Bhagavad Gita: Chapter 13, Verse 19

ఇతి క్షేత్రం తథా జ్ఞానం జ్ఞేయం చోక్తం సమాసతః ।
మద్భక్త ఏతద్విజ్ఞాయ మద్భావాయోపపద్యతే ।। 19 ।।

ఇతి — ఈ విధముగా; క్షేత్రం — క్షేత్ర స్వభావము; తథా — మరియు; జ్ఞానం — జ్ఞానము; జ్ఞేయం — జ్ఞాన విషయము; చ — మరియు; ఉక్తం — తెలియచేయబడినది; సమాసతః — సంక్షిప్తముగా; మత్-భక్తః — నా భక్తుడు; ఏతత్ — ఇది; విజ్ఞాయ — తెలుసుకొని; మత్-భావః — నా దివ్య స్వభావము; ఉపపద్యతే — పొందును.

Translation

BG 13.19: ఈ ప్రకారముగా నీకు క్షేత్రము యొక్క స్వభావమును, జ్ఞానము యొక్క అర్థమును, మరియు జ్ఞాన విషయమును, నేను తెలియచేసాను. నా భక్తులు మాత్రమే దీనిని యదార్థముగా అర్థం చేసుకోగలరు, అలా చేసిన పిదప, వారు నా దివ్య స్వభావమునే పొందుతారు.

Commentary

శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు క్షేత్రమును మరియు జ్ఞాన విషయమును గురించి తన యొక్క వివరణకు, దీనిని తెలుసుకోవటం వల్ల వచ్చే ఫలమును (ఫలస్తుతి) చెప్పటంతో ముగింపు ఇస్తున్నాడు. అయినా, మరల ఒకసారి, భక్తి గురించి చెప్పటం అవసరం అనుకున్నాడు; మరియు కేవలం తన భక్తులు మాత్రమే ఈ జ్ఞానమును యదార్థముగా అర్థం చేసుకోగలరు అని అంటున్నాడు. కర్మకాండ, జ్ఞానోపాసన, అష్టాంగము మొదలైనవి అభ్యాసం చేసే వారు, వారికి వారే అంతా అర్థమయిపోయింది అనుకున్నా, భక్తి రహితంగా ఉంటే, భగవద్ గీత యొక్క యదార్థమైన భావమును అర్థం చేసుకోలేరు. భక్తి అనేది, భగవత్ జ్ఞానం దిశగా వెళ్లే ప్రతి ఒక్క మార్గములో తప్పని సరిగా ఉండవలసినదే.

జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ దీనిని చాలా చక్కగా చెప్పారు:

జో హరి సేవా హేతు హో, సోఇ కర్మ బఖాన
జో హరి భగతి బడావే, సోఇ సముఝియ జ్ఞాన (భక్తి శతకము, 66వ శ్లోకం)

‘భగవంతుని పట్ల భక్తి యుతంగా చేసిన పనే నిజమైన కర్మ; మరియు భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించే విషయమే నిజమైన జ్ఞానము.’

భక్తి అనేది మనకు భగవంతుని గురించి తెలుసుకోవటానికి సహకరించేది మాత్రమే కాదు, అది భక్తుడిని భగవంతునిలా కూడా చేస్తుంది, కాబట్టి, భక్తులు తన స్వభావాన్ని పొందుతారు అని అంటున్నాడు శ్రీ కృష్ణుడు. ఇదే విషయం వైదిక శాస్త్రాలలో పదే పదే చెప్పబడింది. వేదములు ఇలా పేర్కొంటున్నాయి:

భక్తిరేవైనం నయతి భక్తిరేవైనం పశ్యతి భక్తిరేవైనం దర్శయతి
భక్తి వశః పురుషో భక్తిరేవ భూయసీ

(మాథర్ శృతి)

‘కేవలం భక్తి మాత్రమే మనలను భగవంతుని దగ్గరికి తీస్కువెళ్లగలదు. భక్తి ఒక్కటే మనలకు భగవంతుడిని దర్శింపచేయగలదు. భక్తి ఒక్కటే మనలను భగవంతుని సన్నిధికి చేర్చగలదు. భగవంతుడు భక్తికి వశమై పోతాడు. కాబట్టి అనన్య భక్తి సాధన చేయుము.’ ముండకోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

