Bhagavad Gita: Chapter 17, Verse 16

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః ।
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ।। 16 ।।

మనః ప్రసాదః — మనస్సులో ప్రశాంతత; సౌమ్యత్వం — సౌమ్యముగా ఉండటము; మౌనమ్ — మౌనము; ఆత్మ-వినిగ్రహః — ఆత్మ నిగ్రహము; భావ-సంశుద్ధిః — భావములో పవిత్రత; ఇతి — ఈ విధముగా; ఏతత్ — ఇవన్నీ; తపః — తపస్సు; మానసమ్ — మనస్సు యొక్క; ఉచ్యతే — చెప్పబడినవి.

Translation

BG 17.16: ఆలోచనలో ప్రశాంతత, మృదుత్వము, మౌనము, ఆత్మ-నిగ్రహము మరియు భావములో పవిత్రత - ఇవన్నీ మనస్సు యొక్క తపస్సు అని పెర్కొనబడినాయి.

Commentary

మనస్సు యొక్క తపస్సు అనేది శరీరము మరియు వాక్కు యొక్క తపస్సుల కంటే ఉన్నతమైనది. ఎందుకంటే, మనస్సుని గెలువ గలిగితే, శరీరము మరియు వాక్కు వాటంతట అవే స్వాధీనములోనికి వస్తాయి, కానీ శరీరము, వాక్కులను గెలిస్తే మనస్సు ఖచ్చితంగా నియంత్రణ లోనికి వచ్చినట్టు చెప్పలేము. నిజానికి మనస్సు యొక్క స్థితి వ్యక్తి యొక్క స్థాయి/దృక్పథమును నిర్ణయిస్తుంది. శ్రీ కృష్ణుడు 6.5వ శ్లోకం లో ఈ విధంగా చెప్పాడు, "నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్దరించుకోనుము, అంతేకాని మరింత పతనం కావద్దు, ఎందుకంటే మనస్సు మన మిత్రుడుగా ఉండవచ్చు లేదా మన శత్రువుగా అయిపోవచ్చు."

మనస్సుని ఒక పూదోటతో పోల్చవచ్చు, దానిని తెలివిగా సాగు చేసుకోవచ్చు లేదా దానిమటుకు దాన్నే వదిలేయచ్చు. తోటమాలి ఆ స్థలాన్ని పండ్లు, పువ్వులు మరియు కూరగాయలు పెంచుకోవటానికి సాగు చేస్తాడు. అదే సమయంలో ఆయన కలుపుమొక్కలు పెరగకుండా కూడా జాగ్రత్త పడతాడు. అదే విధముగా, మనం స్వంత మనస్సుని ఉన్నత తలపులతో, పవిత్రమైన భావాలతో నింపుకుంటూ, అదే సమయంలో ప్రతికూల, వినాశకర తలపులను ఏరిపారేస్తూ ఉండాలి. ఒకవేళ మనము క్రోధపూరిత, ద్వేశపూరిత, దూషణ, మూర్ఖమైన, విమర్శక, మరియు నిందించే తలంపులను మన మనస్సులో ఉండనిస్తే, అవి మన వ్యక్తిత్వం పైన తీవ్ర వినాశకర ప్రభావం చూపుతాయి. మనస్సుని నియంత్రించటం నేర్చుకుని, దానిని క్రోధము, ద్వేషము, అయిష్టత వంటి వాటి నుండి ప్రభావితం కాకుండా చూసుకోనంతవరకూ, మన మనస్సు నుండి ప్రయోజన కారక పని ఏదీ మనకు లభించదు. భగవంతుని కృప మన హృదయములలో వ్యక్తమవ్వటాన్ని అడ్డుకునే కలుపుమొక్కలు ఇవే.

