Bhagavad Gita: Chapter 13, Verse 8-12

అమానిత్వమదంభిత్వమ్ అహింసా క్షాంతిరార్జవమ్ ।
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ।। 8 ।। ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ ।
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ।। 9 ।। అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదిషు ।
నిత్యం చ సమచిత్తత్వమ్ ఇష్టానిష్టోపపత్తిషు ।। 10 ।। మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ ।
వివిక్తదేశసేవిత్వమ్ అరతిర్జనసంసది ।। 11 ।। అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ ।
ఏతద్ జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతోఽన్యథా ।। 12 ।।

అమానిత్వం — నమ్రత; అదంభిత్వమ్ — దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా; అహింసా — అహింస; క్షాంతిః — క్షమాగుణము; ఆర్జవమ్ — నిరాడంబరత/సరళత; ఆచార్య-ఉపాసనం — గురు సేవ; శౌచం — శరీర, మనస్సుల యొక్క శుద్ధి; స్థైర్యం — స్థిరత్వము; ఆత్మ-వినిగ్రహః — ఆత్మనిగ్రహము; ఇంద్రియ-అర్థేషు — ఇంద్రియ వస్తువిషయముల పట్ల; వైరాగ్యమ్ — వైరాగ్యము; అనహంకారః — అహంకార రహితముగా; ఏవ చ — మరియు ఇంకా; జన్మ — పుట్టుట; మృత్యు — మరణము; జరా — ముసలితనము; వ్యాధి — వ్యాధి; దుఃఖ — చెడు; దోష — దోషములు; అనుదర్శనమ్ — తెలిసికొనుట (అనుభూతి); అసక్తిః — ఆసక్తి లేకుండా; అనభిష్వంగః — లాలస/తృష్ణ లేకుండా; పుత్ర — పిల్లలు; దార — భార్య (భర్త); గృహ-ఆదిషు — ఇల్లు మొదలగునవి; నిత్యం — ఎల్లప్పుడూ; చ — మరియు; సమ-చిత్తత్వమ్ — సమ చిత్తముతో ఉండుట; ఇష్ట — ఇష్టమైనవి; అనిష్ట — ఇష్టం లేనివి; ఉపపత్తిషు — వాటి ప్రాప్తి చే; మయి — నా పట్ల; చ — మరియు; అనన్య-యోగేన — అనన్య చిత్తముతో ఏకమై ఉండి; భక్తిః — భక్తి; అవ్యభిచారిణీ — నిశ్చలమైన; వివిక్త — ఏకాంత; దేశ — ప్రదేశములు; సేవిత్వమ్ — పట్ల మొగ్గు చూపి; అరతిః — విముఖత; జన-సంసది — ప్రాపంచిక విషయాసక్తులైన సమాజం పట్ల; ఆధ్యాత్మ — ఆధ్యాత్మిక; జ్ఞాన — జ్ఞానము; నిత్యత్వం — ఎల్లప్పుడూ ఉండటము; తత్త్వ-జ్ఞాన — ఆధ్యాత్మిక సిద్ధాంత జ్ఞానము; అర్థ — కోసము; దర్శనమ్ — వేదాంతశాస్త్రము; ఏతద్ — ఇవి అన్ని; జ్ఞాన — జ్ఞానము; ఇతి — ఈ విధంగా; ప్రోక్తమ్ — చెప్పబడినవి; అజ్ఞానం — అజ్ఞానము; యత్ — ఏదైతే; అతః — దీనికి; అన్యథా — విరుద్ధమైన.

Translation

BG 13.8-12: నమ్రత; దంభము (కృత్తిమ బుద్ధి) లేకుండా ఉండుట; అహింస; క్షమా గుణము; సరళత; గురు సేవ; శరీర-మనస్సుల పరిశుద్ధత; నిశ్చల బుద్ధి; ఆత్మ-నిగ్రహము; ఇంద్రియభోగ వస్తువిషయములపై అనాసక్తి; అహంకారము లేకుండుట; జన్మ, మృత్యు, జరా, వ్యాధుల దురవస్థను గుర్తుచేసుకోవటం; మమకారరాహిత్యం; భార్య(భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటిని అంటుకొని (యావ) లేకుండా ఉండుట; జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట; నా పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట; ఏకాంత ప్రదేశాల్లో ఉండటానికే ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి; ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం; మరియు పరమ సత్యముకై తత్త్వాన్వేషణ - ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను, మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానము అని అంటాను.

