Bhagavad Gita: Chapter 6, Verse 6

బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః ।
అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ ।। 6 ।।

బంధుః — మిత్రుడు; ఆత్మా — మనస్సు; ఆత్మనః — వ్యక్తికి; తస్య — అతని; యేన — ఎవరి చేత నైతే; ఆత్మా — మనస్సు; ఏవ — ఖచ్చితంగా; ఆత్మనా — ఆ వ్యక్తికి; జితః — జయించి; అనాత్మనః — నిగ్రహింపబడని మనస్సు కల వారికి; తు — కానీ; శత్రుత్వే — శత్రువుకి; వర్తేత — ఉండును; ఆత్మా, ఏవ —మనస్సే ; శత్రు-వత్ — శత్రువు లాగ.

Translation

BG 6.6: మనస్సుని జయించినవారికి అది వారి మిత్రుడు. అలా చేయలేని వాడికి, మనస్సు ఒక శత్రువు వలె పనిచేస్తుంది.

Commentary

మనకు శత్రువులుగా అనిపించి, మనకు హాని చేయగలరేమో అన్న వారిని ఎదుర్కోవటానికి, మన ఆలోచనా శక్తి లో చాలా భాగాన్ని వెచ్చిస్తాము. వైదిక శాస్త్రాలు, అతి పెద్ద శత్రువులైన - కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, భ్రాంతి మొదలైనవి - మనలోనే ఉంటాయి, అని చెప్తున్నాయి. ఈ అంతర్గత శత్రువులు బాహ్యమైన వాటి కన్నా ఏంతో హానికరమైనవి. బాహ్య పిశాచాలు మనను కొంత సమయం వరకు బాధించవచ్చు, కానీ, మన మనస్సు లోనే ఉన్న పిశాచాలు మనం నిరంతరం దౌర్భాగ్యస్థితిలోనే ఉండేటట్టు చేయగలవు. సర్వమూ అనుకూలంగా ఉండి కూడా, తమ స్వంత మనస్సు వలన మానసిక కుంగు, ద్వేషము, ఆందోళన, బెంగ మరియు ఒత్తిడి వంటి వాటితో దౌర్భాగ్యమైన జీవితం గడిపిన ఎందరో మనకు తెలుసు.

వైదిక తత్వ శాస్త్రం, మన తలంపుల/ఆలోచనల యొక్క పరిణామాల మీద చాల ముఖ్యంగా నొక్కిచెప్పింది. వ్యాధులు అనేవి వైరస్, బ్యాక్టీరియ వలన మాత్రమే రావు, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు (negativities) వలన కూడా వస్తాయి. ఎవరైనా పొరపాటుగా మీ మీద రాయి విసిరితే, అది కొద్ది సేపు మనలను బాధించవచ్చు, కానీ తరువాతి రోజు దాని గురించి నీవు మర్చి పోవచ్చు. కానీ, ఎవరైనా అప్రియమైన మాట అంటే, అది మిమ్ములను ఎన్నో సంవత్సరాల వరకు బాధించవచ్చు. ఇదే ఆలోచనల యొక్క గొప్ప శక్తి. బౌద్ధ శాస్త్రంలో, ధర్మపాద (1.3) బుద్ధుడు కూడా ఈ నిజాన్ని స్పష్టంగా తెలియపరిచాడు.

"నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను ! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో నే ఉన్నవారికి దుఃఖం అంతము కాదు."

"నేను అవమానించబడ్డాను! నేను నిందింపబడ్డాను ! నేను దండింపబడ్డాను! నేను దోచుకోబడ్డాను! ఈ ఆలోచనల తో లేని వానికి కోపం తగ్గిపోతుంది."

మనలో ద్వేషమే పెంపొందించుకుంటే, మన విపరీత (negative) ఆలోచనలు, మనం ద్వేషించే వస్తువుకి కాకుండా, మనకే ఎక్కువ నష్టం కలుగ చేస్తాయి. చాలా తెలివిగా ఇలా చెప్పబడింది : "ద్వేషం/ఆగ్రహం అనేది మనం విషం తాగి ఎదుటి వాడు చనిపోవాలని కోరుకోవటం లాంటిది". సమస్య ఏమిటంటే చాలా మంది జనులు తమ యొక్క సంస్కరింపబడని మనస్సే తమకు ఎంతో హాని కలుగ చేస్తోందని తెలుసుకోరు. కాబట్టి, జగద్గురు శ్రీ కృపాలు మహారాజ్ గారు ఇలా ఉపదేశిస్తారు.

మన కో మానో శత్రు ఉసకీ సునహు జని కఛు ప్యారే (సాధన భక్తి తత్త్వం)

"ప్రియమైన ఆధ్యాత్మిక సాధకుడా, నీ నిగ్రహింపబడని మనస్సుని నీ శత్రువుగా చూడుము. దాని ప్రభావానికి లొంగిపోకు."

కానీ, ఆధ్యాత్మిక సాధన ద్వారా, మనస్సుని బుద్ధి యొక్క నియంత్రణ లోనికి తెచ్చినప్పుడు, దానికి మన ఉత్తమ స్నేహితుడుగా అయ్యే సామర్ధ్యం ఉంది. ఏదేని వస్తువు శక్తి ఎక్కువున్న కొద్దీ దాని దురుపయోగ ప్రమాదం కూడా ఎక్కువుంటుంది. మనస్సు అనేది మన శరీరంలో అమర్చబడిన ఉన్న ఒక అత్యంత శక్తి వంతమైన ఉపకరణం కాబట్టి అది రెండు పక్కల పదునుగా ఉన్న కత్తి లాంటిది. ఈ విధంగా, రాక్షసత్వ స్థాయికి దిగజారిన వారు కూడా తమ మనస్సు వలననే అలా అవుతారు; అదే సమయంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన వారు కూడా తమ పవిత్రమైన మనస్సు వలననే అలా అవుతారు. అదే ప్రకారంగా, విన్స్టన్ చర్చిల్ , రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉన్న విజయుడైన బ్రిటిష్ ప్రధాని, ఇలా అన్నాడు: “The price of greatness is the responsibility over your every thought.” ఈ శ్లోకం లో, శ్రీ కృష్ణుడు అర్జునుడుకి, మనస్సు యొక్క హాని కలిగించే మరియు శ్రేయస్సు కలిగించే శక్తి గురించి, జ్ఞానోపదేశం చేస్తున్నాడు. తదుపరి మూడు శ్లోకాలలో, యోగారూఢుని (యోగములో పురోగతి సాధించిన వాని) యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.