Bhagavad Gita: Chapter 17, Verse 8

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః ।
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్త్వికప్రియాః ।। 8 ।।

ఆయుః సత్త్వ — ఆయుష్షును పెంచేందుకు దోహద పడేవి; బల — బలము; ఆరోగ్య — ఆరోగ్యము; సుఖ — సుఖము; ప్రీతి — తృప్తి; వివర్ధనాః — పెంచేవి; రస్యాః — రసముతో ఉండి; స్నిగ్ధాః — చిక్కటి రసభరితమై; స్థిరాః — పోషకములతో ఉండేవి; హృద్యాః — మనస్సుకు ప్రీతి కలిగించేవి; ఆహారాః — ఆహారము; సాత్త్విక-ప్రియాః — సత్త్వ గుణము ప్రధానముగా ఉండేవారికి ప్రియమైనవి.

Translation

BG 17.8: సత్త్వగుణ ప్రధానముగా ఉండేవారు, ఆయుష్షుని పెంచేవి, మరియు సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, మరియు తృప్తిని పెంచేవాటిని ఇష్టపడుతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకములతో కూడినవై, మరియు సహజంగానే రుచిగా ఉంటాయి.

Commentary

14వ అధ్యాయము, 6వ శ్లోకములో, శ్రీ కృష్ణుడు, సత్త్వ గుణము స్వచ్ఛమైనది, తేజోవంతమయినది, మరియు ప్రశాంతమైనది అని మరియు అది ఒకలాంటి సంతోషమును మరియు తృప్తిని కలుగచేస్తుంది అని చెప్పి ఉన్నాడు. సాత్త్విక ఆహారము కూడా ఇదే విధమైన ప్రభావమును కలిగి ఉంటుంది. ఈ పై శ్లోకములో, ఈ రకమైన ఆహారములు 'ఆయుః సత్త్వ' అంటే, ‘ఆయుష్షును పెంచేవి’ అని చెప్పబడ్డాయి. అవి మంచి ఆరోగ్యమును, సద్గుణములను, ఆనందమును, మరియు సంతుష్టిని కలుగ చేస్తాయి. ఇటువంటి ఆహారములు రసభరితంగా, సహజంగానే రుచిగా, ఘాటుగా లేకుండా మరియు మేలుకలిగించేవిగా ఉంటాయి. ధాన్యములు, పప్పులు, బీన్స్, పండ్లు, కూరగాయలు, పాలు, మరియు ఇతర శాఖాహార పదార్థములు వంటివి.

కాబట్టి, శాఖాహార భోజనము ఆధ్యాత్మిక జీవనానికి అనుగుణముగా సత్త్వ గుణము పెంపొందించుకోవటానికి వీలుగా ఉంటుంది. ఎంతోమంది సాత్త్విక (సత్త్వ గుణ ప్రధానముగా ఉన్నవారు) మేధావులు మరియు తత్త్వవేత్తలు ఈ భావాన్నే వ్యక్తీకరించారు:

మానవుడు మాంసం తినే జంతువుగా ఉండటం ఒక కళంకం కాదా? నిజమే, మనిషి ఇతర జంతువులను చంపి జీవనం సాగించే శక్తి ఉన్నవాడే, అలాగే చేస్తున్నాడు కూడా; కానీ ఇది చాలా హేయమైన పద్ధతి... మానవ జాతి భవితవ్యంలో, దాని యొక్క క్రమేపి జరిగే పరిణితి క్రమంలో – మరింత నాగరిక సమాజంతో సంపర్కం జరిగిన పిదప, అడవి జాతులు ఒకరినొకరు తినటం ఆపేసినట్టు, మనుష్యులు జంతువులను తినటం విడిచిపెట్టేస్తారు - అనటంలో నాకు ఎటువంటి సంశయం లేదు;

— వాల్డెన్ లో హెన్రీ డేవిడ్ థోరో

నేను మాంసం తినడానికి నిరాకరించడం అప్పుడప్పుడూ అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నా విలక్షణత్వం వల్ల చీవాట్లు తినాల్సివచ్చేది, కానీ, ఈ తేలికైన ఆహారంచేత, మానసిక స్పష్టత మరియు శీఘ్ర గ్రహణశక్తికి సంబంధించి, నేను గొప్ప పురోగతిని సాధించాను. మాంసం తినటం అనేది అకారణ హత్యయే.

— బెంజమిన్ ఫ్రాంక్లిన్.

శాఖాహారము మనల్ని మానసికంగా చేతకానివాళ్లను, స్తబ్ధంగా, లేదా అచేతనముగా తయారుచేసింది అన్న తప్పుడు భావనను మనం సరిదిద్దటం ఆవశ్యకం. మాంసాహారము ఏ పరిస్థితులలోనైనా అవసరము అని నేను భావించటంలేదు.

— మహాత్మా గాంధీ.

‘ప్రియజనులారా, మీ శరీరములను పాపిష్టి ఆహారంతో అపవిత్రం చేయవద్దు. మనకు మొక్కజొన్న మరియు ఆపిల్ పళ్ళు , తమ బరువుతో శాఖలను క్రిందికి వంచి ఉన్నాయి. పొయ్యి మీద ఉడికించి మృదువుగా చేసుకొనగలిగే కూరగాయలు ఉన్నాయి. ఈ భూమి మనకు ఏంతో వైభవోపేతమయిన, సున్నితమైన ఆహారములు ఇవ్వగలదు; ఎటువంటి రక్తపాతం లేని విందులను ఏర్పాటుచేయగలదు. క్రూర-పశువులు మాత్రమే ఇలా మాంసంతో తమ ఆకలిని తీర్చుకుంటాయి. పశువుల్లో కూడా అన్నీ మాంసం తినవు, ఎందుకంటే గుర్రాలు, గొడ్లు, మరియు గొఱ్ఱెలు గడ్డి మాత్రమే తింటాయి.

— పైథాగరస్.

నా పొట్టను, చచ్చిన జంతువుల స్మశానం చేయటం నాకు ఇష్టం లేదు.

— జార్జ్ బెర్నార్డ్ షా

జంతువుల పట్ల హింసలో కూడా, ఆవు (గోవు)ని సంహరించటం అత్యంత హేయమైనది. ఆవు మానవుల కోసం పాలు ఇస్తుంది, కాబట్టి అది మానవులకు తల్లి (అమ్మ) వంటిది. అది పాలు ఇవ్వలేని పరిస్థితిలో అయినప్పుడు, అమ్మ లాంటి ఆవుని సంహరించటం అనేది అమానుషము, మొరటుపని, మరియు కృతజ్ఞతలేని పని.