Commentary

క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడిని గురించి తెలుసుకునే జ్ఞానము కేవలం ఏదో మానసిక కసరత్తు కాదు. ప్రవర్తనలో మార్పు లేకుండానే, మామూలు పుస్తక జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, కానీ శ్రీ కృష్ణుడు చెప్పే ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో అట్లా కాకుండా, దానికి హృదయంలో పవిత్రత అవసరము. (ఇక్కడ, హృదయము అంటే శరీరంలో ఉన్న అవయవం కాదు. మనోబుద్ధులతో కూడిన అంతఃకరణముని కూడా కొన్నిసార్లు హృదయము అంటారు). జీవితమును పవిత్రం చేసి మరియు దానిని జ్ఞాన వెలుగుతో ప్రకాశింప చేసే - గుణములు, అలవాట్లు, ప్రవర్తన మరియు దృక్పథాలని ఈ ఐదు శ్లోకాలు వివరిస్తున్నాయి.

నమ్రత: మనం ఎప్పుడైతే మన క్షేత్రము యొక్క గుణముల పట్ల గర్వముతో ఉంటామో, అంటే అందము, తెలివి, నైపుణ్యము, సామర్థ్యము వంటి వాటి మీద, మనకు ఇవన్నీ ఇచ్చినది ఆ భగవంతుడే అని మర్చిపోతాము. కాబట్టి గర్వము అనేది మన మనస్సుని భగవంతుని నుండి దూరముగా చేస్తుంది. ఆత్మ జ్ఞాన పథంలో, గర్వము అనేది ఒక పెద్ద అవరోధము ఎందుకంటే అది మనోబుద్ధుల గుణములను ప్రభావితం చేసి మొత్తం క్షేత్రమును మలినపరుస్తుంది.

కపటత్వం/మిథ్యాచారం లేకుండా ఉండుట: ఓ కపటి, కృత్తిమమైన బాహ్య వ్యక్తిత్వమును పెంపొందించుకుంటాడు. వ్యక్తి అంతర్గతంగా దోషపూరితముగా ఉంటాడు కానీ, బాహ్యంగా మంచి గుణములు ఉన్నట్టు ఒక వేషం సృష్టిస్తాడు. కానీ దురదృష్టవశాత్తూ, బాహ్యంగా ప్రదర్శించే మంచి గుణములు, పైపైకే ఉంటాయి మరియు ఒక డొల్ల మాత్రమే.

అహింస: జ్ఞానమును పెంపొందించుకోవాలంటే సమస్త ప్రాణుల పట్ల గౌరవం ఉండటం అవసరం. దీనికి అహింస యొక్క అభ్యాసం ఆవశ్యకం. అందుకే శాస్త్రాలు ఇలా పేర్కొంటున్నాయి: ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్; ‘ఇతరుల యొక్క ఏ ప్రవర్తన నీకు నచ్చదో, నీవు వారితో ఆ విధముగా ప్రవర్తించకుండా ఉండుము.’

క్షమా గుణము: మనకు అపకారం చేసిన వారి పట్ల కూడా మనము దుర్భావన చేయకపోవటమే క్షమా గుణము. నిజానికి, దుర్భావన మనస్సులో ఉంచుకోవటం, ఎదుటి వాడి కన్నా మనకే ఎక్కువ హాని చేస్తుంది. క్షమా గుణము అభ్యాసం చేయటంచే, వివేకము కలిగిన వ్యక్తి, మనస్సులోని చెడుని అంతా విడిచిపెట్టి మనస్సుని పరిశుద్ధి చేసుకుంటాడు.

