13వ అధ్యాయము: క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

ఒక్కోటి ఆరు అధ్యాయములతో కూడిన మూడు విభాగాలుగా, భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి. మొదటి ఆరు అధ్యాయముల భాగము కర్మ యోగాన్ని విశదీకరిస్తుంది. రెండవ భాగము, భక్తి యొక్క మహత్వమును, మరియు భక్తిని పెంపొందించుకోవటానికి భగవంతుని యొక్క విభూతులను కూడా (ఐశ్వర్యములను) తెలియపరుస్తుంది. మిగతా ఆరు అధ్యాయముల మూడవ భాగము, తత్త్వ జ్ఞానమునకు అర్థవివరణ చేస్తుంది. ఈ ప్రస్తుత అధ్యాయము, మూడవ భాగములోని మొదటి అధ్యాయము; ఇది రెండు పదాలను మనకు పరిచయం చేస్తున్నది — క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును తెలిసినవాడు). క్షేత్రము అంటే ఈ శరీరము అని మరియు క్షేత్రజ్ఞుడు (క్షేత్రమును ఎరిగినవాడు) అంటే అందులో ఉండే ఆత్మ అని అనుకోవచ్చు. కానీ ఇది విషయాన్ని చాలా సరళీకరణం చేసినట్టే, ఎందుకంటే క్షేత్రము అంటే దానిలో చాలా ఉంటాయి — మనస్సు, బుద్ధి, మరియు అహంకారము, మరియు మన వ్యక్తిత్వములో ఉండే భౌతిక శక్తి యొక్క అన్ని అంశములు. ఈ బృహత్‌ నిర్వచనంలో, ఆత్మ తప్ప, మన వ్యక్తిత్వమును నిర్ణయించే మిగతా అన్ని అస్తిత్వాలను కలిపి శరీర క్షేత్రము అనవచ్చు. జీవాత్మను క్షేత్రమును తెలిసినవాడు, లేదా 'క్షేత్రజ్ఞుడు' అంటారు.
    ఎలాగైతే, ఒక రైతు తన క్షేత్రములో విత్తనములు వేసి, దాని నుండి పంటను పొందుతాడో, అదేవిధంగా మన శరీరము అనే క్షేత్రములో మంచి లేదా చెడు తలంపులు మరియు కార్యములు వేసి, తద్వారా మన భవిష్యత్తుని పొందుతాము. బుద్ధుడు ఇలా వివరించాడు: ‘మన ప్రస్తుత స్థితి మన ఆలోచనల/తలంపుల ఫలితమే; అది మన తలంపుల మీదనే ఆధారపడి ఉన్నది; మరియు అది మన ఆలోచనలతోనే తయారు చేయబడినది.’ కాబట్టి, మన ఆలోచనలు ఎట్లా ఉంటే మనం అట్లానే అవుతాము. ప్రఖ్యాత అమెరికన్ తత్త్వవిచారకుడు రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్, ఇలా అన్నాడు: ‘ప్రతి పని యొక్క వెనుక మూలకారణం ఒక ఆలోచన ఉంటుంది. (The ancestor of every action is thought).’ అందుకే, మన క్షేత్రమును, మంచి ఆలోచనలు మరియు చర్యలతో ఉంచుకునే కళను మనం నేర్చుకోవాలి. దీనికి క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు – యొక్క తేడాను స్పష్టంగా చూపించే జ్ఞానం అవసరము. ఈ ప్రస్తుత అధ్యాయములో, శ్రీ కృష్ణుడు ఈ యొక్క విషయంపై విస్తారమైన విశ్లేషణను అందిస్తున్నాడు. శరీర క్షేత్రములో ఉన్న భౌతిక ప్రాకృతిక మూలకాలన్నింటినీ ఇక్కడ పేర్కొంటున్నాడు. భావాలు, ఉద్వేగాలు, మరియు మానసిక స్థితుల రూపాల్లో, క్షేత్రములో జనించే మార్పులు/కదలికలను ఆయన వివరిస్తాడు. క్షేత్రమును పవిత్రం చేసి, దానిని జ్ఞాన దీపముచే ప్రకాశం చేసే గుణములు మరియు లక్షణములను శ్రీ కృష్ణుడు పేర్కొంటాడు. ఇటువంటి జ్ఞానము మనకు క్షేత్రజ్ఞుడైన ఆత్మను అనుభవము లోనికి తేవటానికి దోహదపడుతుంది. ఆ తదుపరి, ఈ అధ్యాయము, సమస్త ప్రాణుల క్షేత్రములను సంపూర్ణముగా తెలిసినవాడైన భగవంతుడి గురించి మనకు వివరిస్తుంది. ఆ సర్వోన్నత భగవానుడు ఒకేసమయంలో పరస్పర విరుద్ధమైన లక్షణములను కలిగి ఉంటాడు, అంటే, ఒకే సమయంలో విరుద్ధమైన గుణములను కలిగి ఉండటం. అందుకే, సృష్టిలో సర్వవ్యాపిగా ఉంటాడు, మరియు సర్వ భూతముల హృదయములలో కూర్చుని కూడా ఉంటాడు. కాబట్టి, అందుకే ఆయన సమస్త ప్రాణులకు పరమాత్మ.
    ఆత్మ, పరమాత్మ, మరియు భౌతిక ప్రకృతి-లను వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు, జీవ రాశులు చేసే పనులకు వీటిలో ఏది కారణమో వివరిస్తాడు, మరియు అంతేకాక, స్థూలంగా ఈ ప్రపంచంలో కారణము మరియు కార్యములకు ఏది మూలమో కూడా వివరిస్తాడు. ఎవరైతే వీటిని స్పష్టంగా వేర్వేరుగా చూడగలుగుతారో మరియు సరిగ్గా నిశితంగా కార్యము యొక్క కారణములను చూడగలరో, వారే నిజముగా చూసినట్టు; వారే నిజముగా జ్ఞానములో స్థితమై ఉన్నట్టు. వారు ప్రతి ప్రాణిలో ఉన్న పరమాత్మను గమనించగలరు, మరియు తమ మనస్సుచే తమని తామే నీచ స్థాయికి దిగజార్చుకోరు. విభిన్నమైన జీవరాశులు ఒకే ప్రకృతి యందు స్థితమై ఉన్నట్టు చూడగలరు. సమస్త సృష్టిలో అంతర్లీనంగా వ్యాప్తమై ఉన్న ఒకే ఒక ఆధ్యాత్మిక అస్తిత్వమును చూడగలిగిన తరుణంలో వారు బ్రహ్మ జ్ఞానమును పొందుతారు.

