములను ప్రకటితం చేసినది ఆయనే. భగవంతుడు దివ్యమంగళ స్వరూపుడు మరియు మన బుద్ధికన్నా అతీతుడు కాబట్టి, వేదములు కూడా దివ్యమైనవి. ఆయన మాత్రమే వాటి యొక్క నిజమైన అర్థము తెలిసినవాడు, మరియు ఆయన తన కృపను ఎవరిమీదైనా ప్రసాదిస్తే, ఆ భాగ్యశాలియైన జీవాత్మ కూడా వేదములను ఎరుంగును. భగవంతుని అవతారమైన వేద వ్యాసుడు, వేదాంత దర్శనమును వ్రాసాడు. అందుకే, శ్రీ కృష్ణుడు తానే వేదాంతమును వ్రాసాను అని అంటున్నాడు.

చివరగా, వేదములు అసంఖ్యాకమైన భౌతిక మరియు ఆధ్యాత్మిక ఉపదేశములను కలిగి ఉన్నా, సమస్త వేదజ్ఞానమునకు లక్ష్యము భగవంతుడిని తెలుసుకోవటమే అని అంటున్నాడు. కామ్య కర్మ కాండలు కూడా వేదాల్లో ఒక ప్రయోజనం కోసం ఉన్నాయి. భౌతిక ప్రపంచం పట్ల తీవ్రమైన మమకారాసక్తులు కలిగిఉన్నవారిని ఆకర్షించి, వారికి ఒక మధ్యంతర మెట్టుగా పనిచేసి, తరువాత వారిని కూడా భగవంతుని వైపుగా మరల్చివేస్తాయి. కఠోపనిషత్తు (1.2.15) ఇలా పేర్కొంటున్నది : ‘సర్వే వేదా యత్ పదమామనంతి”, ‘సమస్త వేద మంత్రములు నిజానికి భగవంతుడి దిశగానే సూచిస్తున్నాయి.’ మనం అన్ని వేద మంత్రాలను కంఠస్థం చేయవచ్చు, చక్కటి రాగతాళయుక్తంగా వాటిని పాడవచ్చు, అన్ని పూజాది కర్మ కాండలను బాగా చేయవచ్చు, ధ్యానంలో నిమగ్నమవ్వచ్చు, మరియు కుండలినీ శక్తిని కూడా ఉత్తేజింపచేయవచ్చు, అయినా, భగవంతుని గురించి తెలుసుకోలేకపోతే, వేదముల యొక్క యదార్థ తత్త్వం అర్థం కానట్టే. అదే సమయంలో, భగవంతుని పట్ల ప్రేమను పెంచుకున్నవారు, అనాయాసముగానే సమస్త వేద శాస్త్రముల ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నట్టే. జగద్గురు శ్రీ కృపాలుజీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:

సర్వ శాస్త్ర సార యహ గోవింద రాధే,

ఆఠోఁ యాం మన హరి గురు మే లగా దే
(రాధా గోవింద గీతము)

‘అన్ని వేద శాస్త్రముల సారము ఏమిటంటే, రాత్రింబవళ్ళు మనస్సుని హరి, గురువు పట్ల ప్రేమపూర్వక భక్తిలో నిమగ్నము చేయటమే.’

ఈ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు జగత్సృష్టి వృక్షమును వివరించాడు. ఇక ఇప్పుడు ఈ విషయాన్నిముగిస్తూ, ఆ జ్ఞానాన్ని సరియైన దృక్పథంలో పెట్టడానికి, శ్రీ కృష్ణుడు, క్షరము, అక్షరము, మరియు పురుషోత్తమ అన్న పదాలను, తదుపరి రెండు శ్లోకాలలో వివరిస్తున్నాడు.