ఉపాసతే పురుషం యే హ్యకామా-స్తే శుక్రమేతదతివర్తంతి ధీరాః

(3.2.1)

‘భౌతిక ప్రాపంచిక కోరికలను విడిచి, దివ్య మంగళ పరమేశ్వరుని పట్ల భక్తితో నిమగ్నమైన వారు, జనన-మరణ చక్రము నుండి విముక్తి పొందుతారు.’ ఇంకా, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:

యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ
తస్యైతే కథితా హ్యర్తా ప్రకాశంతే మహాత్మనః (6.23)

‘ఎవరికైతే, భగవంతుని పట్ల నిశ్చలమైన భక్తి ఉంటుందో, అదే విధమైన భక్తి గురువు పట్ల ఉంటుందో, అటువంటి సత్పురుషుల హృదయములో, భగవంతుని కృపవలన, వేద శాస్త్రముల జ్ఞానములన్నీ అనాయాసముగా తెలియచేయబడును.’ ఇతర వైదిక శాస్త్రాలు కూడా ఇదే విషయాన్ని నొక్కివక్కాణిస్తున్నాయి:

న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ
న స్వాధ్యాయస్త పస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా

(భాగవతం 11.14.20)

శ్రీకృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: ‘ఉద్ధవా, నేను అష్టాంగ యోగము ద్వారా కానీ, సాంఖ్య శాస్త్ర పఠనము వలన కానీ, ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేత కానీ, తపస్సుల చేత కానీ, లేదా సన్యాసం చేత గాని, పొందబడను. కేవలం భక్తి చేత మాత్రమే నేను పొందబడుతాను.’ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని పదేపదే చెప్తాడు - 8.22 శ్లోకం, 11.54 శ్లోకం మొదలైనవాటిలో. 18.55వ శ్లోకంలో ఆయన అంటాడు: ‘కేవలం ప్రేమ యుక్త భక్తి చేత మాత్రమే యదార్థముగా నేను ఏమిటో తెలుసుకోగలరు. తదుపరి, భక్తి ద్వారా నా స్వభావమును తెలుసుకున్న పిదప, జనులు నా దివ్య ధామమునకు చేరుకుంటారు.’ రామాయణము కూడా ఇలా పేర్కొంటున్నది:

రామహి కేవల ప్రేము పిఆరా, జాని లేఉ జో జాననిహారా

‘సర్వోన్నతుడైన శ్రీరామచంద్ర ప్రభువు కేవలం ప్రేమ చేత మాత్రమే పొందబడుతాడు. తెలుసుకోదలచిన వారందరికీ ఈ నిజము తెలియనీ.’

నిజానికి, ఇతర మత ధర్మాల్లో కూడా ఈ సూత్రం ధృవీకరించబడింది. యూదు తోరా (Jewish Torah) లో ఇలా వ్రాయబడినది, ‘నీ దేవుడైన ప్రభువును సంపూర్ణ హృదయ పూర్వకముగా, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణశక్తితోను ప్రేమించవలెను (ద్వితీయోపదేశకాండము 6.5)’ (You shall love the Lord your God with all your heart, and with all your soul, and with all your might (Deuteronomy 6.5)). ఇదే విషయాన్ని నజరేయుడైన యేసు, క్రైస్తవ కొత్త నిబంధనలో, అత్యంత ప్రధానమైన సూత్రముగా, ఈ ఆజ్ఞను పునరావృతం చేస్తున్నాడు (మార్క్ 12.30). గురు గ్రంథ్ సాహిబ్ ఇలా పేర్కొంటున్నది:

హరి సమ జగ మహాన్ వస్తు నహీఁ, ప్రేమ పంథ సో పంథా
సద్గురు సమ సజ్జన్ నహీఁ, గీతా సమ నహీఁ గ్రంథ

‘భగవంతుని వంటి వ్యక్తిత్వము ఇంకేదీ లేదు; భక్తి మార్గానికి సమానమైన మార్గము లేదు; గురువుకు సమానమైన మనిషి లేడు; మరియు భగవద్గీతకు సాటి వచ్చే శాస్త్రగ్రంథము ఇంకోటి లేదు’