Bhagavad Gita: Chapter 14, Verse 9

సత్త్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత ।
జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత ।। 9 ।।

సత్త్వం — సత్త్వ గుణము; సుఖే — సుఖములకు; సంజయతి — కట్టివేయును; రజః — రజో గుణము; కర్మణి — కర్మల పట్ల; భారత — అర్జునా, భరత వంశీయుడా; జ్ఞానం — జ్ఞానము; ఆవృత్య — ఆవరించివేయును; తు — కానీ; తమః — తమో గుణము; ప్రమాదే — భ్రమ/మోహములో; సంజ యతి — బంధించేవేయును; ఉత — నిజముగా.

Translation

BG 14.9: సత్త్వము వ్యక్తిని భౌతిక సుఖాలకు కట్టివేస్తుంది; రజో గుణము జీవాత్మకు కర్మల పట్ల ఆసక్తి కలిగిస్తుంది; మరియు తమో గుణము జ్ఞానమును కప్పివేసి వ్యక్తిని మోహభ్రాంతికి బంధించివేస్తుంది.

Commentary

సత్త్వ గుణములో భౌతిక జీవన క్లేశములు తగ్గుతాయి, మరియు ప్రాపంచిక కోరికలు తగ్గుముఖం పడతాయి. ఇది వ్యక్తి యొక్క స్థితిలో ఒకలాంటి సంతుష్టిని కలుగచేస్తుంది. ఇది మంచిదే, కానీ దీనితో ఒక ఇబ్బంది కూడా ఉంది. ఉదాహరణకు, ప్రపంచంలో క్లేశములకు గురైనవారు మరియు మనస్సులో ప్రాపంచిక కోరికలతో సతమతమై పోయేవారు వారి సమస్యలకై పరిష్కారమును వెదుకుతూ ఉంటారు, ఈ ప్రయత్నమే కొన్నిసార్లు వారిని ఆధ్యాత్మికత వైపు తెస్తుంది. కానీ, సత్త్వ గుణములో ఉన్నవారు ఒకలాంటి నిశ్చింతమైన తృప్తితో ఉండిపోయి, అలౌకిక స్థాయికి చేరుకోవటానికి ఉత్సాహం చూపరు. మరియు, సత్త్వ గుణము బుద్ధిని జ్ఞానముచే ప్రకాశవంతము చేస్తుంది. దీనితో పాటుగా ఆధ్యాత్మిక వివేకము లేకపోతే, జ్ఞానముతో గర్వము పెరిగి, ఆ గర్వము భగవత్ భక్తిలో అడ్డుగా వస్తుంది. దీనిని మనము తరచుగా శాత్రవేత్తలు, విద్యావేత్తలు, పండితులు మొదలైన వారిలో గమనించవచ్చు. వీరిలో సత్త్వ గుణము సాధారణంగా ఎక్కువ ప్రభావశీలంగా ఉంటుంది, ఎందుకంటే వారి యొక్క సమయాన్ని, శక్తిని జ్ఞాన సముపార్జనలో వినియోగిస్తారు. అయినా, వారికి ఉన్న జ్ఞానము వారిని తరచుగా గర్వితులను చేస్తుంది, మరియు వారి బుద్ధికి అతీతముగా ఇంకేదీ పరమ సత్యము లేదని అనుకుంటూ ఉంటారు. ఈ విధంగా, వారు శాస్త్రముల పట్ల లేదా భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ముల పట్ల విశ్వాసాన్ని పెంచుకోలేకపోతారు.

రజో గుణములో, జీవులు తీవ్ర పరిశ్రమ దిశగా ప్రేరణ పొందుతారు. ప్రపంచం పట్ల వారి అనురక్తి, మరియు సుఖాలు, హోదా, సంపద, మరియు శారీరక సౌకర్యాల పట్ల వారి యొక్క ఆసక్తి, తమ ఆశయాలను సాధించే దిశగా పరిశ్రమించేటట్లు వారిని ప్రేరేపిస్తుంది; అవే వారికి జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా అనిపిస్తాయి. రజో గుణము స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ పెంచుతుంది, మరియు కామమును పెంచుతుంది. ఈ కామమును తృప్తిపర్చుకోవటానికి పురుషుడు-స్త్రీ వైవాహిక సంబంధంలోకి ప్రవేశించి ఒక గృహమును కలిగిఉంటారు. ఆ గృహమును నిర్వహించుకోవటానికి సంపద అవసరము, కాబట్టి వారి ఆర్థిక అభ్యున్నతి కోసము పరిశ్రమిస్తుంటారు. తీవ్ర వ్యవహారములు చేస్తుంటారు కానీ, ఆ ప్రతి-ఒక్క పని మరిన్ని కర్మలను సృష్టిస్తుంది, మరియు అవి వారిని మరింత భౌతిక అస్తిత్వ బంధనములో బంధించివేస్తాయి.

తమోగుణము, ప్రాణుల బుద్ధిని మబ్బుకప్పేస్తుంది. సుఖాల కోసం వాంఛ, ఇక ఇప్పుడు వక్రమైన తప్పుడు విధాలుగా పరిణమిస్తుంది. ఉదాహరణకి, సిగరెట్టు తాగటం హానికరమని అందరికీ తెలుసు. ప్రతి ఒక్క సిగరెట్టు పాకెట్ మీద ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరిక కూడా ఉంటుంది. సిగరెట్టు త్రాగేవారు దానిని చదువుతారు, అయినా వారి ధూమపానం ఆపరు. ఇది ఎందుకు జరుగుతుందంటే, బుద్ధి తన విచక్షణా శక్తిని కోల్పోయి, తనకు హాని జరిగినా ఆ ధూమపాన సుఖాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. ఒకరెవరో హాస్యాస్పదంగా అన్నట్టు, ‘సిగరెట్టు అంటే ఒక చివర నిప్పు మరొక చివర మూర్ఖుడు ఉండే ఒక పైపు’ అని. ఇదే తమోగుణము యొక్క ప్రభావము, ఇది ఆత్మను అజ్ఞానపు చీకటిలో బంధించివేస్తుంది.