అర్జునుడు ఇలా అన్నాడు, ‘ఓ కేశవా, ప్రకృతి మరియు పురుషుడు అంటే ఏమిటి, క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే ఏమి? అని తెలుసుకోగోరుచున్నాను. నిజమైన జ్ఞానము ఏమిటి మరియు అటువంటి జ్ఞానము యొక్క లక్ష్యము ఏమిటి? అని కూడా తెలుసుకోగోరుచున్నాను.’

సర్వోత్కృష్ట దివ్య భగవానుడు ఇలా పలికెను: ఓ అర్జునా, ఈ దేహము క్షేత్రము అని, మరియు ఈ దేహమును గూర్చి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని - ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడినది.

ఓ భరత వంశీయుడా, నేను కూడా ప్రతి ఒక్క క్షేత్రమును ఎఱింగిన వాడినే. ఈ శరీరమును క్షేత్రమని (కార్యకలాపాలు జరిగే స్థానము) మరియు ఆత్మ, పరమాత్మ క్షేత్రజ్ఞులని (క్షేత్రమునెరింగినవారు) తెలుసుకోవటమే, నిజమైన జ్ఞానముగా నేను పరిగణిస్తాను.

వినుము, క్షేత్రము అంటే ఏమిటో దాని స్వభావం ఏమిటో నేను నీకు వివరిస్తాను. దానిలో మార్పు ఎలా సంభవిస్తుందో, అది దేనిచే సృష్టించబడినదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, వాని శక్తిసామర్థ్యము ఏమిటో కూడా వివరిస్తాను.

మహాత్ములైన ఋషులు క్షేత్రమును గూర్చి మరియు క్షేత్రజ్ఞుని గురించి సత్యమును పెక్కువిధముల వివరించి ఉన్నారు. ఎన్నోవేద మంత్రములలో కూడా ఇది తెలుపబడినది, ప్రత్యేకముగా బ్రహ్మ సూత్రములలో ఇది సహేతుకముగా మరియు నిశ్చయాత్మకముగా తెలుపబడినది.

పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది.

వాంఛ మరియు ద్వేషము, సంతోషము మరియు దుఃఖము, శరీరము, చైతన్యము, మనోబలము — ఇవన్నీ కలిపి క్షేత్రము మరియు దాని మార్పులు (వికారములు) అనబడుతాయి.

నమ్రత; దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా ఉండుట; అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర-మనస్సుల పరిశుద్ధత; నిశ్చల బుద్ధి; ఆత్మ-నిగ్రహము; ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని (యావ) లేకుండా ఉండుట; జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను.

ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్.

సర్వత్రా ఆయన చేతులు, పాదములు, కన్నులు, శిరస్సులు, మరియు ముఖములు ఉన్నాయి. ఆయన చెవులు కూడా అన్ని ప్రదేశాలలో ఉన్నాయి, ఎందుకంటే ఆయన ఈ జగత్తు అంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడు.

ఇంద్రియ వస్తువిషయములను అన్నింటినీ ఆయన గ్రహించగలిగినా, ఆయన ఇంద్రియ రహితుడు. ఆయనకు దేనిపట్ల కూడా మమకారానుబంధము లేదు, అయినా ఆయనే అన్నింటిని సంరక్షించి పోషించేవాడు. ఆయన నిర్గుణుడు అయినా, ప్రకృతి త్రిగుణములకు భోక్త ఆయనే.

ఆయన సమస్త చరాచర భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. ఆయన సూక్ష్మమైన వాడు, కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము. చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు.

ఆయన విభజించుటకు వీలులేని వాడు, అయినా సర్వప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడే, సమస్త భూతములకు (ప్రాణులకు) సంరక్షకుడు-పోషకుడు, లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకొనుము.

అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే, మరియు ఆయన అజ్ఞానపు చీకటికి పరమ అతీతుడు. జ్ఞానము ఆయనే, జ్ఞాన విషయము ఆయనే, మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే. ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు.

ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.

ప్రకృతి (భౌతిక ప్రకృతి) మరియు పురుషుడు (ఆత్మలు) రెండూ కూడా అనాదియైనవి (సనాతనమైనవి). శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా, భౌతిక శక్తి చే సంభవిస్తున్నాయని తెలుసుకొనుము.

సృష్టి యందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని; సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో, జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడినది.

ఎప్పుడైతే ప్రకృతిలో (భౌతిక శక్తి) లో స్థితమై ఉన్న పురుషుడు (జీవాత్మ) త్రిగుణములను సుఖించదలచాడో, వాటి పట్ల మమకారాసక్తియే, ఆ జీవాత్మకు ఉన్నతమైన జన్మ మరియు నీచ జన్మలకు కారణమగును.

దేహముయందే ఆ సర్వోన్నత భగవానుడు కూడా ఉంటాడు. ఆయన సర్వసాక్షి, సర్వ నియామకుడు, ధరించి పోషించేవాడు, అలౌకిక భోక్త, సర్వోత్కృష్ట నిర్వాహకుడు మరియు పరమాత్మ, అని చెప్పబడుతాడు.

