Bhagavad Gita: Chapter 10, Verse 9

మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంతః పరస్పరమ్ ।
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ ।। 9 ।।

మత్-చిత్తః — నా యందే మనస్సు లగ్నం చేసి; మత్-గత-ప్రాణాః — నాకే తమ జీవితాలని అర్పించి (శరణాగతి చేసి); బోధయంతః — భోదిస్తూ (భగవంతుని దివ్య జ్ఞానముతో); పరస్పరం — ఒకరికొకరు; కథయంతః — చెప్పుచూ; చ — మరియు; మాం — నా గురించి; నిత్యం — నిత్యమూ; తుశ్యంతి — సంతుష్టి; చ — మరియు; రమంతి — (వారు) ఆనందింతురు; చ — మరియు.

Translation

BG 10.9: వారి మనస్సులు నా యందే లగ్నం చేసి, వారి జీవితాలని శరణాగతితో నాకే అర్పించి, నా భక్తులు ఎల్లప్పుడూ నా యందే సంతుష్టులై ఉంటారు. ఒకరినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాల గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని, పరమానందమునూ అనుభవిస్తుంటారు.

Commentary

మనస్సు యొక్క స్వభావమేమిటంటే దానికిష్టమైన దానిపై అది లగ్నమై పోతుంది. ఆయన యందు గాఢమైన అభిమానం పెంచుకోవటం వలన భగవంతుని భక్తులు ఆయనను గుర్తుచేసుకుంటూ స్మరించటంలో నిమగ్నమై పోతారు. ఆయన పట్ల భక్తియే వారి జీవితానికి ఆధారంగా ఉంటుంది, దాని నుండే వారి జీవిత పరమార్థం, లక్ష్యం, బ్రతుకేందుకు శక్తిని పొందుతారు. ఒక చేపకు నీరు ఎలా అవసరమో వారికి భగవత్ స్మరణ అలా అవసరము అని భావిస్తారు.

వ్యక్తుల హృదయానికి ఏది ఇష్టమైనదో తెలుసుకోవాలంటే వారు తమ మనస్సు, శరీరము మరియు సంపదను దేనికి అంకితం చేస్తారో దాని బట్టి తెలుసుకోవచ్చు. బైబిల్ ఇలా పేర్కొంటుంది: ‘నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును’ (For where your treasure is, there your heart will also be.) (మత్తయి Matthew 6:21). వ్యక్తుల మనస్సు ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే వారి చెక్కుపుస్తకం మరియు క్రెడిట్ కార్డు లావాదేవీలు చూస్తే సరిపోతుంది. ఒకవేళ వారు ఖరీదైన వాహనాల కోసం డబ్బు ఖర్చు పెడుతుంటే వారి మనస్సు వాటిపై ఉన్నట్టు. ఒకవేళ వారు విలాసవంతమైన సెలవులపై బాగా ఖర్చు పెడుతుంటే, అదే వారికి బాగా నచ్చే విషయమన్నట్టు. ఒకవేళ వారు ఆఫ్రికాలో ఎయిడ్స్ జబ్బుతో ఉన్న పిల్లలకై విరాళం దానం చేస్తుంటే, ఆ విషయమే వారి యొక్క మనస్సులో ఉన్నట్టు. తల్లిదండ్రులకు వారి పిల్లల పట్ల ప్రేమ అనేది, వారి పట్ల సమయము, డబ్బు వెచ్చించే వైనంతో మనకు తెలుస్తుంది. ఇదే విధంగా, భక్తుల యొక్క ప్రేమ అనేది వారి భగవంతునికే అంకితమయ్యే తీరుతో ప్రకటితమవుతుంది. శ్రీ కృష్ణుడు మద్-గత-ప్రాణాః, అంటే, ‘నా భక్తులు వారి జీవితాన్ని నాకే అంకితం చేస్తారు’ అని అర్థం.

ఇటువంటి శరణాగతి నుండి తృప్తి లభిస్తుంది. భక్తులు తమ కార్యకలాపముల ఫలితాన్ని తమ ప్రియమైన భగవంతునికే సమర్పిస్తారు కాబట్టి, వారు ప్రతి సందర్భము/పరిస్థితి ఆయన నుండే వస్తున్నది అని భావిస్తారు. కాబట్టి, వారు అనుకూల మరియు ప్రతికూల పరిస్థితులను రెంటినీ కూడా భగవత్ సంకల్పముగా చూస్తారు, మరియు ఈ రెంటిలో కూడా సమత్వ-బుద్ధితో ఉంటారు.

భగవంతుని పై భక్తుల యొక్క ప్రేమ, పైన పేర్కొన్న రూపాలలో వ్యక్తమయినా, అది వారి పెదవులపై కూడా ప్రకటితమవుతుంది. వారికి భగవంతుని వైభవము, ఆయన నామములు, రూపములు, గుణములు, లీలలు, ధామములు, మరియు భక్తుల గురించి మాట్లాడుకోవటం అత్యంత ఆనందదాయకంగా ఉంటుంది. ఈ ప్రకారంగా భగవంతుని వైభవాల, కీర్తన మరియు శ్రవణ ప్రక్రియలలో వారు ఆనందం అనుభవించటమే కాక, దానిని ఇతరులతో కూడా పంచుకుంటారు. తమలో తమ ఆధ్యాత్మిక పురోగతి కోసం, భగవంతుని దివ్య జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటారు (బోధయంతి). భగవంతుని లీలలు, వైభవము గురించి మాట్లాటడం మరియు పాడటం భక్తులకు పరమ సంతృప్తిని (తుశ్యంతి) మరియు ఆనందాన్ని (రమంతి) కలుగ చేస్తుంది. ఈ విధంగా తలచుకోవటం, వినటం మరియు జపించే ప్రక్రియల ద్వారా వారు భగవంతుడిని ఆరాధిస్తుంటారు. ఇదే త్రివిధా భక్తి అంటే – శ్రవణం, కీర్తనం, మరియు స్మరణం. 9.14వ శ్లోక వ్యాఖ్యానం లో ఇది ఇంతకు క్రితం వివరించబడినది.

తన భక్తులు తనను ఎలా ఆరాధిస్తారో చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు, తను, వారి భక్తికి ఎలా ప్రతిస్పందిస్తాడో ఇప్పుడిక చెప్తాడు.