Bhagavad Gita: Chapter 3, Verse 17

యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ।
ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే ।। 17 ।।

యః — ఎవరైతే; తు — కానీ; ఆత్మ-రతిః — ఆత్మ యందే రమించునో; ఏవ — తప్పకుండా ; స్యాత్ — ఉండునో; ఆత్మ-తృప్తః — ఆత్మయందే తృప్తిగా ఉండునో; చ — మరియు; మానవః — మానవుడు; ఆత్మని — ఆత్మ యందే; ఏవ — తప్పకుండా; చ — మరియు; సంతుష్టః — తృప్తినొంది; తస్య — అతనికి; కార్యం — కర్తవ్యము; న-విద్యతే — ఉండదు.

Translation

BG 3.17: కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై, ఆత్మ యందే సంతుష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు.

Commentary

బాహ్య వస్తువుల కోసం కోరికలను త్యజించిన వారు మాత్రమే ఆత్మ యందు రమిస్తూ సంతుష్టులుగా ఉండగలరు. ప్రాపంచిక కోరికలే మన బంధానికి మూలకారణం, ‘ఇది ఇలాగే అవ్వాలి, అది కాకూడదు.’ వంటివి. శ్రీ కృష్ణుడు ఈ అధ్యాయంలో తదుపరి (3.37వ శ్లోకంలో), కోరికలే సమస్త పాపాలకి మూల కారణమనీ, అందుకే వాటిని త్యజించాలి అని, పేర్కొంటున్నాడు. ఇంతకు క్రితం చెప్పినట్టు (2.64వ శ్లోక వ్యాఖ్యానంలో), మనస్సులో గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే, ఎప్పుడైనా శ్రీ కృష్ణుడు కోరికలను త్యజించమన్నప్పుడు, ఆయన ప్రాపంచిక కోరికల గురించి చెప్తున్నట్టు, అంతేకాని ఆధ్యాత్మిక పురోగతి కోసం, లేదా, భగవత్ ప్రాప్తి కోసం ఉన్న కోరికలు కాదు.

మరి, అటువంటప్పుడు, అసలు భౌతిక ప్రాపంచిక కోరికలు ఎందుకు జనిస్తాయి? మనల్ని మనం ఈ శరీరమే అనుకుంటే, మన శారీరక, మానసిక వాంఛలే మన ఆత్మ కోరుకునేవి అని అనుకొంటాము, ఇవి మనలను మాయా ప్రపంచంలోకి గిరగిరా విసిరివేస్తాయి. సంత్ తులసీదాస్ ఇలా వివరిస్తున్నాడు:

జిబ జిబ తే హరి తే బిలగానో తబ తే దేహ గేహ నిజ మాన్యో,
మాయా బస స్వరూప్ బిసరాయో తేహి బ్రమ తే దారుణ దుఃఖ పాయో

‘జీవాత్మ తానే భగవంతుని నుండి విడివడిన కారణంగా, అప్పుడు భౌతిక శక్తి దానిని మాయలో కప్పివేసింది. ఈ మాయ వల్ల తనను తాను శరీరమే అనుకొంటూ, తనను తాను ఆత్మనని మరిచి పోయి ఉండటం చేత, దారుణమైన దుఃఖాలను అనుభవిస్తున్నది.’

జ్ఞానోదయమైన వారు, ఆత్మ అనేది భౌతికమైనదికాదని, దివ్యమైనదని అందుకే నాశనములేనిదని తెలుసుకుంటారు. నశ్వరమైన ప్రాపంచిక వస్తువులు ఏవీ నిత్యమైన ఆత్మ దాహాన్ని తీర్చలేవు, కాబట్టి ఆ ఇంద్రియ వస్తు-విషయములపై ఉండే యావ, మూర్ఖత్వమే అవుతుంది. ఈ విధంగా ఆత్మ-జ్ఞానులైన మహాత్ములు తమ మనస్సుని భగవంతుని యందే సంయోగం చేసి తమలో తాము అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు.

ప్రాపంచికంగా బద్ధులైన జీవాత్మలకు నిర్దేశించబడిన కర్మలు (విధులు), జ్ఞానోదయమైన వారికి వర్తించవు; ఎందుకంటే వారు ఆయా కర్మల లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి. ఉదాహరణకు కళాశాల విద్యార్ధిగా ఉన్నంత వరకు ఆ విశ్వవిద్యాలయం యొక్క నియమాలు పాటించాలి, కానీ ఒకసారి ఉత్తీర్ణుడై పట్టభద్రుడైన తరువాత ఆ కళాశాల నియమాలు ఇక అప్రస్తుతమైనవే. అలాంటి ముక్త జీవుల గురించి, ఇలా చెప్పబడింది: ‘బ్రహ్మవిత్ శృతి మూర్ధ్నీ’, ‘ భగవంతునితో సంయోగం నొందిన వారు వేదముల శిరస్సుపై నడుస్తారు’, అంటేవారు ఇక వేదములలో చెప్పిన నియమములను పాటించవల్సిన అవసరం లేదు.

మరో ఉదాహరణ చూడండి. ఓ పురోహితుడు ఒక అబ్బాయిని, అమ్మాయిని వివాహ వేడుక నిర్వహించటం ద్వారా ఒక్కటి చేస్తాడు. ఒకసారి ఆ వేడుక అయిపోయిన తరువాత, ‘ఇక మీరు భార్యా-భర్తలు; నేను వెళుతున్నాను’ అంటాడు. ఆయన పని అయిపోయింది. ఒకవేళ భార్య ఇలా అంటే, ‘అయ్యగారూ, పెళ్ళప్పుడు మీరు మాతో చేపించిన ప్రమాణాలను మా ఆయన పాటించటంలేదు.’ అని అంటే, ఆ పురోహితుడు ఇలా జవాబు ఇస్తాడు. ‘ఇది నా పరిధిలోని విషయం కాదు, నా ధర్మ మీ ఇద్దరినీ వివాహంతో ఒక్కటిగా చేయటమే, మరియు ఆ పని అయిపోయింది.’ అని.

వేదముల అంతిమ లక్ష్యం జీవాత్మను పరమాత్మ దగ్గరికి చెర్చటమే. ఒకసారి జీవాత్మ భగవత్-ప్రాప్తి నొందిన తరువాత, వేద నియమాలు వర్తించవు; ఆ జీవాత్మ వాటి అజమాయిషీ పరిధిని దాటి పోయింది.