Bhagavad Gita: Chapter 15, Verse 9

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ ।
అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ।। 9 ।।

శ్రోత్రం — చెవులు; చక్షుః — కన్నులు; స్పర్శనం — స్పర్శ; చ — మరియు; రసనం — నాలుక; ఘ్రాణమ్ — ముక్కు; ఏవ — కూడా; చ — మరియు; అధిష్ఠాయ — చుట్టూ ఉండి; మనః — మనస్సు; చ — మరియు; అయం — అవి; విషయాన్ — ఇంద్రియ విషయములు; ఉపసేవతే — ఆస్వాదించును.

Translation

BG 15.9: మనస్సును ఆశ్రయించి ఉన్న ఇంద్రియములు - చెవులు, కన్నులు, చర్మము, నాలుక మరియు ముక్కు - వీటి యొక్క గ్రహణశక్తితో, జీవాత్మ ఇంద్రియ వస్తువిషయములను ఆస్వాదిస్తుంటుంది.

Commentary

ఆత్మ దివ్యమైనది కావున, అది సూటిగా రుచి చూడటం, స్పర్శించటం, అనుభవించటం, వాసనచూడటం లేదా వినటం చేయలేదు, మరి అది ఎలా ఈ అనుభూతులను ఆస్వాదించవచ్చు? దీనికి సమాధానం ఏమిటంటే, దానికి ఇంద్రియములు, మనస్సు సహాయం చేస్తాయి. ఇంద్రియములు, మనస్సు నిజానికి జడమైనవి, కానీ అవి ఆత్మ శక్తిచే చైతన్యవంతం అయ్యి మరియు ప్రాణం ఉన్నట్టుగా అవుతాయి. కాబట్టి, అవి వస్తువులు, పరిస్థితులు, ఆలోచనలు మరియు వ్యక్తుల ద్వారా సుఖదుఃఖాలను అనుభవిస్తాయి. అహంకారముచే ఆత్మ తన మనసేంద్రియములతో అనుసంధానమై పరోక్షంగా ఆ యొక్క సుఖాలను అనుభవిస్తుంటుంది.

ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆత్మ స్వయంగా దివ్యమైనది అయినా, అది ఈ విధంగా అనుభవించే ఆనందము, ప్రాకృతికమైనది. ఈ విధంగా ఇంద్రియములు-మనస్సు ఎంత ఆనందాన్ని తెచ్చి ఇచ్చినా ఆత్మకు అసంతృప్తి గానే ఉంటుంది. ఇంకా తన లక్ష్యమును చేరుకోలేదు అన్న భావన ఉండిపోతుంది, మరియు తనను యదార్థముగా తృప్తి నొందించే ఆ సంపూర్ణ ఆనందము కోసము అన్వేషిస్తూనే ఉంటుంది. అమెరికన్ తత్త్వవేత్త రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు: ‘మానవ జీవితం క్లేశములతో కూడుకున్నది అని అనుకుంటాము. అది దుఃఖకరమైనది అని ఎట్లా తెలుసుకున్నాము? ఈ అసౌకర్యానికి, సనాతన అసంతృప్తికి ఆధారం ఏమిటి ? సర్వత్రా ఉండే ఈ అజ్ఞానము మరియు తాపత్రయం ఏమిటి? ఆత్మ చేసే ఈ దావా కి మూలమేమిటి? (We grant that human life is mean. But how did we find out that it is mean? What is the ground of this uneasiness, of this old discontent? What is this universal sense of want and ignorance, but the fine innuendo by which the soul makes its enormous claim?)

ఇంకొక ప్రఖ్యాత తత్త్వవేత్త మయిస్టర్ ఎఖార్ట్ (Meister Eckhart) ఇలా వ్రాసాడు: ‘జీవాత్మలో ఏదో ఉంది, అది ఆ ప్రాణి కంటే ఉన్నతమైనది, దివ్యమైనది మరియు సరళమైనది. ఆ ప్రకాశత్వం, ఒక మహోన్నత అస్తిత్వం తోటే తృప్తి చెందుతుంది” (There is something in the soul which is above the living being, divine and simple. This light is only satisfied with the supra essential essence)

ఆత్మ ఆశించే ఆ యొక్క, అనంతమైన, నిత్యమైన మరియు దివ్య ఆనందము, భగవంతుని నుండే లభిస్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత, బంధనమునకు కారణమయిన అవే ఇంద్రియ-మనస్సులను, భగవంతుని దిశగా మరల్చి, భక్తి యందు ఉపకరణములుగా వాడుకోవచ్చు. ఈ విషయంలో, హిందీ రామాయణము రచించిన సంత్ తులసీదాసు ఒక మంచి ఉదాహరణ.

