Bhagavad Gita: Chapter 16, Verse 13-15

ఇదమద్య మయా లబ్దమ్ ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ।। 13 ।।
అసౌ మయా హతః శత్రుః హానిష్యే చాపరానపి ।
ఈశ్వరోఽహమహం భోగీ సిద్ధోఽహం బలవాన్ సుఖీ ।। 14 ।।
ఆడ్యోఽభిజనవానస్మి కోఽన్యోఽస్తి సదృశో మయా ।
యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞానవిమోహితాః ।। 15 ।।

ఇదం — ఇది; అద్య — ఈనాడు; మయా — నా చేత; లబ్దమ్ — పొందబడెను; ఇమం — ఇది;  ప్రాప్స్యే — నేను ఆర్జిస్తాను; మనః-రథమ్ — కోరిక;  ఇదం — ఇది; అస్తి — ఉన్నది;  ఇదం — ఇది; అపి — కూడా; మే — నాదే ; భవిష్యతి — భవిష్యత్తులో; పునః — మళ్లీ; ధనమ్ — ధనము; అసౌ — ఆ (అతను);  మయా — నా చేత; హతః — సంహరింపబడెను; శత్రుః — శత్రువు; హానిష్యే — నేను నాశనం చేసెదను; చ — మరియు; అపరాన్ — ఇతరులను; అపి — కూడా; ఈశ్వరః — ఈశ్వరుడు; అహం — నేను; భోగీ — భోగించేవాడిని; సిద్దః — శక్తివంతుడను; అహం — నేను; బల-వాన్ — బలవంతుడను; సుఖీ — సుఖముగా ఉన్నాను; ఆడ్యః — ధనవంతుడను; అభిజన-వాన్ — గొప్ప హోదాలో కల బంధువులు; అస్మి — నాకు;  కః — ఎవరు?; అన్యః — ఇతరులు; అస్తి — ఉన్నారు; సదృశః — అటువంటి వారు; మయా — నాకు; యక్ష్యే — యజ్ఞములు చేసెదను;  దాస్యామి — దానములు ఇచ్చెదను; మోదిష్యే — ఆనందించెదను; ఇతి — ఈ విధముగా; అజ్ఞాన — అజ్ఞానముతో; విమోహితాః — మోహితులై; (భ్రమ లో).

Translation

BG 16.13-15: ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, "నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా ఉంటుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను శక్తిమంతుడను మరియు నేను సుఖంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు నా బంధువులు గొప్ప హోదాలో ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను (దేవతలకు) యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను." ఈ విధంగా, వారు అజ్ఞానముచే మోహితులై పోతారు.

Commentary

నైతికత్వాన్ని పూర్తిగా విస్మరిస్తూ, ఆసురీ లక్షణములు కలవారు తమకేది నచ్చితే దానిని అనుభవించే హక్కు ఉంది అనుకుంటారు. తన స్వప్రయోజనాలు నెరవేరటం కోసం పరిస్థితులను తమ వైపు తిప్పుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైదిక కర్మ కాండలు తమకు భౌతిక సంపత్తిని కలుగచేస్తాయి అని తెలుసుకుని,  వారు కీర్తి సంపదల కోసం యజ్ఞయాగాదులు కూడా నిర్వహిస్తుంటారు.  కానీ, ఎట్లైతే రాబందు ఎత్తులో ఎగిరినా దాని చూపు క్రిందికే నిమగ్నమై ఉంటుందో, ఆసురీ స్వభావము కలవారు కొన్నిసార్లు సమాజంలో ఉన్నతహోదా కి ఎదుగుతారు, కానీ వారి పనులు నీచమైనవిగా మరియు నిమ్నస్థాయిలో ఉంటాయి.  ఇటువంటి వారు అధికారాన్ని గౌరవిస్తారు మరియు "might is right.” అన్న సూత్రాన్ని నమ్ముతారు.  కాబట్టి, వారి కోరికలను తీర్చుకునేందుకు ఉన్న అవరోధాలను తొలగించటానికి ఇతరులకు హాని చేయటానికి లేదా గాయపరచటానికి కూడా వెనుకాడరు.  సూక్తి సుధాకరం నాలుగు రకాలైన మనుష్యులను పేర్కొంటుంది:

ఏకే  సత్పురుషాః పరార్థ ఘటకాః స్వార్థాన్‌ పరిత్యజ్య యే
సామాన్యాస్తు పరార్థముద్యమభృతః స్వార్థావిరోధేన యే
తే ఽమీ మానవ  రాక్షసాః పరహితం స్వార్థాయ నిఘ్నంతి యే
యే తు ఘ్నంతి నిరర్థకం పరహితం తే కే  న జానీమహే

