Bhagavad Gita: Chapter 14, Verse 19

నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి ।
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగఛ్చతి ।। 19 ।।

న-అన్యం — వేరే ఏవీ కాదు; గుణేభ్యః — గుణముల కంటే; కర్తారం — చేసేది; యదా — ఎప్పుడైతే; ద్రష్టా — చూసేవాడు; అనుపశ్యతి — చూస్తాడో; గుణేభ్యః — ప్రకృతి గుణముల కన్నా; చ — మరియు; పరం — అతీతమైన; వేత్తి — తెలుసుకొనుము; మత్-భావం — నా దివ్య స్వభావము; సః — వారు; అధిగచ్చతి — పొందెదరు.

Translation

BG 14.19: అన్ని కార్యములలోనూ, కర్తలు ఈ త్రి-గుణములే తప్ప వేరే ఇతర ఏవీ లేవు, అని ఎప్పుడైతే వివేకవంతులు తెలుసుకుంటారో, మరియు నన్ను ఈ గుణములకు అతీతునిగా తెలుసుకుంటారో, వారు నా దివ్య స్వభావాన్ని పొందుతారు.

Commentary

ఈ మూడు గుణముల యొక్క సంక్లిష్టమైన పనితీరుని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు వాటి బంధనము నుండి ముక్తిపొందటానికి సరళమైన ఉపాయమును చెప్తున్నాడు. జగత్తు లోని సమస్త జీవ భూతములు ఈ మూడు గుణముల బంధనములో ఉన్నాయి, కాబట్టి ఈ గుణములే జగత్తులో జరిగే కార్యములన్నింటిలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి. కానీ, సర్వోన్నత భగవానుడు వాటికి అతీతుడు. కాబట్టి, ఆయనను త్రి-గుణాతీతుడు (భౌతిక ప్రకృతి యొక్క గుణములకు అతీతుడు) అని అంటారు. అదే విధంగా, భగవంతుని యొక్క అన్ని గుణములు - ఆయన నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు పరివారము – ఇవన్నీ త్రి-గుణాతీతములే.

ఒకవేళ మన మనస్సుని త్రి-గుణముల యొక్క పరిధి లోనే ఉన్న ఏ ఒక్క వ్యక్తి లేదా వస్తువు పట్ల అనుసంధానం చేసినా, ఆ సంబంధిత గుణ-ప్రభావం మన మనోబుద్ధులపై పెరుగుతుంది. కానీ, మన మనస్సుని దివ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రములోనే ఉంచితే, అది త్రిగుణములకు అతీతముగా దివ్యమైనదిగా అవుతుంది. ఈ సూత్రమును అర్థం చేసుకున్నవారు, ప్రాపంచిక వస్తువులు, మనుష్యుల పట్ల తమ సంబంధాన్ని తగ్గించుకుంటూ, భక్తి ద్వారా, భగవంతుడు మరియు గురువు పట్ల సంబంధాన్ని బలపరుచుకుంటారు. ఇది వారికి త్రిగుణములకు అతీతముగా అవ్వటానికి సహాయకారిగా మరియు భగవంతుని యొక్క దివ్య స్వభావాన్ని పొందటానికి సహాయకారిగా ఉంటుంది. ఈ విషయం 14.26వ శ్లోకంలో మరింత విశదీకరించబడినది.