Bhagavad Gita: Chapter 7, Verse 19

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ।। 19 ।।

బహూనాం — అనేకమైన; జన్మనాం — జన్మలు; అంతే — తరువాత; జ్ఞాన-వాన్ — జ్ఞాన వంతులు; మాం — నాకు; ప్రపద్యతే — శరణాగతి చేస్తారు; వాసుదేవః — శ్రీ కృష్ణుడు, వసుదేవుని కుమారుడు; సర్వం — సర్వమూ; ఇతి — అది; స — అటువంటి; మహా-ఆత్మా — మహాత్ముడు; సు-దుర్లభః — ఏంతో అరుదు.

Translation

BG 7.19: ఎన్నో జన్మల ఆధ్యాత్మిక సాధన తరువాత, జ్ఞాన సంపన్నుడు, ఉన్నదంతా నేనే (వాసుదేవుడే) అని తెలుసుకొని, నాకు శరణాగతి చేస్తాడు. అటువంటి మహాత్ముడు నిజముగా చాలా అరుదు.

Commentary

ఈ శ్లోకం ఒక సాధారణ అపార్థాన్ని నివృత్తి చేస్తున్నది. తరచుగా అధికమైన ప్రజ్ఞ కలవారు, భక్తి అనేది జ్ఞానము కంటే తక్కువ స్థాయిది అని అపహాస్యము చేస్తారు. జ్ఞాన సముపార్జన లో నిమగ్నమై ఉన్నారనే గర్వం తో ఉండి, భక్తి లో నిమగ్నమైన వారిని తక్కువగా చూస్తారు. కానీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు దానికి పూర్తి విరుద్ధంగా చెప్తున్నాడు. చాలా జన్మలలో జ్ఞానం పెంపొందించుకున్న తరువాత జ్ఞాని యొక్క జ్ఞానము పరిపక్వ దశకు చేరిన పిదప, ఆవ్యక్తి భగవంతునికి శరణాగతి చేస్తాడు.

వాస్తవానికి, యదార్ధమైన జ్ఞానం సహజంగానే భక్తికి దారి తీస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి బీచ్ పై నడుస్తూ ఇసుకలో ఒక ఉంగరాన్ని కనుగోన్నాడనుకోండి. దానిని పైకి తీస్కున్నాడు కానీ దాని విలువ పై ఏ మాత్రం అవగాహన లేదు అనుకోండి. దాన్ని, ఈ మధ్య సాధారణంగా వాడుకలో ఉన్న ఏదో గిల్టు నగ, అనుకోని, దాని విలువ ఓ $30 అనుకుంటాడు. మరుసటి రోజు, ఆ ఉంగరాన్ని ఒక కంసాలి వాడికి చూపించి ఇలా అడిగాడు, "ఈ ఉంగరం యొక్క విలువ ఎంత ఉంటుందో చెప్పగలరా?" అని. ఆ కంసాలి దానిని పరిశీలించి ఇలా సమాధానం చెప్పాడు, "ఇది 22 కారట్ బంగారం, దీని విలువ $300 ఉంటుంది." ఇది విన్న తరువాత ఆ వ్యక్తి కి ఆ ఉంగరం మీద ప్రేమ ఎక్కువయింది. ఇప్పుడు ఆ ఉంగరం చూసినప్పుడు, ఒక $300 విలువ బహుమానం పొందిన ఆనందం అనుభవించాడు.

ఇంకొన్ని రోజులు గడిచాయి, నగల వ్యాపారి అయిన అతని మామ, పక్క ఊరి నుండి వచ్చాడు. తన మామ ని ఇలా అడిగాడు, "ఈ ఉంగరాన్ని మరియు దీనిలో ఉన్న రాయిని విలువ కట్టి చెప్పగలరా?" అని. అతని మామ దాన్ని చూసి, మరియు ఇలా ఆశ్చర్యముతో అరిచాడు, "ఇదేక్కడిది నీకు?" ఇది అసలు సిసలు వజ్రం. దీని విలువ $100,000 ఉంటుంది." అతను ఉబ్బుతబ్బిబై పోయి ఇలా అన్నాడు. "మామా, నాతో పరిహాసం చేయవద్దు". "నేను పరిహాసం చేయటం లేదు, నేను చెప్పేది నమ్మకపోతే, దీనిని నాకు $75,000 కి అమ్మేయి." అన్నాడు. ఇక ఇప్పుడు అతనికి ఆ ఉంగరం విలువ గురించి నిస్సందేహమైన జ్ఞానం లభించింది. వెనువెంటనే, ఆ ఉంగరం మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఒక పెద్ద లాటరీ గెలిచినట్టు సంతోషం వేసి, అతని ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

చూడండి, ఆ ఉంగరం పట్ల వ్యక్తి యొక్క ప్రేమ, దాని గురించి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఎలా పెరుగుతూ ఉన్నదో ? ఆ ఉంగరం యొక్క విలువ $30 అన్న జ్ఞానం ఉన్నప్పుడు అని పట్ల ఉన్న ప్రేమ కూడా అంత మాత్రం గానే ఉంది. ఈ ఉంగరం విలువ $300 అని తెలిసినప్పుడు దాని మీద ప్రేమ అంతే నిష్పత్తిలో పెరిగింది. ఆ ఉంగరం విలువ నిజంగా $100,000 అని అతనికి తెలిసినప్పుడు, దాని పై అతని ప్రేమ ఆ మేరగా పెరిగి పోయింది.

ఈ పై ఉదాహరణ మనకు, జ్ఞానానికి, ప్రేమకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని తెలియచేప్తున్నది. రామాయణం ఇలా పేర్కొంటున్నది:

జానేం బిను న హోఇ పరతీతీ. బిను పరతీతి హోఇ నహిం ప్రీతీ

"జ్ఞానం లేకుండా విశ్వాసం ఉండలేదు; విశ్వాసం లేకుండా ప్రేమ పెరుగదు." ఈ విధంగా, యదార్థమైన జ్ఞానం సహజంగానే ప్రేమతో కూడి ఉంటుంది. మనకు బ్రహ్మం గురించి నిజమైన జ్ఞానం ఉంది అని అనుకుని, కానీ, ఆయన మీద ఎటువంటి ప్రేమ లేకపోతే, మన జ్ఞానం ఉత్తగా సిద్ధాంత పరం గానే ఉన్నట్టు.

ఇక్కడ శ్రీ కృష్ణుడు వివరించేది ఏమిటంటే, ఎన్నో జన్మల జ్ఞాన సముపార్జన తరువాత ఆ జ్ఞాని యొక్క జ్ఞానము నిజమైన విజ్ఞానము గా పరిపక్వం చెందితే, అతను ఉన్నదంతా ఆ భగవంతుడే అని తెలుసుకొని, పరమేశ్వరుడికి శరణాగతి చేస్తాడు. ఇటువంటి మహాత్ముడు చాలా అరుదు అని ఈ శ్లోకం పేర్కొంటున్నది. దీనిని జ్ఞానులకి, కర్మీ లకి, హఠ యోగులకి, తపస్విలకి చెప్పలేదు. దీనిని భక్తులకే చెప్పాడు, మరియు "సర్వమూ భగవంతుడే" అని సంపూర్ణముగా తెలుసుకొని ఆయనకు శరణాగతి చేసిన, ఇటువంటి మహోన్నతమైన ఆత్మ చాల దుర్లభము (అరుదు) అని అంటున్నాడు.