"మొదటి రకం మనుష్యులు సాధు పురుషులు, వారు ఇతరుల సంక్షేమం కోసం తమ స్వార్ధ-ప్రయోజనాన్ని వదిలి పెడతారు.  రెండవ రకం మనుష్యులు, సాధారణమైన వారు,  వీరు, తమకు హాని/నష్టం కలగనంత వరకూ, ఇతరుల సంక్షేమం కోసం పనిచేస్తారు. మూడవ రకం మనుష్యులు ఆసురీ గుణాలు కలవారు, వారి స్వార్ధ-ప్రయోజనం నెరవేరుతుంది అంటే, ఇతరులకు హాని చేయటానికి వెనుకాడరు. ఇక, నాల్గవ రకం మనుష్యులు, అకారణంగా ఇతరులను బాధ పెట్టి ఆనందిస్తుంటారు (శాడిజం). వారికి సరిపోయే పేరు కూడా లేదు."  శ్రీ కృష్ణుడు నీచమైన ఆసురీ ప్రవృత్తి గల వారిని ఇక్కడ స్పష్టముగా వివరిస్తున్నాడు.  గర్వముతో కళ్ళు మూసుకుపోయి, వారు ఈ విధముగా అనుకుంటారు: "నేను ఒక ఐశ్వర్యవంత రాజరిక కుటుంబంలో పుట్టాను. ధనవంతుడను మరియు బలవంతుడను,  నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను.  భగవంతుని ముందు మ్రోకరిల్లాల్సిన అవసరమూ నాకు లేదు ఎందుకంటే నేనే దేవుడి లాంటి వాడిని" అని.

చాలా సందర్భాలలో, జనులు "నేను" అన్నప్పుడు , అది వారి అహంకారము మాట్లాడుతున్నట్టు, వారు కాదు. ఈ అహంకారము అనేది అభిప్రాయాలు, బాహ్య వేషభాషలు, ఆవేశాలు వంటి వాటితో వ్యక్తిగత అనుసంధానం అయి ఉంటుంది. ఈ అహంకారము అనేది దానికే ఒక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటుంది, దాని ప్రభావముచే, జనులు తలంపులు, భావోద్వేగాలు, మరియు జ్ఞాపకాలతో అనుసంధానమై ఉంటారు మరియు వాటిని తమలో భాగమే అనుకుంటారు. ఈ అహాంహారమే "ఇది నాది" (యజమానత్వము) అన్న భావన కలిగి ఉంటుంది, కానీ ఈ యజమానత్వము తాత్కాలికమైనదే.  దానిలోనే దాగి ఒక "ఇది చాలదు" అన్న గాఢమైన అసంతృప్తి ఉంటుంది. ఈ యొక్క తీరని కోరికే  వ్యాకులతని, కలవరపాటుని, విసుగుని, ఆందోళనని మరియు అసంతృప్తిని కలుగ చేస్తుంది. పర్యవసానంగా, యదార్ధము యొక్క మరింత వికృతమైన అనుభూతి కలుగుతుంది, అది నిజమైన ఆత్మ నుండి "నేను" ని మరింత దూరం చేస్తుంది.

ఈ అహంకారమే మన జీవితంలో అత్యంత పెద్ద అబద్దాన్నిసృష్టిస్తుంది, మనం కాని దాన్ని మనముగా చూపిస్తుంది. ఈ విధంగా, ధర్మ మార్గం లో పురోగతి కోసం, సమస్త మతధర్మాలూ మరియు సాధువులు,  మన అహంకార  పూరిత ఆలోచనా పరంపర ను విధ్వంసం చేయాలని, వేడుకుంటారు. The Tao Te Ching ఇలా పేర్కొన్నారు: "“Instead of trying to be the mountain, be the valley of the Universe.” (Chapter 6) Jesus of Nazaret కూడా ఇలా పేర్కొన్నాడు: “When you are invited, go and sit in the lowest place so that when the host comes, he may say to you, friend, move up higher. For everyone who exalts himself will be humbled, and everyone who humbles himself will be exalted.” (Luke 14:10-11). సంత్ కబీర్ దీనిని చాలా చక్కగా పేర్కొన్నాడు:

ఊంచే పానీ న ఠికే, నీచే హి ఠహరాయే
నీచా హోయ సో భరీ పీ, ఊంచా ప్యాసా జాయ

"నీరు పైనే ఉండదు; అది సహజంగానే పల్లమునకు పారుతుంది. అణకువగా నమ్రతగా ఉన్నవారు (భగవంతుని కృపను) తనివితీరా త్రాగుతారు, అదే సమయంలో గొప్పతో, దంభముతో ఉన్నవారు దాహంతోనే ఉండిపోతారు."