తన యుక్త వయస్సులో, అతనికి భార్య పట్ల అమితమైన మమకారానురాగాలు ఉండేవి. ఒకసారి ఆమె తన తల్లిదండ్రుల దగ్గర ఉండటానికి కొద్ది రోజులు వారింటికి వెళ్ళింది, అప్పుడు ఒకనాడు తులసీదాసుకు ఆమెను చూడాలనిపించింది. ఆయన తన మామగారి ఇంటికి నడవటం ప్రారంభించాడు, కానీ దారిలో ఒక వాగు ఉంది, అప్పుడు పెద్ద వర్షం పడుతుండటంతో పడవవాళ్ళు ఎవరూ ఆ వాగుని దాటించటానికి ఒప్పుకోలేదు. అదే సమయంలో నీటిలో తేలుతూ ఒక శవం అక్కడకు కొట్టుకు వచ్చింది. తన భార్యను కలవాలని తీవ్ర వాంఛతో ఉన్న తులసీదాసు దానిని ఒక దూలము అనుకున్నాడు. దానిని ఒడిసిపట్టుకుని ఆ వాగుని దాటాడు.

వాళ్ళ ఇంటిలో రెండవ అంతస్థులో ఉన్న భార్యను కలవాలనే కోరిక ఆయనను పూర్తిగా ఆవరించి ఉంది. ఒక పాము ఆ ఇంటి గోడకు వ్రేలాడుతూ ఉంది, తులసీదాసు దానిని జాగ్రత్తగా చూడలేదు, దానిని ఒక తాడు అనుకున్నాడు. కాబట్టి, ఇంటి ప్రధాన ద్వారం వద్ద తలుపు కొట్టి సమయం వృధా చేయకూడదనుకుని, ఆ పాముని పట్టుకుని పైకి ఎగబాకాడు. ఆయన కిటికీ గుండా లోనికి ప్రవేశించినప్పుడు, ఆయన భార్య ఆశ్చర్య పోయింది. ఆయన ఎలా ఆ నదిని దాటాడో, ఎలా ఆ గోడ ఎక్కాడో అని ఆమె అడిగింది. అప్పుడాయన తాను పొరపాటుగా అనుకున్న దూలమును, త్రాడుని చూపించాడు. ఆమె శవాన్ని మరియు పామును చూసి అదిరిపోయింది. అప్పుడామె ఆశ్చర్యముతో అన్నది, ‘మీకు ఈ రక్తమాంసాలతో ఉన్న శరీరము అంటే అంత కోరిక ఉన్నది. ఇంత గాఢముగా మీరు ఆ భగవంతుడినే కోరుకుని ఉంటే, మీరు మరల ఈ జగత్తులో పుట్టవలసిన అవసరమే ఉండదు!’ అని.

తన భార్య యొక్క మాటలు ఆయనను ఎంత బలంగా తాకాయి అంటే, ఆయన తన తప్పుని తెలుసుకుని, విరక్తుడై పోయాడు. గృహస్తు జీవితాన్ని విడిచి పెట్టి, భక్తిలో నిమగ్నమవటానికి వెళ్ళిపోయాడు. తనను ఇంతకు క్రితం ఇబ్బంది పెట్టిన అవే మనస్సు-ఇంద్రియముల కోరికలను భగవత్ దిశగా మరల్చి వేసాడు. ఈ విధంగా, భక్తి మార్గ ప్రక్రియ ద్వారా తనను తాను పవిత్రం చేసుకుని గొప్ప ప్రఖ్యాత రచయిత సంత్ తులసీదాసు అయ్యాడు. తరువాతి కాలంలో ఆయన ఇలా వ్రాసాడు:

కామిహి నారి పిఆరి జిమి లోభిహి ప్రియ జిమి దామ,
తిమి రఘునాథ నిరంతర ప్రియ లాగహు మోహి రామ (రామచరితమానస్)

‘ఒక కాముకుడు, అందమైన స్త్రీని వాంఛించినట్టుగా; మరియు ఒక లోభి, ధనమును కాంక్షించినట్టుగా; నా ఇంద్రియ మనస్సులు నిరంతరం శ్రీ రామచంద్ర ప్రభువునే కోరుకోవాలి.’