14వ అధ్యాయము: గుణత్రయ విభాగ యోగము

గుణత్రయ విభాగ యోగము

గత అధ్యాయము, ఆత్మ మరియు భౌతిక శరీరమునకు మధ్య తేడాని విపులంగా విశదీకరించింది. ఈ అధ్యాయము, దేహము మరియు దాని మూలకముల యొక్క మూలశక్తి అయిన భౌతిక శక్తి యొక్క స్వభావమును వివరిస్తుంది; ఇదే మనస్సు మరియు పదార్థమునకు మూలము. భౌతిక ప్రకృతి మూడుగుణములతో కూడి ఉంటుంది అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు - సత్త్వము, రజస్సు, మరియు తమస్సు. భౌతిక శక్తిచే తయారైన శరీరమనోబుద్ధులు కూడా ఈ మూడు గుణములను కలిగి ఉంటాయి; ఈ మూడు గుణముల కలయిక మనలో ఏ పాళ్ళలో ఉన్నది అన్నదాని బట్టి మన వ్యక్తిత్వము ఆధారపడి ఉంటుంది. సత్త్వ గుణము - శాంతి, సదాచారము, సద్గుణము మరియు ప్రసన్నత వంటి లక్షణాలతో ఉంటుంది. రజో గుణము వలన అంతులేని కోరికలు మరియు ప్రాపంచిక అభ్యున్నతి కోసం తృప్తినొందని తృష్ణ, కలుగుతాయి. మరియు తమో గుణము వలన భ్రమ, సోమరితనం, మత్తు మరియు నిద్ర కలుగుతాయి. ఆత్మ, జ్ఞానోదయం పొందేవరకూ, ప్రకృతి యొక్క ఈ బలీయమైన శక్తులతో వ్యవహరించటం నేర్చుకోవాలి. ఈ త్రి-గుణములకు అతీతముగా వెళ్ళటమే మోక్షము.
    ఈ త్రి-గుణముల బంధనమును ఛేదించి వెళ్లిపోవటానికి ఒక సరళమైన ఉపాయం తెలియచేస్తాడు శ్రీ కృష్ణుడు. సర్వోత్కృష్ట భగవానుడు ఈ మూడు గుణములకు అతీతుడు, ఒకవేళ మనం ఆయనతో అనుసంధానం అయిపోతే, ఆ తదుపరి, మన మనస్సు కూడా దివ్యమైన స్థాయికి ఎదుగుతుంది. ఈ తరుణంలో, అర్జునుడు, త్రిగుణములకు అతీతముగా ఎదిగిన వారి లక్షణములు ఏమిటి అని అడుగుతాడు. అటువంటి జీవన్ముక్తులైన వారి లక్షణములను శ్రీ కృష్ణుడు క్రమపద్ధతిలో వివరిస్తాడు. జ్ఞానోదయమైన వారు ఎల్లప్పుడూ సమత్వచిత్తము (సమతౌల్యం) తోనే ఉంటారు అని చెప్తాడు; జగత్తులో ఈ త్రిగుణములు ప్రవర్తిల్లుచున్నప్పుడు, వాటి ప్రభావం మనుష్యులలో, వస్తువులలో, పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు వారు ఉద్వేగానికి లోనుకారు. వారు అన్నింటినీ భగవంతుని యొక్క శక్తి ప్రకటితమవుతున్నట్టుగానే చూస్తారు; అన్నీ చివరికి ఆయన అధీనములోనే ఉన్నట్టు గమనిస్తారు. అందుకే, ప్రాపంచిక పరిస్థితులు వారిని అతిసంతోషానికి లేదా దుఃఖమునకు గురి చేయవు; చలించిపోకుండా ఉండి వారు ఆత్మ యందే స్థితమై ఉంటారు. త్రిగుణములకు అతీతముగా ఎదగటానికి, భక్తి యొక్క ఔన్నత్యాన్ని, శక్తిని మరల ఒకసారి మనకు శ్రీ కృష్ణ పరమాత్మ గుర్తు చేయటంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. 

శ్రీ భగవానుడు పలికెను: నేను మళ్ళీ ఒకసారి ఈ యొక్క సర్వశ్రేష్ఠమైన విద్యను, అన్నింటికన్నా ఉత్తమమైన జ్ఞానమును నీకు వివరిస్తాను; ఇది తెలుసుకున్న గొప్ప సాధువులందరూ అత్యున్నత పరిపూర్ణతను సాధించారు.

ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. వారు, సృష్టి సమయంలో మరలా జన్మించరు లేదా ప్రళయ సమయంలో నాశనం కారు.

ఈ యొక్క సమస్త భౌతిక ప్రకృతి, గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను, ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతియే గర్భము మరియు నేనే బీజమును ఇచ్చే తండ్రిని.

ఓ మహా బాహువులు కల అర్జునా, భౌతిక ప్రాకృతిక శక్తి అనేది త్రిగుణములను కలిగి ఉంటుంది - సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణము. ఈ గుణములే నాశములేని నిత్య జీవాత్మను నశ్వర దేహమునకు బంధించును.

వీటిలో సత్త్వ గుణము మిగతావాటి కంటే పవిత్రమైనది కావుటచే, ఇది ప్రకాశకమైనది మరియు చాలా క్షేమదాయకమైనది. ఓ పాపరహితుడా, సుఖానుభవము మరియు జ్ఞానము పట్ల ఆసక్తి వలన అది జీవాత్మను బంధించివేస్తుంది.

