జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వామృతమశ్నుతే ।
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ।। 13 ।।
జ్ఞేయం — తప్పకుండా తెలుసుకోబడదగినది; యత్ — ఏదైతే; తత్ — అది; ప్రవక్ష్యామి — ఇప్పుడు నీకు తెలియచేస్తాను; యత్ — అది; జ్ఞాత్వా — తెలుసుకున్న తరువాత; అమృతం — అమరత్వము; అశ్నుతే — పొందురు; అనాది — ఆది (మొదలు) లేని; మత్-పరం — నాకు ఆధీనమై; బ్రహ్మ — బ్రహ్మన్; న — కాదు; సత్ — ఉన్నది; తత్ — అది; న — కాదు; అసత్ — లేనిది; ఉచ్యతే — అంటారు.
Translation
BG 13.13: ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో, దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియచేస్తాను, అది తెలుసుకున్న తరువాత, వ్యక్తి అమరత్వం పొందుతాడు. అదియే, సత్, అసత్ లకు అతీతముగా ఉండే ఆదిరహిత బ్రహ్మన్.
Commentary
పగలు-రాత్రి అనేవి ఒకే నాణెమునకు రెండు పక్కల వంటివి, ఒకటి లేనిదే ఇంకొకటి ఉండజాలదు. ఒకచోట పగలు ఉంది అని చెప్పాలంటే అక్కడే రాత్రి కూడా ఉండాలి. కానీ, అక్కడ రాత్రి అనేదే లేకపోతే అక్కడ పగలు లేనట్లే; అక్కడ ఎడతెగని వెలుగు మాత్రమే ఉన్నట్టు. అదే విధముగా, బ్రహ్మన్ విషయంలో, ‘సత్ (ఉన్నది)’ అనే పదం దాన్ని సంపూర్ణంగా వివరించదు. బ్రహ్మన్ యొక్క అస్తిత్వము సత్-అసత్ రెంటికీ అతీతమైనది, అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.
బ్రహ్మన్ అంటే, జ్ఞానులు ఉపాసించే నిర్గుణ, నిరాకార తత్త్వము. తన యొక్క సాకార రూపములో, భగవంతుడిగా, అది భక్తులకు ఆరాధ్య యోగ్యము. దేహములో నివసించి ఉంటున్న, అదే అస్తిత్వానికి ‘పరమాత్మ' అని పేరు. ఇవన్నీ కూడా, ఒకే సర్వోన్నత పరమతత్త్వము యొక్క మూడు అస్తిత్వాలు. తదుపరి 14.27వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: బ్రహ్మణో హి ప్రతిష్ఠాహమ్, ‘నిరాకార బ్రహ్మన్‌కు కూడా నేనే ఆధారము.’ ఈ విధంగా, నిరాకార బ్రహ్మము మరియు భగవంతుని సాకార రూపము రెండూ కూడా ఒకే సర్వోత్కృష్ట అస్తిత్వ స్వరూపాలు. రెండూ కూడా సర్వత్రా ఉంటాయి, అందుకే రెంటినీ సర్వ వ్యాప్తము అని అనవచ్చు. వీటిని ఉదహరిస్తూ, శ్రీ కృష్ణుడు భగవంతునిలో ప్రకటితమయ్యే పరస్పర విరుద్ధ గుణములను తెలియపరుస్తున్నాడు.