Bhagavad Gita: Chapter 10, Verse 25

మహార్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ ।
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ।। 25 ।।

మహా-ఋషీణాం — మహర్షులలో; భృగుః — భృగు మహర్షిని; అహం — నేను; గిరాం — శబ్దములలో (మంత్ర); ఏకం అక్షరం — ఏకాక్షరమైన 'ఓం' కారమును; యజ్ఞానాం — యజ్ఞములలో; జపయజ్ఞః — భగవన్నామములను భక్తితో నిరంతరం జపించే యజ్ఞము; అస్మి — నేనే; స్థావరాణాం — స్థావరములలో (కదలని వాటిలో); హిమాలయః — హిమాలయములు.

Translation

BG 10.25: మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో అలౌకికమైన 'ఓం' కారమును. జపములలో (యజ్ఞములలో) భగవన్నామమును మరలమరల జపించటమే నేను; స్థావరములలో హిమాలయమును నేను;

Commentary

అన్ని పండ్లు మరియు పూలు ఒకే నేల నుండి పెరిగినా, వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రదర్శనకు ఉంచుతారు. అదే విధంగా, ఈ విశ్వములో వ్యక్తమయిన లేదా అవ్యక్తమయిన ప్రతిదీ కూడా భగవంతుని విభూతియే, కానీ వాటిలో ఉన్న ప్రధానమైన వాటిని వేరుగా ఆయన వైభవముగా చూపిస్తారు.

స్వర్గాది లోకములలో ఉన్న ఋషులలో భృగు మహర్షి ప్రత్యేకమైన వాడు. ఆయనకు జ్ఞానము, యశస్సు మరియు భక్తి ఉన్నాయి. విష్ణు మూర్తి తన వక్ష స్థలం మీద ఆయన పాద గుర్తు కలిగి ఉన్నాడు. భృగు మహర్షి, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివులను పరీక్షించటం అనే, పురాణాలలో చెప్పబడిన ఒక దివ్య లీల పర్యవసానంగా ఇది జరిగింది. శ్రీ కృష్ణుడి విభూతి ఆయన ద్వారా చక్కగా ప్రకటితమవుతున్నది.

భగవంతుడిని నిరాకార రూపంలో ఆరాధన చేసేవారు, "ఓం" కారపు ధ్వని పై ధ్యానం చేస్తుంటారు, ఇది భగవంతుని ఇంకొక విభూతి. శ్రీ కృష్ణుడు ఇంతకు క్రితమే 7.8వ మరియు 8.13వ శ్లోకాలలో, "ఓం" కారము పవిత్రమైన శబ్దము అని చెప్పి ఉన్నాడు. అది 'అనాహత నాదము' (ఈ జగత్తు మొత్తం వ్యాపించి ఉన్న శబ్ద ప్రకంపన). తరచుగా "ఓం" కారము వేద మంత్రముల ప్రారంభంలో పవిత్రత కోసం ఉచ్చరించబడుతుంది. ఈ యొక్క "ఓం" కారము నుండే గాయత్రీ మంత్రము ప్రకటించబడినది అని అంటారు, మరియు గాయత్రీ మంత్రము నుండే వేదములు ప్రకటితమయినాయి.

హిమాలయములు ఉత్తర భారత దేశంలో ఉన్న పర్వత శ్రేణులు. యుగాల నుండి అవి కోట్లమంది భక్తులలో ఆధ్యాత్మిక ఉత్తేజాన్ని కలిగించాయి. వాటి వాతావరణం, పర్యావరణం మరియు ఏకాంతము, ఆధ్యాత్మిక పురోగతి కోసం సాధన కు ఏంతో అనుకూలముగా ఉంటాయి. అందుకే, ఏంతో మంది మహర్షులు హిమాలయములలో వారి సూక్ష్మ శరీరాలలో, వారి స్వీయ పురోగతి కోసం మరియు మానవ జాతి సంక్షేమం కోసం తపస్సు ఆచరిస్తూ నివసిస్తుంటారు. అందుకే, ప్రపంచంలో ఉన్న ఎన్నెన్నో పర్వత శ్రేణులలో కంటే హిమాలయములే భగవంతుని యొక్క వైభవాన్ని చక్కగా ప్రదర్శిస్తున్నాయి.

యజ్ఞము అంటే మనలను ఆ భగవంతునికి అంకితం చేసుకునే ప్రక్రియ. అన్ని యజ్ఞములకంటే సరళమైనది భగవంతుని పవిత్ర నామములను జపించటమే. దీనినే జప యజ్ఞము అంటారు; అంటే నిరంతరం భక్తితో భగవంతుని దివ్య నామాలను పదే పదే అంటూ ఉండటమే. కర్మకాండ విధాన యజ్ఞములు ఆచరించటానికి, ఏంతో నిష్ఠ గా పాటించవలసిన ఎన్నో నియమాలు ఉంటాయి. కాని, జప యజ్ఞములో, ఎలాంటి నియమాలు లేవు. దాన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చు, మరియు అది మిగతా రకాల యజ్ఞముల కన్నా పవిత్రమైనది. ఈ ప్రస్తుత కలి యుగంలో, భగవంతుని నామ జపం చేయమని మరింత ధృడంగా చెప్పబడింది.

కలియుగ కేవల నామ ఆధారా, సుమిరి సుమిరి నర ఉతరహి( పారా (రామాయణం)

"కలి యుగంలో భగవంతుడి నామ జపము మరియు స్మరణము భవ సాగరాన్ని దాటటానికి ఉన్న శక్తి వంతమైన సాధనము."