పరమాత్మ, జీవాత్మ, భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యదార్థమును అర్థం చేసుకున్న వారు, మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు. వారి ప్రస్తుత పరిస్థితి ఎలాఉన్నా వారు విముక్తి చేయబడతారు.

కొందరు ధ్యానము ద్వారా తమ హృదయములో ఉన్న పరమాత్మను దర్శించటానికి ప్రయత్నిస్తారు; మరియు ఇతరులు దీనినే జ్ఞాన సముపార్జన ద్వారా పొందటానికి ప్రయత్నిస్తారు, ఇంకా మరికొందరు ఈ విజ్ఞానమును కర్మ మార్గము ద్వారా సాధించుటకు పరిశ్రమిస్తుంటారు.

ఇంకా కొందరు ఈ ఆధ్యాత్మిక మార్గముల గురించి తెలియనివారు, వాటి గురించి ఇతరుల దగ్గర విని, ఆ సర్వోన్నత భగవానుని ఆరాధించటం మొదలుపెడతారు. ఇలా భక్తితో మహాత్ముల దగ్గర శ్రవణం చేయటం చేత, వారు కూడా క్రమక్రమంగా ఈ జనన-మరణ సంసార సాగరాన్ని దాటగలరు.

ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, ఈ సమస్త చరాచర ప్రాణులు, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క సంయోగము వలననే ఉన్నాయని నీవు తెలుసుకొనుము.

సమస్త ప్రాణులలో, ఆత్మతో పాటుగా ఉన్న పరమాత్మను చూసినవాడే, మరియు ఆ రెంటినీ ఈ నశ్వరమైన శరీరంలో అనశ్వరమైన వాటిగా చూసినవాడే, నిజముగా చూసినట్టు.

సర్వ ప్రాణులలో సమానముగా, పరమాత్మగా ఉన్న ఆ భగవంతుడిని చూసేవారు, తమ మనస్సుచే తమను తామే దిగజార్చుకోరు. తద్వారా, వారు పరమ పదమునకు చేరుకుంటారు.

(శరీరము యొక్క) అన్ని కార్యములు చేసేది భౌతిక ప్రకృతియే, దేహమునందున్న జీవాత్మ నిజానికి ఏపనీ చేయదు, అని అర్థంచేసుకున్నవారు నిజముగా చూసినట్టు.

విభిన్న వైవిధ్యములతో కూడిన జీవరాశులు అన్నీ ఒకే ప్రకృతిలో స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు, మరియు అవన్నీ దానినుండే ఉద్భవించినవి అని అర్థం చేసుకున్నప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.

ఓ కుంతీ తనయుడా, పరమాత్మ నాశములేనిది, అనాదియైనది, భౌతిక లక్షణములు ఏవీ లేనిది. దేహములోనే స్థితమై ఉన్నా, అది ఏమీ చేయదు, మరియు, భౌతిక శక్తి చే ఏమాత్రం కళంకితము కాదు.

ఆకాశము (ఖాళీ జాగా) అన్నింటిని తనలోనే కలిగిఉంటుంది, కానీ సూక్ష్మమైనది కావటం వలన, తనలో కలిగి ఉన్న వాటిచే కళంకితముకాదు. అదే విధముగా, దేహములో దాని చైతన్యమంతా వ్యాపించి ఉన్నా, ఆత్మ అనేది శరీరము యొక్క గుణములచే ప్రభావితము కాదు.

ఎలాగైతే ఒక్క సూర్యుడే సమస్త సౌరకుటుంబమును ప్రకాశింపచేయునో, అలాగే ఒక్క ఆత్మయే మొత్తం శరీరమును (చైతన్యము చే) ప్రకాశింపచేయును.

జ్ఞాన-చక్షువులచే, ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు, మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు, పరమ పదమును చేరుకుంటారు.