Bhagavad Gita: Chapter 3, Verse 22

న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ।। 22 ।।

న — లేదు; మే — నాకు; పార్థ — అర్జునా; అస్తి — ఉండటము; కర్తవ్యమ్ — కర్తవ్యము ; త్రిషు — ఈ మూడు; లోకేషు — లోకాల్లో; కించన — ఏమాత్రమయినా; న — లేదు; అనవాప్తం — పొందదగినది; అవాప్తవ్యం — సాధించ వలసినది; వర్తే — చేయుచున్నాను; ఏవ — ఇంకా; చ — మరియు; కర్మణి — కర్మ యందు.

Translation

BG 3.22: ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, అర్జునా, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చేయవల్సిన విధులను చేస్తూనే ఉంటాను.

Commentary

మనమందరమూ ఎందుకు పని చేస్తున్నామంటే మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి. మనమందరమూ అనంతానంద సముద్రమైన భగవంతుని అణు అంశములము, కాబట్టి మనమందరమూ ఆనందాన్ని వెతుక్కుంటున్నాము. మనకు ఆ పరిపూర్ణ/నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకు అసంతృప్తి, అసంపూర్ణత ఉన్నాయి. కాబట్టి, మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. కానీ, ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి, ఆయనకు మాత్రమే అది అనంతమైన పరిమాణంలో ఉంటుంది. అయిన తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు మరియు ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు. అందుకే, ఆయనను ఆత్మారాముడు (తనలో తానే రమించువాడు), ఆత్మ-రతీ (తన పట్ల తానే ఆకర్షితమైయ్యే వాడు) మరియు ఆత్మ-క్రీడ (దివ్య లీలలను తన స్వరూపం తోనే చేసేవాడు) అంటారు.

అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కర్మలు(పనులు) చేస్తే, దానికి ఒకే ఒక కారణం ఉండవచ్చు — అవి తన కోసము కాదు; ఇతరుల సంక్షేమం కోసమే. ఈ విధంగా, తన సాకార స్వరూపంలో శ్రీకృష్ణుడిగా, ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా, లోక హితార్థం పని చేస్తున్నానని, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఆయన కర్మలు చేసినప్పుడు కలిగే లోక హితం, ఇక తదుపరి వివరిస్తున్నాడు.

Swami Mukundananda

3. కర్మ యోగము

Subscribe by email

Thanks for subscribing to “Bhagavad Gita - Verse of the Day”!