సరళత: ఇది ఆలోచనలో (మనసా), వాక్కులో (వాచా) మరియు చేతలలో (కర్మణా) కపటత లేకుండా ముక్కుసూటిగా ఉండటము. ఆలోచనా సరళత అంటే, మోసం, ఈర్ష్య, వక్రత వంటి నకారాత్మక తలంపులు లేకుండా ఉండటము. వాక్కులో సరళత అంటే వెక్కిరింత, దూషణ, చాడీలు చెప్పటం, అతిశయోక్తి లేకుండా ఉండటం. చేతలలో సరళత అంటే, సింపుల్‌గా జీవించటం, ప్రవర్తనలో ఋజుత్వము, మొదలైనవి.

గురు సేవ: ఆధ్యాత్మిక జ్ఞానము అనేది గురువు ద్వారా లభిస్తుంది. ఈ దివ్య జ్ఞానము అందుకోవాలంటే, శిష్యుడికి గురువు గారి పట్ల అంకితభావము మరియు భక్తి ఉండాలి. గురువుకు సేవ చేయటం ద్వారా, శిష్యుడికి వినయము మరియు నిబద్ధత పెరుగుతాయి; దీనితో గురువు తన శిష్యుడికి జ్ఞానమును ప్రసాదించటానికి వీలవుతుంది. శ్రీ కృష్ణుడు అర్జునుడికి 4.34వ శ్లోకంలో ఇలా వివరించాడు: ‘ఆధ్యాత్మిక గురువు గారి దగ్గరికి వెళ్లి సత్యమును గురించి తెలుసుకొనుము. వినయము/మర్యాదతో ఆయనను అడుగుము మరియు ఆయనకి సేవ చేయుము. అటువంటి జ్ఞానోదయమయిన మహాత్ముడు, తాను స్వయముగా సత్యమును తెలుసుకున్నాడు కాబట్టి, నీకు ఆ జ్ఞానమును ప్రసాదించగలడు.’

శారీరక మరియు మానసిక శౌచము: శుభ్రత అనేది అంతర్గతంగా మరియు బాహ్యంగా రెంటిలో ఉండాలి. శాండిల్య ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది: శౌచం నామ ద్వివిధం-బాహ్యమాంతరం చేతి (1.1) ‘పరిశుభ్రత రెండు రకాలుగా ఉంటుంది—అంతర్గతమైనది మరియు బాహ్యమైనది.’ బాహ్యమైన పరిశుభ్రత మంచి ఆరోగ్యము నిలుపుకోటానికి, క్రమశిక్షణ పెంచుకోవటానికి మరియు మనస్సును నిర్మలంగా ఉంచుకోవటానికి దోహదపడుతుంది, కానీ మానసిక స్వచ్ఛత కూడా ఇంకా ఎక్కువ ముఖ్యమైనది, మనస్సుని పరిపూర్ణ పవిత్రుడైన భగవంతునిపై నిలపటంద్వారా దీనిని సాధించవచ్చు. జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ ఇలా పేర్కొన్నారు:

మాయాధిన్ మలీన్ మన, హై అనాది కాలీన్,
హరి విరహానల ధోయ జల, కరు నిర్మల బని దీన్

(భక్తి శతకము 79వ శ్లోకం)

‘ఈ ప్రాకృతిక మనస్సు అనంతమైన జన్మల నుండి మలినమై ఉన్నది. అత్యంత వినయవిధేయత వినమ్రతలను అభ్యాసం చేస్తూ, భగవంతుడిని పొందాలనే తపన ద్వారా దానిని పవిత్రం చేసుకొనుము.’