ఓ అర్జునా, రజో గుణము మోహావేశ ప్రవృత్తితో కూడినది. అది ప్రాపంచిక కోరికలు మరియు మమకారముల వల్ల జనిస్తుంది మరియు ఆత్మను కామ్యకర్మల పట్ల ఆసక్తిచే బంధించివేస్తుంది.

ఓ అర్జునా, అజ్ఞానముచే జనించిన తమో గుణము, జీవాత్మల యొక్క మోహభ్రాంతికి కారణము. అది సమస్త జీవరాశులను నిర్లక్ష్యము, సోమరితనము మరియు నిద్రచే భ్రమకు గురి చేస్తుంది.

సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది; మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది.

ఓ అర్జునా! ఒక్కోసారి రజస్తమోగుణములపై సత్త్వముది పైచేయిగా ఉంటుంది. ఒక్కోసారి సత్త్వతమోగుణములపై రజో గుణము ఆధిపత్యంతో ఉంటుంది; మరియు ఇంకాకొన్ని సార్లు సత్త్వరజో గుణములను తమోగుణము ఓడిస్తుంది.

దేహములోని అన్ని ద్వారములు జ్ఞానముచే ప్రకాశితమైనప్పుడు, అది సత్త్వగుణము యొక్క ప్రకటితము అని తెలుసుకొనుము. రజో గుణము ప్రబలినప్పుడు, ఓ అర్జునా, లోభము (దురాశ), ప్రాపంచిక లాభము కోసం పరిశ్రమ, వ్యాకులత, మరియు యావ పెంపొందుతాయి. ఓ అర్జునా – అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము - ఇవి తమో గుణము యొక్క ప్రధానమైన లక్షణములు.

సత్త్వ గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు, జ్ఞానులు ఉండే పవిత్ర లోకాలను (రజస్సు, తమస్సు లేనటువంటివి) చేరుకుంటారు. రజో గుణ ప్రధానముగా ఉంటూ మరణించినవారు కర్మాసక్తులైన వారిలో జన్మిస్తారు; తమో గుణ ప్రభావంతో ఉంటూ మరణించిన వారు జంతువుల జీవరాశిలో పుడతారు.

సత్త్వ గుణములో చేసిన కార్యముల ఫలములు పవిత్రమైన ఫలితములను ఇస్తాయి. రజో గుణములో చేసిన పనులు, దుఃఖాలను కలుగ చేస్తాయి, మరియు, తమో గుణములో చేసిన పనులు అజ్ఞానపు చీకటిని కలుగచేస్తాయి.

సత్త్వ గుణముచే జ్ఞానము, రజో గుణముచే లోభము(దురాశ), మరియు తమో గుణముచే నిర్లక్ష్యము మరియు మోహము (భ్రాంతి) జనించును.

సత్త్వ గుణములో స్థితమై ఉన్నవారు ఉన్నత స్థాయికి వెళతారు; రజో గుణములో స్థితమై ఉండేవారు మధ్యస్థాయి లోనే ఉండిపోతారు; తమో గుణములో స్థితమై ఉండేవారు అధోగతి పాలౌతారు.

అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో, మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.

శరీర సంబంధిత ప్రకృతి త్రిగుణములకు అతీతముగా అయిపోవటం వలన, వ్యక్తి, జన్మ, మృత్యువు, వృద్ధాప్యము, మరియు దుఃఖముల నుండి విముక్తి పొంది, అమరత్వం పొందుతాడు.

అర్జునుడు ఇలా అడిగాడు: ప్రకృతి త్రి-గుణములకు అతీతముగా అయినవారి లక్షణములు ఏ విధంగా ఉంటాయి, ఓ ప్రభూ? వారు ఏవిధంగా ప్రవర్తిస్తారు? వారు త్రి-గుణముల బంధనమునకు అతీతముగా ఎలా అవుతారు?

శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - (సత్త్వ గుణ జనితమైన) ప్రకాశమును కానీ, (రజో గుణ జనితమైన) కార్యకలాపములను కానీ, లేదా (తమో గుణ జనితమైన) మోహభ్రాంతిని కానీ - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు.

సుఖదుఃఖాలలో ఒక్క రీతిగానే ఉండేవారు; ఆత్మ భావన యందే స్థితమై ఉండేవారు; మట్టిముద్ద, రాయి, మరియు బంగారము వీటన్నిటినీ ఒకే విలువతో చూసేవారు; అనుకూల లేదా ప్రతికూల పరిస్థితిలో ఒక్కరీతిగానే ఉండేవారు; తెలివైన వారు; నిందాస్తుతులను రెంటినీ సమముగా స్వీకరించేవారు; గౌరవమును, అవమానమును ఒక్క రీతిగానే తీసుకునేవారు; శత్రువుని, మిత్రుడిని ఒకలాగే చూసేవారు; అన్ని యత్నములను విడిచిపెట్టినవారు - వీరు త్రిగుణములకు అతీతులైనవారు అని చెప్పబడుతారు.

నిష్కల్మషమైన భక్తి ద్వారా నన్ను సేవించిన వారు ప్రకృతి త్రిగుణములకు అతీతులై పోవుదురు మరియు బ్రహ్మన్ స్థాయికి చేరుతారు.

అనశ్వరమైన, అవ్యయమైన నిరాకార బ్రహ్మమునకు, సనాతనమైన ధర్మమునకు మరియు అఖండమైన దివ్య ఆనందమునకు, నేనే ఆధారమును.