15వ అధ్యాయము: పురుషోత్తమ యోగము

పురుషోత్తమ యోగము

ఇంతకు క్రితం అధ్యాయములో, ప్రకృతి త్రిగుణములకు అతీతులమవటం ద్వారా భగవత్ లక్ష్యమును చేరుకోవచ్చు అని శ్రీ కృష్ణుడు వివరించి ఉన్నాడు. అనన్య భక్తిలో నిమగ్నమవటమే త్రి-గుణములకు అతీతులమై పోవటానికి ఉన్న అద్భుతమైన పద్ధతి అని కూడా చెప్పి ఉన్నాడు. ఇటువంటి భక్తిలో నిమగ్నమవటానికి, మనము మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరం చేసి దానిని భగవంతుని యందే నిమగ్నం చేయాలి. అందుకే, ఈ ప్రపంచం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా ఆవశ్యకం.
ఈ అధ్యాయంలో, అర్జునుడికి భౌతిక జగత్తు పట్ల వైరాగ్యం పెంపొందించటానికి సహాయం చేయటానికి, శ్రీ కృష్ణుడు, ఈ యొక్క భౌతిక జగత్తుని తద్రూప ఉపమానముతో వివరిస్తున్నాడు. భౌతిక జగత్తుని ఒక తల క్రిందులుగా ఉండే అశ్వత్థ వృక్షం (రావిచెట్టు) తో పోల్చుతున్నాడు. బద్ధ జీవాత్మ - ఆ వృక్షం ఎక్కడి నుండి వచ్చినదో, ఎప్పటినుండి ఇది ఉందో, అది ఎట్లా పెరుగుతూనే ఉంటుందో తెలుసుకోకుండానే - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు ఆ చెట్టు కొమ్మలలో పైకీ క్రిందికీ తిరుగుతూనే ఉంటుంది. ఆ చెట్టు యొక్క వేర్లు పైకి ఉంటాయి, ఎందుకంటే దాని యొక్క మూలం భగవంతునిలో ఉంది కాబట్టి. వేదములలో చెప్పబడిన కామ్య కర్మలు ఆ చెట్టుకి ఆకులలాంటివి. ఆ చెట్టుకి పోషణ, ప్రకృతి యొక్క త్రి-గుణములు. ఈ గుణములు ఇంద్రియ విషయములను సృష్టిస్తాయి, అవి ఈ చెట్టుకు అంకురముల (మొగ్గ) వంటివి. ఈ అంకురములు, ఊడలను (aerial roots) ని జనింపచేస్తాయి. అవి వృక్షమును మరింత విస్తరింపచేస్తాయి. ఈ అధ్యాయము, ఈ ఉపమానం ఆధారంగా - భౌతిక ప్రపంచంలో క్లేశములకు గురయ్యే జీవాత్మ, భౌతిక అస్తిత్వములో ఉండే జగత్తు యొక్క నిజ స్వరూపము యొక్క అజ్ఞానము వలన, మరింత దానిలో ఎలా చిక్కుకుని పోతుందో - విస్తారముగా వివరిస్తుంది. వైరాగ్యము అనే గొడ్డలి సహాయంతో ఈ వృక్షాన్ని కొట్టివేయాలి అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. ఆ తరువాత మనం ఆ చెట్టు యొక్క మూలం కోసం వెతకాలి; అది స్వయంగా భగవంతుడే. ఆ మూలాన్ని తెలుసుకున్న పిదప ఆయనకి ఈ అధ్యాయములో చెప్పబడిన విధముగా శరణాగతి చేయాలి; అప్పుడు మనము ఆ భగవంతుని యొక్క దివ్య ధామముని చేరుకుంటాము, ఆ తదుపరి మళ్ళీ ఇక ఈ భౌతిక జగత్తులోకి రాము.
    శ్రీ కృష్ణుడు ఇక తదుపరి, తనయొక్క నిత్య సనాతనమైన అంశములైన, ఈ జగత్తులో ఉన్న జీవాత్మలు, దివ్యమైనవని వివరిస్తున్నాడు. కానీ, భౌతిక ప్రకృతి చే బద్ధులైపోయి, మనస్సుతో కలిపి ఆరు ఇంద్రియములచే అవి కష్టాలను అనుభవిస్తున్నాయి. జీవాత్మ దివ్యమైనది అయినా, అది ఎలా ఇంద్రియముల యొక్క భౌతిక విషయములను భోగిస్తూ ఉంటుందో వివరిస్తున్నాడు. ఆత్మ మరణ సమయంలో ఇంకొక శరీరములోనికి, తన ప్రస్తుత జన్మ యొక్క మనస్సు మరియు ఇంద్రియములతో సహా, ఎలా ప్రవేశిస్తుందో వివరిస్తాడు. అజ్ఞానులు తమ దేహములోని ఆత్మను గుర్తించరు; మరియు అది మరణ సమయంలో వెళ్లిపోవటాన్ని కూడా గుర్తించరు. కానీ యోగులు తమ యొక్క జ్ఞాన-చక్షువులచే మరియు పవిత్రమైన మనస్సుచే దానిని గ్రహిస్తారు. అదే విధంగా భగవంతుడు కూడా తన సృష్టిలో అంతటా ఉంటాడు; కానీ ఆయనను జ్ఞాన చక్షువులచే తెలుసుకోవాలి. అంతటా వ్యక్తమయ్యే ఆయన యొక్క విభూతుల ద్వారా జగత్తులో భగవంతుని యొక్క అస్తిత్వమును మనము ఎలా తెలుసుకోవచ్చో శ్రీ కృష్ణుడు తెలియచేస్తాడు. క్షరము, అక్షరము మరియు పురుషోత్తమ అనే పదముల వివరణతో ఈ అధ్యాయం ముగుస్తుంది. 'క్షరము' అంటే భౌతిక జగత్తులోని నశించిపోయే జీవరాశులు. 'అక్షరము' అంటే భగవంతుని దివ్య ధామములో ఉన్న విముక్తి పొందిన జీవులు. 'పురుషోత్తమ' అంటే సర్వోత్కృష్ట భగవానుడు, ఆయనే మార్పులేని నియామకుడు మరియు పోషకుడు. ఆయన క్షర మరియు అక్షర జీవులకు అతీతుడు. ఆయన మనసారా ఆరాధించబడాలి.

