Bhagavad Gita: Chapter 6, Verse 41-42

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః ।
శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోఽభిజాయతే ।। 41 ।।
అథవా యోగినామేవ కులే భవతి ధీమతామ్ ।
ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ ।। 42 ।।

ప్రాప్య — పొందును; పుణ్య-కృతాం — పుణ్యాత్ముల; లోకాన్ — లోకాలు; ఉషిత్వా — నివసించిన పిదప; శాశ్వతీః — చాలా; సమాః — యుగాలు; శుచీనాం — ధర్మపరాయణుల; శ్రీ-మతాం — సంపన్నుల; గేహే — ఇంటియందు; యోగ-భ్రష్టః — యోగములో సాఫల్యము పొందలేక పోయినవారు; అభిజాయతే — పుట్టెదరు; అథవా — లేదా; యోగినాం — దివ్య జ్ఞానము ప్రసాదించబడ్డ వారి; ఏవ — ఖచ్చితముగా; కులే — కుటుంబములో; భవతి — జన్మించెదరు; ధీ-మతాం — వివేకవంతుల; ఏతత్ — ఇది; హి — నిజముగా; దుర్లభ-తరం — చాలా దుర్లభము; లోకే — ఈ లోకంలో; జన్మ — పుట్టుక; యత్ — ఏదైతే; ఈదృశమ్ — ఇటువంటి.

Translation

BG 6.41-42: యోగ భ్రష్టులైన వారు (ఈ జన్మలో యోగములో సాఫల్యత సాధించలేకపోయిన వారు), పుణ్య లోకాలకు వెళతారు. అక్కడ చాలా కాలం నివసించిన పిదప, వారు తిరిగి భూలోకంలో, ధర్మపరాయణుల మరియు సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. లేదా, ఏంతో కాలం యోగ అభ్యాసము వలన వైరాగ్యం వృద్ధి చెందిన వారయితే, దివ్యజ్ఞాన సంపన్నుల కుటుంబంలో జన్మిస్తారు. ఇటువంటి జన్మ చాలా లోకంలో చాలా దుర్లభము.

Commentary

ప్రాపంచిక పుణ్య కార్యాలు చేసినవారికి, వేదాలలో చెప్పబడిన సకామ కర్మ కాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసం ప్రసాదించబడుతుంది. మరైతే, యోగభ్రష్టుడు ఈ స్వర్గ లోకాలకు ఎందుకు పోవాలి? దీనికి కారణం ఏమిటంటే, యోగమునకు (భగవంతునితో సంయోగం) వ్యతిరేకమైనది భోగము (భౌతిక అనుభూతులు). భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడై పోతాడు. కాబట్టి భగవంతుడు, దయాళువైన తండ్రి లాగా, ఓ పడిపోయిన యోగికి, భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి, అవన్నీ వ్యర్థమైనవి, అవి ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తాడు. కాబట్టి, భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గ లోకాలకు పంపబడి, తిరిగి ఈ భూలోకానికి పంపబడుతాడు.

ఇటువంటి జీవులకు తమ ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగించటానికి అవకాశం ఉండే కుటుంబంలో జన్మ ఇవ్వబడుతుంది. శుచీ అంటే పవిత్రమైన మరియు మంచి నడవడిక కలవారు అని అర్థం; శ్రీ అంటే సంపన్నులు అని అర్థం. యోగ భ్రష్టులైన వారు, పవిత్రమైన కుటుంబంలో చిన్నప్పటి నుండే ఆధ్యాత్మికత నేర్పించే వారికి జన్మిస్తారు లేదా సంపన్నుల కుటుంబంలో, భౌతిక అవసరాలు అన్నీ తీరి, బతుకు తెరువు కోసం రోజూ ప్రయాస పడే అవసరం లేని వారికి జన్మిస్తారు. ఇటువంటి కుటుంబ వాతావరణం ఆధ్యాత్మిక పరిశ్రమలో నిమగ్నమవటానికి, అటువంటి ఆసక్తి కల జీవులకు అనుకూలంగా ఉంటుంది.

మనం పుట్టిన పరిస్థితులు, స్థానము, మరియు కుటుంబము అనేవి మన జీవితంపై ఎంతో ప్రభావం కలిగి ఉంటాయి. మన శారీరిక తల్లిదండ్రుల నుండి మనం వంశపారంపర్యమైన గుణాలను పొందుతాము. ఇది జన్యు సంబంధమైన వంశపారంపర్య పద్దతి. కానీ, సామాజిక వారసత్వ పద్దతి కూడా ఉంటుంది. మనం చాలా ఆచారాలని మనం పెరిగిన వాతావరం వలన గుడ్డిగా పాటిస్తుంటాము. మనం భారతీయులమా, అమెరికన్లమా, బ్రిటిష్ వారిమా అని, మనకు మనం ఎంచుకోము. మన జన్మ ప్రకారం మనం ఎదో ఒక జాతీయతను ఆపాదించుకొనటమే కాకుండా వేరే దేశీయులతో శతృత్వం కూడా పెంచుకునేంత వరకు పోతాము. ఖచ్చితంగా మనం, సామాజిక వారసత్వంలో భాగంగా మన తల్లిదండ్రుల మతాన్నే అనుసరిస్తాము.

ఈ విధంగా, మనం పుట్టిన స్థలం మరియు కుటుంబం మన జీవిత గమనం మరియు పురోగతిపై చాలా చాలా ప్రభావం కలిగి ఉంటాయి. ఒకవేళ, ప్రతి జన్మలో, పుట్టే స్థలం మరియు కుటుంబం ఎదో కాకతాళీయంగా నిర్ణయించబడితే ఈ ప్రపంచంలో న్యాయం లేనట్టే. కానీ, మన యొక్క అనంతమైన జన్మల తలంపులు, పనుల చిట్టా భగవంతుని దగ్గర ఉంది. కర్మ సిద్ధాంత శాసనముని అనుసరించి, యోగంలో సాఫల్యం పొందలేకపోయిన యోగి యొక్క పూర్వ జన్మ ఆధ్యాత్మిక సంపద, దాని ఫలములను ఇస్తుంది. ఆ ప్రకారంగానే, ఎంతో పురోగతి సాధించి మరియు వైరాగ్యం పెంపొందించుకున్న యోగులు, స్వర్గ/పుణ్య లోకాలకు పంపబడరు. వారికి, తమ ప్రయాణం ముందుకు తీసుకువెళటానికి అనుకూలముగా, ఆధ్యాత్మికతలో ఉన్నతమైన దశలో ఉన్న కుటుంబంలో ఇక్కడే జన్మ ఇవ్వబడుతుంది. అటువంటి జన్మ అత్యంత భాగ్యవంతమైనది ఎందుకంటే, ఆ తల్లిదండ్రులు తమ పిల్లలకి చిన్నతనం నుండే ఆధ్యాత్మిక దివ్య జ్ఞానాన్ని బోధిస్తుంటారు.