Bhagavad Gita: Chapter 14, Verse 22-23

శ్రీ భగవానువాచ ।
ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ ।
న ద్వేష్టి సంప్రవృత్తాని న నివృత్తాని కాంక్షతి ।। 22 ।। ఉదాసీనవదాసీనో గుణైర్యో న విచాల్యతే ।
గుణా వర్తంత ఇత్యేవం యోఽవతిష్ఠతి నేంగతే ।। 23 ।।

శ్రీ భగవాన్-ఉవాచ — శ్రీ భగవానుడు ఇలా పలికెను; ప్రకాశం — ప్రకాశము; చ — మరియు; ప్రవృతిం — క్రియాకలాపములు; చ — మరియు; మోహం — మోహము (భ్రమ); ఏవ — అయినా; చ — మరియు; పాండవ — అర్జునా, పాండు పుత్రుడా; న ద్వేష్టి — ద్వేషించరు; సంప్రవృత్తాని — ఉన్నప్పుడు; న నివృత్తాని — లేనప్పుడు; కాంక్షతి — వాటి కోసం తాపత్రయపడడు; ఉదాసీన-వత్ — ఉదాసీనముగా ఉంటూ (తటస్థముగా); ఆసీనః — స్థితమై ఉండి; గుణైః — ప్రకృతి గుణములు; యః — ఎవరైతే; న విచాల్యతే — కలతచెందరో; గుణా — ప్రకృతి త్రి-గుణములు; వర్తంతే — ప్రవర్తించుతున్నవి; ఇతి ఏవం — అని తెలుసుకుని; యః — ఎవరైతే; అవతిష్ఠతి — ఆత్మ యందే స్థితమై ఉండి; న ఇంగతే — చలించకుండా ఉంటారు.

Translation

BG 14.22-23: శ్రీ భగవానుడు పలికెను: ఓ అర్జునా, ఈ త్రిగుణములకు అతీతులైనవారు - (సత్త్వ గుణ జనితమైన) ప్రకాశమును కానీ, (రజో గుణ జనితమైన) కార్యకలాపములను కానీ, లేదా (తమో గుణ జనితమైన) మోహభ్రాంతిని కానీ - అవి పుష్కలంగా ఉన్నప్పుడు ద్వేషించరు, లేదా, అవి లేనప్పుడు వాటిని కాంక్షించరు. వారు ప్రకృతి గుణముల పట్ల తటస్థముగా, ఉదాసీనంగా ఉండి, వాటిచే అలజడికి గురికారు. గుణములే ప్రవర్తించుతున్నవని తెలుసుకుని వారు నిశ్చలముగా ఆత్మ యందే స్థితమై ఉంటారు.

Commentary

శ్రీ కృష్ణుడు ఇప్పుడు ఈ యొక్క త్రిగుణములకు అతీతులైన వారి యొక్క లక్షణములను వివరిస్తున్నాడు. ప్రపంచంలో ఈ త్రి-గుణములు ప్రవర్తిల్లటం చూసినప్పుడు, వాటి ప్రభావం మనుష్యులలో, వస్తువులలో మరియు వాటి చుట్టూ ఉండే పరిస్థితులలో వ్యక్తమైనప్పుడు వారు చలింపరు. జ్ఞానోదయమైన వారు అజ్ఞానమును చూసినప్పుడు దానిని ద్వేషింపరు, లేదా దానిలో చిక్కుకోరు. ప్రాపంచిక మనస్తత్వం కలవారు ఈ ప్రపంచ స్థితిగతులపై మరీ ఎక్కువగా చింతిస్తూఉంటారు. వారి యొక్క సమయాన్ని మరియు శక్తిని ప్రపంచం లోని పరిస్థితులపై తలపోస్తూ గడుపుతారు. జ్ఞానోదయమైన మహాత్ములు కూడా మానవ సంక్షేమం కోసమే పని చేస్తుంటారు, కానీ వారు అలా ఎందుకు చేస్తారంటే అది వారి సహజ స్వభావం కాబట్టి. అదే సమయంలో, ఈ జగత్తు అంతా భగవంతుని నియంత్రణలో ఉన్నది అని కూడా వారికి తెలుసు. కేవలం తమ శక్తానుసారం పని చేయాలి మరియు మిగతాది ఆ భగవంతునికే విడిచిపెట్టాలి అని వారికి తెలుసు. ఈ భగవంతుని యొక్క జగత్తు లోనికి వచ్చిన తరువాత మన యొక్క ప్రధానమైన కర్తవ్యం మన అంతఃకరణ శుద్ధి కోసం పరిశ్రమించటమే. ఆ తదుపరి, శుద్ధమైన పవిత్రమైన అంతఃకరణతో మనం సహజంగానే, ప్రపంచ పరిస్థితులు మనలను తీవ్రంగా ప్రభావితం చేయనీయకుండా, ప్రపంచంలో సత్కార్యములు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు, ‘మీరు ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును మీతోనే ప్రారంభించండి’ (Be the change that you wish to see in the world.)

జ్ఞానోదయమయిన మహాత్ములు, త్రి-గుణములు చేసే పనులకు తాము అతీతులమని తెలుసుకున్నవారు, ప్రకృతి యొక్క త్రిగుణములు జగత్తులో వాటివాటి సహజ స్వభావ పనులు చేస్తుంటే, హర్షమునకు కానీ లేదా శోకమునకు కానీ గురికారు. నిజానికి, వారి మనసులోనే ఈ గుణములను గమనించినా, వారు కలత చెందరు. ఈ మనస్సు భౌతిక శక్తిచే తయారుచేయబడినది, అందుకే దానికి ప్రకృతి సహజమైన మాయా త్రి-గుణములు ఉంటాయి. కాబట్టి, మనస్సు సహజంగానే ఈ గుణములచే మరియు వాటివాటి అనుగుణముగా వచ్చే తలంపులచే ప్రభావితం అవుతుంది. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే, శారీరక దృక్పథంలో, మనము మన మనస్సుని మనకంటే వేరుగా చూడము. కాబట్టి, మనస్సు ఏదైనా కలవరపరిచే ఆలోచనను సృష్టిస్తే, మనము ఇలా అనుకుంటాము, ‘ఓ, ఇలాగ నేను చెడుగా ఆలోచిస్తున్నాను.’ అని. ఆ విషపు ఆలోచనలను మనవే అనుకుంటాము, వాటిని మనయందే ఉండనించి అది మన అధ్యాత్మికతని దెబ్బ తీసేటట్లు చేసుకుంటాము. ఒకవేళ మనస్సు భగవంతుడు లేదా గురువు పట్ల కూడా వ్యతిరేక ఆలోచనను పుట్టిస్తే, ఆ ఆలోచన మనదే అనుకుంటాము. ఒకవేళ, ఆ సమయంలో, మనం, మనస్సుని మనకంటే వేరుగా పరిగణిస్తే, మనము అటువంటి విషపు ఆలోచన నుండి దూరం జరిగిపోవచ్చు. అప్పుడు మన మనస్సు యొక్క ఆలోచనను తిరస్కరిస్తూ ఇలా అనుకోవచ్చు, ‘నా భక్తికి సహకరించే విధంగా ఉండని ఏ ఆలోచనతో కూడా నాకు సంబంధం లేదు’ అని. అలౌకికమైన స్థితిలో ఉండే మహాత్ములు, గుణముల ప్రభావం వలన తమ మనస్సులో పుట్టే అన్ని చెడు తలంపుల నుండి తమను తాము దూరం చేసుకునే కళను బాగా అభ్యసించిన వారే.