దాతవ్యమితి యద్దానం దీయతేఽనుపకారిణే ।
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ।। 20 ।।
దాతవ్యం — దానము చేయాలి కాబట్టి; ఇతి — ఈ విధముగా; యత్ — ఏదైతే; దానం — దానము; దీయతే — ఇవ్వబడునో; అనుపకారిణే — మళ్ళీ తిరిగి ఇవ్వలేని వానికి; దేశే — సరియైన ప్రదేశంలో; కాలే — సరియైన సమయంలో; చ — మరియు; పాత్రే — పాత్రత కలిగిన వానికి; చ — మరియు; తత్ — అది; దానం — దానము; సాత్త్వికం — సత్త్వ గుణములో ఉన్న; స్మృతమ్ — అని పేర్కొనబడినది.
Translation
BG 17.20: దానము చేయుట తన కర్తవ్యము అని భావించి, తగిన పాత్రత ఉన్నవారికి, ప్రతిఫలాపేక్ష లేకుండా, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో దానము చేయుట అనేది సత్త్వగుణ దానము అని చెప్పబడుతుంది.
Commentary
మూడు విధముల దానములు ఇక ఇప్పుడు వివరించబడుతున్నాయి. శక్తానుసారం దానము ఇవ్వటం అనేది మన కర్తవ్యముగా చేయాలి. భవిష్య పురాణం ఇలా పేర్కొంటున్నది: దానమేకం కలౌ యుగే , ‘కలి కాలంలో దానం చేయటమే అంతఃకరణ శుద్ధికి మార్గము.’ రామాయణం కూడా ఇలా పేర్కొంటున్నది:
ప్రగట చారి పద ధర్మ కే కలి మహుఁ ఏక్ ప్రధాన
జేన కేన బిధి దీన్హేం దాన కరఇ కల్యాన
‘ధర్మమునకు నాలుగు మూలసూత్రములు ఉన్నాయి, వాటిలో ఒకటి కలియుగములో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే - ఏ రూపంలోనైనా/పద్ధతిలో అయినా దానం చేయుము - అని.’ దాన ప్రక్రియ ఎన్నో మంచి ఫలితములను ఇస్తుంది. అది ఇచ్చే వాడికి భౌతిక ప్రాపంచిక వస్తువులమీద మమకారాసక్తిని తగ్గిస్తుంది; అది సేవా దృక్పథమును పెంచుతుంది; విశాల హృదయమును ఇస్తుంది; మరియు ఇతరుల పట్ల వాత్సల్య భావమును పెంచుతుంది. కాబట్టి, చాలా మతాల సిద్ధాంతాలు, వ్యక్తి సంపాదనలో పదవవంతు దానము చేయమని ఉపదేశిస్తున్నాయి. స్కంధ పురాణము ఈ విధముగా పేర్కొంటున్నది:
న్యాయోపార్జిత విత్తస్య దశమాంశేన ధీమతః
కర్తవ్యో వినియోగశ్చ ఈశ్వరప్రీత్యర్థమేవ చ
‘నీవు న్యాయముగా సంపాదించిన దానిలో నుండి, పదవవంతు పక్కకు తీసి, మరియు అది నీ కర్తవ్యముగా భావించి, దానిని దానం చేయుము. నీ దానమును ఈశ్వర ప్రీతి కోసమే అర్పితం చేయుము.’ దానము సక్రమమైనదా లేదా, ఉన్నతమైనదా నీచమైనదా, అనేది శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాలను బట్టి నిర్ణయించబడుతుంది. అది ఎప్పుడైతే హృదయపూర్వకంగా అర్హతగల పాత్రుడికి, సరియైన సమయంలో, సరియైన ప్రదేశంలో ఇవ్వబడుతుందో అప్పుడు అది సత్త్వ గుణ దానము అని చెప్పబడుతుంది.