Bhagavad Gita: Chapter 7, Verse 6

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ।। 6 ।।

ఏతత్ యోనీని — ఈ రెండు (శక్తులు) మూలాధారము; భూతాని — ప్రాణులు; సర్వాణి — సమస్త; ఇతి — అది; ఉపధారయ — తెలుసుకొనుము; అహం — నేను; కృత్స్నస్య — సమస్త; జగతః — సృష్టి (జగత్తు); ప్రభవః — ఉత్పత్తిస్థానము; ప్రలయ — లయము; తథా — కూడా.

Translation

BG 7.6: సమస్త జీవ రాశులు నా యొక్క ఈ రెండు శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అని తెలుసుకొనుము. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తిస్థానము మరియు నా లోనికే ఇది అంతా లయమై పోతుంది.

Commentary

ఈ జడపదార్థము మరియు జీవశక్తుల సంయోగం వలనే, భౌతిక జగత్తులో ఉన్న సమస్త జీవరాశి ఉద్భవిస్తుంది. తనంతట తానుగా అయితే, పదార్థము జడమైనది; ఆత్మకి శరీరం రూపంలో ఒక వాహనం అవసరం. ఈ రెండు శక్తుల సంయోగం వలన, ప్రాణులు వ్యక్తమవుతాయి.

భగవంతుడే ఈ రెండు శక్తులకి మూల స్థానం; సమస్త సృష్టి ఆయన నుండే వ్యక్తమౌతుంది. బ్రహ్మగారి యొక్క నూరు సంవత్సరములు పూర్తయినప్పుడు, ఈ సృష్టి చక్రం ముగింపు దశ చేరుకున్నప్పుడు, భగవంతుడు ఈ సృష్టిని లయము చేస్తాడు. ఐదు స్థూల మూలకాలు, ఐదు సూక్ష్మతత్త్వాలలో విలీనమౌతాయి; ఐదు సూక్ష్మతత్త్వాలు అహంకారంలో విలీనమౌతాయి; అహంకారము మహాత్తులోనికి లీనమవుతుంది. మహత్తు అనేది ప్రకృతి లోనికి విలీనమవుతుంది. ప్రకృతి, శ్రీ మహా విష్ణువు శరీరం లోనికి వెళ్లి కూర్చుంటుంది. ఈ ప్రస్తుత సృష్టి చక్రంలో మోక్షము పొందలేక పోయిన జీవులు (ఆత్మలు) కూడా భగవంతుని శరీరంలో అవ్యక్త రూపంలో, తదుపరి సృష్టి చక్రం కోసం వేచి ఉంటారు. మరొకసారి, భగవంతుడు సృష్టి చేయటం సంకల్పించినప్పుడు, ఈ చక్రం మొదలౌతుంది (7.4వ శ్లోక వ్యాఖ్యానంలో చెప్పినట్టుగా) మరియు ఈ జగత్తు వ్యక్తమవుతుంది. కాబట్టి, సమస్త సృష్టికి, సర్వ-భూతములకూ, భగవంతుడే జన్మ స్థానము, ఆధారము మరియు అంతిమ శాంతి స్థానం.