జనులు, వారి తలంపులు రహస్యమైనవని మరియు అవి వారి మనస్సులోనే ఉంటూ ఇతరులకు ఏమాత్రం తెలియనివి కాబట్టి వాటికి ఎటువంటి బాహ్యమైన పరిణామం ఉండదు అని అనుకుంటారు. ఈ ఆలోచనలే వారి యొక్క అంతర్గత స్వభావాన్ని మరియు బాహ్య వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే మనం ఎవరినైనా చూసినప్పుడు, "ఆయన చాలా మంచివాడిగా, నమ్మకస్తుడిగా ఉన్నట్టు అనిపిస్తున్నది" అని అనుకుంటాము. ఇంకొక వ్యక్తి పట్ల మనం అంటాము, "ఆమె చాలా ప్రమాదకారిగా, మోసగత్తె లాగా అగుపిస్తున్నది, ఆమె నుండి దూరంగా ఉండు" అని. ప్రతి ఒక్కరికి కూడా, వారి వారి ఆలోచనలు/తలపులే వారి స్వరూపాన్ని నిర్ణయిస్తాయి. రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్ ఈ విధంగా అన్నాడు “మన చూపులలోనే, మన నవ్వులోనే, మన అభివాదనలోనే, మన చేతి పట్టు లోనే, అంతా తెలిసి పోతుంది. మనం చేసుకున్న పాపం మనలను అంటుకునే ఉంటుంది, మంచి పనులను కళంకితం చేస్తుంది. మనలను ఎందుకు నమ్మరో తెలియదు. దుష్టగుణము కళ్ళను కప్పివేస్తుంది, బుగ్గలను తగ్గిస్తుంది, ముక్కును నొక్కుతుంది, మరియు ," ఓ మూర్ఖుడా, మూర్ఖుడా !" అని రాజు గారి నుదుటిపై వ్రాస్తుంది (There is full confession in the glances of our eyes, in our smiles, in salutations, in the grasp of the hands. Our sin bedaubs us, mars all the good impressions. Men do not know why they do not trust us. The vice glasses the eyes, demeans the cheek, pinches the nose, and writes, ‘O fool, fool!’ on the forehead of a king). తలంపులను వ్యక్తిత్వం తో జోడిస్తూ ఇంకొక గొప్ప లోకోక్తి ఉన్నది:

“Watch your thoughts, for they become words. (నీ ఆలోచనలను గమనించు, అవే నీ మాటలు అవుతాయి)
Watch your words, for they become actions. (నీ మాటలను గమనించు, అవే నీ పనులు అవుతాయి)
Watch your actions, for they become habits. (నీ పనులను గమనించు, అవే నీ అలవాట్లు అవుతాయి)
Watch your habits, for they become character. (నీ అలవాట్లను గమనించు, అవే నీ ప్రవర్తన అవుతాయి)
Watch your character, for it becomes your destiny. (నీ ప్రవర్తన ను గమనించు, అదే నీ భవితవ్యము అవుతుంది.)

మన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క ప్రతికూల/ద్వేషభావ ఆలోచనతో మనం మనలకే హాని చేకూర్చుకుంటున్నాము, అని మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. అదే సమయంలో, ప్రతిఒక్క మంచి ఆలోచనతో మనలను మనం ఉన్నతంగా తీర్చి దిద్దుకుంటాము. హెన్రీ వాన్ డైక్ దీనిని చాలా స్పష్టముగా తన కావ్యం “Thoughts are things.” లో వివరించాడు.

I hold it true that thoughts are things;
They’re endowed with bodies and breath and wings
That which we call our secret thought
Speeds forth to earth’s remotest spot,
Leaving its blessings or its woes,
Like tracks behind as it goes.
We build our future, thought by thought.
For good or ill, yet know it not,
Choose, then, thy destiny and wait,
For love brings love, and hate brings hate.

మనలో ఉండే ప్రతి ఒక్క తలంపుకి దాని పరిణామాలు ఉంటాయి, ఒక్కొక్క ఆలోచనతో మనం మన భవిష్యత్తుని ఎంచుకుంటాము. ఈ కారణం చేత, మనస్సుని చెడు/ప్రతికూల తలంపుల నుండి దూరంగా చేస్తూ, దానిని సద్భావనతో ఉన్న తలంపులలో ఉంచటం అనేది, మనస్సు యొక్క తపస్సు అని చెప్పబడుతుంది.