శ్రీ భగవానుడు పలికెను : వేర్లు పైకి మరియు కొమ్మలు క్రిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేద మంత్రములు, మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు.

త్రి-గుణములచే పోషించబడి, ఈ చెట్టు యొక్క శాఖలు, పైకి మరియు క్రిందికి విస్తరించి ఉంటాయి, ఇంద్రియ విషయములు వాటికి చిగుర్ల వలె ఉంటాయి. మానవ రూపంలో కర్మ ప్రవహించటానికి, చెట్టు యొక్క వేర్లు క్రిందికి వ్రేలాడుతూ ఉంటాయి. క్రిందిన, దాని యొక్క వేర్లు శాఖలుగా విస్తరించి, మనుష్య లోకములో కర్మలను కలుగచేస్తాయి.

ఈ వృక్షము యొక్క నిజ స్వరూపము ఈ జగత్తులో గ్రహింపబడదు, దాని యొక్క మొదలు, చివర, లేదా సనాతన అస్తిత్వము కూడా అర్థం కావు. కానీ, ఈ యొక్క లోతైన వేర్లు కల అశ్వత్థ వృక్షమును అనాసక్తి/వైరాగ్యమనే బలమైన గొడ్డలిచే ఖండించివేయాలి. ఆ తరువాత ఆ వృక్షము యొక్క మొదలు వెతకాలి, అదియే ఆ భగవంతుడు, ఆయన నుండే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి సనాతన కాలం క్రితం సంభవించినది. ఆయనను ఆశ్రయించిన తరువాత మళ్ళీ మనం ఈ జగత్తు లోనికి రాము.

దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.

సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ ఇవేవీ నా పరం ధామమును ప్రకాశింపచేయలేవు. అక్కడికి వెళ్లిన పిదప, జనులు మరల ఈ భౌతిక లోకానికి తిరిగిరారు.

భౌతిక జగత్తులో ఉన్న జీవాత్మలు నా యొక్క సనాతనమైన అంశములు. కానీ, భౌతిక శక్తిచే కట్టివేయబడి, వారు మనస్సుతో కలిపి ఉన్న ఆరు ఇంద్రియములతో ప్రయాస పడుతున్నారు.

ఎలాగైతే గాలి, సుగంధమును ఒకచోటి నుండి ఇంకొక చోటికి తీస్కువెళుతుందో, జీవాత్మ కూడా, పాత శరీరమును విడిచి, కొత్త శరీరంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు, మనస్సు మరియు ఇంద్రియములను తనతో పాటుగా తీసుకెళుతుంది.

మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు - చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు - వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.

అది ఇంద్రియ వస్తువిషములను ఆనందిస్తూ దేహములోనే ఉన్నప్పుడు కానీ లేదా అది దేహమును విడిచివెళ్లినప్పుడు కానీ, జీవాత్మను అజ్ఞానులు గమనించరు. కానీ జ్ఞాన నేత్రములు కలవారు దానిని దర్శించగలరు.

గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.

సమస్త సౌర మండలమును ప్రకాశింపచేసే సూర్యుని తేజస్సుని నేనే అని తెలుసుకొనుము. చంద్రుని యొక్క ప్రకాశము మరియు అగ్ని యొక్క కాంతి నానుండే ఉద్భవిస్తున్నాయని తెలుసుకొనుము.

పృథ్వి యందు అంతటా ప్రవేశించి వ్యాపించి ఉండి, నేను సమస్త ప్రాణులను నా శక్తి చే పోషిస్తుంటాను. చంద్రుడిగా ఉండి, సమస్త వృక్షజాతికి పుష్టిని చేకూరుస్తుంటాను.

నాలుగు రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు ఒంటబట్టించుకొనటానికి, సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపానసంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను.

నేను సమస్త ప్రాణుల హృదయములలో స్థితమై ఉన్నాను, నా నుండే జ్ఞాపకశక్తి, జ్ఞానము, మరియు విస్మృతి (మర్చిపోవుట) కలుగుతాయి. అన్ని వేదముల ద్వారా తెలుసుకోబడవలసిన వాడను నేను మాత్రమే, వేదాంత రచయితను నేనే, మరియు వేదముల అర్థమును తెలిసినవాడను నేనే.

సృష్టిలో రెండు రకాల ప్రాణులు ఉన్నాయి, క్షరములు (నశించేవి) మరియు అక్షరములు (నశించనివి). భౌతిక జగత్తులో ఉన్నవి క్షరములు. అక్షరములు అంటే మోక్షము పొందిన జీవులు.

ఇవే కాక, నాశరహితమైన పరమాత్మయైన ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుడు ఉన్నాడు. ఆయన అవ్యయమైన ఈశ్వరునిగా ముల్లోకములలో ప్రవేశించి, సమస్త ప్రాణులను పోషిస్తూ ఉంటాడు.

నేను నశ్వరమైన ఈ భౌతిక పదార్థముకంటెనూ, మరియు నాశరహితమైన జీవాత్మ కంటెనూ కూడా అతీతమైనవాడను. కాబట్టి వేదములలో మరియు స్మృతులలో నేనే సర్వోత్కృష్ట దివ్య పురుషుడిగా కీర్తింపబడ్డాను.

ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో, వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జునా, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు.

ఓ పాపరహితుడా, అర్జునా, అత్యంత రహస్యమైన వేద శాస్త్ర మూలతత్త్వమును నేను నీకు తెలియచేసాను. దీనిని అర్థం చేసుకున్న వ్యక్తి జ్ఞాని అవుతాడు, మరియు సాధించవలసినది అంతా నెరవేర్చినవాడు అవుతాడు.