7వ అధ్యాయము: జ్ఞాన విజ్ఞాన యోగము

జ్ఞాన విజ్ఞాన యోగము

భగవంతుని శక్తుల యొక్క భౌతిక మరియు ఆధ్యాత్మిక విస్తారాన్ని వివరించటంతో ఈ అధ్యాయం మొదలౌతుంది. ఇవన్నీ కూడా తన నుండే ఉద్భవించాయని, దారంలో గుచ్చబడిన పూసల వలె తన యందే స్థితమై ఉన్నాయని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఆయనే ఈ సమస్త సృష్టికి మూలము, మరియు మళ్ళీ ఇదంతా ఆయనలోకే తిరిగి లయమైపోతుంది. ఆయన యొక్క భౌతిక ప్రాకృతిక శక్తి, మాయ, బలీయమైనది దానిని అధిగమించటం చాలా కష్టము, కానీ, ఆయనకి శరణాగతి చేసినవారు ఆయన కృపకు పాత్రులై, మాయను సునాయాసముగా దాటిపోగలరు. తనకు శరణాగతి చేయని నాలుగు రకాల మనుష్యుల గూర్చి, మరియు తన యందు భక్తిలో నిమగ్నమయ్యే నాలుగు రకాల మనుష్యుల గురించి శ్రీ కృష్ణుడు వివరిస్తాడు. తన భక్తులలో, ఎవరైతే జ్ఞానముతో తనను భజిస్తారో, తమ మనోబుద్ధులను ఆయనతో ఐక్యం చేస్తారో, వారు తనకు అత్యంత ప్రియమైన వారిగా పరిగణిస్తాను అని అంటున్నాడు. తమ బుద్ధి ప్రాపంచిక కోరికలతో కొట్టుకోపోయిన కొందరు, దేవతలకు శరణాగతి చేస్తారు. కానీ, ఈ దేవతలు కేవలం తాత్కాలిక భౌతిక ఫలాలని మాత్రమే ఇవ్వగలరు, వాటిని కూడా తమకు భగవంతుడు ప్రసాదించిన శక్తి ద్వారానే ఇస్తారు. అందుకే, మనం భక్తితో నిమగ్నమవ్వటానికి, భగవంతుడే అత్యంత యోగ్యుడు. సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వము మరియు సర్వశక్తిమత్వం వంటి దివ్య గుణములను కలిగి ఉండి, తనే పరమ సత్యమని మరియు అంతిమ లక్ష్యమని, శ్రీ కృష్ణుడు వక్కాణిస్తున్నాడు. కానీ, ఆయన నిజ వ్యక్తిత్వం, తన యోగమాయా శక్తి యొక్క తెరచే కప్పివేయబడి ఉంది, అందుకే తన యొక్క దివ్య మంగళ స్వరూపము యొక్క నిత్య శాశ్వతమైన స్వభావం అందరికీ తెలియదు. ఆయనను మనం ఆశ్రయిస్తే, ఆయనే తన గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మరియు ఆయనను తెలుసుకున్న తరువాత మనకు కూడా ఆత్మ జ్ఞానము మరియు కర్మ-క్షేత్రము గురించి జ్ఞానం, అవగతమవుతుంది. 

భగవంతుడు పలికెను: ఓ అర్జునా, నాయందు మాత్రమే మనస్సు నిలిపి, భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా, సందేహానికి తావు లేకుండా తెలుసుకొనగలవో, ఇప్పుడు వినుము.

ఏ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకున్న పిదప ఇంకా ఏమీ తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో, దానిని నేను నీకు సంపూర్ణముగా తెలియచేస్తాను.

వేల మందిలో ఏ ఒక్కరో పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు; మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఎవరో ఒకరు మాత్రమే నన్ను యదార్థముగా తెలుసుకుంటారు.

భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.

ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.

సమస్త జీవ రాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తిస్థానము మరియు నా లోనికే ఇది అంతా లయమై పోతుంది.

నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.

నీటి యందు రుచిని నేను, ఓ కుంతీ పుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారమును (ప్రణవము); ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును.

భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలోని తేజస్సును నేనే. సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే, మరియు తాపసులలో తపస్సును నేనే.

ఓ అర్జునా, సమస్త ప్రాణులకూ సనాతనమైన మూల బీజము నేనే అని తెలుసుకొనుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని నేనే.

భరత వంశీయులలో శ్రేష్ఠుడా, బలవంతులలో కామరాగరహితమైన బలము నేను. ధర్మ విరుద్ధముకాని, శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియలను నేనే.

భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణములు — సత్త్వము, రజస్సు, తమస్సు — నా శక్తి ద్వారానే వ్యక్తమైనాయి. అవి నా యందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతుడను.

మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై (మోహితులై), ఈ లోకంలోని జనులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు.

ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.

నాలుగు రకాల మనుష్యులు నాకు శరణాగతి చేయరు — జ్ఞానము లేని వారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్నా సోమరితనంతో తమ నిమ్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమకు గురైనవారు, మరియు ఆసురీ ప్రవృత్తి కలవారు.

ఓ భరతశ్రేష్ఠుడా, నాలుగు రకముల ధర్మ-పరాయణులు నా పట్ల భక్తితో నిమగ్నమౌతారు — ఆపదలో ఉన్నవారు, జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నించేవారు, ప్రాపంచిక వస్తువుల సంపాదన కోసం చూసేవారు, మరియు జ్ఞానము నందు స్థితులై ఉన్న వారు.

వీరందరిలో కెల్లా, జ్ఞానంతో నన్ను పూజించే వారు, మరియు నా పట్ల దృఢ సంకల్పముతో మరియు అనన్య భక్తితో ఉన్నవారిని, అందరి కంటే, శ్రేష్ఠమైన వారిగా పరిగణిస్తాను. నేను వారికి ప్రియమైనవాడిని మరియు వారు నాకు ప్రియమైనవారు.

నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో ఉండి, దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.

ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడైన వ్యక్తి, ఉన్నదంతా నేనే అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.

భౌతిక ప్రాపంచిక కోరికలచేత జ్ఞానం కొట్టుకొని పోయినవారు అన్య దేవతలకు శరణాగతి చేస్తారు. వారి స్వీయ స్వభావాన్ని అనుసరిస్తూ అన్య దేవతలను ఆరాధిస్తారు; దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఆయా కర్మ కాండలను ఆచరిస్తారు.

భక్తుడు విశ్వాసంతో ఏ ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధించాలని కోరుకుంటాడో, ఆ భక్తుడికి ఆయా స్వరూపం మీదనే శ్రద్ధ నిలబడేటట్టు చేస్తాను.

శ్రద్ధా విశ్వాసము కలిగి ఉన్న ఆ భక్తుడు ఆ దేవతనే ఆరాధించును మరియు కోరుకున్న సామాగ్రిని పొందును. కానీ, నిజానికి ఆ ప్రయోజనాలని సమకూర్చి పెట్టేది నేనే.

కానీ ఈ అల్ప-జ్ఞానము కలిగిన జనులు పొందే ఫలము తాత్కాలికమైనది. దేవతలను ఆరాధించే వారు ఆయా దేవతల లోకానికి వెళతారు, అదే సమయంలో, నా భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు.

పరమేశ్వరుడైన నన్ను, శ్రీ కృష్ణుడిని, ఒకప్పుడు నిరాకార అవ్యక్తముగా ఉండి ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకున్నానని, అల్ప జ్ఞానము కలవారు అనుకుంటారు. అక్షరమైన, సర్వోత్కృష్టమైన ఈ నాయొక్క సాకార రూపాన్ని వారు అర్థం చేసుకోలేకున్నారు.

నా యోగమాయా శక్తి ద్వారా కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరించను. కాబట్టి జ్ఞానము లేని వారు నేను పుట్టుక లేని వాడినని మరియు మార్పుచెందని వాడినని తెలుసుకోలేరు.

అర్జునా! నాకు భూత, వర్తమాన, భవిష్యత్తు అంతా తెలుసు, మరియు సమస్త ప్రాణులు అన్నీ తెలుసు; కానీ నేను ఎవరికీ తెలియను.

ఓ భరత వంశస్థుడా, రాగ, ద్వేషములనే ద్వంద్వములు, మోహము (భ్రాంతి) నుండే పుట్టుచున్నవి. ఓ శత్రువులను జయించేవాడా, ఈ భౌతిక జగత్తులో ఉన్న ప్రతి ప్రాణి కూడా పుట్టుక నుండే వీటిచే భ్రమింపజేయబడుచున్నది.

పుణ్య కార్యములు ఆచరించుటచే ఎవరి పాపములు అయితే పూర్తిగా నశించిపోయినవో, వారు ఈ ద్వంద్వముల మోహము నుండి విముక్తి పొందుతారు. అటువంటి వారు నన్ను దృఢ సంకల్పముతో పూజిస్తారు.

ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందటానికి పరిశ్రమిస్తూ, నన్ను ఆశ్రయించిన వారు, బ్రహ్మంను, తమ ఆత్మ తత్త్వమును, సమస్త కర్మ క్షేత్రమును తెలుసుకుంటారు.

సమస్త అధిభూత (పదార్థ క్షేత్రము), అధిదైవ (దేవతలు), మరియు అధియజ్ఞము (యజ్ఞములకు ఈశ్వరుడు) లకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమయిన జీవాత్మలు, మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు.