16వ అధ్యాయము: దైవాసుర సంపద్విభాగ యోగము

దైవాసుర సంపద్విభాగ యోగము

ఈ అధ్యాయములో, శ్రీ కృష్ణుడు, మనుష్యులలో ఉండే రెండు రకాల స్వభావాలను వివరిస్తున్నాడు - దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాలు. శాస్త్ర ఉపదేశాలను/నియమాలను పాటించటం, సత్త్వ గుణమును పెంపొందించుకోవటం, మరియు మనస్సుని ఆధ్యాత్మిక సాధనచే శుద్ధి చేసుకోవటం ద్వారా, దైవీ గుణాలు వృద్ధి చెందుతాయి. అది దైవీ సంపత్తి (దేవుని వంటి గుణములు) పెంచుకోవటానికి దోహదపడుతుంది, చిట్ట చివరగా అది భగవత్-ప్రాప్తిని కలిగిస్తుంది. దీనికి విరుద్ధంగా, ఆసురీ ప్రవృత్తి కూడా ఉంది, రజో గుణము, తమో గుణములతో అనుసంధానం వలన మరియు భౌతిక ప్రాపంచిక దృక్పథాన్ని అవలంబించటం వలన అది పెరుగుతుంది. అది మనిషి యొక్క వ్యక్తిత్వములో అపవిత్ర నడవడికను కలిగిస్తుంది, మరియు అంతిమంగా ఆత్మను నరకం వంటి స్థితిలోకి నెట్టివేస్తుంది.
ఈ అధ్యాయం, దివ్య స్వభావము కలిగి ఉన్న వారి యొక్క దైవీ గుణములను వివరించటంతో ప్రారంభమవుతుంది. ఆ తదుపరి, జాగురూకతతో విడిచిపెట్టవలసిన ఆసురీ (రాక్షస) గుణములను వివరిస్తుంది ఎందుకంటే, అవి మన ఆత్మను మరింత అజ్ఞానములోకి మరియు జనన-మరణ సంసారములోనికి నెట్టివేస్తాయి. శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తూ - మన ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయం పై శాస్త్రములు చెప్పినవే ప్రమాణములు - అని అంటున్నాడు. శాస్త్ర ఉపదేశాలను మనం అర్థం చేసుకోవాలి మరియు ఆ తరువాతే, ఆ చెప్పబడిన విధంగా ఈ ప్రపంచంలో ప్రవర్తించాలి.

శ్రీ భగవానుడు పలికెను : ఓ భరత వంశీయుడా, దైవీ సంపద కలవాని లక్షణములు ఇవిగో - నిర్భయత్వము, కల్మషం లేని మనస్సు, ఆధ్యాత్మిక జ్ఞానములో దృఢసంకల్పము, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములను చేయుట, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు మరియు నిష్కాపట్యం; అహింస, సత్య సంధత, క్రోధము లేకుండుట, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతకకుండా ఉండుట, సర్వ ప్రాణులపట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత, అణకువ, మరియు నిశ్చలత్వము; బలము, క్షమాగుణము, మనఃస్థైర్యము, పరిశుభ్రత, ఎవరిపట్లా శత్రుత్వం లేకుండుట, మరియు దురభిమానం లేకుండుట.

ఓ పార్థా, దంభము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనము, మరియు అజ్ఞానము అనేవి ఆసురీ స్వభావముకల వారి గుణములు.

దైవీ గుణములు మోక్షము దిశగా తీసుకువెళతాయి, కానీ, ఆసురీ గుణములు బంధనములో చిక్కుకుపోయి ఉండటానికి కారణమౌతాయి. శోకింపకుము అర్జునా, నీవు దైవీ గుణములతోనే జన్మించినవాడవు.

ఈ జగత్తులో రెండు రకాల జీవులు ఉంటారు - దైవీ గుణములు కలిగిఉన్నవారు మరియు ఆసురీ స్వభావము కలిగి ఉన్నవారు. నేను దైవీ గుణములను విస్తారముగా వివరించి ఉన్నాను, ఓ అర్జునా, ఆసురీ స్వభావమును గురించి చెప్తాను, వినుము.

ఆసురీ గుణములు కలవారు ఏది మంచి నడవడిక మరియు ఏది చెడు నడవడిక అని అర్థం చేసుకోరు. అందుకే వారు పవిత్రత కానీ, లేదా సత్ప్రవర్తన కానీ లేదా కనీసం సత్యసంధత కూడా కానీ కలిగి ఉండరు.

వారు ఇలా అంటారు, ‘ఈ జగత్తులో పరమ సత్యము అనేది ఏదీ లేదు, ఏ రకమైన (నైతిక నియమ) ఆధారము లేదు, మరియు భగవంతుడు (దీనిని సృష్టించింది లేదా నిర్వహించేది) అనేవాడు ఎవరూ లేడు. ఇదంతా స్త్రీ-పురుష సంయోగము వల్లనే ఉద్భవించినది మరియు లైంగిక తృప్తి కంటే వేరే ఏమీ ఇతర ప్రయోజనం లేదు.’ అని.

