Bhagavad Gita: Chapter 13, Verse 6

మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ।
ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ।। 6 ।।

మహా-భూతాని — (పంచ) మహా భూతములు; అహంకారః — అహంకారము; బుద్ధిః — బుద్ధి; అవ్యక్తమ్ — ఆవ్యక్తమైన మూల ప్రకృతి; ఏవ — నిజముగా; చ — మరియు; ఇంద్రియాణి — ఇంద్రియములు; దశ-ఏకం — పదకొండు; చ — మరియు; పంచ — ఐదు; చ — మరియు; ఇంద్రియ-గో-చరాః — (ఐదు) పంచేద్రియముల గ్రాహ్య విషయములు.

Translation

BG 13.6: పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, అవ్యక్త మూల ప్రకృతి, పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు), మరియు ఐదు ఇంద్రియ గ్రాహ్య విషయములతో ఈ యొక్క క్షేత్రము కూడి ఉన్నది.

Commentary

క్షేత్రములో ఉండే ఇరవైనాలుగు అంశములు ఏమిటంటే: పంచ-మహాభూతములు (భూమి, నీరు, అగ్ని, వాయువు, మరియు ఆకాశము), పంచ తన్మాత్రలు (ఐదు ఇంద్రియ గ్రాహ్యములు - రుచి, స్పర్శ, వాసన, దృష్టి, మరియు శబ్దము), ఐదు కర్మేంద్రియములు (కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగములు, మరియు గుదము), ఐదు జ్ఞానేంద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, మరియు ముక్కు), మనస్సు, బుద్ధి, అహంకారము, మరియు ప్రకృతి (భౌతిక శక్తి యొక్క ఆదిమ స్వరూపము). శ్రీ కృష్ణుడు దశైకం (పది+ఒకటి) అన్న పదాన్ని పదకొండు ఇంద్రియములను సూచించటానికి ఉపయోగిస్తున్నాడు. వీటిలో, ఐదు జ్ఞానేద్రియములు, ఐదు కర్మేంద్రియములు లతో పాటు మనస్సుని కూడా కలిపి చెప్పాడు. ఇంతకు క్రితం 10.22వ శ్లోకంలో, ఇంద్రియములలో తానే మనస్సుని అని కృష్ణుడు చెప్పి ఉన్నాడు.

ఐదు ఇంద్రియ గ్రాహ్యములు బాహ్యమైనవి అయినా, వాటిని క్షేత్రములో కలిపి ఎందుకు చెప్పాడు అని ఎవరైనా అనుకోవచ్చు. ఇది ఎందుకంటే, మనస్సు ఇంద్రియ విషయములపై చింతన చేస్తుంటుంది, మరియు ఈ ఇంద్రియ గ్రాహ్యములు సూక్ష్మ రూపములో మనస్సులో ఉంటాయి. అందుకే, మనం నిద్ర పోతున్నప్పుడు, మనస్సుతో కలలు కంటుంటే, మన యొక్క స్థూల ఇంద్రియములు మంచం పైనే ఉన్నా, ఆ కలలో మనము చూస్తాము, వింటాము, అనుభూతి చెందుతాము, రుచి చూస్తాము మరియు వాసన కూడా చూస్తాము. దీని వలన మనకు అర్థం అయ్యేది ఏమిటంటే, స్థూల ఇంద్రియ విషయములు సూక్ష్మ రూపంలో మనస్సులో కూడా ఉంటాయి అని. ఆత్మ యొక్క సమస్త క్షేత్రమును ఇక్కడ విశదీకరిస్తున్నాడు కాబట్టి, శ్రీ కృష్ణుడు వాటిని ఇక్కడ పేర్కొన్నాడు. వేరే ఇతర కొన్ని గ్రంథాలు, శరీరమును వివరించటంలో, ఐదు ఇంద్రియ గ్రాహ్యములను కాకుండా బదులుగా, పంచ ప్రాణములను పేర్కొంటాయి. దీనిని కేవలం వర్గీకరణ విషయంగా మాత్రమే చూడాలి కానీ తత్త్వ విరుద్ధత పరంగా చూడకూడదు.

ఇదే జ్ఞానము కోశముల పరంగా కూడా వివరించబడినది. ఈ శరీర క్షేత్రములో, లోనున్న ఆత్మను ఆవరించి ఐదు కోశములు ఉంటాయి:

అన్నమయ కోశము. ఇది పంచ మహా భూతములతో (భూమి, నీరు, అగ్ని,వాయువు మరియు ఆకాశము) తయారైన స్థూల కోశము.

ప్రాణమయ కోశము. ఇది ఐదు ప్రాణ వాయువులతో (ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన) ఉన్న ప్రాణ-వాయు కోశము.

మనోమయ కోశము. ఇది మానసిక కోశము, ఇది మనస్సు మరియు ఐదు కర్మేంద్రియములను కలిగి ఉంటుంది (కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగాలు, మరియు గుదము).

విజ్ఞానమయ కోశము. ఇది బుద్ధికి సంబంధించిన కోశము, దీనిలో బుద్ధి, మరియు ఐదు జ్ఞానేంద్రియములు (చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, మరియు ముక్కు) ఉంటాయి.

ఆనందమయ కోశము. ఈ ఆనందమయ కోశములో, శరీరము-మనస్సు-బుద్ధి అమరిక యొక్క స్వల్ప-ఆనందము తో మనలను అనుసంధానం చేసే అహంకారము ఉంటుంది.