స్థిరబుద్ధి: ఆత్మ-జ్ఞానము మరియు భగవత్ ప్రాప్తి అనేవి ఒక్క రోజులో సాధించగలిగే లక్ష్యములు కావు. లక్ష్యం సాధించే వరకూ అదే మార్గంలో ఉండే దృఢ సంకల్పమే ఈ స్థిర బుద్ధి. శాస్త్రములు ఇలా పేర్కొన్నాయి: చరైవైతే చరైవతే , చరన్ వై మధు విందతి, ‘ముందుకు సాగుతూనే ఉండు, ముందుకు సాగుతూనే ఉండు. ఎవరైతే పట్టువదలకుండా సాగుతూ ఉంటారో వారికి చివరికి మధురమైన తేనె లభిస్తుంది.’

ఆత్మ-నిగ్రహము: మనోబుద్దులను పాడు చేసే ప్రాపంచిక భోగముల వెనుక పడి పరిగెత్తకుండా, మనస్సు-ఇంద్రియములను నిగ్రహించటమే ఈ ఆత్మ-నిగ్రహము. విలాసభోగములచే మన ప్రాణశక్తి దుర్వ్యయమై పోకుండా ఈ ఆత్మ నిగ్రహము కాపాడుతుంది.

ఇంద్రియ వస్తు విషయములపై అనాసక్తి: ఇది, పైన ఉదహరించబడినటువంటి, బలవంతంగా మనల్ని మనము నిగ్రహించుకునే ఆత్మ-నిగ్రహము కంటే ఒక మెట్టు ఎక్కువది. అనాసక్తి అంటే, భగవత్ ప్రాప్తి పథంలో అడ్డంకిగా ఉన్న ఇంద్రియసుఖాల పట్ల అభిరుచి లేకపోవటం.

అహంకార రహితముగా ఉండుట: అహంకారము అంటే ‘నేను’, ‘నాకు’, మరియు ‘నాది’ అనే అంతర్గత స్పృహ. ఇది అవిద్య/అజ్ఞానమునకు సూచిక, ఎందుకంటే అది, మనలను మనం ఈ శరీరమే అని భావించే, శారీరక స్థాయి నుండి జనిస్తుంది. దీనినే 'అహం చేతనా' అని కూడా అంటారు. (నేను అన్న స్పృహ నుండి జనించే గర్వము). అందరూ మహాత్ములూ నొక్కివక్కాణించి చెప్పేదేమిటంటే, భగవంతుడిని మన హృదయము లోనికి ఆహ్వానించాలంటే, మొదట మనలో ఉన్న గర్వమును నిర్మూలించుకోవాలి.

జబ మై థా తబ హరి నహిఁ, అబ్ హరి హై, మై నాహీఁ
ప్రేమ్ గలీ అతి సంకరీ, యా మే ద్వే న సమాహీ (సంత్ కబీర్)

“‘నేను’ అన్న భావన ఉన్నప్పుడు, భగవంతుడు అక్కడ ఉండడు; ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, 'నేను' లేను. దివ్య ప్రేమ మార్గము చాలా ఇరుకైనది; దానిలో 'నేను' మరియు 'భగవంతుడు' ఇద్దరూ పట్టరు.”

జ్ఞాన యోగ మార్గములో మరియు అష్టాంగ యోగ మార్గములో, ఈ యొక్క 'అహం చేతనా' భావన ను వదిలించుకోవటానికి విస్తృతమైన సాధనా ప్రక్రియలు ఉన్నాయి. కానీ, భక్తి యోగ మార్గములో, అది చాలా సునాయాసముగా వదిలిపోతుంది. మన 'అహం' అన్న పదానికి ముందర 'దాస' (సేవకుడు) అన్న పదం తగిలిస్తాము, దానితో అది దాసోహం (నేను భగవంతుడి సేవకుడిని) గా మారిపోతుంది. ఇక ఇప్పుడు 'నేను' ఏమాత్రం హానికారకం కాదు మరియు ఆత్మ-దృక్పథం అనేది భగవత్-దృక్పథంగా మారిపోతుంది.