ఇటువంటి దృక్పథంలో గట్టిగా ఉండి, ఈ తప్పుదోవపట్టిన జీవాత్మలు, అల్ప బుద్ధితో మరియు క్రూర (ఉగ్ర) కార్యములతో, ప్రపంచానికి శత్రువులుగా మారి దానిని విధ్వంసం చేయభయపెడుతారు.

తృప్తిపరచలేని కామముతో ఉంటూ, దంభము, దురభిమానము, మరియు గర్వముతో నిండిపోయి, ఈ ఆసురీ లక్షణములు కలవారు తప్పుడు సిద్ధాంతములను పట్టుకునివుంటారు. ఈ విధంగా మోహితులై, వారు తాత్కాలికమైన వాటికి ఆకర్షితమై అపవిత్ర సంకల్పంతో ప్రవర్తిస్తారు.

వారు అంతులేని చింతలు/ఆందోళనలచే సతమతమై పోతుంటారు, అవి చివరికి మరణం తోనే ముగుస్తాయి. అయినా సరే, వాంఛల సంతుష్టి మరియు ఆస్తి కూడగట్టుకోవటమే జీవిత పరమావధి అని నిశ్చయముగా ఉంటారు.

వందల కొద్దీ కోరికలచే కట్టివేయబడి, మరియు కామ క్రోధములచే ఆవరించబడి, వారు అన్యాయ పద్ధతులలో సంపదను ప్రోగుచేయటానికి శ్రమిస్తారు, ఇదంతా వారి ఇంద్రియ సుఖాల కోసమే.

ఆసురీ లక్షణములు కలిగిన వారు ఇలా ఆలోచిస్తారు, ‘నేను ఈనాటికే చాలా ధనమును సంపాదించాను, నా ఈ కోరికను తీర్చుకుంటాను. ఇదంతా నాదే, రేపు నాకు ఇంకా వస్తుంది. ఆ శత్రువు నాచే నాశనం అయిపోయాడు, మరియు నేను మిగతావారిని కూడా నాశనం చేస్తాను! నేనే స్వయంగా దేవుడి వంటి వాడిని, నేనే ఇదంతా భోగించేది, నేను దోశరహితుడను, నేను శక్తిమంతుడను మరియు నేను ఆనందంగా ఉన్నాను. నేను ధనవంతుడను మరియు గొప్ప హోదాల్లో ఉన్న బంధువులు నాకు ఉన్నారు. నాకు ఇక సాటి ఎవరు? నేను (దేవతలకు) యజ్ఞములు చేస్తాను; దానములు ఇస్తాను; ఆనందిస్తాను.’ ఈ విధంగా, వారు అజ్ఞానముచే భ్రమపడుతుంటారు.

ఇటువంటి ఊహలు, తలంపులతో తప్పుదారి పట్టి, చిత్తభ్రాంతి వలలో చిక్కుకుపోయి, మరియు ఇంద్రియ సుఖాల తృప్తికి బానిసైపోయి, వారు అధోః నరకాలకు పతనమై పోతారు.

ఇటువంటి దురహంకారముతో మరియు మొండిపట్టుదల గల మనుషులు, తమ ధనము, సంపదచే గర్వము, అహంకారముతో నిండి, శాస్త్ర నియమముల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా నామమాత్రంగా ఆడంబరంగా యజ్ఞములు చేస్తారు.

అహంకారము, బలము, గర్వము, కామము, మరియు కోపముచే కళ్ళుమూసుకుపోయి, ఈ అసురీ ప్రవృత్తి కలవారు, తమ దేహములో మరియు ఇతరుల దేహములో కూడా ఉన్న నన్ను దుర్భాషలాడుతూ/ద్వేషిస్తూ ఉంటారు.

క్రూరులు మరియు ద్వేషపూరిత స్వభావము కలవారు, అధములు, నీచ నరులను, నేను, భౌతిక జగత్తు యొక్క పునర్జన్మ చక్రములో, పదే పదే అటువంటి ఆసురీ స్వభావము కలవారి గర్భములోనే విసిరివేస్తుంటాను. ఈ మూర్ఖపు ఆత్మలు మళ్ళీ మళ్ళీ ఆసురీ గర్భములలోనే జన్మిస్తుంటాయి. నన్ను చేరుకోలేక, ఓ అర్జునా, అత్యంత నీచ స్థాయి జీవనంలోనికి క్రమేపీ పడిపోతాయి.

ఆత్మ వినాశనానికి దారి తీసే నరక ద్వారములు మూడు ఉన్నాయి - కామము, క్రోధము, మరియు లోభము. కాబట్టి, అందరూ వీటిని విడిచిపెట్టాలి.

చీకటి దిశగా ఉన్న ఈ మూడు ద్వారముల నుండి ముక్తి పొందిన వారు, ఆత్మ శ్రేయస్సుకై పరిశ్రమిస్తారు, తద్వారా వారు పరమ లక్ష్యమును పొందుతారు.

ఎవరైతే శాస్త్రములో చెప్పబడిన ఆదేశములను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్ధిని కానీ, సుఖాన్ని కానీ, చివరకి జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.

కాబట్టి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయంలో శాస్త్రములనే ప్రమాణముగా తీసుకొనుము. శాస్త్ర విధివిధానాలు, ఉపదేశాలను తెలుసుకొనుము మరియు ఆవిధంగానే ఈ జగత్తులో ప్రవర్తించుము.