Bhagavad Gita: Chapter 15, Verse 5

నిర్మానమోహా జితసంగదోషా
అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ।
ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖసంజ్ఞైః
గచ్ఛంత్యమూఢాః పదమవ్యయం తత్ ।। 5 ।।

నిః — లేకుండా; మాన — అహంకారం/గర్వము; మోహాః — మోహము; జిత — జయించి; సంగ — సంగము (మమకారాసక్తి); దోషాః — దోషములు; అధ్యాత్మ-నిత్యాః — నిరంతరం ఆత్మ, భగవంతుని యందే స్థితమై ఉండి; వినివృత్త కామాః — ఇంద్రియ భోగ కోరికల నుండి పూర్తిగా స్వేచ్ఛ పొందినవారు; ద్వంద్వైః విముక్తాః — ద్వంద్వముల నుండి విముక్తులైనవారు; సుఖ-దుఃఖ సంజ్ఞైః — సుఖదుఃఖములు అనబడే; గచ్ఛంతి — పొందెదరు; అమూఢాః — వివేకవంతులు; పదం — ధామము; అవ్యయం — నిత్య సనాతనమైన; తత్ — అది.

Translation

BG 15.5: దురభిమానము మరియు మోహము లేకుండా ఉన్నవారు, మమకారాసక్తియనే అరిష్టాన్ని జయించినవారు, సతతమూ ఆత్మ, భగవంతుని చింతనలోనే ఉన్నవారు, ఇంద్రియ భోగములను అనుభవించాలని కోరికలు లేని వారు, సుఖదుఃఖములనెడి ద్వంద్వములకు అతీతులై ఉన్నవారు, ఇటువంటి ముక్తజీవులు నా పరమపదమును చేరుకుంటారు.

Commentary

శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఇక ఆ వృక్షము యొక్క మూలాధారమైన, భగవంతునకు ఎలా శరణాగతి చేయాలో వివరిస్తున్నాడు. ప్రప్రథమంగా అజ్ఞానము వల్ల జనించిన అహంకారమును మరియు గర్వమును విడిచిపెట్టాలి అని అంటున్నాడు. భ్రాంతికి లోనైన జీవాత్మ ప్రస్తుతం ఇలా అనుకుంటుంది, ‘నాకున్న దానికంతా నేనే యజమానిని, ఇంకా భవిష్యత్తులో, మరింత సంపాదించుకుంటాను. ఇదంతా నా భోగవిలాసానికి మరియు సంతోషానికే ఉన్నది.’ అని. మనము అజ్ఞానము వలన జనించిన ఈ అహంకారముచే మోహితులమై ఉన్నంత వరకు, మనమే ప్రకృతిని అనుభవించేది అని అనుకుంటాము. ఇటువంటి పరిస్థితిలో, మనము ఆ భగవంతుడిని పక్కకుపెడతాము మరియు ఆయన సంకల్పానికి శరణాగతి చేయటానికి వాంఛించము.

మనమే వీటన్నిటినీ అనుభవించేది అన్న దృక్పథం జ్ఞాన సహకారంతో నిర్మూలించబడాలి. ఈ భౌతిక శక్తి భగవంతునికి చెందినది కాబట్టి ఆయన సేవ కోసమే ఉన్నది అని గ్రహించాలి. ఆత్మ కూడా భగవంతుని యొక్క సేవకుడే, కాబట్టి ప్రస్తుతమున్న భోగించే దృక్పథాన్ని సేవా దృక్పథముగా మార్చాలి. దీని కోసం, మనము మనస్సుని భగవంతుని నుండి దూరంగా, ప్రాపంచికత్వం వైపు మరల్చే భౌతిక బంధాలను నిర్మూలించుకోవాలి. బదులుగా, ఆత్మ అనేది భగవంతుని యొక్క సనాతన నిత్య దాసుడే అని అర్థం చేసుకుని, మనస్సుని నిస్వార్థ సేవా దృక్పథంలో భగవంతుని యందే అనుసంధానం చేయాలి. పద్మ పురాణం ఇలా పేర్కొంటున్నది:

దాస భూతమిదం తస్య జగత్ స్థావర జంగమం
శ్రీమన్నారాయణ స్వామీ జగతాంప్రభురీశ్వరః

‘సర్వోన్నత ప్రభువు నారాయణుడు సమస్త జగత్తుకు ప్రభువు, ఆయనే నియంత్రకుడు. అన్ని స్థావర-జంగమములు (కదిలేవి మరియు కదలని ప్రాణులు) మరియు సృష్టిలో సమస్త పదార్థములు ఆయన సేవకులే’. అందుకే భగవంతుని సేవచెయ్యాలని ఎంత ఎక్కువగా కోరిక పెంచుకుంటే, అంత మాత్రము ఈ ప్రకృతిని అనుభవించేది నేనే అన్న భ్రాంతి నిర్మూలించబడుతుంది మరియు హృదయము పరిశుద్ధమవుతుంది. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్, అంతఃకరణ శుద్ధి కోసము దీనినే అన్నింటికన్నా ప్రధానమైనదిగా పేర్కొన్నాడు.

సౌ బాతన కీ బాత ఇక, ధరు మురళీధర ధ్యాన,
బఢవహు సేవా-వాసనా, యహ సౌ జ్ఞానన జ్ఞాన (భక్తి శతకము 74వ శ్లోకము)

‘అంతఃకరణ శుద్ధి కోసం ఉన్న వందల సలహాలలో, అత్యంత ముఖ్యమైనది ఇదే. మీ మనస్సుని ఆ దివ్య మంగళ మురళీధరుడైన శ్రీ కృష్ణ పరమాత్మ యందే నిమగ్నం చేయండి; మరియు ఆయనకు సేవ చేయాలనే వాంఛను పెంచుకోండి. ఈ ఉపదేశము ఇటువంటి వంద దివ్య జ్ఞాన రత్నాల కంటే ఎక్కువ ముఖ్యమైనది.’

ఒకసారి మనము అంతఃకరణ శుద్ధి యందు విజయం సాధించి, భగవంతుని పట్ల ప్రేమ యుక్త భక్తిలో నిమగ్నమైతే, అప్పుడు ఏమవుతుంది? ఇటువంటి పరిశుద్ధ జీవులు శాశ్వతముగా ఆ పరమ పదమును చేరుకుంటారు అని శ్రీ కృష్ణుడు ఈ పై శ్లోకములో వివరిస్తున్నాడు. భగవత్ దృక్పథములోనే జీవించే స్థితికి వచ్చేసినప్పుడు ఈ భౌతిక జగత్తు యొక్క అవసరం ఇక ఉండదు. ఆ జీవాత్మ ఇక భగవంతుని యొక్క దివ్య ధామములో, ఇతర భగవత్ ప్రాప్తి నొందిన జీవులతో, నివసించటానికి అర్హత పొందినట్టే. ఎలాగైతే ఒక నగర వైశాల్యంలో, ఒక జైలు చిన్న భాగమే అయినట్టు, ఆ భౌతిక జగత్తు కూడా అలాంటిదే. అది భగవంతుని యొక్క సమస్త సృష్టిలో ఒక నాలుగవవంతు (1/4th) మాత్రమే, ఆధ్యాత్మిక జగత్తు మూడు వంతులు. (3/4th). వేదములు ఇలా పేర్కొంటున్నాయి:

పాదో ఽస్య విశ్వా భూతాని, త్రిపాదస్య అమృతం దివి (పురుష సూక్తం, 3వ మంత్రం)

‘భౌతిక శక్తిచే తయారుచేయబడిన ఈ తాత్కాలికమైన జగత్తు, సృష్టిలో ఒక వంతు మాత్రమే. మిగతా మూడు వంతులు, జనన మరణములకు అతీతముగా ఉండే భగవంతుని యొక్క నిత్యసనాతన ధామము.’ శ్రీ కృష్ణుడు తదుపరి శ్లోకంలో ఆ నిత్యసనాతన ధామ లక్షణాన్ని వివరిస్తున్నాడు.