జన్మ, మృత్యు, జరా, వ్యాధుల యొక్క దురవస్థను సదా గుర్తుంచుకోవటం: ఒకవేళ బుద్ధికి - భౌతిక ప్రగతి లేదా ఆధ్యాత్మిక పురోగతి లలో ఏది ఎక్కువ ముఖ్యమో అనే అయోమయంలో ఉంటే - అప్పుడు దానికి ఆత్మ జ్ఞానమును సంపాదించుకునేందుకు కావలసిన దృఢ సంకల్పమును పెంపొందించుకోవడం కష్టముగా ఉంటుంది. కానీ బుద్ధికి ఈ ప్రపంచం యొక్క వికృతం పట్ల నిశ్చయం కలిగినప్పుడు, అది తన సంకల్పంలో దృఢంగా ఉంటుంది. ఈ దృఢ సంకల్పం పొందటానికి, ఈ భౌతిక లోకంలో, మన ఈ జీవితంలో విడదీయలేనివిగా ఉండే కష్టాలు/దుఃఖాలు/బాధలపై నిరంతర చింతన చేస్తుండాలి. బుద్ధుడిని ఆధ్యాత్మిక పథంలో పెట్టింది ఈ చింతనే. ఆయన ఒక రోగిని చూసి, ‘ఈ ప్రపంచంలో వ్యాధులు అనేవి ఉన్నాయి నేను కూడా ఏదో ఒకరోజు రోగగ్రస్త మవ్వాల్సిందే.’ అని అనుకున్నాడు. తరువాత ఒక వృద్ధుడిని చూసి, ‘ఇక్కడ వృద్ధాప్యం కూడా ఉంది. అంటే నేను కూడా ఏదోకరోజు ముసలివాడిని అయిపోవాలి’ అని అనుకున్నాడు. ఆ తరువాత, ఒక చని పోయిన వ్యక్తిని చూసాడు , ‘ఇది కూడా జీవనంలో భాగమే, అంటే నేను కూడా ఒక రోజు చనిపోవాల్సిందే’ అని తెలుసుకున్నాడు. బుద్ధుడి యొక్క బుద్ధి ఎంత గ్రహణశక్తిగలది అంటే, ఒక్కసారి వీటిని చూసినంతనే అవి ఆయనను ఈ ప్రపంచాన్ని త్యజించేలా చేసాయి. మనకు ఇంకా అంత కుశలత కలిగిన బుద్ధి లేదు కాబట్టి, ప్రపంచం యొక్క వికృతం అవగతం అయ్యే వరకూ, వీటి గురించి నిరంతర చింతన చేస్తూనే ఉండాలి.

మమకార-ఆసక్తి రహితంగా ఉండుట: అంటే, ప్రాపంచిక జగత్తు పట్ల అనాసక్తితో ఉండటం. మనకు ఉన్నది ఒక్క మనస్సే మరియు మనం ఆధ్యాత్మిక లక్ష్యములను సాధించాలంటే మనము దాన్ని భౌతిక వస్తువిషయముల నుండి దూరంచేయాలి. సాధకుడు, ప్రాపంచిక మమకార ఆసక్తుల స్థానంలో, వాటికి బదులుగా వాటి స్థానంలో భగవంతుని పట్ల ప్రేమ మరియు మమకారమును స్థాపించుకుంటాడు.

