Bhagavad Gita: Chapter 7, Verse 18

ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ ।
ఆస్థితః స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్ ।। 18 ।।

ఉదారాః — మహనీయులు; సర్వే — వీరందరూ; ఏవ — నిజముగా; ఏతే — వీరు; జ్ఞానీ — జ్ఞానులు; తు — కానీ; ఆత్మా-ఏవ — స్వయముగా నేనే; మే — నా యొక్క; మతం — అభిప్రాయము; ఆస్థితః — స్థితుడై ఉండి; సః — ఆ వ్యక్తి; హి — ఖచ్చితంగా; యుక్త-ఆత్మా — ఏకీకృత మైనవారు; మాం — నా యందు; ఏవ — నిజముగా; అనుత్తమాం — సర్వోన్నత; గతిం — లక్ష్యము.

Translation

BG 7.18: నా యందు భక్తితో ఉన్నవారందరూ నిజముగా ఉత్తములే. కానీ, జ్ఞానముతో ఉండి, దృఢనిశ్చయము కలిగి, బుద్ధి నా యందు ఐక్యమై, మరియు కేవలం నన్ను మాత్రమే వారి పరమ లక్ష్యంగా కలిగిఉన్నవారు, స్వయంగా నా స్వరూపమే అని నేను పరిగణిస్తాను.

Commentary

7.17వ శ్లోకంలో జ్ఞానయుక్తుడైన భక్తుడే ఉన్నతమైన వాడు, అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, మిగతా మూడు రకాల భక్తులు కూడా ఆయనకి ప్రియమైన వారే అని వివరణ ఇస్తున్నాడు. ఏ కారణంతో అయితేనేమి, భక్తిలో నిమగ్నమై ఉన్నవారు అందరూ గొప్పవారే అని చెప్తున్నాడు. అయినా, జ్ఞానంలో స్థితులై ఉన్న భక్తులు, భౌతిక వస్తు సంపద కారణాల కోసం భగవంతుడిని పూజించరు. అందుకే, భక్తుల యొక్క ఈ యొక్క నిస్వార్థ, బేషరతుగా ఉన్న ప్రేమకి భగవంతుడు బద్ధుడై పోతాడు.

పరా భక్తి, లేదా దివ్య ప్రేమ, అనేది, ప్రాపంచిక ప్రేమ కంటే చాలా విభిన్నమైనది. దివ్య ప్రేమ అనేది దివ్య సఖుని సంతోషం కోసం పరితపించే స్వభావంతో ఉంటుంది; ప్రాపంచిక ప్రేమ అనేది సొంత-ప్రయోజనం కోసం కోరికచే ప్రేరేపితమైనది. దివ్య ప్రేమ అనేది, సమర్పణ స్వభావంతో మరియు ఇష్టసఖుని సేవలో త్యాగంతో నిండి ఉంటుంది; ప్రాపంచిక ప్రేమ అనేది తీసుకునే దృక్పథంతో ఉంటుంది, దాని అంతిమ లక్ష్యం ప్రేమించిన వారి నుండి ఏదో పొందటమే. చైతన్య మహాప్రభు ఇలా వివరించాడు:

కామేర తాత్పర్య నిజ-సంభోగ కేవల
కృష్ణ-సుఖ-తాత్పర్య-మాత్ర ప్రేమ తా’ ప్రబల
అతఏవ కామ-ప్రేమే బహుత అంతర
కామ అంధ-తమః, ప్రేమ నిర్మల భాస్కర
(చైతన్య చరితామృతము, ఆది లీల 4.166 & 171)

‘కామము (ప్రాపంచిక ప్రేమ) స్వీయ-సంతోషం కోసము ఉంటుంది; దివ్య ప్రేమ శ్రీ కృష్ణుడి సంతోషం కోసం పెంపొందించుకోబడి ఉంటుంది. వీటి మధ్య చాలా పెద్ద తేడా ఉంది - కామము అనేది చీకటి మరియు అజ్ఞానము వంటిది, అదే సమయంలో దివ్య ప్రేమ అనేది స్వచ్ఛమైనది మరియు ప్రకాశవంతమయినది.’ జగద్గురు శ్రీ కృపాలు జీ మహారాజ్ దీనిని చాలా అద్భుతంగా పేర్కొన్నాడు:

బ్రహ్మ లోక్ పర్యంత సుఖ్, అరు ముక్తిహుఁ త్యాగ్,
తబఇ ధరహు పగ ప్రేమ పథ, నహిఁ లగి జైహైఁ దాగ్

(భక్తి శతకము, 45వ శ్లోకం)

‘భక్తి మార్గంలో ప్రయాణించాలంటే, ప్రాపంచిక భౌతిక సుఖాల కోరికలను మరియు మోక్షము కోసం ఉన్న వాంఛను విడిచిపెట్టాలి. లేదా, అలాకాకపొతే దివ్య ప్రేమ అనే స్వచ్ఛమైన నీరు స్వార్థంతో మలినమైపోతుంది.’ నారద మహర్షి స్వచ్ఛమైన ప్రేమను ఈ విధంగా నిర్వచించారు:

తత్ సుఖ సుఖిత్వం (నారద భక్తి దర్శన్, 24వ సూత్రము)

‘నిజమైన ప్రేమ అంటే ఇష్ట సఖుని సంతోషం కోసం ఉన్నదే.’ భౌతిక ప్రాపంచికత్వంతో ప్రేరేపితమైన భక్తులు ఇటువంటి భక్తిలో నిమగ్నం కాలేరు, కానీ జ్ఞానంతో ఉన్న భక్తుడు ఈ నిస్వార్థ స్థాయికి ఎదుగుతాడు. ఎప్పుడైతే ఎవరైనా భగవంతుడిని ఈ విధంగా ప్రేమించటం నేర్చుకుంటారో, ఆయన ఆ భక్తునికి బానిసై పోతాడు. భగవంతుని యొక్క అత్యుత్తమ లక్షణం ఏమిటంటే, 'భక్త వత్సలుడు' (తన భక్తులపై ఆయనకు ఉన్న ప్రేమ). పురాణాలు ఇలా పేర్కొంటున్నాయి:

గీత్వా చ మమ నామాని విచరేన్మమ సన్నిధౌ
ఇతి బ్రవీమి తే సత్యమ్ క్రీతోహం తస్య చార్జున

(ఆది పురాణం 1.2.231)

శ్రీ కృష్ణుడు ఇలా అంటున్నాడు: ‘నా నామములు జపం చేస్తూ, తలంపులలో నన్ను తమ దగ్గరగా ఉంచుకున్న వారికి నేను బానిసనై పోతాను. ఇది నిజము ఓ అర్జునా.’ భగవంతుడు తన నిస్వార్థ భక్తుల పట్ల ఎంత ఋణపడి ఉంటాడంటే, వారిని తన స్వ-స్వరూపంగానే చూసుకుంటాను అన్న స్థాయి వరకు ఈ శ్లోకంలో చెప్తున్నాడు.