అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।
యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।
అన్నాత్ — అన్నము నుండి; భవంతి — ఉత్పన్నమగును; భూతాని — ప్రాణులు; పర్జన్యాత్ — వర్షముల వలన; అన్న — ధాన్యము/అన్నము; సంభవః — ఉత్పత్తి; యజ్ఞాత్ — యజ్ఞములు చేయటం నుండి; భవతి — కలుగును; పర్జన్యః — వాన; యజ్ఞ — యజ్ఞము; కర్మ — నిర్దేశింపబడిన కర్తవ్యములు (విహిత కర్మలు); సముద్భవః — జనించును.
Translation
BG 3.14: ప్రాణులు అన్నీ ఆహారం వలననే జీవిస్తాయి మరియు ఆహారం వర్షముల వలన ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత కర్మలు) ఆచరణచే యజ్ఞము జనిస్తుంది.
Commentary
ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును, ధాన్యం భుజించబడి రక్తముగా మారుతుంది. రక్తము నుండి వీర్యము జనించును. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు, వీటిచే ప్రీతినొందిన దేవతలు వానలు కురిపిస్తారు; అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది.