తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకమ్ ।
దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే ।। 10 ।।
తేషాం — వారికి; సతత-యుక్తానాం — ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో; భజతాం — భక్తిలో నిమగ్న మయ్యే వారికి; ప్రీతి-పూర్వకం — ప్రేమతో; దదామి — నేను ఇస్తాను; బుద్ధి-యోగం — దివ్య జ్ఞానము; తం — అది; యేన — దేనివల్ల అయితే; మాం — నా వద్దకు; ఉపయాంతి — వచ్చెదరు; తే — వారు.
Translation
BG 10.10: మనస్సు సదా ప్రేమ పూర్వక భక్తితో నాతో ఏకమై ఉన్న వారికి, నేను దివ్య జ్ఞానమును ప్రసాదిస్తాను దానిచే వారు నన్ను పొందవచ్చు.
Commentary
మన సొంత తెలివితేటలతో భగవంతుని యొక్క దివ్య జ్ఞానమును అందుకోలేము. మనకెంత తెలివితేటలు ఉన్నా, చివరికి మన బుద్ధి మాయచే తయారుచేయబడినది అని ఒప్పుకోవలసినదే. కాబట్టి, మన ఆలోచనలు, కుశలత, మరియు వివేకము, భౌతిక ప్రాపంచిక జగత్తుకు మాత్రమే పరిమితము. భగవంతుడు మరియు ఆయన యొక్క దివ్య జగత్తు, మన భౌతికమైన బుద్ధికి అతీతమైనవి. వేదములు దృఢముగా ఈ విషయాన్నినొక్కి వక్కాణించాయి.
యస్యా మతం తస్య మతం మతం యస్య న వేద సః
అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం (కేనోపనిషత్తు 2.3)
‘తమ బుద్ధిచే భగవంతుడిని తెలుసుకుంటాము అనుకునేవారికి భగవంతునిపై ఎటువంటి అవగాహన లేదు. భగవంతుడు తమ బుద్ధి పరిమితికి అతీతమైన వాడు అని తెలుసుకున్న వారే ఆయనను నిజముగా అర్థం చేసుకున్నట్టు.’
బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:
స ఏష నేతి నేత్యాత్మా గ్రిహ్యోః (3.9.26)
‘తమ బుద్ధి ఆధారంగా, స్వంత ప్రయత్నంచే భగవంతుణ్ణి ఎన్నటికీ అర్థం చేసుకోలేరు.’ రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:
రామ అతర్క్య బుద్ధి మన బానీ, మత హమార అస సునహి సయానీ
‘శ్రీ రామచంద్ర భగవానుడు మన బుద్ధి, మనస్సు మరియు మాటల సామర్థ్యానికి అతీతుడు.’
మరిక, భగవంతుడిని తెలుసుకునే విషయం మీద ఉన్న ఈ వాక్యాలన్నీ కూడా, ఆయనను తెలుసుకోవటం అసాధ్యమని స్పష్టంగా చెప్తుంటే, మరిక భగవత్ ప్రాప్తి అనేది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఇక్కడ భగవత్ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవచ్చో తెలియచేస్తున్నాడు. భగవంతుడే తన దివ్య జ్ఞానాన్ని జీవాత్మకు ప్రసాదిస్తాడు, అప్పుడు ఆయన కృప లభించిన ఆ భాగ్యశాలియైన జీవాత్మ ఆయనను తెలుసుకోగలుగుతుంది. యజుర్వేదము ఇలా పేర్కొంటున్నది. ‘తస్య నో రాస్వ తస్య నో ధేహీ’, ‘భగవంతుని చరణారవిందముల నుండి జనించే అమృతంలో ఓలలాడకుండా, ఎవ్వరూ కూడా ఆయనను తెలుసుకోలేరు.’ ఈ విధంగా, భగవంతుని గురించి ఉన్న యదార్థమైన జ్ఞానము, మన తెలివితేటల కసరత్తు వలన రాదు, ఆయన కృపచే మాత్రమే వస్తుంది. తన కృపకు పాత్రుడిని ఏదో ఇష్టమొచ్చినట్టు ఎంచుకోను, తనపై భక్తితో మనస్సుని ఐక్యం చేసినవారికే అది ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఇక తదుపరి, ఒకసారి మనకు భగవత్ కృప లభించిన తరువాత ఏమవుతుందో ఇక చెప్తున్నాడు.