Bhagavad Gita: Chapter 10, Verse 8

అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ।
ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః ।। 8 ।।

అహం — నేను; సర్వస్య — సమస్త సృష్టి యొక్క; ప్రభవః — మూల ఉత్పత్తి స్థానము; మత్తః — నా నుండే; సర్వం — సర్వమూ; ప్రవర్తతే — ప్రవర్తిల్లును (నడుచుట); ఇతి — ఈ విధముగా; మత్వా — తెలుసుకొని; భజంతే — ఆరాధిస్తారు; మాం — నన్ను; బుధాః — వివేకవంతులు; భావ-సమన్వితః — అత్యంత విశ్వాసము మరియు భక్తి తో కూడి.

Translation

BG 10.8: నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. నా వలననే అన్నీ నడుస్తున్నవి. దీనిని సంపూర్ణముగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు.

Commentary

శ్రీ కృష్ణుడు ఈ శ్లోకాన్ని ‘అహం సర్వస్య ప్రభవో’ అని అనటంతో ప్రారంభిస్తున్నాడు, అంటే ‘నేనే సర్వోత్కృష్ట పరమ సత్యమును మరియు సర్వ కారణ కారణమును’ అని. ఈ విషయాన్ని 7.7వ, 7.12వ, 10.2-3వ, మరియు 15.15వ శ్లోకాలలో, భగవద్గీత లో చాలా సార్లు చెప్పాడు. ఇతర పురాణ/ఇతిహాసాలలో కూడా ఇది గట్టిగా పేర్కొనబడినది. ఋగ్వేదము ప్రకారం:

యం కామయే తమ్ తమ్ ఉగ్రం కృష్ణోమి తం బ్రహ్మాణం తమ్ ఋషిం తమ్ సుమేద్సం (10.125.5)

‘నేను ప్రేమించే వారిని అత్యంత మహానీయులుగా చేస్తాను; వారిని పురుషులుగా లేదా స్త్రీలగా చేస్తాను; వారిని జ్ఞానవంతులైన మహాత్ములుగా చేస్తాను; ఏదేని జీవాత్మను బ్రహ్మ పదవికి అర్హునిగా చేస్తాను.’ ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వివేకులు దృఢ విశ్వాసం పెంచుకుని మరియు ప్రేమయుక్త భక్తితో ఆయనను ఆరాధిస్తారు.

ఈ విధంగా శ్రీ కృష్ణుడు ఈ భౌతిక జగత్తుకి మరియు ఆధ్యాత్మిక జగత్తుకి, రెండింటికీ కూడా సర్వేశ్వరుడు. కానీ, కేవలం ఈ సృష్టి నిర్వహణయే భగవంతుని యొక్క ప్రధానమైన కార్యము కాదు. చైతన్య మహాప్రభు ఇలా పేర్కొన్నాడు:

స్వయం భగవానేర కర్మ నహే భార-హరణ

(చైతన్య చరితామృతము, ఆది లీల 4.8)

‘శ్రీ కృష్ణుడు తానే స్వయంగా ఈ భౌతిక విశ్వముల యొక్క సృష్టి, స్థితి, మరియు లయములో నిమగ్నం కాడు.’ శ్రీ కృష్ణుడి ప్రధాన కార్యము ఏమిటంటే, ముక్తి/మోక్షము సాధించిన జీవులతో తన దివ్య ధామము గోలోకములో ప్రేమ యుక్త నిత్య లీలలలో నిమగ్నమవ్వటమే. భౌతిక సృష్టి నిమిత్తం, ఆయనే కారణోదక్షాయి విష్ణు స్వరూపంగా అవతరిస్తాడు, ఆయననే మహావిష్ణువు అని కూడా అంటారు.

