Bhagavad Gita: Chapter 15, Verse 11

యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితమ్ ।
యతంతోఽప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః ।। 11 ।।

యతంతః — గట్టిగా ప్రయత్నించే; యోగినః — యోగులు; చ — కూడా; ఏనం — దీనిని (ఆత్మ); పశ్యంతి — చూచెదరు; ఆత్మని — శరీరములో; అవస్థితం — స్థితమై ఉన్న; యతంతః — పరిశ్రమిస్తూ; అపి — కూడా; అకృత-ఆత్మనః — అంతఃకరణ శుద్ధి లేని వారు; న ఏనం పశ్యతి — దీనిని గమనించలేరు; అచేతసః — అజ్ఞానులు.

Translation

BG 15.11: గట్టిగా పరిశ్రమించే యోగులు కూడా దేహములోనే స్థితమై ఉన్న ఆత్మను తెలుసుకోగలుగుతారు. కానీ, ఎంత ప్రయత్నించినా, అంతఃకరణ శుద్ధి లేని వారు మాత్రం దానిని తెలుసుకొనలేరు.

Commentary

జ్ఞానము కోసం ప్రయత్నించటం మాత్రమే సరిపోదు; మన పరిశ్రమ సరియైన దిశలో కూడా ఉండాలి. మనుష్యులు తరచుగా ఈ తప్పు చేస్తుంటారు - ఈ ప్రపంచ విషయాలని తెలుసుకున్న పద్ధతి ద్వారానే, దివ్యమైన అస్తిత్వములను తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారు తమ భౌతిక ఇంద్రియ గ్రహణశక్తి మరియు తమ బుద్ధి యొక్క శక్తి ఆధారముగా, జ్ఞానములలో ఏది సరియైనదో ఏది తప్పైనదో నిర్ణయిస్తారు. ఏదేని పదార్థమును, తమ ఇంద్రియములు చూడలేకపోతే మరియు తమ బుద్ధి అర్థం చేసుకోలేకపోతే, అప్పుడు ఆ పదార్థము లేదు అని ఊహించుకుంటారు. 'ఆత్మ' అనేది ఇంద్రియములచే గ్రహింపబడలేదు కాబట్టి, వారు అటువంటి పదార్థమేదీ లేదని నిశ్చయిస్తారు. ఈ విషయాన్ని వివరిస్తూ, అలెక్సిస్ కారేల్ (Alexis Carrel) తన పుస్తకం ‘మాన్ ది అన్‌నోన్’ (Man the Unknown) లో ఇలా పేర్కొన్నాడు:

‘మన మనస్సు సహజంగానే మన కాలంలో ఉన్న తత్త్వ సిద్ధాంతాలకు లేదా శాస్త్రీయ సిద్ధాంతాలకు అతీతంగా ఉన్నవాటిని తిరస్కరించటానికే మొగ్గు చూపిస్తుంది. అంతిమంగా, శాస్త్రవేత్తలు కూడా మనుష్యులే. వారి పరిసరస్థితులు మరియు కాలంలో ఉన్న పూర్వభావనలతో నిండిపోయి ఉంటారు. ప్రస్తుతమున్న సిద్ధాంతములు వివరించలేని నిజాలు అసలు లేనేలేవు అని వారు మనస్ఫూర్తిగా నమ్ముతుంటారు. ప్రస్తుతం, శాస్త్రజ్ఞులు టెలీపథీ మరియు ఇతర పారలౌకిక ఘటనలను, ఊహాజనితములుగా అనుకుంటారు. ఆచార విరుద్ధంగా ఉన్న ప్రత్యక్షంగా కనిపించే నిజాలు అణచివేయబడుతాయి. (Our mind has a natural tendency to reject the things that do not fit into the frame of scientific or philosophical beliefs of our time. After all, scientists are only human. They are saturated with the prejudices of their environment and epoch. They willingly believe that facts which cannot be explained by current theories do not exist. At present times, scientists still look upon telepathy and other metaphysical phenomena as illusions. Evident facts having an unorthodox appearance are suppressed)

న్యాయ దర్శనం ఇటువంటి ఆలోచనను కూప-మండూక-న్యాయము (నూతిలో కప్ప యొక్క తర్కము) అని పేర్కొంటుంది.

ఒక నూతిలో ఒక కప్ప ఉండేది; దానికి తన నివాసం యొక్క పరిసర కొలతలు బాగా తెలుసు. ఒక రోజు, ఒక రానా కాంక్రివోరా (Rana Cancrivora) అంటే సముద్రములో నివసించే కప్పల జాతి చెందిన ఒక కప్ప, ఆ బావిలోకి దుమికింది. అవి రెండూ మాట్లాడుకోవటం మొదలు పెట్టాయి. బావి-కప్ప, ఆ సముద్ర-కప్పను ఇలా అడిగింది, ‘నీవు వచ్చిన సముద్రం ఎంత పెద్దది?’ అని.

ఆ సముద్ర-కప్ప ఇలా బదులిచ్చింది, ‘అది చాలా పెద్దది.’

‘అది ఈ బావి కన్నా ఐదు రెట్లు పెద్దదా?’

‘లేదు, ఇంకా చాలా పెద్దది.’

‘ఈ బావి కన్నా పది రెట్లు పెద్దదా?’

‘కాదు, ఇంకా పెద్దది’

‘వంద రెట్లు పెద్దదా?’

‘లేదు, లేదు అంత చిన్నది కాదు, అది చాలా చాలా పెద్దది.’

‘నువ్వు అబద్దం చెప్తున్నావు’ అన్నది ఆ బావి-కప్ప, ‘నా బావి కన్నా వంద రెట్లు పరిమాణం పెద్దది ఉండటం ఎట్లా సాధ్యం?’ అని అన్నది.

జీవితాంతం ఆ బావి లోనే ఉండటంతో దాని బుద్ధి ఒక పరిమితితో అయిపోయింది, కాబట్టి అది ఆ మహా సముద్రమును అర్థం చేసుకోలేక పోయింది. అదే విధంగా, తమ అల్ప-బుద్ధిచే పరిమితమైపోయి, భౌతిక దృక్పథంలో ఉన్న జనులు, భౌతికము కానటువంటి ఆత్మ ఉన్నది అన్న విషయాన్ని ఒప్పుకోరు. కానీ, ఆధ్యాత్మిక పథంలో ప్రయాణించేవారు, తమ భౌతిక బుద్ధి పరిమితి కంటే పరమైన (అతీతమైన) జ్ఞానము ఉంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. వినయంతో మరియు విశ్వాసంతో ఆధ్యాత్మిక పథాన్ని అనుగమించటం ప్రారంభిస్తారు మరియు తమ అంతఃకరణ (హృదయమును) పవిత్రం చేసుకోవటాన్ని లక్ష్యంగా చేసుకుంటారు. ఎప్పుడైతే మనస్సు శుద్ధి అవుతుందో అప్పుడు వారికి ఆత్మ యొక్క ఉనికి సహజంగానే తెలిసిపోతుంది. ఆ తదుపరి, శాస్త్రముల యొక్క యదార్థమును, జ్ఞానోదయము ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు.

ఎలాగైతే ఇంద్రియములు, ప్రారంభంలో, ఆత్మను తెలుసుకోలేవో, భగవంతుడు కూడా, ఇంద్రియ పరిధిలో లేడు, కాబట్టి జ్ఞాన నేత్రములచే చూడబడాలి. తదుపరి శ్లోకములలో , శ్రీ కృష్ణుడు భగవంతుని అస్తిత్వమును తెలుసుకునే పద్ధతిని వివరిస్తున్నాడు.