Bhagavad Gita: Chapter 7, Verse 14

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ।। 14 ।।

దైవీ — దివ్యమైన; హి — నిజముగా; ఏషా — ఈ యొక్క; గుణ-మయీ — ప్రకృతి త్రి గుణములతో కూడిన; మమ — నా యొక్క; మాయా — మాయ, భగవంతుని శక్తులలో ఒకటి; భగవత్ ప్రాప్తి పొందటానికి ఇంకా అర్హత సాధించని ఆత్మల నుండి భగవంతుని నిజమైన స్వభావాన్ని దాచి ఉంచునది; దురత్యయా — అధిగమించటానికి చాలా కష్టతరమైనది; మాం — నాకు; ఏవ — ఖచ్చితంగా; యే — ఎవరైతే; ప్రపద్యంతే — శరణాగతి చేసెదరో; మాయాం ఏతాం — ఈ మాయ; తరంతి — దాటిపోవురు; తే — వారు.

Translation

BG 7.14: ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, 'మాయ', అధిగమించుటకు చాలా కష్టతరమైనది. కానీ, నాకు శరణాగతి చేసిన వారు దానిని సునాయాసముగా దాటిపోగలరు.

Commentary

భౌతిక శక్తి అనేది మిథ్య (లేనిది) అని కొంత మంది అంటారు. మనం అజ్ఞానంలో ఉన్నాము కాబట్టి మనకు మాయ గోచరిస్తున్నది అంటారు, ఒకవేళ మనం జ్ఞానంలో స్థితులమై ఉంటే మాయ అనేది ఉండదు, అని అంటారు. భ్రాంతి తొలిగిపోయి, ఆత్మ నే పరమ సత్యమని తెలుసుకుంటామని అంటారు. కానీ, భగవత్ గీత యొక్క ఈ శ్లోకం, ఈ సిద్ధాంతాన్ని కొట్టివేస్తుంది. శ్రీ కృష్ణుడు చెప్పిన ప్రకారం, మాయ అనేది మిధ్య కాదు; అది భగవంతుని యొక్క శక్తి స్వరూపం. శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా ఇలా పేర్కొంటున్నది:

మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌ (4.10)
“మాయ అనేది శక్తి (ప్రకృతి), భగవంతుడు శక్తిమంతుడు.”

రామాయణం ఇలా పేర్కొంటున్నది:

సో దాసీ రఘుబీర కై సముఝేం మిథ్యా సోపి.
“కొంతమంది అనుకుంటారు, మాయ అనేది మిథ్య (లేనిది) అని, కానీ నిజానికి అది భగవత్ సేవలో నిమగ్నమయిన శక్తి స్వరూపం.”

ఇక్కడ, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, మాయ అనేది అధిగమించటానికి చాలా కష్టమైనది. ఎవరైనా మాయను వశపరుచుకున్నారంటే, దాని అర్థం ఆ వ్యక్తి భగవంతుడిని జయించినట్టే. ఎవ్వరూ కూడా భగవంతుడిని జయించలేరు కాబట్టి ఎవ్వరూ కూడా మాయని కూడా జయించలేరు. మరియు, మనస్సు అనేది మాయతో తయారయినదే కాబట్టి, ఏ యోగి, జ్ఞాని లేదా కర్మీ కూడా కేవలం స్వీయశక్తి చే మనస్సుని విజయవంతంగా నియత్రించలేరు.

అప్పుడు అర్జునుడు ఇలా అడగవచ్చు, "నేను మరి ఎలా ఈ మాయను అధిగమించవచ్చు? అని" దీనికి సమాధానాన్ని శ్రీ కృష్ణుడు ఈ శ్లోక రెండవ పాదం లో ఇస్తున్నాడు. "అర్జునా, పరమేశ్వరుడినైన నాకు, నీవు శరణాగతి చేస్తే, అప్పుడు నా కృప చే, నేను నిన్ను ఈ భౌతిక జగత్తు అనే సాగరాన్ని దాటింపచేస్తాను. ఈ జీవాత్మ నాదై పోయింది (నన్ను ఆశ్రయం పొందింది) అని మాయ కు చెప్తాను. దయచేసి దీన్ని విడిచిపెట్టు అని." అని అంటున్నాడు. ఎప్పుడైతే ఈ భౌతిక శక్తికి భగవంతుని నుండి సూచన వస్తుందో, అది ఆత్మను తన బంధము నుండి సునాయాసంగా విడిచిపెడుతుంది. మాయ ఇలా అంటుంది, "నా పని ఇంతే - భగవంతుని చరణములు చేరుకునేంత వరకు జీవాత్మను బాధలకు గురి చేస్తూ ఉండటమే. ఈ జీవాత్మ ఈశ్వర శరణాగతి చేసింది కాబట్టి ఇక నా పని అయిపొయింది."

ఈ విషయాన్ని ఒక రోజువారి సాధారణ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోండి. మీరు మీ స్నేహితుడిని కలవటానికి వెళ్లి, అతని ఇంటి గేటు వద్దకు చేరుకున్నారనుకోండి. ఆయన గేటుకి ఒక బోర్డు కి ఇలా ఉంది "కుక్క ఉన్నది జాగ్రత్త" అని. అతని పెంపుడు జర్మన్ షెపర్డ్ కుక్క లోపల నిలబడి ఉంది మరియు ఒక సుశిక్షితమైన కుక్కలా, మీవైపు కోపంతో గుర్రుమంటుంది. మీరు వెనక గేటు నుండి లోనికి ప్రయత్నిద్దామని గోడ చుట్టూ వెళ్తారు. కానీ, ఆ కుక్క కూడా చుట్టు తిరిగి వచ్చి అదే విధంగా కోపంతో "దమ్ముంటే లోపలి అడుగుపెట్టు" అన్నట్టుగ్గా గుర్రు మంటుంది. ఇక ఏమీ వేరే ఉపాయం లేనప్పుడు మీరు మీ స్నేహితుడుని గట్టిగా పిలుస్తారు. అతను తన ఇంట్లోంచి బయటకు వచ్చి, తన కుక్క మిమ్ములను ఇబ్బంది పెడుతున్నదని చూస్తాడు. అతను ఇలా అరుస్తాడు, "వద్దు స్మోకీ! ఇటొచ్చి కూర్చో." వెంటనే ఆ కుక్క శాంతించి, వచ్చి తన యజమాని చెంతనే కూర్చుంటుంది. ఇక ఇప్పుడు మీరు భయం లేకుండా గేటు తెరిచి లోపలి నడిచి వెళ్తారు. ఇదే విధంగా, మనలను బాధించే భౌతిక మాయా శక్తి కూడా భగవంతుని ఆధీనములో ఉంటుంది. మన స్వీయ ప్రయత్నం ద్వారా మనం దానిని అధిగమించలేము. దానిని దాటే ఉపాయం, భగవంతునికి శరణాగతి అవ్వటమే. ఈ శ్లోకంలో, ఈ విషయం శ్రీ కృష్ణుడిచే బలంగా ధ్రువీకరించబడింది. మనం ఇంత సునాయాసంగా, కేవలం శరణాగతి చేసి మాయని దాటిపోగలిగితే, మరి ఎందుకు మనుష్యులు ఈశ్వరునికి శరణాగతి చేయరు? శ్రీ కృష్ణుడు దీనిని తదుపరి శ్లోకంలో వివరిస్తున్నాడు.