ఈ విధంగా, అనంతమైన భౌతిక విశ్వములను కలిగి ఉన్న ఈ భౌతిక సృష్టిపై ఆధిపత్యానికి ఉన్న భగవంతుని స్వరూపమే మహావిష్ణువు. మహా విష్ణువునే ప్రథమ పురుషుడు అని కూడా అంటారు (భౌతిక జగత్తులో భగవంతుని యొక్క ప్రథమ స్వరూపము). ఆయన కారణ సముద్రంలో దివ్య నీటిలో ఉంటూ అనంతమైన బ్రహ్మాండాలను తన శరీర రోమ కూపాల్లోంచి సృజిస్తూ ఉంటాడు. తదుపరి ఆయనే ప్రతి ఒక్క బ్రహ్మాండం క్రింద గర్భోదక్షాయి విష్ణు స్వరూపంలో వ్యాప్తించి ఉంటాడు, ఆయననే ద్వితీయ పురుషుడు అంటారు. (భౌతిక ప్రపంచంలో రెండవ స్వరూపము).

గర్భోదక్షాయి విష్ణు నుండి బ్రహ్మ జన్మించాడు. ఆయనే సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తాడు – విశ్వము యొక్క విభిన్నములైన స్థూల, సూక్ష్మ పదార్థాలని, ప్రకృతి నియమాలని, గ్రహాలూ, పాలపుంతలూ, వాటిపై నివసించే జీవరాశులు మొదలైనవన్నీటినీ సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి బ్రహ్మని విశ్వ సృష్టి కర్త అని అంటూ ఉంటారు, నిజానికి ఆయన ద్వితీయ స్థాన సృష్టికర్త.

గర్భోదక్షాయి విష్ణు ఇంకొంత వ్యాప్తి నొంది, తానే, క్షీరోదక్షాయి విష్ణుగా రూపాంతరం చెంది, ప్రతి బ్రహ్మాండం యొక్క పై భాగంలో, క్షీర సాగరంలో నివసిస్తాడు. క్షీరోదక్షాయి విష్ణువు నే తృతీయ పురుషుడు అంటారు. (భౌతిక జగత్తు లో భగవంతుని యొక్క మూడవ రూపాంతరము). విశ్వం పైన ఉంటాడు అంతేకాక, తానే పరమాత్మ రూపంలో సర్వ ప్రాణుల హృదయములో, వాటి కర్మలను గమనిస్తూ, వాటి లెక్క గణిస్తూ, సరైన సమయంలో కర్మ ఫలాలని అందచేస్తూ ఉంటాడు. అందుకే ఆయనను విశ్వ స్థితికారకుడు అంటారు.

ఇక్కడ చెప్పబడిన విష్ణు మూర్తి స్వరూపాలన్నీ శ్రీ కృష్ణుడి కన్నా అభేదములే. అందుకే, ఈ శ్లోకంలో సమస్త ఆధ్యాత్మిక మరియు భౌతిక సృష్టి ఆయన నుండే వచ్చాయి అని అంటున్నాడు. శ్రీ కృష్ణుడినే ‘అవతారీ’ (అన్ని అవతారముల మూలము) అని కూడా అంటారు. శ్రీమద్ భాగవతము ప్రకారం : ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం (1.3.28) ‘భగవంతుని సమస్త స్వరూపాలు శ్రీ కృష్ణుడి రూపాంతరాలే లేదా ఆయన రూపాంతరాల రూపాంతరాలే; ఆయన మాత్రం స్వయం భగవానుడు.’ అందుకే, ద్వితీయ స్థాన సృష్టికర్త అయిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ విధంగా స్తుతించాడు:

యస్యైకనిశ్వసిత కాలమథావలంబ్య
జీవంతి లోమవిలజా జగదండనాథాః
విష్ణుర్మహాన్ సఇహయస్య కలావిషేశో
గోవిందమాది పురుషం తమహం భజామి

(బ్రహ్మ సంహిత 5.48)

‘అనంతమైన బ్రహ్మాండాలు — ప్రతి ఒక్క దాంట్లో ఒక శంకరుడు, బ్రహ్మ, మరియు విష్ణువు ఉన్నటువంటివి – శ్రీ మహా విష్ణువు శరీర రోమ కూపాల్లోంచి ఆయన శ్వాస తీసుకున్నప్పుడు సృజించబడుతాయి; మరియు ఆయన శ్వాస విడిచినప్పుడు ఆయనలోకే లయమై పోతాయి. అటువంటి శ్రీ మహా విష్ణువు మూల స్వరూపమైన శ్రీ కృష్ణుడిని నేను పూజిస్తాను.’ శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు భక్తులు తనను ఎలా భజిస్తారో వివరిస్తున్నాడు.