భార్య (భర్త), పిల్లలు, ఇల్లు వంటి వాటినే పట్టుకుని ఉండకపోవటం: మనస్సుకి ఈ విషయముల పట్ల సునాయాసముగా మమకారానుబంధము ఏర్పడిపోతుంది. శారీరక స్పృహలో, వ్యక్తి అప్రయత్నంగానే కుటుంబసభ్యులను, ఇంటిని – ‘నావారు, నాది’ అని అనుకుంటాడు. ఇవన్నీ మనసులో తరచుగా తిరుగుతూనే ఉంటాయి మరియు వీటిపై ఆసక్తి మనస్సుని భౌతిక దృక్పథంలోనే కట్టివేస్తాయి. ఆసక్తి/మమకారం అనేది - కుటుంబ సభ్యులు ఇలాగే ఉండాలి, ఫలానా విధంగానే ప్రవర్తించాలి అన్న ఆపేక్షను/కోరిక కలుగచేస్తుంది, మరియు ఈ ఆశలు తీరనప్పుడు, అది మానసిక క్షోభకు దారి తీస్తుంది. మరియు అనివార్యముగా, కుటుంబ సభ్యుల నుండి దూరమవ్వటం కూడా సంభవిస్తుంది, తాత్కాలికంగా వారు వేరే చోటికి వెళ్ళినప్పుడు గానీ, లేదా శాశ్వతంగా, వారు చనిపోయినప్పుడైనా. ఇవన్నీ అనుభవాలు మరియు ఆయా భయాలు మనస్సుపై చాలా భారమును కలిగించి, దానిని భగవంతుని నుండి దూరంగా తీసుకువెళతాయి. కాబట్టి మనము నిత్య శాశ్వతమైన ఆనందాన్ని అన్వేషిస్తుంటే, మనం భార్య (భర్త), పిల్లలు, ఇల్లు - వీటితో వ్యవహరించేటప్పుడు, మన మనస్సు వాటిల్లో చిక్కుకొని పోకుండా ఉండేట్టు, ప్రాజ్ఞతతో ఉండాలి. ఒక నర్సు హాస్పిటల్లో తన విధి నిర్వర్తించినట్టు, లేదా, ఒక టీచర్ తన విద్యార్థుల పట్ల తన విధిని నిర్వర్తించినట్లు, మమకారాసక్తి లేకుండా, వారి పట్ల మన ధర్మ (కర్తవ్యము) నిర్వర్తించాలి.

అనుకూల లేదా ప్రతికూల పరిస్థితుల పట్ల సమ-భావనతో ఉండుట: పగలు-రాత్రి లాగా సుఖదాయకమైన లేదా కష్టదాయకమైన పరిస్థితులు పిలవకుండానే వస్తుంటాయి. అదే జీవితం. ఈ ద్వంద్వములకు అతీతముగా ఎదగాలంటే, మనయొక్క ఆధ్యాత్మిక బలాన్ని, ప్రపంచం పట్ల వైరాగ్యం ద్వారా పెంచుకోవాలి. జీవితంలో వ్యతిరేక పరిస్థితులలో కూడా చలించకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుకోవాలి మరియు విజయం ప్రాప్తించినపుడు ఏదో సాధించామని గర్వపడే భావనని కూడా విడిచిపెట్టాలి.

నా (కృష్ణుడి) పట్ల నిశ్చలమైన మరియు అనన్య భక్తి: వైరాగ్యం అంటే కేవలం మనస్సు తప్పుడు దిశలో వెళ్ళటం లేదు అని. కానీ జీవితం అంటే ప్రతికూల పరిస్థితులను కేవలం నివారించటమే కాదు. శ్రేయస్కర విషయాలలో కూడా నిమగ్నమవ్వటమే జీవితం. నిజంగా కోరతగిన జీవిత లక్ష్యము అంటే దాన్ని భగవంతుని యొక్క చరణారవిందముల వద్ద అంకితం చేయటమే. కాబట్టి, శ్రీ కృష్ణుడు దానిని ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు.

ఏకాంత ప్రదేశాల యందు ఇష్టత: ప్రాపంచిక జనుల్లా కాకుండా, భక్తులు, ఒంటరితనాన్ని అధిగమించటానికి ఇతరుల సాంగత్యాన్ని కోరుకోరు. వారి మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వారు సహజంగానే ఏకాంతాన్ని ఇష్టపడుతారు. కాబట్టి వారు సహజంగానే, ఆధ్యాత్మిక తలంపులలో మరింత నిమగ్నమవ్వటానికి ఏకాంత ప్రదేశాలని ఇష్టపడుతారు.

లౌకిక ప్రాపంచిక సమాజం పట్ల విముఖత: భౌతిక ప్రాపంచిక మనస్సుకు సూచిక ఏమిటంటే అది ప్రాపంచిక మనుష్యులు మరియు ప్రాపంచిక విషయాల గురించిన మాటల్లో ఆహ్లాదంగా ఉంటుంది. భగవత్ స్పృహ పెంపొందించుకునేవారు, సహజంగానే వీటి పట్ల అయిష్టత పెంచుకుని, ప్రాపంచిక సమాజానికి దూరంగా ఉంటారు; అదే సమయంలో, భగవత్ సేవ కోసం, ప్రాపంచిక జగత్ వ్యవహారాల్లో పాలుపంచుకోవలసి వస్తే, భక్తుడు దానిని స్వీకరిస్తాడు మరియు మానసికంగా దానిచే ప్రభావితం కాకుండా ఉండే సామర్థ్యాన్ని పెంచుకుంటాడు.

ఆధ్యాత్మిక జ్ఞానములో స్థిరముగా ఉండుట: ఏదేని విషయమును కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే తెలుసుకుంటే సరిపోదు. కోపము అనేది మంచిది కాదు అని వ్యక్తికి తెలిసి ఉండవచ్చు, కానీ దానికి పదేపదే వశమై పోతూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవనంలో ఆచరణలో పెట్టటం నేర్చుకోవాలి. గంభీరమైన సత్యాలని ఒక్కసారి వినటం ద్వారా ఇది సాధ్యం కాదు. వాటిని విన్న తరువాత, వాటిపై పదేపదే చింతన చేయాలి. దివ్య ఆధ్యాత్మిక యదార్థాలపై నిరంతర చింతనయే ఇక్కడ శ్రీ కృష్ణుడు చెప్తున్న ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత్వం.

పరమ సత్యము కొరకై తత్త్వాన్వేషణ: జంతువులు కూడా శారీరక క్రియలైన తినటం, నిద్రించటం, మైథునం, మరియు రక్షించుకోవటం వంటి పనులను చేస్తాయి. కానీ, భగవంతుడు ప్రత్యేకంగా మనుష్యులకు జ్ఞానాన్ని పెంపొందించుకునే శక్తి ఇచ్చాడు. అది, శారీరక సుఖాలను విలాసంగా అనుభవించటానికి ఇవ్వబడలేదు, ‘నేను ఎవరిని?’, ‘నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?’, ‘నా జీవిత లక్ష్యము ఏమిటి?, ‘ఈ ప్రపంచం ఎలా సృష్టించబడినది?, ‘ఆ సృష్టి కర్తకి నాకు ఉన్న సంబంధము ఏమిటి?’, ‘నా జీవన ప్రయోజనాన్ని ఎలా సఫలం చేసుకోవాలి?’ అన్న ప్రశ్నలపై చింతన చేయటానికి ఆ శక్తి ఇవ్వబడినది. తత్త్వపరమైన సత్యాన్వేషణ మన ఆలోచనను పశుస్థాయి నుండి ఉన్నతంగా చేసి, మరియు మనలను భగవత్ ప్రాప్తి ఉపదేశమును వినటం మరియు చదవటం దిశగా తీసుకువెళుతుంది.

ఈ పైన వివరించబడిన సుగుణములు, అలవాట్లు, ప్రవర్తన, మరియు దృక్పథం మనలను జ్ఞానము, వివేకము పెంచుకునే దిశగా తీసుకువెళుతాయి. వీటికి వ్యతిరేకమైనవి అహంకారము, కపటత్వము, హింసాప్రవృత్తి, ప్రతీకారము, మోసము, గురువు పట్ల అమర్యాద, శరీరమనస్సుల అపరిశుభ్రత, చంచలత్వము, ఆత్మనిగ్రహం లేకుండుట, ఇంద్రియ వస్తువిషయాల పట్ల లాలస, దురభిమానము, భార్య (భర్త), ఇల్లు, పిల్లలు వంటి వాటిపై యావ, మొదలగునవి. ఇటువంటి స్వభావం ఆత్మ-జ్ఞాన ఎదుగుదలను కుంటుపడేస్తుంది. అందుకే శ్రీ కృష్ణుడు వాటిని అజ్ఞానము మరియు చీకటి అని అంటున్నాడు.