3వ అధ్యాయము : కర్మ యోగము

కర్మ యోగము

అన్ని ప్రాణులూ తమ తమ ప్రకృతి సిద్ధమైన స్వాభావిక లక్షణంచే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయనీ, మరియు ఎవరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మలు చేయకుండా ఉండలేరనీ, ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఏవో కాషాయి వస్త్రాలు ధరించి బాహ్యంగా సన్యాసం ప్రదర్శిస్తూ, లోలోన ఇంద్రియ వస్తువులపై చింతనచేసే వారు కపటులు. వారికన్నా, బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, లోనుండి మమకార రాహిత్యంతో ఉండే, కర్మ యోగము ఆచరించే వారు, ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీ కృష్ణుడు తదుపరి వక్కాణిస్తున్నాడు. మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని 'యజ్ఞం' అవుతుంది. యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు; వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు మరియు వారి జీవితాలు వ్యర్థమైనవి.
ఆత్మ యందే స్థితులై ఉండే జ్ఞానోదయమైనవారు, సామాన్య జనులలా కాకుండా, తమ శారీరక బాధ్యతలను నిర్వర్తించే అవసరం లేదు, ఎందుకంటే వారు ఉన్నతమైన ఆత్మ స్థాయి విధులు నిర్వర్తిస్తుంటారు కాబట్టి. కానీ వారు తమ సామాజిక విధులను విస్మరిస్తే, అది పెద్దవారి అడుగు జాడలలో నడిచే సామాన్య జనుల మనస్సులలో కలత కలిగిస్తుంది. కాబట్టి, అందరూ అనుకరించటానికి, ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం జ్ఞానులు, ఎలాంటి స్వార్థ ప్రయోజనం లేకుండా కర్మలు ఆచరిస్తూనే ఉండాలి. ఇది, అజ్ఞానులు పరిపక్వత లేకుండా అకాలంగా తమ విధులను త్యజించటాన్ని ఇది నిరోధిస్తుంది. ఈ ప్రయోజనం కోసమే జ్ఞానోదయమైన జనక మహారాజు వంటి రాజులు, తమ కార్యకలాపాలను నిర్వర్తించారు.
    తమకు ఇష్టం లేకపోయినా, ఏదో బలవంతమైన ప్రభావం చేతనా అన్నట్టు, జనులు ఎందుకు పాపపు కర్మలను చేస్తారు అని తదుపరి అర్జునుడు ప్రశ్నిస్తాడు. ప్రపంచంలో అన్నిటినీ నాశనం చేసే పాపిష్టి శత్రువు కామమే అని, ఆ పరమాత్మ వివరిస్తాడు. నిప్పు పొగచే మరియు అద్దం దుమ్ముచే కప్పి వేయబడ్డట్టుగా, కోరికలు జ్ఞానాన్ని కప్పివేసి, బుద్ధిని దూరంగా లాగేస్తాయి. తదుపరి, శ్రీ కృష్ణుడు, పాప స్వరూపమైన, కోరికలు అనే శత్రువుని సంహరించమని మరియు తన ఇంద్రియములు, మనస్సు, బుద్ధిని నియంత్రణలోకి తెమ్మని, అర్జునుడికి శంఖారావ పిలుపునిస్తున్నాడు.

అర్జునుడు ఇలా పలికెను : ఓ జనార్దనా, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమైనదయితే మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము.

భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్-ప్రాప్తికి (జ్ఞానోదయము) ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి: ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము; మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము.

మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి కర్మ బంధము (ప్రతిక్రియ) ల నుండి విముక్తి పొందజాలడు. అలాగే, కేవలం బాహ్య (భౌతిక) సన్యాసము ద్వారా జ్ఞాన సిద్ధిని పొందజాలడు.

ఎవ్వరూ కూడా ఒక్క క్షణం కూడా కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులు తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే (త్రి-గుణములు) ప్రేరితమై కర్మలు చేయవలసియే ఉండును.

బాహ్యమైన కర్మేంద్రియములను అదుపులో ఉంచినా, మనస్సులో మాత్రం ఇంద్రియ విషయముల పైనే చింతన చేస్తూ ఉండే వారు తమని తామే మోసం చేసుకునే వారు, అలాంటి వారు కపటులు అనబడుతారు.

కానీ, అర్జునా, తమ జ్ఞానేంద్రియములను మనస్సుతో అదుపు చేసి, కర్మేంద్రియములతో మమకార/ఆసక్తులు లేకుండా పనిచేసే కర్మ యోగులు, నిజంగా ఏంతో శ్రేష్ఠులు.

కాబట్టి నీవు వేదముల అనుగుణంగా విధింపబడ్డ కర్తవ్యమును నిర్వర్తించాలి, ఎందుకంటే పనులు చేయటం అనేది క్రియారాహిత్యము కన్నా ఉత్తమమైనది. క్రియాకలాపములను విడిచి పెట్టడం వలన శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు.

పనులని ఒక యజ్ఞం లాగా, భగవత్ అర్పితంగా చేయాలి, లేదా, ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.

సృష్టి ప్రారంభంలో, బ్రహ్మ దేవుడు, మానవజాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి, ఇలా చెప్పాడు, ‘ఈ యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి.’

మీ యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల, మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శేయస్సు/సౌభాగ్యం కలుగుతుంది.

యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు, జీవిత నిర్వహణకు అవసరమైన అన్నింటిని ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని, తిరిగి నివేదించకుండా, తామే అనుభవించే వారు, నిజానికి దొంగలే.

యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే, ఆధ్యాత్మిక చింతనగల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునే వారు పాపమునే భుజింతురు.

సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత కర్మలు) ఆచరణచే యజ్ఞము జనిస్తుంది.

మానవుల విహిత కర్మలు (కర్తవ్యములు) వేదములలో చెప్పబడ్డాయి, మరియు వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి, సర్వ-వ్యాపియైన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు.

వేదములచే నిర్దేశించబడిన ఈ యజ్ఞ చక్రములో తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు; అట్టి వారి జీవితము వ్యర్థం.

కానీ ఎవరైతే ఆత్మయందే రమింతురో, జ్ఞానోదయులై, ఆత్మ యందే సంతుష్టులుగా ఉందురో, వారికి ఎట్టి కర్తవ్యమూ ఉండదు.

ఇటువంటి ఆత్మ-జ్ఞానులైన వారు తమ విధులను (కర్మలను) చేయటం వలన కానీ, చేయకపోవటం వలన కానీ, వారికి వచ్చేది, పోయేవి (లాభనష్టాలు) ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధార పడవలసిన అవసరమూ లేదు.

కాబట్టి, మమకారాసక్తులను విడిచిపెట్టి, ఆసక్తి రహితుడవై, నీ పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించుము, ఏలనన కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పని చేయటం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు.

తమ ధర్మములను (విహిత కర్మలను) నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందితిరి. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.

ఈ మూడు లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు, అర్జునా, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చేయవల్సిన విధులను చేస్తూనే ఉంటాను.

నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థా, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు.

నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను, మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.

అజ్ఞానులు కర్మ ఫలముల యందు ఆసక్తి/మమకారంతో తమ విధులను నిర్వర్తించినట్లుగా, ఓ భరత వంశీయుడా, జ్ఞానులు కూడా (లోకహితం కోసం), జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం తమ కర్మలను ఆచరించాలి.

కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా, ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని, జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. బదులుగా, జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ, అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి స్ఫూర్తినివ్వవలెను.

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

ఓ మహా బాహువులున్న అర్జునా, జ్ఞానులు, ప్రకృతి-గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే (ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న) గుణముల (ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో) యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు.

గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనయిన వారు, వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ, ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఇది తెలియని అజ్ఞానులను కలవర పరచరాదు.

అన్ని కార్యములను నాకు అర్పితముగా చేసి, పరమేశ్వరుడైన నాయందే నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశ, స్వార్ఠ చింతన విడిచి మరియు మానసిక శోకము వీడినవాడివై, యుద్ధం చేయుము!

పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో, అసూయ లేకుండా, నా ఈ బోధనలను పాటించే వారు కర్మ బంధముల నుండి విముక్తులౌతారు.

కానీ, జ్ఞానం లేక మరియు విచక్షణ లోపించి, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి తమ భ్రష్టత్వాన్ని తామే కోరి తెచ్చుకుంటారు.

వివేకవంతులు కూడా తమ ప్రకృతి స్వభావం అనుసరించి పనులు చేస్తారు. అన్ని ప్రాణులు తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?

ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తు/విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి, కానీ వాటికి వశము కాకూడదు, ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.

ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.

అర్జునుడు ఇలా అడిగాడు: ఓ వృష్ణి వంశీయుడా (శ్రీ కృష్ణా), ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానయినా, బలవంతంగా ఏదోశక్తి చేపించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును?

సర్వోన్నత భగవంతుడు ఇలా పలికెను: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే (కోరికలు, వాంఛలు), తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దాన్నిగా తెలుసుకొనుము.

నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడ్డట్టుగా - ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామము (కోరిక) చే కప్పివేయబడుతుంది.

అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, ఎప్పటికీ తృప్తిపఱుపరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది, ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలె మండుతూనే ఉంటుంది, ఓ కుంతీ పుత్రుడా.

ఇంద్రియములు, మనస్సు, బుద్ధి - ఇవి కోరికల మూల స్థానం అని చెప్పబడును. వాటి ద్వారా అది, వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకి గురి చేస్తుంది.

కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణ లోనికి తెచ్చి, జ్ఞాన విజ్ఞానములను నశింపచేసే ఈ పరమ పాపిష్టి కామము (కోరికలు) అనే శత్రువును నిర్మూలించుము.

స్థూల శరీరం కన్నా ఇంద్రియములు ఉన్నతమైనవి, ఇంద్రియముల కన్నా మనస్సు ఉన్నతమైనది. మనస్సు కన్నా ఉన్నతమైనది బుద్ధి, మరియు బుద్ధి కన్నా మరింత ఉన్నతమైనది ఆత్మ.

ఈ విధంగా జీవాత్మ అనేది భౌతికమైన బుద్ధి కన్నా ఉన్నతమైనది అని తెలుసుకొని, ఓ మహాబాహువులు కలవాడా, నీ నిమ్న అస్తిత్వాన్ని (ఇంద్రియమనోబుద్ధులను), నీ ఉన్నత అస్తిత్వంచే (ఆత్మ శక్తి ద్వారా) వశపరుచుకొనుము, మరియు కామమనే బలీయమైన శత్రువును సంహరింపుము.