భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా ।। 4 ।।
భూమిః — భూమి (నేల); ఆపః — నీరు; అనలః — అగ్ని; వాయుః — గాలి; ఖం — ఆకాశం (ఖాళీ స్థలము); మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; ఏవ — నిజముగా; చ — మరియు; అహంకారః — అహంకారము; ఇతి — ఇవి; యం — ఇవన్నీ; మే — నా యొక్క; భిన్నా — వివిధములైన; ప్రకృతిః — భౌతిక ప్రాకృతిక శక్తి; అష్టధా — ఎనిమిది రకములు.
Translation
BG 7.4: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు.
Commentary
ఈ జగత్తుని కూర్చిన భౌతిక శక్తి, అద్భుతమైన వైవిధ్యం కలది మరియు నిగూఢమైనది. దీనిని వర్గీకరణ చేస్కుంటే, మన పరిమితమైన బుద్ధులకి కాస్త అర్థం అవుతుంది. కానీ, ఈ ప్రతి ఒక్క వర్గంలో కూడా అసంఖ్యాకమైన ఉప-వర్గాలు ఉన్నాయి. ఆధునిక శాస్త్రంలో అనుసరించే వర్గీకరణ ఏమిటంటే, అక్కడ పదార్థాన్ని మూలకముల సమ్మేళనముగా పరిగణిస్తారు. ప్రస్తుతం, 118 మూలకాలు కనుగొనబడి పీరియాడిక్ టేబుల్‌లో పొందుపరచబడ్డాయి. భగవద్గీతలో మరియు సాధారణంగా వైదిక తత్త్వజ్ఞానంలో, సమూలమైన వేరే పద్ధతి వాడబడింది. పదార్థాన్ని ప్రకృతి అంటారు, అంటే భగవంతుని శక్తి, మరియు ఈ శక్తి యొక్క ఎనిమిది అంగాలని ఈ శ్లోకంలో చెప్పటం జరిగింది. ఆధునిక శాస్త్ర పద్ధతి యొక్క సహాయంతో ఇది ఎంత అద్భుతమైన పరిజ్ఞానమో మనం అర్థం చేసుకోవచ్చు.
1905లో, తన ఆనస్ మరాబులస్ (Annus Mirabilis) సంకలనంలో, ఆల్బర్ట్ ఐన్-స్టీన్, మొదటిసారి ద్రవ్యరాశి-శక్తి యొక్క సమత్వాన్ని ప్రతిపాదించాడు. ద్రవ్యాన్ని శక్తిగా మార్చుకోగలిగే అవకాశం ఉంది అని చెప్పాడు; ఇది E = MC2 అన్న సూత్రం ప్రకారం జరుగుతుంది. ఈ దృక్పథం, అంతకు క్రితం వరకూ న్యూటన్ పరంగా, విశ్వమంతా ఘన పదార్థము తోనే ఉంది అన్న అవగాహనని సమూలంగా మార్చివేసింది. తర్వాత 1920 దశకంలో నీల్స్ బోర్ (Neils Bohr) మరియు ఇతర శాస్త్రవేత్తలు క్వాంటం థియరీ ప్రతిపాదించారు, దీనిలో ‘ద డ్యూయల్ పార్టికల్-వేవ్ నేచర్ అఫ్ మేటర్’ (the dual particle-wave nature of matter) ను ప్రతిపాదించారు. అప్పటి నుండి, శాస్త్రవేత్తలు, అన్ని పదార్థాలను, శక్తులను కలిపి ఒకే పరం గా అర్థం చేసుకోవటానికి వీలుగా ఒక ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ (Unified Field Theory) కోసం అన్వేషిస్తున్నారు.
శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఐదువేల సంవత్సరముల క్రితం, ఆధునిక శాస్త్రం అభివృద్ధి చెందక ముందే చెప్పిన విషయం, ఒక సంపూర్ణ ‘యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ’ (Unified Field Theory). ఆయన అన్నాడు, ‘అర్జునా, ఈ విశ్వంలో ఉన్నదంతా నా భౌతిక శక్తి యొక్క స్వరూపమే.’ కేవలం ఈ ఒక్క ప్రకృతి శక్తి యే ఇన్ని వివిధ రకాల ఆకారములు, స్వరూపములు, మరియు పదార్థములుగా రూపాంతరం చెందింది. ఇదే విషయం తైత్తిరీయ ఉపనిషత్తులో విస్తారంగా వివరించబడింది.
తస్మద్వా ఏతస్మాదాత్మన ఆకాశః సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృధివీ పృధివ్యా ఔషధయః ఔషధీభ్యోరన్నమ్ అన్నాత్పురుషః స వా ఏషః పురుషః పురుషో అన్నరసమయః (2.1.2)
భౌతికశక్తి యొక్క ప్రప్రథమ మూల స్వరూపము 'ప్రకృతి'. భగవంతుడు ఈ లోకాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు, ఆయన అలా దాని వంక చూస్తాడు, దీనితో అది కదిలించబడి, మహాన్ గా వికసిస్తుంది. ఈ మహాన్ మరింత వికసించి అహంకారముగా వ్యక్తమౌతుంది. ఈ మహాన్, అహంకారము రెండూ కూడా ఆధునిక శాస్త్రము కన్నా సూక్ష్మమైనవి. అహంకారము నుండి పంచ-తన్మాత్రలు, అంటే ఐదు గ్రాహ్యతలు — రుచి, స్పర్శ, వాసన, దృష్టి, మరియు శబ్దములు వస్తాయి, వాటి నుండి (ఐదు) పంచ మహా-భూతములు జనిస్తాయి — ఆకాశం, గాలి, అగ్ని, నీరు, మరియు భూమి.
ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పంచ మహా భూతములను తన శక్తి యొక్క రూపాంతరములగా పేర్కొనటమే గాక, మనస్సు, బుద్ధి, మరియు అహంకారములను కూడా తన విశిష్ట శక్తి స్వరూపాలుగా ఇందులో జోడించాడు. ఇవన్నీ కేవలం తన భౌతిక శక్తి, మాయ, యొక్క విభాగాలే అని శ్రీ కృష్ణుడు పేర్కొంటున్నాడు. వీటన్నిటి కన్నా అతీతమైనది 'జీవ శక్తి' (ఆత్మ శక్తి), లేదా భగవంతుని ఉన్నతమైన శక్తి - దీనిని తదుపరి శ్లోకంలో కృష్ణుడు వివరిస్తున్నాడు.